‘అబ్బబ్బా! ఇలా ఇన్నేళ్లుగా ప్రపంచ చాంపియన్‌గా ఉండటం బోర్ కొట్టేస్తోందమ్మా! నా వల్ల కాదు. అవే విజయాలు, అవే టైటిల్స్. ఎప్పుడూ నేనే అంటే ఎలా? ఎవరైనా కొత్తవాళ్లు విజేతగా వస్తే బాగుంటుంది. అయినా ఎవరూ నన్ను ఓడించడం లేదు. ఇలా అయితే నేనే ఆడకుండా తప్పుకుంటా’.. సరిగ్గా ఇలాగే కాకపోయినా ఇదే అర్థంలో దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ దాదాపు ఏడాదిన్నర క్రితం చేసిన ఈ వ్యాఖ్య చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. దాదాపు దశాబ్ద కాలం నుంచి ప్రపంచ చాంపియన్‌గా కొనసాగుతూ 32 ఏళ్ల వయసులోనే ఇంతటి వైరాగ్యం వచ్చేసిందా అన్నట్లుగా అతని మాటలు వినిపించాయి.
అయితే ఈ ఆల్‌టైమ్ చెస్ గ్రేట్ అనుకోకుండా చేసిన వ్యాఖ్య కాదు ఇది. ఎందుకంటే అసలు పోటీ అనేదే లేకుండా తిరుగులేకుండా సాగుతున్న చెస్ సామ్రాజ్యంలో అతను రారాజుగా ఉన్నాడు. పేరుకు నంబర్‌వన్ మాత్రమే కాదు, ఒకటి నుంచి పది వరకు అన్ని స్థానాలూ అతడివే! ఆ తర్వాతే మిగతావారి లెక్క మొదలవుతుంది. నిజంగానే అతని సమకాలికులు కావచ్చు, లేదా కొత్తగా వస్తున్న తరం కుర్రాళ్లు కావచ్చు కార్ల్‌సన్‌ను ఓడించలేక చేతులెత్తేస్తున్నారు.
ప్రపంచ చాంపియన్‌షిప్ మాత్రమే కాకుండా ఇతర మెగా టోర్నీల్లో కూడా అగ్రస్థానానికి గురి పెట్టకుండా రెండోస్థానం లక్ష్యంగానే అంతా బరిలోకి దిగుతున్నారు. ఇలాంటి సమయంలో తాను రాజుగా కంటే సామాన్యుడిగా ఉండటమే సరైనదని అతను భావించాడు. అందుకే క్లాసికల్ చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా తప్పుకుంటున్నానని ప్రకటించడం అతనికే చెల్లింది. చదరంగంలో లెక్కలేనన్ని రికార్డులు, ఘనతలు తన పేరిట నమోదు చేసుకున్న నార్వేజియన్ కార్ల్‌సన్ ప్రస్థానం అసాధారణం.
2013, చెన్నై. స్థానిక హీరో, దేశంలో చెస్‌కు మార్గదర్శి అయిన విశ్వనాథన్ ఆనంద్ తన వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఎదురుగా చాలెంజర్ రూపంలో 23 ఏళ్ల మాగ్నస్ కార్ల్‌సన్ ఉన్నాడు. ఆనంద్‌తో పోలిస్తే అతని ఘనతలు చాలా తక్కువ. పైగా అనుభవం కూడా లేదు. కాబట్టి అనూహ్యం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుతాన్ని ఎవరూ ఆపలేకపోయారు. సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కార్ల్‌సన్ అలవోకగా ఆనంద్‌ను ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచాడు. మొత్తం 12 రౌండ్‌ల పోరు కాగా 10వ రౌండ్‌కే చాంపియన్ ఖరారు కావడంతో తర్వాతి రెండు రౌండ్‌లు నిర్వహించాల్సిన అవసరం లేకపోయింది.
ఇందులో 3 విజయాలు సాధించి 7 గేమ్‌లు డ్రా చేసుకున్న మాగ్నస్.. ప్రత్యర్థి ఆనంద్‌కు ఒక్క గేమ్‌లోనూ గెలిచే అవకాశం ఇవ్వలేదు. అలా మొదలైన విజయప్రస్థానం ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. ఆ తర్వాత ఈ టైటిల్‌ను అతను మరోసారి నాలుగు సార్లు నిలబెట్టుకున్నాడు. వాస్తవం ఏమిటంటే స్వచ్ఛందంగా తాను వరల్డ్ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకున్నా, ఆటపై ఇష్టంతో ఇతర టోర్నీల్లో పాల్గొంటున్న మాగ్నస్‌ను ఓడించేందుకు అతని దరిదాపుల్లోకి కూడా కనీసం ఎవరూ రాలేకపోతున్నారు.
చైల్డ్ ప్రాడజీగా మొదలై...
చదరంగంలో శిఖరానికి చేరిన కార్ల్‌సన్‌లోని ప్రతిభ చిన్నతనంలోనే అందరికీ కనిపించింది. పుట్టుకతోనే వీడు మేధావిరా అనిపించేలా అతని చురుకుదనం ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. రెండేళ్ల వయసులోనే 500 ముక్కల జిగ్‌సా పజిల్‌ను అతను సరిగ్గా పేర్చడం చూసి కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. ఇక చాలామంది పిల్లలు ఇష్టపడే ‘లెగోస్’లోనైతే అతని సామర్థ్యం అసాధారణం అనిపించింది. 10–14 ఏళ్ల పిల్లల కోసం ఉద్దేశించిన పజిల్స్‌ను కూడా అతను నాలుగేళ్ల వయసులోనే సాల్వ్ చేసి పడేసేవాడు. అద్భుతమైన జ్ఞాపకశక్తి కూడా కార్ల్‌సన్ సొంతం.
ఐదేళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, రాజధానులు, పటాలు, జనాభావంటి సమాచారాన్ని అలవోకగా గుర్తు పెట్టుకొని చెప్పేవాడు. దీనిని సరైన సమయంలో గుర్తించడం అతని తల్లిదండ్రుల తొలి విజయం. తమవాడికి చెస్ సరిగ్గా సరిపోతుందని భావించిన వారు ఆ దిశగా కార్ల్‌సన్‌ను ప్రోత్సహించడంతో చదరంగ ప్రపంచం ఒక గొప్ప ఆటగాడిని చూడగలిగింది.
ఆరంభంలో తన లోకంలో తాను ఉంటూ చెస్‌పై అంత ఆసక్తి ప్రదర్శించకపోయినా ఇంట్లో తన అక్కపై గెలిచేందుకు కనబరచిన పట్టుదల ఆపై చెస్‌పై అతడికి ప్రేమను పెంచింది. చెస్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన తర్వాత దానిపై ఆసక్తి మరింత పెరిగింది. ఆపై 8 ఏళ్ల వయసులోనే నార్వే జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని సత్తా చాటడంతో అందరికీ అతని గురించి తెలిసింది. ఆపై చదరంగమే అతనికి లోకంగా మారింది. ఆ తర్వాత యూరోప్‌లోని వేర్వేరు వయో విభాగాల టోర్నీల్లో చెలరేగి వరుస విజయాలతో మాగ్నస్ దూసుకుపోయాడు.
గ్రాండ్‌మాస్టర్‌గా మారి...
13 ఏళ్ల వయసు వచ్చేసరికి కార్ల్‌సన్ దూకుడైన ఆట గురించి అందరికీ తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో అతను మరెన్నో సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా అంచనా వేశారు. అది ఎంత తొందరగా జరగనుందని వేచిచూడటమే మిగిలింది. నిజంగానే కేవలం ఏడు నెలల వ్యవధిలోనే మాగ్నస్ మూడు ఇంటర్నేషనల్ మాస్టర్స్ నార్మ్‌లు సాధించడంలో సఫలమయ్యాడు. అతని ప్రతిభ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది.
దాంతో ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ కార్ల్‌సన్‌కు స్పాన్సర్‌షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. తనపై ఉంచిన నమ్మకాన్ని ఈ నార్వే కుర్రాడు ఎప్పుడూ వమ్ము చేయలేదు. 14 ఏళ్లు కూడా పూర్తికాకముందే గ్రాండ్‌మాస్టర్‌గా మారి కెరీర్‌లో మరో మెట్టు ఎక్కాడు. అదే ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ పాల్గొని ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఫలితం సానుకూలంగా రాకపోయినా రాబోయే సంవత్సరాల్లో మాగ్నస్ సృష్టించబోయే సునామీకి ఇది సూచికగా కనిపించింది.
శిఖరానికి చేరుతూ...
సాధారణంగా చెస్‌లో గొప్ప ఆటగాళ్లందరూ భిన్నమైన ఓపెనింగ్స్‌ను ఇష్టపడతారు. ఓపెనింగ్ గేమ్‌తోనే చాలా వరకు ఆటపై పట్టు బిగించేస్తారు. కానీ మాగ్నస్ దీనిని పెద్దగా పట్టించుకోడు. మిడిల్ గేమ్‌లో మాత్రం అతనో అద్భుతం. దూకుడైన ఎత్తులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ కోలుకోలేకుండా చేయడంలో అతను నేర్పరి. ప్రాక్టీస్ కోసం కంçప్యూటర్లలో ఉండే ప్రోగ్రామింగ్ కంటే సొంత మెదడుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. అపరిమిత సంఖ్యలో తనతో తానే మ్యాచ్‌లు ఆడుతూ సుదీర్ఘ సాధనతో నేర్చుకోవడం అతనికి మాత్రమే సాధ్యమైన కళ. ఈ ప్రతిభ అతడిని వేగంగా పైకి ఎదిగేలా చేసింది.
తనకెదురైన ప్రతి ఆటగాడినీ ఓడిస్తూ వచ్చిన మాగ్నస్ 19 ఏళ్ల వయసులో తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని శిఖరానికి చేరాడు. అదే ఏడాది అతని కెరీర్‌లో మరో కీలక క్షణం మరో దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను వ్యక్తిగత కోచ్‌గా నియమించుకోవడం. ప్రపంచ చెస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు మరో యువ సంచలనానికి శిక్షణ ఇస్తే ఎలా ఉంటుందనేదానికి ఈ బంధం బలమైన ఉదాహరణ. కాస్పరోవ్‌తో కలసి ఎత్తుకు పైఎత్తులతో దూసుకుపోయిన ఈ యువ ఆటగాడు నాలుగేళ్ళలో తిరుగులేని ప్రదర్శనతో శిఖరానికి చేరుకున్నాడు. తర్వాతి రోజుల్లో కాస్పరోవ్ పేరిట ఉన్న ఘనతలన్నీ అతను చెరిపేయగలగడం విశేషం.
అన్నీ అద్భుతాలే...
2013లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన కార్ల్‌సన్ 2014లో దానిని నిలబెట్టుకున్నాడు. ఈసారి కూడా విశ్వనాథన్ ఆనంద్‌పైనే అతను అలవోక విజయాన్ని అందుకున్నాడు. ఇక్కడ కూడా చివరి గేమ్ అవసరం లేకపోయింది. 2016 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మాత్రం సెర్జీ కర్యాకిన్ (రష్యా)తో అతనికి కాస్త పోటీ ఎదురైంది. 12 గేమ్‌ల తర్వాత ఇద్దరూ 6–6 పాయింట్లతో సమంగా నిలవగా, టైబ్రేక్‌లో విజయం అతని సొంతమైంది. నాలుగోసారి 2018లో ఫాబియానో కరువానా (అమెరికా)పై కూడా ఇదే తరహాలో 6–6తో స్కోరు సమం కాగా, టైబ్రేక్‌లో 3–0తో గెలిచి వరల్డ్ చాంపియన్‌గా కొనసాగాడు. 2021లోనైతే మాగ్నస్ ఆధిపత్యం మరింత స్పష్టంగా కనిపించింది.
ఇయాన్ నెపొమాచి (రష్యా)తో జరిగిన సమరం పూర్తి ఏకపక్షంగా సాగింది. 14 రౌండ్ల పోరు కాగా 11 రౌండ్లు ముగిసేసరికి 7.5 పాయింట్లు సాధించి తన జగజ్జేత హోదాను మళ్లీ నిలబెట్టుకున్నాడు. బహుశా ఇదే ఫలితం తర్వాతి వరల్డ్ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండేందుకు కారణమై ఉండవచ్చు. క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలాగే చెస్‌లోనూ క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లు ఉన్నాయి. కార్ల్‌సన్ మూడింటిలో సాగించిన ఆధిపత్యం చూస్తే అతను ఏ స్థాయి ఆటగాడో అర్థమవుతుంది. క్లాసిక్‌లో 5 సార్లు విశ్వ విజేతగా నిలిచిన అతను 5 సార్లు ర్యాపిడ్‌లో, 7 సార్లు బ్లిట్జ్‌లో వరల్డ్ చాంపియన్‌గా (మొత్తం 17 టైటిల్స్) నిలవడం విశేషం.
చెస్ చరిత్రలో గ్యారీ కాస్పరోవ్ (2851)ను అధిగమించి అతి ఎక్కువ యెల్లో రేటింగ్ (2882) సాధించిన ఆటగాడిగా కార్ల్‌సన్‌ను నిలిచాడు. వరుసగా పదేళ్ల పాటు విశ్వవిజేతగా నిలిచిన అతను వరుసగా 125 గేమ్‌లలో ఓటమి ఎరుగని ఆటగాడిగా తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. అతనిపై పెద్ద సంఖ్యలో వచ్చిన పుస్తకాలు, వీడియో డాక్యుమెంటరీలు కార్ల్‌సన్ ఆటలోని అద్భుతాన్ని మనకు చూపిస్తాయి. అధికారికంగా ప్రపంచ చాంపియన్ కాకపోయినా, అతను ఇంకా వరల్డ్ చెస్‌ను శాసిస్తూనే ఉన్నాడు. గత రెండేళ్లలో అతను సాధించిన విజయాలు, టైటిల్స్‌కు మరెవరూ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఇదే జోరు కొనసాగిస్తూ మున్ముందూ చెస్‌లో మాగ్నస్ లెక్కలేనన్ని ఘనతలు సాధించడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment