పిన్న వయస్సులోనే చదరంగ రారాజుగా అవతరించిన దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పద్దెనిమిదేళ్ల వయసులో ఈ కుర్రాడు సాధించిన విజయం పట్ల యావత్ భారతావని పులకరించిపోతోంది. ‘‘సరిలేరు నీకెవ్వరు’’ అంటూ ఈ ప్రపంచ చాంపియన్‌కు క్రీడాలోకం నీరాజనాలు పలుకుతోంది.
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం గుకేశ్‌కు భారీ నజరానా ప్రకటించింది. చెన్నైకి చెందిన ఈ చెస్ ప్లేయర్‌కు ఏకంగా రూ. 5 కోట్ల రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
రూ. 5 కోట్ల నజరానా
‘‘చిన్న వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌గా దొమ్మరాజు గుకేశ్ అవతరించిన ఈ చారిత్రక సందర్భంలో రూ. 5 కోట్ల నజరానా అందిస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది.
గుకేశ్ చారిత్రాత్మక విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసింది. అతడు భవిష్యత్తులోనూ ఇలాంటి గొప్ప విజయాలెన్నో మరిన్ని సాధించాలని కోరుకుంటున్నా. ఇలాంటి యువ తారలను తీర్చిదిద్దడంలో శక్తి వంచన లేకుండా తమ మద్దతు అందిస్తున్న తమిళనాడు క్రీడా శాఖ, ఉదయనిధి స్టాలిన్‌కు అభినందనలు’’ అని స్టాలిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించి.. రూ. 11 కోట్ల ప్రైజ్‌మనీ
సింగపూర్ సిటీ వేదికగా జరిగిన క్లాసికల్ ఫార్మాట్‌లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ వరల్డ్ చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో గుకేశ్ 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. 58 ఎత్తుల్లో 32 ఏళ్ల లిరెన్ ఆటకు చెక్ పెట్టి అత్యుత్తమ ప్రదర్శనతో చదరంగ రారాజుగా అవతరించాడు.
తద్వారా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక వరల్డ్ చాంపియన్‌గా ట్రోఫీతో పాటు గుకేశ్‌కు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ.11.45 కోట్ల ప్రైజ్‌మనీ) లభించింది. అంతేకాకుండా మూడు గేమ్‌లు గెలిచినందుకు అదనంగా రూ.5.07 కోట్లు గుకేశ్‌కు అందాయి.
చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment