
భారత్‌కు చేరిన ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్
చెన్నై: దేశమంతా సచిన్ టెండూల్కర్ ఫేర్‌వెల్ టెస్టు సిరీస్ ‘మేనియా’తో ఊగిపోతున్న సమయంలో.... చెస్‌లో అత్యున్నత సమరం కూడా మన దేశంలోనే జరుగబోతోంది. ఈనెల 9 నుంచి 28 వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు చెన్నై వేదిక కానుంది. భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) మధ్య 12 రౌండ్ల పాటు ఈ పోరు జరుగనుంది. ఆనంద్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ టోర్నీని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తూ రికార్డు స్థాయిలో రూ.29 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పోరు కోసం సోమవారం కార్ల్‌సన్ చెన్నై చేరుకున్నాడు. అతడికి ఫిడే ఉపాధ్యక్షుడు డీవీ సుందర్, ఏఐసీఎఫ్ అధ్యక్షుడు జేసీడీ ప్రభాకర్, ప్రపంచ చాంపియన్‌షిప్ నిర్వాహక కార్యదర్శి వి.హరిహరన్ స్వాగతం పలికారు.
2012 మాస్కోలో జరిగిన చివరి చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఆనంద్ 6-6, 2.5-1.5 (టైబ్రేక్) తేడాతో గెల్ఫాండ్‌ను ఓడించాడు. అయితే ఇప్పటిదాకా కార్ల్‌సన్, ఆనంద్ పలు గేమ్స్‌లో ముఖాముఖి తలపడినా నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం ఆడలేదు. 2005 నుంచి ఇప్పటిదాకా 62 గేమ్స్‌లో ఆనంద్ 15 సార్లు, కార్ల్‌సన్ 11 సార్లు గెలవగా 36 గేమ్‌లు డ్రాగా ముగిశాయి. క్లాసికల్ చెస్‌లో ఆడిన 29 గేమ్‌ల్లో ఆనంద్ ఆరు సార్లు, కార్ల్‌సన్ మూడు సార్లు నెగ్గారు.
7న టోర్నీ ఆరంభం
ఈనెల 7న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత టోర్నీని ఆరంభిస్తారు. 9న తొలి గేమ్ జరుగుతుంది. ఒక్కో ఆటగాడు ఆరు సార్లు తెల్ల పావులు, ఆరు సార్లు నల్ల పావులతో ఆడాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతీ గేమ్ ఆరు గంటలపాటు ఉంటుంది. ఏ ఆటగాడైతే ముందుగా 6.5 పాయింట్లు సాధిస్తే అతడినే విజేతగా ప్రకటిస్తారు. ఓవరాల్ ప్రైజ్ మనీ రూ.14 కోట్లు కాగా టైటిల్ నెగ్గిన ఆటగాడికి 60 శాతం, రన్నరప్‌కు 40 శాతం సొమ్ము దక్కుతుంది. టోర్నీ వేదిక హోటల్ హయత్ రెజెన్సీకి ఆనంద్‌తో పాటు అతడి భార్య, కుమారుడు శుక్రవారమే చేరుకున్నారు. అయితే కార్ల్‌సన్ మాత్రం బయటకు వెల్లడించని రిసార్ట్‌లో బస చేస్తాడని సమాచారమున్నా అధికారికరంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఫిడే ఉపాధ్యక్షుడు సుందర్ చెప్పారు. తమకు తెలిసి అతడు కూడా హయత్‌లోనే ఉండే అవకాశం ఉందని అన్నారు. అలాగే ఈ ఇద్దరు ఆటగాళ్లు కలిసి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కార్ల్‌సన్ వెంట అతడి తల్లిదండ్రులు, ముగ్గురు సోదరీమణులు, సహాయక సిబ్బంది వచ్చారు. ఈ టోర్నీ కారణంగా హోటళ్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు