
మయామి: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)ను కంగు తినిపించినప్పటికీ ప్రజ్ఞానంద ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆఖరి రౌండ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు 4–2తో కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు.
ఒక మ్యాచ్ నాలుగు గేములుగా జరిగే ఈ టోర్నీలో ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో 2–2తో సమమైంది. ఈ దశలో విజేతను నిర్ణయించేందుకు బ్లిట్జ్‌లో రెండు టైబ్రేక్స్‌ను నిర్వహించగా రెండు గేముల్లోనూ ప్రజ్ఞానందే గెలిచాడు. అయితే ఓవరాల్‌గా నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ 16 మ్యాచ్ పాయింట్లతో టోర్నీ విజేతగా నిలువగా, భారత టీనేజ్ సంచలనం 15 పాయింట్లతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. మేటి ర్యాంకింగ్ ఆటగాళ్లను కంగుతినిపించిన భారత ఆటగాడికి 5, 6వ రౌండ్ గేమ్‌ల్లో ఎదురైన ఓటములు ప్రతికూలమయ్యాయి.