తన గెలుపును విమర్శిస్తున్న వారికి ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘ఇలాంటి వ్యాఖ్యలు నన్నేమీ బాధపెట్టలేదు. కొన్ని గేమ్‌లు ఆశించిన స్థాయిలో దూకుడుగా సాగలేదనేది వాస్తవమే. అయితే చెస్ బోర్డుపై ఆటలో వేసే ఎత్తులు మాత్రం వరల్డ్ చాంపియన్‌ను నిర్ణయించవు. పట్టుదల, పోరాటతత్వం ఉండటంతో పాటు మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తే గెలుస్తాడు.
కొన్నిసార్లు పేలవంగా ఆడాను.. నిజమే.. కానీ
వీటిన్నింటిని నేను చూపించానని నమ్ముతున్నా. ఆట విషయానికి వస్తే ఇది అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కాకపోవచ్చు. ఎందుకంటే నేను తొలిసారి ఆడుతున్నాను. ఇతరులతో పోలిస్తే నాపై ఒత్తిడి కూడా భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు నేను పేలవంగా ఆడాననేది కూడా నిజం. అయితే కీలక సమయాల్లో నేను సత్తా చాటి స్థాయిని ప్రదర్శించగలిగాను. దాని పట్ల నేను సంతోషంగా ఉన్నా’ అని గుకేశ్ వివరించాడు.
చదరంగం చచ్చిపోయింది అంటూ విమర్శలు
కాగా.. ‘గుకేశ్, లిరెన్ మధ్య గేమ్‌లు చూస్తే అసలు వరల్డ్ చాంపియన్‌షిప్‌లా లేదు... చదరంగం చచ్చిపోయింది... ఒక చిన్న తప్పు వరల్డ్ చాంపియన్‌ను నిర్ణయించడం ఏమిటి?’... గురువారం గుకేశ్ గెలుపు అనంతరం వచ్చిన విమర్శలివి!
స్టార్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌తో పాటు మాజీ ఆటగాడు క్రామ్నిక్ తదితరులు గుకేశ్ ఘనతకు గౌరవం ఇవ్వకుండా ఆ విజయం స్థాయిని తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గుకేశ్ పైవిధంగా స్పందించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ విజయానికి ఆటతో పాటు మరెన్నో కారణాలు ఉంటాయని అతను అభిప్రాయపడ్డాడు.
విమర్శలను పట్టించుకోవద్దు: ఆనంద్
వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత గుకేశ్ ఆటపై వస్తున్న కొన్ని విమర్శలను భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తిప్పి కొట్టాడు. ఎవరో ఒకరు ఇలాంటి మాటలు అంటూనే ఉంటారని, వాటిని పట్టించుకోవద్దని అతను గుకేశ్‌కు సూచించాడు. ‘గుకేశ్ చరిత్ర సృష్టించడం నేను కళ్లారా చూశాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. విమర్శలు ప్రతీ మ్యాచ్‌కు వస్తూనే ఉంటాయి.
విజయాలు సాధించినప్పుడు ఇలాంటివి సహజం. వరల్డ్ చాంపియన్ అయ్యాక ఎవరో అనే ఇలాంటి మాటలను లెక్క చేయవద్దు. లిరెన్ క్షణం పాటు ఉదాసీనత ప్రదర్శించాడు. ఇలాంటి క్షణాలు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో దాదాపు ప్రతీ మ్యాచ్‌లో వస్తాయి. గుకేశ్ దానిని బాగా వాడుకున్న తీరును ప్రశంసించాలి’ అని ఆనంద్ పేర్కొన్నాడు.
ఎన్నో త్యాగాలు చేశాడు
‘‘గుకేశ్ విశ్వ విజేతగా నిలిచిన క్షణం మా జీవితంలోనే అత్యుత్తమమైనది. ఇన్నేళ్ల తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో చాలా సంతోషంగా ఉంది. గుకేశ్ ప్రపంచ చాంపియన్ అయ్యాడనే వార్త విని నేను నమ్మలేకపోయా.
పది నిమిషాల పాటు ఏడ్చేశా. చిన్నప్పటి నుంచి గుకేశ్ ఎంతో క్రమశిక్షణతో చాలా కష్టపడ్డాడు. తానూ ఎన్నో త్యాగాలు చేశాడు. ఈ టైటిల్‌తో ఆ కష్టమంతా సంతోషంగా మారిపోయింది’’ అని గుకేశ్ తల్లి పద్మాకుమారి పుత్రోత్సాహంతో పొంగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment