ప్రపంచ చెస్ చాంపియన్‌గా దొమ్మరాజు గుకేశ్
18 ఏళ్లకే వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్
చివరి గేమ్‌లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌పై గెలుపు
ఓవరాల్‌గా 7.5–6.5 పాయింట్ల తేడాతో టైటిల్ కైవసం
విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా గుర్తింపు
అద్భుతం జరగడంలో కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు... కానీ అసలు సమయంలో అలాంటి అద్భుతాన్ని ఎవరూ ఆపలేరు! ఒకటి కాదు... రెండు కాదు... కనీసం మూడుసార్లు దొమ్మరాజు గుకేశ్‌కు విజయావకాశాలు వచ్చాయి... కానీ దురదృష్టవశాత్తూ త్రుటిలో అతను వాటిని చేజార్చుకున్నాడు. మరోవైపు ప్రత్యర్థి కూడా మూడుసార్లు పైచేయి సాధించి గెలుపుపై కన్నేసినా... బలంగా నిలబడ్డాడు.
అన్నింటికి మించి యుద్ధ వ్యూహాల్లో ‘సంధి’ కూడా ఒక భాగమే అన్నట్లుగా ఒక అడుగు వెనక్కి తగ్గుతూ అవసరమైనప్పుడు ‘డ్రా’లకు అంగీకరించాడు. కానీ పోరు ఆఖరి ఘట్టానికి చేరేసరికి ఇక సంధి దశకు సమయం మించిపోయింది. దాడి చేయడం మినహా మరో మార్గం లేదు. ఇక్కడ వెనుకంజ వేస్తే ఇక కోలుకునేందుకు ఎలాంటి అవకాశమూ ఉండదు. అందుకే ఆ సమయంలో తనలోని అసలైన అస్త్రశ్రస్తాలకు పదును పెట్టాడు.
అతను పన్నిన ఉచ్చులో డింగ్ లిరెన్ చిక్కాడు. 55వ ఎత్తు వద్ద అతను సరిదిద్దుకోలేని తప్పిదం చేశాడు. అంతే...మరో మూడు ఎత్తుల్లోనే గుకేశ్ చైనా కింగ్ ఆట కట్టించాడు... అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్రను సృష్టిస్తూ అరవై నాలుగు గళ్ల ప్రపంచంలో రారాజుగా కిరీటధారణ చేశాడు.
ఆట ముగిశాక సాంప్రదాయం ప్రకారం గుకేశ్ చెస్ బోర్డుపై మళ్లీ పావులను పేరుస్తున్నాడు... ఒక్కో గడిలో వాటిని పెడుతున్న సమయంలో అతని కన్నీళ్లు ఆగడం లేదు... ఏడుస్తూనే అభినందనలు అందుకుంటున్నాడు... ఆ భావోద్వేగాలను నియంత్రించడం సాధ్యం కావడం లేదు. అతను చేతులు జోడించి పదే పదే బోర్డుకు మొక్కుతున్న తీరు చూస్తే గుకేశ్ దృష్టిలో అది అరవై నాలుగు గళ్ల ఆట వస్తువు మాత్రమే కాదనిపిస్తోంది... అదో దేవాలయంలా, తానో భక్తుడిలా కనిపిస్తున్నాడు.
11 ఏళ్ల చిన్నారిగా ఉన్న సమయంలో ఏదో ఒక రోజు ప్రపంచ చాంపియన్‌ను అవుతానని చెప్పుకున్న ఆ కుర్రాడు టీనేజర్‌గానే ఆ లక్ష్యాన్ని చేరుకున్న క్షణాన తన ఇన్నేళ్ల కష్టం, సాధన, త్యాగాలను గుర్తు చేసుకుంటున్నట్లుగా అనిపించింది... ఆటలో తొలి ఎత్తు వేసిన నాటి నుంచే అసాధారణ ప్రదర్శనలకు చిరునామాగా మారిన గుకేశ్ నలుపు తెలుపుల గళ్లలోనే తన రంగుల ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు.
అతి పిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు సృష్టించే అవకాశాన్ని 17 రోజుల తేడాతో కోల్పోయిన ఈ చెన్నై చిన్నోడు ఇప్పుడు 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చాంపియన్‌గా తన జెండా పాతాడు. –సాక్షి క్రీడా విభాగం
సింగపూర్ సిటీ: భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చెస్ చాంపియన్‌గా ఆవిర్భవించాడు. 18 ఏళ్ల వయసులోనే విశ్వ విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయసు్కడిగా నిలిచాడు. క్లాసికల్ ఫార్మాట్‌లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో గుకేశ్ 7.5–6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 13 గేమ్‌లు ముగిసేసరికి ఇద్దరూ 6.5–6.5 పాయింట్లతో సమంగా ఉండగా నిర్ణాయక చివరి పోరులో గుకేశ్ తన సత్తాను ప్రదర్శించాడు.
58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజయనాదం చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో క్యాండిడేట్స్ టోర్నీ గెలుచుకొని వరల్డ్ చాంపియన్‌కు సవాల్ విసిరేందుకు సిద్ధమైన రోజు నుంచి గుకేశ్‌పై అంచనాలు పెరిగాయి. నవంబర్ 25 నుంచి మొదలైన ఈ సమరంలో 9 గేమ్‌లు ‘డ్రా’గానే ముగిశాయి. గురువారం చివరి గేమ్‌కు ముందు చెరో రెండు గేమ్‌లు గెలిచిన ఇద్దరూ సమంగా ఉన్నారు.
ఈ గేమ్ కూడా ‘డ్రా’ అయితే ‘టైబ్రేక్’ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చేది. కానీ గుకేశ్ ఆ అవకాశం ఇవ్వలేదు. తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించి లిరెన్‌ను పడగొట్టాడు. తద్వారా క్లాసికల్ విభాగంలో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ (2012) తర్వాత వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన భారత ప్లేయర్‌గా గుకేశ్ నిలిచాడు.
చివరి పోరు సాగిందిలా...
తెల్లపావులతో ఆడిన 32 ఏళ్ల లిరెన్ కింగ్స్ ఇండియన్ అటాక్ ఓపెనింగ్‌తో ఆటను మొదలు పెట్టగా... గ్రన్‌ఫీల్డ్ వేరియేషన్‌తో గుకేశ్ బదులిచ్చాడు. ఈ గేమ్ కూడా ‘డ్రా’ అయితే తన బలమైన ర్యాపిడ్‌లో గుకేశ్ ఆట కట్టించవచ్చని భావించిన లిరెన్ ఈసారి కూడా దూకుడు ప్రదర్శించకుండా రక్షణాత్మకంగా నే ఆడాడు. ఇక మరో ‘డ్రా’ ఖాయం అనిపించింది. ఈ దశలో లిరెన్ చేసిన భారీ తప్పిదం తన టైటిల్ కోల్పోయేలా చేసింది.
తన 55వ ఎత్తులో అతను రూక్‌ను ఎఫ్2 గడిలోకి పంపించాడు. ఆశ్చర్యంతో గుకేశ్ కళ్లు ఒక్కసారిగా మెరిశాయి! కాస్త మంచినీళ్లు తాగిన అనంతరం గుకేశ్ తన ప్రత్యర్థి ఆట కట్టించేందుకు ఎన్ని ఎత్తులు అవసరమో ప్రశాంతంగా ఆలోచించుకున్నాడు. ఆపై ఎంతో సమయం పట్టలేదు. తన 58వ ఎత్తులో కింగ్‌ను ఇ5 గడిలోకి పంపడంతో లిరెన్‌కు ఓటమిని అంగీకరించడం మినహా మరో మార్గం లేకపోయింది.
39 ఏళ్ల రికార్డు బద్దలు
రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ పేరిట 39 ఏళ్లుగా ఉన్న రికార్డును భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ బద్దలు కొట్టాడు. క్లాసికల్ చెస్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పిన్న వయసు్కడిగా ఇప్పటి వరకు కాస్పరోవ్ (22 ఏళ్ల 6 నెలల 27 రోజులు; 1985లో కార్పోవ్‌పై విజయం) పేరిట రికార్డు ఉంది.
అయితే గురువారం ఈ రికార్డును గుకేశ్ (18 ఏళ్ల 8 నెలల 14 రోజులు) తిరగరాశాడు. విశ్వవిజేతగా నిలిచిన గుకేశ్‌కు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 45 లక్షలు), రన్నరప్ డింగ్ లిరెన్‌కు 11 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 75 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
‘డ్రా’లను దాటి...
‘గుకేశ్, లిరెన్ మధ్య గేమ్‌లు చూస్తుంటే వరల్డ్ చాంపియన్‌షిప్ పోరులాగా అస్సలు అనిపించడం లేదు. ఇద్దరిలో ఎవరూ పైచేయి సాధించేందుకు ఇష్టపడటం లేదు’... నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ వ్యాఖ్య ఇది. ‘ఈ గేమ్‌లు ఇలాగే సాగితే చదరంగంపై ఇప్పటికి మిగిలిన ఉన్న ఆ కాస్త ఆసక్తి కూడా పోతుంది’... పలువురు మాజీలు, విశ్లేషకుల అభిప్రాయం ఇది. గుకేశ్, లిరెన్ మధ్య సాగిన పోరు చూస్తే ఇది వాస్తవమే అనిపిస్తుంది. మొదటి గేమ్‌లో లిరెన్ గెలుపుతో చాంపియన్‌షిప్ సమరం ఉత్సాహంగా మొదలైంది.
రెండో గేమ్ ‘డ్రా’ కాగా... మూడో గేమ్‌లో గుకేశ్ విజయం సాధించి లెక్క సమం చేశాడు. ఆ తర్వాత వరుసగా ఏడు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో సగటు చెస్ అభిమానులు కూడా ఇదేం ఆట అన్నట్లుగా నిట్టూర్పు విడిచారు. ముఖ్యంగా ఇద్దరు ఆటగాళ్లు చెరో మూడుసార్లు గెలిచే అవకాశం వచ్చినా... వాటిని చేజార్చుకోవడం, దూకుడుగా ఆడి పైచేయి సాధించే ప్రయత్నం చేయకపోవడం కూడా ఆశ్చర్యం కలిగించింది.
10 గేమ్‌ల తర్వాత గుకేశ్ గెలుపుపై స్వయంగా కార్ల్‌సన్ కూడా సందేహం వ్యక్తం చేశాడు. లిరెన్ కూడా జాగ్రత్తగా ఆడి ర్యాపిడ్ పోరువైపు తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నట్లే కనిపించింది. కానీ 11వ గేమ్‌లో గుకేశ్ గెలుపు ఒక్కసారిగా చలనం తీసుకొచ్చింది. ఆ వెంటనే లిరెన్ కూడా విజయంతో సమాధానమివ్వడంతో మరింత ఆసక్తి పెరిగింది. అయితే 13వ గేమ్ కూడా ‘డ్రా’ అయింది. దాంతో అందరి దృష్టి చివరి పోరుపై నిలిచింది.
కానీ విశ్వనాథన్ ఆనంద్ కూడా ఫలితంపై సందేహంతోనే ఉన్నాడు. దాదాపు సగం ఆట ముగిశాక ఈ మ్యాచ్‌లో ఎవరైనా గెలిచే అవకాశాలు ఒక శాతం కూడా లేవని అతను అభిప్రాయపడ్డాడు. అయితే లిరెన్ చేసిన తప్పు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను అనూహ్యంగా ముగించింది. అంది వచ్చిన అవకాశాన్ని సమర్థంగా వాడుకున్న మన గుకేశ్ ఈ మెగా ఈవెంట్‌ను భారతీయుల దృష్టిలో చిరస్మరణీయం చేశాడు.
చిత్తూరు జిల్లా మూలాలు...
వరదయ్యపాళెం: గుకేశ్‌ది చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం. వారిది తిరుపతి జిల్లాకు చెందిన గ్రామీణ నేపథ్యం. గుకేశ్ తండ్రి రజనీకాంత్ స్వస్థలం సత్యవేడు సమీపంలోని పిచ్చాటూరు మండలం చెంచురాజుకండ్ర. ఆయన తన వైద్యవృత్తి కోసం చెన్నైకి తరలి వెళ్లగా, అక్కడే అబ్బాయి పుట్టాడు. గుకేశ్ తాత శంకరరాజు సొంత ఊరు చెంచురాజుకండ్రలోనే ప్రస్తుతం స్థిరపడ్డారు.
గుకేశ్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: పిన్న వయస్సులో ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించిన తెలుగు తేజంగుకేశ్ దొమ్మరాజు చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. గుకేశ్‌కు అభినందనలు తెలుపుతూ గురువారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
గుకేశ్ తెలుగు వాడైనందుకు గర్విస్తున్నామన్నారు. గుకేశ్ దేశంలోని యువతకు, విద్యార్థులకు ప్రేరణగా నిలవనున్నారని పేర్కొన్నారు. ఒక తెలుగు యువ కుడు ఈ రికార్డు సాధించడం అందరికీ ఆదర్శనీయమన్నారు. భవిష్యత్తులో గుకేశ్ మరిన్ని విజయాలు సాధించాలని జగన్ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment