sachin tendulkar retirement
-
అంతా నీ నామస్మరణే...!
క్రికెట్ ప్రపంచంలో ఈ ఏడాది మార్మోగిన పేరు సచిన్ టెండూల్కర్. సమకాలిన క్రికెట్లో రికార్డుల రారాజుగా వెలుగొందిన ఈ స్టార్ ఆటగాడు క్రికెట్ నుంచి వీడ్కోలు పలకడంతో యావత్ క్రీడాలోకం అతడి నామస్మరణలో మునిగి తేలింది. ఈ ఏడాది ద్వితీయార్థం అంతా సచిన్‌కు సంబంధించిన వార్తా విశేషాలతో గడిచింది. సొంత మైదానంలో సచిన్ వీడ్కోలు చెప్పడంతో అభిమానుల భావోద్వేగం తారాస్థాయికి చేరింది. క్రికెట్ గురించి తెలియని వారిని కూడా సచిన్ రిటైర్మెంట్ కదిలించింది. ఇరవై నాలుగేళ్లు తన ఆటతో అలరించిన ఈ క్రికెట్ ‘దేవుడు’ అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. వేలకు వేలు పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఆటతోనే కాదు తన ప్రవర్తన ద్వారా అభిమానులను సంపాదించుకున్నాడు. క్రికెట్లో దాదాపు అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్న మాస్టర్ బ్లాస్టర్ ఆటతోనే కాదు తన ప్రవర్తన ద్వారా అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే అతడు ఆటకు దూరమవుతున్నాడన్న విషయాన్ని అభిమానులు త్వరగా జీర్ణించుకోలేకపోయారు. క్రికెట్‌నే శ్వాసగా భావించిన సచిన్ వీడ్కోలు వేళ ఉద్వేగానికి లోనయ్యాడు. 24 ఏళ్లుగా 22 గజాల మధ్య గడిపిన నేను రిటైర్ అవుతున్నాననే విషయం నమ్మలేకపోతున్నానని చెప్పి వినమ్రంగా మైదానం నుంచి నిష్క్రమించాడు. ఆటకు దూరమైనా క్రికెట్ తన అనుంబంధం కొనసాగుతుందని తెలిపాడు. సచిన్ లేని క్రికెట్‌ను ఊహించొచ్చు కానీ క్రికెట్ లేని సచిన్‌ను ఊహించలేకపోతున్నానని అతడి భార్య అంజలి చేసిన వ్యాఖ్యలు- క్రికెట్‌పై 'మాస్టర్'కున్న మమకారాన్ని తెలుపుతున్నాయి. క్రీడా రంగంలో అన్ని అవార్డులు అందుకున్న దేశంలో ముఖ్యమైన పౌర పురస్కారాలు పొందిన క్రీడాకారుడిగా కూడా సచిన్ ఖ్యాతి కెక్కాడు. తాజాగా 'భారతరత్న'మయ్యాడు. ఆటకు దూరమైనా సచిన్‌కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. బీహార్‌లోని కైమూర్ జిల్లా అతర్వాలియా గ్రామంలో క్రికెట్ దేవుడికి గుడి కట్టారు. సమాజ్‌పార్టీ నుంచి అతడికి ఆహ్వానం అందింది. యూనిసెఫ్ దక్షిణాసియా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. సచిన్ జీవిత చర్రితను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2013 సంవత్సరంలో ఇంటర్నెట్లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రీడాకారుల్లో కూడా సచిన్ ముందున్నాడు. దటీజ్ సచిన్! -
విజయంతో వీడ్కోలు
ముంబై: ప్రపంచ క్రికెట్లో ‘సచిన్ శకానికి’ ధోనిసేన విజయంతో వీడ్కోలు పలికింది. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేసి మాస్టర్ కెరీర్‌కు ఘనమైన ముగింపు నిచ్చింది. బ్యాట్స్‌మెన్ చూపిన అద్భుత ప్రదర్శనకు బౌలర్ల అసమాన తెగువ తోడు కావడంతో మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. వాంఖడేలో శనివారం మూడో రోజు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. రామ్‌దిన్ (53 నాటౌట్) టాప్ స్కోరర్. చందర్‌పాల్ (41), గేల్ (35) ఓ మోస్తరుగా ఆడారు. హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా మరోసారి ఐదు వికెట్లతో ఆకట్టుకోగా, అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి. వరుసగా రెండు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’; ఓజా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నారు. రామ్‌దిన్ నిలబడినా... 43/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన విండీస్‌ను భారత స్పిన్నర్లు పూర్తిగా కట్టడి చేశారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ ఆరంభంలోనే ఎదురు దాడి మొదలుపెట్టాడు. ఆఫ్‌సైడ్‌లో 8 మంది ఫీల్డర్లను నిలబెట్టినా... అశ్విన్ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. అయితే రెండో ఎండ్‌లో శామ్యూల్స్ (11) కుదురుకునే లోపే ఓజా దెబ్బతీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి శామ్యూల్స్ స్టంపౌటయ్యాడు. తర్వాత ఓజా వరుస ఓవర్లలో గేల్, దేవ్‌నారాయణ్ (0)ను అవుట్ చేశాడు. అయితే చందర్‌పాల్, రామ్‌దిన్ కొద్దిసేపు ప్రతిఘటించారు. క్రీజులో నిలదొక్కుకున్న ఈ ఇద్దరూ... స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడి స్కోరు బోర్డును పెంచారు. నిలకడగా ఆడుతున్న చందర్‌పాల్‌ను 39వ ఓవర్లో అశ్విన్ బోల్తా కొట్టించాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏడో వికెట్‌కు నెలకొన్న 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన స్యామీ (1)ని తర్వాతి ఓవర్లోనే ఓజా వెనక్కిపంపాడు. ఓ ఎండ్‌లో షిల్లింగ్‌ఫోర్డ్ (8)ను నిలబెట్టి రామ్‌దిన్ వేగంగా ఆడాడు. ఈ దశలో కొద్దిసేపు సచిన్‌తో బౌలింగ్ చేయించిన ధోని వికెట్లు పడకపోవడంతో మళ్లీ అశ్విన్‌ను రంగంలోకి దించాడు. చివరకు 45వ ఓవర్లో వేసిన ఫ్లయిట్ బంతిని స్వీప్ చేయబోయిన షిల్లింగ్‌ఫోర్డ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత వచ్చిన గాబ్రియెల్ (0)ను షమీ అవుట్ చేయడంతో భారత్ విజయం ఖరారైంది. ఇక ఈ రెండు జట్ల మధ్య ఈనెల 21 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే ఈనెల 21న కొచ్చిలో, రెండో వన్డే 24న విశాఖపట్నంలో, మూడో వన్డే 27న కాన్పూర్‌లో జరుగుతాయి. స్కోరు వివరాలు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 182 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్: 495 ఆలౌట్ వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: గేల్ (సి) ధోని (బి) ఓజా 35; పావెల్ (సి) షమీ (బి) అశ్విన్ 9; బెస్ట్ ఎల్బీడబ్ల్యూ (బి) ఓజా 9; బ్రేవో (సి) విజయ్ (బి) అశ్విన్ 11; శామ్యూల్స్ (స్టంప్డ్) ధోని (బి) ఓజా 11; చందర్‌పాల్ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 41; దేవ్‌నారాయణ్ (సి) అండ్ (బి) ఓజా 0; రామ్‌దిన్ నాటౌట్ 53; స్యామీ ఎల్బీడబ్ల్యూ (బి) ఓజా 1; షిల్లింగ్‌ఫోర్డ్ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 8; గాబ్రియెల్ (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (47 ఓవర్లలో ఆలౌట్) 187. వికెట్ల పతనం: 1-15; 2-28; 3-43; 4-74; 5-87; 6-89; 7-157; 8-162; 9-185; 10-187 బౌలింగ్: భువనేశ్వర్ 3-0-4-0; షమీ 7-0-28-1; అశ్విన్ 17-4-89-4; ప్రజ్ఞాన్ ఓజా 18-6-49-5; సచిన్ 2-0-8-0 -
పరుగు ఆగింది!
క్రికెట్ దిగ్గజం...పరిపూర్ణ బ్యాట్స్‌మన్...మాస్టర్ బ్లాస్టర్...రికార్డుల రారాజు...సచిన్ టెండూల్కర్ గురించి చెప్పడానికి ఏ విశేషణాలు సరిపోతాయి! క్రికెట్‌నే మతంగా భావించే దేశంలో 24 ఏళ్లు పాటు అతనే దేవుడిగా నిలిచాడు. పదో తరగతి పరీక్షల్లో పాస్ అయ్యేందుకు కుర్రాళ్లు ఆపసోపాలు పడే 16 ఏళ్ల వయసులో ఈ బాలమేధావి దేశానికే ప్రాతినిధ్యం వహించాడు. ఆనాటి నుంచి ఇంతింతై వటుడింతై... అన్నట్లు శిఖరానికి ఎదిగాడు. కోట్లాది భారతీయుల అభిమాన ఆటగాడు ఇక చాలంటూ ఈ రంగం నుంచి తప్పుకున్నాడు. పరుగు ప్రారంభం... పాకిస్థాన్‌తో కరాచీలో ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లో సచిన్ 15 పరుగులకే అవుటయ్యాడు. అయితే తర్వాతి మ్యాచ్‌లోనే పాక్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించాడు. వన్డేల్లోనైతే తొలి రెండు మ్యాచుల్లో డకౌట్! అలా ప్రారంభించిన ఈ ప్రయాణం ఇంత సుదీర్ఘ కాలం పాటు సాగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ సచిన్ నిలబడ్డాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే మాంచెస్టర్‌లో సెంచరీ సాధించి తనేంటో నిరూపించుకున్నాడు. అది మొదలు 90వ దశకం అంతా సచిన్ భారత్‌కు ఆపద్భాంధవుడి పాత్ర పోషించాడు. నిలకడ లేని భారత బ్యాటింగ్ కూలడం, సచిన్ ఒంటరి పోరాటం చేయడం అందరికీ చర్విత చర్వణమే! సచిన్ క్రీజ్‌లో ఉన్నాడంటే అదో అభయం... అవుటయ్యాడంటే మ్యాచ్ చూడటం అనవసరం అనుకోని అభిమాని అప్పట్లో ఎవరూ లేరంటే ఆశ్చర్యమే! పెదవి దాటని మాట... రికీ పాంటింగ్‌లా తప్పతాగి బార్లో తన్నులు తినలేదు... బ్రియాన్ లారాలా సొంత బోర్డుతో గొడవలు పెట్టుకోలేదు... కలిస్‌లా అమ్మాయిలతో కలిసి తిరిగే పుకార్లు రాలేదు... రికార్డులతో తనతో పోటీ పడిన అనేక మంది క్రికెటర్లలో లేని గొప్పతనం సచిన్‌లో ఉంది. ఆటతోపాటే మంచి వ్యక్తిత్వంతో మాస్టర్ అందరికంటే ఎంతో ఎత్తులో నిలబడ్డాడు. ఏనాడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గానీ, మైదానంలో బూతును వాడటం కానీ ఎన్నడూ చేయలేదు. మంకీ గేట్... ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా...లాంటివి సచిన్‌కు సంబంధించిన వివాదాలు అనడం అర్ధ రహితం. ఎందుకంటే వాటిలో మాస్టర్ పాత్ర ఏమీ లేదు. అవి కేవలం కొంత మంది వ్యక్తుల అభిప్రాయాలు మాత్రమే! అందరికంటే ప్రత్యేకం... సచిన్‌కంటే ముందు కూడా భారత క్రికెట్లో గవాస్కర్, కపిల్‌దేవ్ లాంటి అనేక మంది దిగ్గజ ఆటగాళ్లు వచ్చారు. ప్రపంచ క్రికెట్లో ఈ సంఖ్య మరింత ఎక్కువ. వీరిలో ఎవరికీ లేని ప్రత్యేకత సచిన్‌కు ఎందుకు వచ్చింది! గణాంకాలను మించిన గొప్పతనం సచిన్‌లో ఉండటమే అందుకు కారణం. సచిన్ కేవలం ఒక ఆటగాడిగా మిగిలిపోలేదు. ఆట స్థాయిని పెంచి చూపించాడు. ఈనాడు యువ క్రికెటర్లకు లభిస్తున్న క్రేజ్, అందుతున్న డబ్బు సచిన్ చలవే అంటే అతిశయోక్తి కాదు! 90లలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు మార్కెట్ పెరగడంలో పరోక్షంగా సచిన్ పాత్రను విస్మరించలేం. ఆ సమయంలో సచిన్ చుట్టే క్రికెట్ పరిభ్రమించింది. మాస్టర్ కూడా అందుకు తగినట్లుగా తన అద్భుత ప్రదర్శనతో వెలుగు వెలిగాడు. ఒక క్రికెటర్ బ్రాండింగ్ చేస్తే దానికి ఎంతటి ప్రచారం లభిస్తుందో సచిన్ తర్వాతే అందరికీ తెలిసింది. ఆలస్యం చేశాడా! దాదాపు ఏడేళ్ల క్రితమే సచిన్ రిటైర్మెంట్పై ‘ఎండూల్కర్’ అంటూ కథనాలు వచ్చాయి. తనతో కలిసి ఆడిన సహచరులు తనపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడం అతడిని బాధించింది. అయితే ఎన్నో ఏళ్ల పాటు కోట్లాది మంది అంచనాలు మోస్తూ... తీవ్ర ఒత్తిడి మధ్య ఆడిన మాస్టర్, తనలో వాడి తగ్గలేదని నిరూపించేందుకే సిద్ధమయ్యాడు. జట్టులో సీనియర్‌గా ముందుండి నడిపిస్తూ అనేక చారిత్రాత్మక విజయాల్లో భాగమయ్యాడు. 2011 వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాతే సచిన్ తప్పుకోవాల్సిందని చాలా మంది అభిప్రాయ పడ్డారు. కేవలం ఆటపై ప్రేమే అతడిని మరికొంత కాలం ఆడేలా ప్రోత్సహించిందన్నది సత్యం. ఇంకెప్పుడూ రిటైర్ అవుతాడ్రా బాబూ...అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలను చదువుతూ వచ్చిన వారు కూడా సచిన్ రిటైర్ కాగానే అయ్యో అని బాధ పడకుండా ఉంటారా! - సాక్షి క్రీడా విభాగం -
జనం కోరిక తీరింది
న్యూఢిల్లీ: మైదానంలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ‘క్రికెట్ శిఖరం’ సచిన్ టెండూల్కర్... మైదానం ఆవలా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నాడు. వాంఖడే స్టేడియంలో 200వ టెస్టు ఆడి 24 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొన్ని గంటలకే సచిన్ ఖాతాలో మరో ఆణిముత్యం చేరింది. కోట్లాది మంది అభిమానుల ఆకాంక్ష నెరవేరింది. సచిన్ టెండూల్కర్‌ను దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో సత్కరించనున్నట్లు శనివారం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ‘సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రకటించారు’ అని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి వేణు రాజమణి ఒక ప్రకటనను విడుదల చేశారు. దాంతో ‘భారతరత్న’ పొందనున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా 40 ఏళ్ల సచిన్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఈ అత్యున్నత పురస్కారం దక్కించుకున్న పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. ‘నిస్సందేహంగా సచిన్ టెండూల్కర్ విశిష్ట క్రికెటర్. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన దిగ్గజం. 16 ఏళ్లకే కెరీర్‌ను మొదలుపెట్టి 24 ఏళ్లు దేశానికి సేవలు అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో క్రికెట్ ఆడాడు. దేశానికి ఎంతో ప్రతిష్టను తెచ్చాడు. ప్రపంచ క్రీడాపటంలో అసలైన భారత రాయబారిగా నిలిచాడు. క్రికెట్లో సచిన్ సాధించిన ఘనతలు, రికార్డులు అసమానం, అమేయం. అతను కనబరిచిన క్రీడాస్ఫూర్తి ఆదర్శప్రాయం. క్రీడాకారుడిగా కనబరిచిన అసాధారణమైన ప్రతిభకు గుర్తింపుగా అతనికి ఎన్నో పురస్కారాలు లభించాయి’ అని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) తమ ప్రకటనలో సచిన్‌ను కొనియాడింది. సచిన్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలని గత మూడేళ్లుగా చర్చ కొనసాగుతోంది. నిబంధనల ప్రకారమైతే కేవలం కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక, సమాజ సేవ రంగా ల్లో విశిష్ట సేవలు అందించిన వారికే ‘భారతరత్న’ కు అర్హులు. అయితే ఈ నిబంధనలను సవరించి ఈ జాబితాలో క్రీడారంగాన్నీ చేర్చారు. అన్నీ వచ్చేశాయి... తాజాగా ‘భారతరత్న’ కూడా ఖాయం కావడంతో దేశంలోని ముఖ్యమైన పౌర పురస్కారాలు పొందిన క్రీడాకారుడిగా సచిన్ నిలిచాడు. 2008లో సచిన్ దేశ ద్వితీయ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’ అందుకున్నాడు. 1994లో ‘అర్జున అవార్డు’... 1998లో ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’... 1999లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి. అభినందనల వెల్లువ... సచిన్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. క్రికెట్ మేధావి ఆటకెంతో చేశాడని, ఇకపై కూడా అతని జీవితం ఆనందంగా సాగాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకాంక్షించారు. రిటైర్మెంట్తో పాటు సచిన్ భారతరత్న అవార్డుకు ఎంపికవడంపై ప్రధాని స్వయంగా ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఇతర ప్రముఖుల అభినందనలు వారి మాటల్లోనే... క్రీడాకారులకు సచిన్ రోల్‌మోడల్. యువతకు స్ఫూర్తి. అలాంటి దిగ్గజానికి భారతరత్న దక్కడం హర్షణీయం. - సోనియా గాంధీ (కాంగ్రెస్ అధినేత్రి) భారతరత్నకు సచిన్ ముమ్మాటికీ అర్హుడు. క్రికెటర్లకే కాదు క్రీడాకారులందరికీ అతనే రోల్‌మోడల్. - శ్రీనివాసన్ (బీసీసీఐ చీఫ్) మాస్టర్‌లాంటి ఆటగాళ్లు చాలా అరుదు. క్రికెట్‌కే వన్నే తెచ్చిన అతన్ని యావత్ ప్రపంచం గౌరవిస్తుంది. ప్రత్యర్థులు సైతం జేజేలు పలికే ఒక్క ఆటగాడు సచిన్. - రిచర్డ్సన్ (ఐసీసీ సీఈఓ) సచిన్ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. ఇక మీదట ‘ఆట’లేని అతని జీవితం కూడా అద్భుతంగా సాగాలని ఆశిస్తున్నా. - ఫెడరర్ క్రికెట్ చరిత్రలోనే ఓ గొప్ప మ్యాచ్ ఇది. ఇలాంటి మ్యాచ్‌కు మళ్లీ సాక్షులం కాలేం. మా ముందుండి నడిపించిన సచిన్‌కు వందనం. - ధోని డ్రెస్సింగ్‌రూమ్ వెలవెలబోవడం ఖాయం. అతని అమూల్యమైన మార్గదర్శనాన్ని జట్టు కోల్పోతోంది. - రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడనే విషయం వినడానికే కష్టంగా ఉంది. నాలో ఒక భాగం పోయినట్లు అనిపిస్తోంది. కానీ నా జీవితంలో మరో సచిన్ మాత్రం ఎప్పటికీ రాడు. గుడ్‌బై... నాకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు. - యువరాజ్ సింగ్ సెల్యూట్ సచిన్. నీవు లేని క్రికెట్ నీలా ఉండదు. నాకు సంబంధించి క్రికెట్ అంటే నువ్వే. - హర్భజన్ అతను రిటైర్మెంట్ ప్రకటించినప్పటీ నుంచే నేను ఉద్వేగాన్ని ఎదుర్కొంటున్నా. నా మనసులో అతనికున్న స్థానం మహోన్నతమైంది. - సెహ్వాగ్ ఇక మేమంతా నీ ఆటను కోల్పోతున్నాం. నాకే కాదు మొత్తం దేశానికే ఇవి ఉద్విగ్న క్షణాలు. - సానియా వ్యక్తిత్వంలోనూ సచిన్ మనుసున్న మారాజు. అతనికి అంతా మంచే జరగాలి. - లతా మంగేష్కర్ అసాధ్యాలను సుసాధ్యం చేసిన సచిన్‌కు థాంక్స్. - అమితాబ్ బచ్చన్ సచిన్‌లాంటి గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్, మేటి ఇన్నింగ్స్‌లను ఇక చూడలేం. -శ్రీదేవి, సినీ తార రాష్ట్రంలోనూ... సాక్షి, హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ లభించడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్‌ను సత్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి స్వాగతించారు. ‘ప్రపంచ క్రికెట్లో సచిన్ సువర్ణాధ్యాయాన్ని లిఖించాడు. దేశంలోని ఆటగాళ్లందరికీ అతనే ప్రేరణ. అలాంటి సచిన్‌కు భారతరత్నతో ప్రభుత్వం గుర్తింపునివ్వడం శుభపరిణామం. ఆటపై నిబద్ధత, అంకితభావాన్ని అతడి నుంచి నేర్చుకోవాలి ’ - వై.ఎస్. జగన్ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత) ‘సచిన్‌ను చూసి యువత స్ఫూర్తిపొందాలి. భారత అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యే అర్హతలన్నీ సచిన్‌లో ఉన్నాయి’ - తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రికార్డుల రారాజు సచిన్ అంటేనే రికార్డుల రారాజు. అంతర్జాతీయ క్రికెట్లో అతని ప్రతీ పరుగు అమూల్యం. అనితర సాధ్యమైన రికార్డులను ఎన్నింటినో మాస్టర్ సొంతం చేసుకున్నాడు. అతి చిన్న వయసులో....అందరికంటే వేగంగా...అందరికంటే ముందుగా....ఇలా ఎన్నో రికార్డులు మాస్టర్‌కు దాసోహమయ్యాయి. ఇందులో కొన్ని బద్దలు అయ్యే అవకాశం ఉన్నా...మరి కొన్ని ఎప్పటికీ చెరిగిపోనివి. సచిన్ చలవతో పాతికేళ్లుగా క్రికెట్ గణాంక నిపుణులకు చేతి నిండా పని. అలాంటి ఉజ్వల కెరీర్లో కీలక అంకెలపై దృష్టి సారిస్తే.... టెస్టుల్లో.... అత్యధిక పరుగులు (15,921) అత్యధిక ఫోర్లు (2,059) అత్యధిక సెంచరీలు (51) అత్యధిక అర్ధ సెంచరీలు (68) విదేశాల్లో అత్యధిక రన్స్(8,705) నాలుగో స్థానంలో 13,492 పరుగులు చేసిన సచిన్, ఈ స్థానంలోనే 44 సెంచరీలు చేశాడు. 67 సార్లు జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఘనత వన్డేల్లో.... అత్యధిక మ్యాచ్‌లు (463) అత్యధిక బంతులు (21,367) ఎదుర్కొన్న ఆటగాడు అత్యధిక ఫోర్లు (2,016) అత్యధిక సెంచరీలు (49) అత్యధిక అర్ధ సెంచరీలు (96) అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (62) అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు (15) ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (1,894 పరుగులు-1998లో) చేసిన రికార్డు వరుసగా 185 మ్యాచుల్లో పాల్గొన్న ఘనత (1990 ఏప్రిల్ నుంచి 1998 ఏప్రిల్ వరకు) అత్యధిక కాలం సాగిన కెరీర్ (22 ఏళ్ల 91 రోజులు) -
థాంక్యూ...గుడ్ బై..
ఎందుకు కన్నీళ్లు ఆగడం లేదు..! ఏదో ఓ రూపంలో మళ్లీ కనిపిస్తాడని తెలుసు. అయినా మనసెందుకు మాట వినడం లేదు. ఈ బాధెందుకు తగ్గడం లేదు... రెండు పుష్కరాల పాటు మనసులను రంజింపజేసిన ఆట మళ్లీ కనపడదనా..! క్రికెట్‌కే కొత్త నిర్వచనం చెప్పిన ‘దేవుడు’ ఇక ఆటలో భాగం కాలేడనా..! సచిన్ కంటే ముందు ఎందరో దిగ్గజాలు క్రికెట్ ఆడారు. సచిన్‌తో కలిసి ఆడిన గొప్ప క్రికెటర్లున్నారు. భవిష్యత్‌లోనూ ఎవరో ఒకరు అదే స్థాయిలో ఆడే ఆటగాడొస్తాడు. కానీ మళ్లీ సచిన్ రాడు... ఏనాడూ ప్రత్యర్థిపై నోరు పారేసుకుని ఎరగడు. ఎంత డబ్బు ఇస్తానన్నా మద్యం, సిగరెట్లకు ప్రచారం చేయలేదు. బయటా ఎవరినీ పల్లెత్తు మాట అనడు.... ఈ లక్షణాలున్న మరో క్రికెటర్ ప్రపంచానికి దొరకుతాడా..! మనసు ఇంకా మాస్టర్ ఆట చూడాలంటోంది. ఏం చేయాలి..? ఒక జీవితానికి సరిపడా అందించిన జ్ఞాపకాలను నెమరువేసుకుందాం... రెండు పుష్కరాల పాటు ఆట ద్వారా ఆనందం పంచినందుకు థాంక్స్... వీడలేమని మేమంటున్నా... నువ్వు వీడ్కోలన్నావు. నీ మీద ప్రేమతోనే నీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. గుడ్‌బై ‘గాడ్’..! ‘ఆట’ ముగించిన మాస్టర్ అనూహ్యమేమీ కాదు... అయినా సరే అందరిలోనూ అదే ఉద్వేగం... మైదానంలోని ప్రేక్షకులు... కుటుంబ సభ్యులు... సహచరులు... ఇలా ఒక్కరేమిటి... అందరిదీ అదే స్థితి... కొంత మంది భోరున ఏడ్చేశారు. మరి కొంత మంది ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేసినా... అది సాధ్యం కావడం లేదు... ఆత్మీయుడెవరో దూరమవుతున్న బాధ... క్రికెట్ అంటే అతనే అని ఇంత కాలం భావిస్తూ బతికిన తరానికి గుండె బద్దలవుతున్న క్షణం... మరి సచిన్ పరిస్థితి... ఎన్ని ఆలోచనలు రేకెత్తి ఉంటాయి... ఎంత అలజడి సాగుతూ ఉంటుంది... తన జీవితమే ముగిసిపోతున్నట్లు... క్రికెట్ లేకుండా ఎలా బతకగలనంటూ... ఎలాంటి సంబంధం లేకుండానే పాతికేళ్ల పాటు తమలో ఒకడిగా మార్చుకున్న కోటానుకోట్ల ఆత్మీయులకు ఎలా కృతజ్ఞత చెప్పాలంటూ... విజయాలు... పరాజయాలను సమంగా స్వీకరిస్తూ భావోద్వేగాలు కనపడకుండా ఇన్నాళ్లు దాచగలిగిన శిఖర సమానుడు తన ప్రియమైన ఆటను వీడుతున్న సమయాన మాత్రం చిన్న పిల్లాడిలా రోదించాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ మైదానం వీడాడు... ముంబై: అవును....సచిన్ రమేశ్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంనుంచి వీడ్కోలు తీసుకున్నాడు. వాంఖడే స్టేడియంలో శనివారం ఉదయం 11.47 గంటలకు ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌తో ఈ దిగ్గజం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై సచిన్ ఆటను చూసే అవకాశం, అదృష్టం మనకు లేదు. కానీ అతను మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం మనతో నిలిచే ఉంటాయి. 24 ఏళ్ల ఒక రోజు... షమీ బౌలింగ్‌లో గాబ్రియెల్ క్లీన్‌బౌల్డ్ కావడంతో సచిన్ రెండు పుష్కరాల కెరీర్‌కు ఫుల్స్టాప్ పడింది. స్టేడియంలోని దాదాపు 25 వేల మంది ప్రేక్షకులు ఈ చిరస్మరణీయ ఘట్టానికి సాక్షిగా నిలిచారు. మ్యాచ్ ముగియగానే టీమిండియా ఆటగాళ్లు సచిన్‌కు స్టంప్‌ను జ్ఞాపికగా ఇచ్చారు. సహచరులందరినీ ఆలింగనం చేసుకున్న తర్వాత వెస్టిండీస్ ఆటగాళ్లు ఒక్కొక్కరితో మాస్టర్ కరచాలనం చేశాడు. 1989 నవంబర్ 15న తొలి టెస్టు బరిలోకి దిగిన సచిన్ సరిగ్గా 24 ఏళ్ల ఒక రోజు తర్వాత కెరీర్‌ను ముగించాడు. మొబైల్ గార్డ్ ఆఫ్ ఆనర్ మాస్టర్‌ను భారత క్రికెట్ జట్టు ఘనంగా గౌరవించింది. సాధారణంగా దిగ్గజ క్రికెటర్లు రిటైరైతే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు. (ఇరువైపులా నిలబడి బయటకు పంపడం). సచిన్ విషయంలో భారత యువ జట్టు ఒక అడుగు ముందుకేసి మొబైల్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చింది. క్రికెటర్లంతా లైన్లో నిలుచున్న తర్వాత మాస్టర్ ముందుకు వెళ్లే కొద్దీ వరుసలో ఆఖరన ఉన్న ఆటగాడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు చేరి బౌండరీ రోప్ వరకు తీసుకొచ్చారు. చివరిసారిగా పిచ్‌పై... మ్యాచ్ ముగిశాక సచిన్ మైదానాన్ని వీడుతున్న వేళ స్టేడియంలో ప్రతీ ఒక్కరు లేచి నిలబడి ఆ దిగ్గజానికి సలామ్ చేశారు. ఆ తర్వాత మాస్టర్ తన భార్య, పిల్లలతో కలిసి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి వచ్చాడు. 24 ఏళ్ల పాటు తనకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు చెబుతూ భావోద్వేగ ప్రసంగం చేశాడు. అనంతరం కెప్టెన్ ధోనితో పాటు కోహ్లి, ధావన్ తదితరులు తమ భుజాలపై సచిన్‌ను స్టేడియం అంతా ఊరేగించారు. త్రివర్ణ పతాకంతో మాస్టర్ మైదానమంతా కలియదిరిగి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. అనంతరం తన ఉజ్వల కెరీర్‌కు ‘బాట’ పరిచిన పిచ్ దగ్గరికి వచ్చి ఆఖరి సారిగా దానికి మొక్కి ఉద్వేగంగా నిష్ర్కమించాడు. స్టేడియం బయటికి వచ్చాక కూడా టీమ్ బస్సులోంచి అభిమానులకు ఆఖరిసారిగా చేయి ఊపి... క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. పేరుపేరునా కృతజ్ఞతలు మాస్టర్ బ్లాస్టర్ చివరిసారిగా క్రికెట్ మైదానంలో చేసిన ప్రసంగం యథాతథంగా... స్నేహితులారా, (స్టేడియం హోరెత్తింది) నన్ను మాట్లాడనివ్వండి... లేదంటే నేను ఇంకా ఎక్కువ భావోద్వేగానికి లోనవుతాను. 24 ఏళ్లుగా 22 గజాల మధ్య గడిపిన నేను రిటైర్ అవుతున్నాననే విషయం నమ్మలేకపోతున్నాను. నేను ఇక్కడి వరకు రావడానికి నా జీవితంలో మద్దతుగా నిలబడిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. ఎవరినైనా మరచిపోతానేమో అని జాబితా రాసుకుని వచ్చాను. ఒకవేళ పొరపాటున ఎవరినైనా మరచిపోతే క్షమించండి. అంకుల్, ఆంటీ, సోదరులు నా స్కూల్ రోజు ల్లో మా అంకుల్, ఆంటీ వాళ్ల ఇంట్లో ఉండేవాడిని. వాళ్లు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. నే ను ఆడి అలసిపోతే మగత నిద్రలోనే ఆంటీ నాకు ఏదైనా తినిపించి మళ్లీ ఆడేందుకు సిద్ధం చేసేది. మా పెద్దన్నయ్య నితిన్... ‘నువ్వు ఏం చేసినా కరెక్ట్‌గానే చేస్తావు. నీ మీద నమ్మకం ఉంది’ అని చెప్పేవాడు. నా తొలి క్రికెట్ బ్యాట్ ఇచ్చింది మా అక్క సవిత. కాశ్మీర్ విల్లో బ్యాట్ అది. ఇప్పటికీ నేను ఆడుతుంటే తను ఉపవాసం ఉంటుంది. మరో అన్నయ్య అజిత్ గురించి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. నా కోసం తన కెరీర్‌ను వదిలేసుకున్నాడు. 11 ఏళ్ల వయసులో రమాకాంత్ అచ్రేకర్ సర్ దగ్గరకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి నా జీవితం మారిపోయింది. శువ్రారం రాత్రి కూడా ఫోన్లో నా ఆట గురించి చర్చించుకున్నాం. నా కెరీర్ అంతా నా ఆట గురించి చర్చించుకున్నాం, వాదించుకున్నాం. అదే లేకపోతే నేను ఈ స్థాయికి చేరేవాడిని కాదు. అత్తా మామలు... నా అత్తామామలు అన్నాబెల్, ఆనంద్ మెహతా... నాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. వాళ్లతో అనేక విషయాలు చర్చించేవాడిని. నేను అంజలిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు థాంక్స్. స్నేహితులు నా జీవితంలో అండగా నిలబడిన స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ల పనులు వదిలేసుకుని నాకు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేయడానికి వచ్చేవారు. గాయాలైనప్పుడు నా కెరీర్ ముగిసిందనుకున్నాను. కానీ ఉ.3 గం. సమయంలోనూ ఫోన్లలో నా స్నేహితులు స్పందిం చారు. నా కెరీర్ చాలా ఉందని ధైర్యం చెప్పారు. గురువు అచ్రేకర్... నా ఆట 11 ఏళ్ల వయసులో ప్రారంభమైంది. అచ్రేకర్ సార్ నన్ను తన స్కూటర్ మీద ముంబైలోని మైదానాలకు తిప్పేవారు. ప్రాక్టీస్ కోసం ఉదయం ఒక మైదానంలో, మధ్యాహ్నం ఒక గ్రౌండ్లో మ్యాచ్ ఆడటానికి తీసుకెళ్లేవారు. ఇప్పటివరకూ ఎప్పుడూ ఆయన నన్ను బాగా ఆడానని ప్రశంసించలేదు. దీనివల్ల అలసత్వం వస్తుందని ప్రశంసించలేదు. సర్... నేను రిటైర్ అవుతున్నా కాబట్టి ఇప్పుడైనా నేను బాగా ఆడానని మీరు అనవచ్చు... బీసీసీఐ, సహచరులు... ఇదే మైదానంలో నా క్రికెట్ ప్రారంభమైంది. అందరిలాగే భారత్‌కు ఆడాలనేదే నా కల. 16 ఏళ్ల వయసులో బీసీసీఐ నన్ను నమ్మి అవకాశం ఇచ్చింది. చాలామంది క్రికెటర్లతో కలిసి ఆడాను. అందరూ నాకు సహాయం చేశారు. ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ, ఇక్కడలేని కుంబ్లే, నా సహచర క్రికెటర్లు... మీరంతా నాకు కుటుంబంలాంటి వారు. ధోని నాకు 200 టెస్టు క్యాప్ ఇచ్చినప్పుడు... ‘మనమంతా జట్టుగా ఇక్కడ ఉన్నందుకు గర్విద్దాం. మీ పూర్తి సామర్థ్ధ్యంతో దేశానికి సేవ చేస్తారని భావిస్తున్నాను. భగవంతుడు మనకు ఈ అవకాశం ఇచ్చాడు. దీనిని సరైన దిశలో ఉపయోగించుకోవాలి. క్రికెట్ ప్రతిష్టను పెంచాలి’ అన్నాను. ఇంతకాలం నాకు వైద్యం చేసిన డాక్టర్లు, ఫిజియోలకు కృతజ్ఞతలు. మీరు లేకుంటే ఇంతకాలం నేను క్రికెట్ ఆడేవాడినే కాదు. మేనేజర్స్... నా స్నేహితుడు, నా తొలి మేనేజర్ మార్క్ దురదృష్టశాత్తు ఇప్పుడు లేరు. తను లేకుంటే ఇదంతా సాధించేవాడినే కాదు. స్పాన్సర్లు, ప్రమోషన్ల ఒత్తిడి నా మీద లేకుండా స్వేచ్ఛగా క్రికెట్ ఆడుకోగలిగేలా చూశాడు. ఆ తర్వాత నా మేనేజర్ వినోద్ నాయుడు కూడా నా కుటుంబంలో ఒకడిలా కలిసిపోయాడు. నా కోసం తన కుటుంబాన్ని వదిలి వచ్చి పనిచేశాడు. తనతో పాటు వినోద్ కుటుంబానికి కూడా నా కృతజ్ఞతలు. మీడియా, ఫొటోగ్రాఫర్స్... స్కూల్ రోజుల్లో నేను బాగా ఆడినప్పుడు మీడియా ప్రోత్సహించింది. ఈ రోజు ఉదయం వరకు కూడా నా గురించి రాస్తూనే ఉన్నారు. నేను మరింత బాగా ఆడేందుకు ఇవి తోడ్పడ్డాయి. నా జీవితాంతం భద్రపరచుకుని ఆనందించేలా అనేక ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్లకూ థాంక్స్. అభిమానులు... ఇక అందరికంటే ముఖ్యంగా మీరు... (అభిమానులను ఉద్దేశించి) నేను డకౌట్ అయినా, సెంచరీ కొట్టినా అండగానే నిలబడ్డారు. నా కోసం ప్రార్థనలు చేశారు, ఉపవాసాలూ ఉన్నారు. ఇక్కడి ‘సచిన్.. సచిన్...’ అనే హోరు నేను బతికున్నంత కాలం నా చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది. అందరికీ కృతజ్ఞతలు. ఏదైనా మరచిపోయి ఉంటే క్షమించండి. గుడ్‌బై..! ఇక కొన్ని ఇంటి బాధ్యతలు అప్పగిస్తా: అంజలి సచిన్ లేని క్రికెట్‌ను ఊహించొచ్చు కానీ క్రికెట్ లేని సచిన్‌ను ఊహించలేకపోతున్నా. ఇక సచిన్‌కు కొన్ని ఇంటి బాధ్యతలు కూడా అప్పగిస్తా. సచిన్ సాధారణంగా భావోద్వేగాలను బయటపడనీయడు. సాధారణంగా నేను కూడా బయటపడను. కానీ నెల రోజులుగా ఈ రిటైర్మెంట్ రోజును తలచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఎప్పుడు రిటైర్ అవ్వాలనేది తేల్చుకోవడానికి సమయం తీసుకున్నాడు. కానీ నిర్ణయం తీసుకున్నాక దానిని చక్కగా హ్యాండిల్ చేశాడు. ఎక్కడ ఉన్నా ఆట నుంచి దూరమయ్యేవాడు కాదు. నెల రోజులు సెలవులు గడపడానికి వెళ్లినప్పుడు కూడా... ఎక్కువగా తినేవాడు కాదు. క్రికెట్ ఆడాలి, తినను అనేవాడు. సారా, అర్జున్ పుట్టే సమయానికే వాళ్ల నాన్న దేశానికి క్రికెట్ ఆడుతున్నాడు. ఆయన గొప్పతనమేంటో ఇప్పుడు వాళ్లకు బాగా తెలుస్తుంది. పెళ్లి చేసుకోవడానికి ముందే సచిన్ గురించి నాకు అర్థమైంది. తను మొదట ముంబైకి, భారతదేశానికి చెందిన వ్యక్తి. ఆ తర్వాతే నాకు. -అంజలి (సచిన్ భార్య) అంజలి, సారా, అర్జున్... నా జీవితంలో అద్భుతమైన క్షణం 1990లో అంజలి పరిచయం. ఒక డాక్టర్‌గా తనకు కెరీర్ ఉంది. కానీ పిల్లల గురించి నేను చూసుకుంటా... నువ్వు ఆడుకో అని నా కెరీర్ ఇబ్బందులు లేకుండా కొనసాగేలా చేసింది. నేను మాట్లాడిన అనేక చెత్త విషయాలను భరించింది. నా జీవితంలో అద్భుతమైన భాగస్వామ్యం అందించినందుకు థ్యాంక్స్. సారా, అర్జున్ నా జీవితంలో రెండు విలువైన వజ్రాలు. అమ్మాయికి 16 ఏళ్లు, అబ్బాయికి 14 ఏళ్లు. టైమ్ అలా గడిచిపోయింది. వాళ్ల పుట్టిన రోజులకు, వార్షికోత్సవాలకు, స్పోర్ట్స్ డేస్‌కు నేను లేను. కానీ దానిని వాళ్లు అర్థం చేసుకున్నారు. (పిల్లలిద్దరితో) మీ ఇద్దరూ నాకు ఎంతో ప్రత్యేకం. నేను మీతో తగినంత సమయం గడపలేదు. కానీ వచ్చే 16 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం మీతోనే సమయం గడుపుతానని హామీ ఇస్తున్నా. నాన్న... రమేశ్ టెండూల్కర్ తొలుత నా జీవితంలో అందరికంటే ముఖ్యమైన వ్యక్తి మా నాన్న. 1999లో మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన మార్గదర్శనం లేకపోతే ఈరోజు ఇక్కడ నిలబడేవాడిని కాదు. ‘కలలను వె ంటాడు. నీ లక్ష్యంలో ఇబ్బందులు ఎదురైనా ఎప్పుడూ వదిలేయకు. ముఖ్యంగా మంచి మనిషిగా ఎదుగు’ అని ఆయన చెప్పేవారు. నేను సెంచరీ చేసిన ప్రతిసారీ పైకి చూసి, అభివాదం చేసేది ఆయనకే. అమ్మ... రజనీ టెండూల్కర్ మా అమ్మ... నా లాంటి అల్లరి పిల్లాడిని ఎలా పెంచిందో. నా ఆరోగ్యం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకునేది. నా కెరీర్ ప్రారంభం కాకముందు నుంచి కూడా నా కోసం ప్రార్థనలు చేసేది. అవే నాకు బలాన్నిచ్చాయి. -
అందరికీ కృతజ్ఞతలు.. అర్థం చేసుకుంటారనుకుంటున్నా!!
-
అందరికీ కృతజ్ఞతలు.. అర్థం చేసుకుంటారనుకుంటున్నా!!
వాంఖడే స్టేడియంలో సచిన్ రిటైర్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సచిన్ ఉద్వేగ భరితంగా మాట్లాడాడు. ఆ మాటల్లోని ముఖ్యాంశాలు... ''ఇంత అద్భుతమైన ప్రయాణం ముగిసిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి.. నా తండ్రి. ఆయన నాకు చిన్నతనంలోనే స్వేచ్ఛనిచ్చి, కోరుకున్న కెరీర్ ఎంచుకొమ్మన్నారు. నేను ఆయన అడుగుజాడల్లోనే నడిచాను. ఆయన అద్భుతమైన వ్యక్తి కూడా. ఆయన ఆశీస్సుల వల్లే ఇంత స్థాయికి ఎదిగాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత సులభం కాదు. కానీ అంజలి చాలా ఓర్పు, సహనంతో వ్యవహరించింది. ఆమె తన ఇద్దరు బిడ్డలతో పాటు.. నన్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంది. గడిచిన 24 ఏళ్లుగా దేశం కోసం ఆడాను. ఆమె ఎప్పుడూ ప్రార్థస్తూ ఉంది. ఆ ప్రార్థనల ఫలితం వల్లే నేను బాగా ఆడగలిగాను. మా పెద్ద అన్నయ్య ఎప్పుడూ నాకు వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. అందుకే నేను దృష్టి పెట్టగలిగాను. మా సోదరి సబిత నాకు మొదటి బ్యాట్ కొనిచ్చింది. అందుకు చాలా కృతజ్ఞతలు. మా సోదరుడు అజిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రమాకాంత్ ఆచ్రేకర్ సార్ దగ్గరకి తనే తీసుకెళ్లాడు. ఆయన నాకు అన్నీ చెప్పకపోతే నేను క్రికెట్లో చాలా కిందిస్థాయిలో ఉండేవాడినేమో. 1990లో నేను అంజలిని కలవడం నా జీవితంలో చాలా అద్భుతమైన క్షణం. నేను అలా అడుగులో అడుగు వేసుకుంటూ తనవద్దకు వెళ్లాను. ఆమె ఓ డాక్టర్. తాను నన్ను క్రికెట్ ఆడమంది, తాను కుటుంబ బాధ్యతలు తీసుకుంటానంది. నా తప్పులు, ఒత్తిళ్లు తట్టుకున్నందుకు చాలా థాంక్స్. జీవితంలోని ఎత్తుపల్లాలన్నింటిలో తోడున్నందుకు థాంక్స్. (ఈమాట అనగానే అంజలి కంటివెంట కన్నీరు వచ్చింది). జీవితం నాకిచ్చిన రెండు వరాలు.. సారా, అర్జున్. ఇప్పుడు ఇప్పటికే పెరిగారు. వాళ్లకు కూడా నేను చాలా థాంక్స్ చెప్పాలి. వాళ్ల పుట్టినరోజులు, స్పోర్స్ట్ డేలు, ఏం జరిగినా ఎప్పుడూ నేను ఉండేవాడిని కాను. వాళ్లు నాకు ఎంత ప్రత్యేకమో వాళ్లు ఊహించలేరు. ఇన్నాళ్లుగా నేను మీకు సమయం కేటాయించలేకపోయాను. కానీ రాబోయే 16 ఏళ్లు పూర్తిగా మీతోనే ఉంటాను. చిన్నతనంలో నాకు చాలామంది స్నేహితులుండేవారు. వాళ్లను నెట్స్‌లోకి పిలిచి నాకు బౌలింగ్ చేయమనేవాడిని. సెలవులు వచ్చినప్పుడల్లా నేను సరిగా ఆడుతున్నానో లేదోనని వాళ్లను వేధించేవాడిని. తెల్లవారుజామున మూడు గంటలకు కూడా నాతోపాటు వాళ్లు వచ్చి, నీ కెరీర్ అయిపోలేదని ప్రోత్సహించేవాళ్లు. వాళ్లందరికీ చాలా థాంక్స్. నేను 11 ఏళ్ల వయసులో క్రికెట్ కెరీర్ మొదలుపెట్టాను. ఆచ్రేకర్ సార్ నా కోచ్ అయిన తర్వాత జీవితం చాలా మారింది. ఆయనను చూసినప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. సార్ నన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని ముంబై మొత్తం మ్యాచ్‌ల కోసం తిప్పేవారు. గత 29 ఏళ్లుగా ఆయన నన్ను నడిపిస్తూనే ఉన్నారు. ఇక జీవితంలో మ్యాచ్‌లు చూడటమే తప్ప ఆడటం ఉండదు!! ముంబైలో.. ఇదే మైదానంలో నా ఆట మొదలైంది. అందుకే ఇప్పుడు కూడా ఇక్కడే ఆడాలనుకున్నాను. బీసీసీఐ నన్ను 16 ఏళ్ల వయసులో ఎంపిక చేసింది. అప్పుడు నన్ను తీసుకున్న సెలెక్టర్లందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీ అందరి మద్దతు నాకు చాలా ఉంది. గాయపడినప్పుడు కూడా దగ్గరుండి చికిత్సలు చేయించి మళ్లీ భారత్ తరఫున ఆడేలా చేశారు. రాహుల్, లక్ష్మణ్, సౌరవ్... ఇలా వీళ్లందరూ నేను కుటుంబానికి ఊదరంగా ఉన్నప్పుడు డ్రస్సింగ్ రూంలో నాతో ఉండేవారు. వాళ్ల సాహచర్యం నాకు చాలా స్పెషల్. ఎంఎస్ ధోనీ నాకు 200 టెస్టు మ్యాచ్ క్యాప్ ఇచ్చినప్పుడు టీమ్ కోసం ఓ సందేశం ఇచ్చాను. మనమంతా భారత క్రికెట్ జట్టులో భాగమైనందుకు ఎంతో గర్వపడాలి. మీరు మీ పూర్తి సామర్థ్యంతో జాతికి సేవలు అందిండచం కొనసాగిస్తారని ఆశిస్తున్నా. నా డాక్టర్లు, ఫిజియోలు, ట్రైనర్లు.. వాళ్లను ప్రస్తావించకపోతే పెద్ద తప్పు చేసినట్లే. వాళ్లు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. నేను ఎక్కడున్నా గాయపడినప్పుడు వెంటనే వచ్చి, తీసుకెళ్లి మళ్లీ మామూలు సచిన్‌ను చేసేవారు. వినోద్ నాయుడు గత 14 ఏళ్లుగా మా కుటుంబంతో ఉన్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి నా కోసం పనిచేశాడు. స్కూలు సమయంలో ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు నన్ను ప్రోత్సహించిన మీడియాకు కృతజ్ఞతలు. ఫొటోగ్రాఫర్లు నావి మంచిమంచి ఫొటోలు తీశారు. చివరిగా ఒక్కమాట.. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రేక్షకులు కూడా నన్ను చాలా చాలా ప్రోత్సహించారు. వాళ్ల ప్రోత్సాహమే లేకపోతే ఇదంతా ఉండేది కాదు. వాళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాచిన్.. సాచిన్.. అని అరుస్తుంటే నా గుండెల్లోంచి ఉద్వేగం పొంగుకొచ్చేది. థాంక్యూ వెరీమచ్. మీరంతా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థాంక్యూ.. -
మురిపించిన ‘మాస్టర్’
38 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన సచిన్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. చూడచక్కని ఫుట్‌వర్క్‌తో చేసిన డ్రైవ్స్, డిఫెన్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఆరంభంలో బౌన్సర్లతో బెస్ట్ ఇబ్బందిపెట్టినా... స్పిన్నర్లు గింగరాలు తిప్పినా... సచిన్ బ్యాట్ మాత్రం అదరలేదు.. బెదరలేదు. బొంగరం తిప్పినంత సులువుగా బ్యాట్‌ను తిప్పిన మాస్టర్... షిల్లింగ్‌ఫోర్డ్ బంతులను ‘లేట్ కట్’ చేసిన దృశ్యం అభిమానులను తన్మయత్వంలో ముంచెత్తింది. బెస్ట్ బౌలింగ్‌లో బ్యాక్‌ఫుట్‌తో కొట్టిన బలమైన పంచ్‌కు బంతి కవర్స్‌లో వెళ్తుంటే దాన్ని అందుకోవడానికి ముగ్గురు ఫీల్డర్లు పరుగు తీయడం మర్చిపోలేని అనుభూతి. వేగంగా వచ్చిన బెస్ట్ బంతిని ఒక్క అడుగు ముందుకేసి సున్నితంగా నెడుతూ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్ ఓ అద్భుతం. దీంతో సచిన్ 91 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవలి బంతులను ఎదుర్కొన్న తీరైతే అమోఘం. బంతి ఎలా కదిలితే అలా శరీరాన్ని వంచుతూ కొట్టిన ఫుల్డ్రైవ్స్ మాస్టర్ ఇన్నింగ్స్‌ను మదిలో నింపేశాయి. పుజారాతో మంచి సమన్వయం కుదరడంతో సచిన్ ఇన్నింగ్స్ ఓ ప్రవాహంలా సాగిపోయింది. ఈ క్రమంలో సెంచరీ దిశగా సాగుతున్న ఈ ముంబై గ్రేట్‌ను డ్రింక్స్ తర్వాత దేవ్‌నారాయణ్ దెబ్బతీశాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వచ్చిన బంతిని కట్ చేస్తే స్లిప్‌లో స్యామీ చేతిలోకి వెళ్లింది. అంతే ఒక్కసారిగా స్టేడియం మూగబోయింది. మాస్టర్ ఇన్నింగ్సే అత్యుత్తమం ‘తీవ్ర ఒత్తిడి, అంచనాల మధ్య చివరి టెస్టు ఆడుతున్న సచిన్ పరిస్థితిని చూస్తే నేను, రోహిత్ చేసిన సెంచరీలకంటే మాస్టర్ ఇన్నింగ్సే అత్యుత్తమం. మైదానంలో ప్రేక్షకుల హోరు మధ్య మనసు లగ్నం చేయడం అంత సులభం కాదు. సచిన్ ఆఖరి ఇన్నింగ్స్ సమయంలో మరో వైపు క్రీజ్‌లో ఉండటం నాకో ప్రత్యేక అనుభూతి. టెయిలెండర్ల సహాయంతో రోహిత్ సెంచరీ చేసిన తీరు వీవీఎస్ లక్ష్మణ్‌ను గుర్తుకు తెచ్చింది’. - చతేశ్వర్ పుజారా, భారత బ్యాట్స్‌మన్ -
బరువెక్కిన హృదయంతో..!
ముగిసిన సచిన్ ‘ఇన్నింగ్స్’ ముంబై: దేవుడిని ఎన్నో కోరికలు కోరతాం...అన్నీ నెరవేరతాయా! శుక్రవారం వాంఖడే మైదానంలో కూడా సరిగ్గా అదే జరిగింది. సచిన్ అర్ధ సెంచరీ చేశాక...74 పరుగులకు చేరాక అభిమానులంతా మాస్టర్ కచ్చితంగా శతకం అందుకుంటాడనే భావించారు. కానీ వారి కోరికను ‘దేవుడు’ నెరవేర్చలేదు. సెంచరీకి దూరంగా తన పరుగును ఆపేశాడు. అయితే ఏమిటి...బ్రాడ్‌మన్ చేసిన ‘సున్నా’ పరుగులకంటే 74 చేయడం విశేషమే కదా! అప్పటి వరకు చకచకా పరుగులు తీస్తూ దూకుడు ప్రదర్శించిన సచిన్ అదే వేగంతో క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. దేవ్‌నారాయణ్ బౌలింగ్‌లో స్యామీకి క్యాచ్ ఇచ్చిన సమయంలో సరిగ్గా ఉదయం 10.38 గంటలకు వాంఖడే స్టేడియం స్థంభించింది. ఒక్కసారిగా ఏం జరిగిందో ప్రేక్షకులకు అర్థం కాలేదు. కోలుకునే సరికి మాస్టర్ పెవిలియన్ వైపు వెళుతూ కనిపించాడు. అంతే...మైదానంలో ప్రేక్షకులు, వీఐపీలు, కుటుంబ సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో క్రికెట్ వీరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. సచిన్ కూడా కొద్దిసేపు లోకాన్ని కోల్పోయినట్లు భావించాడేమో...చాలా దూరం మామూలుగానే వచ్చేశాడు. అయితే అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ఒక్కసారిగా గుర్తుకొచ్చినట్లుంది. సైట్ స్క్రీన్ సమీపానికి వచ్చాక హెల్మెట్ తీసి బ్యాట్‌ను ప్రేక్షకుల వైపు చూపించాడు. అతను డ్రెస్సింగ్ రూమ్‌లో చేరి తన సీట్లో కూర్చునే వరకు కెమెరా కళ్లన్నీ అతనిపైనే...ఇంకా చెప్పాలంటే సచిన్ నుంచి కెమెరా జరపలేమంటూ టీవీ ప్రసారంలో చాలా సేపటి వరకు ఒక్కసారి కూడా రీప్లే చూపించకపోవడం విశేషం. కోచ్ కన్నీళ్లు.... సచిన్ అవుటైన క్షణాన సన్నిహితుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన హావభావాలు కనిపించాయి. అంజలి కొద్దిగా గాంభీర్యం ప్రదర్శించగా...తల్లి రజని చిరునవ్వుతో కొడుకు వైపు చూసింది. మాస్టర్‌కు మార్గదర్శిగా నిలిచిన సోదరుడు అజిత్ ఉద్వేగంగా కనిపించగా...కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. బౌండరీ బయట బాల్‌బాయ్‌గా కూర్చున్న అర్జున్ మాత్రం తన వయసుకు తగ్గట్లు చప్పట్లతో తండ్రిని అభినందిస్తూ ఉత్సాహంగా కనిపించాడు. అన్నట్లు... ప్రేక్షకుల స్టాండింగ్ ఒవేషన్‌కు సచిన్ కళ్లల్లో కూడా నీళ్లు వచ్చి ఉంటాయా...అంటే చెప్పలేం. బహుశా కొద్ది సేపు వాటిని నియంత్రించుకొని ఉంటాడేమో...కానీ ఒక్కటి మాత్రం నిజం...మాస్టర్ నిష్ర్కమించిన వేళ ప్రత్యక్షంగా గానీ, టీవీల్లో కానీ చూస్తున్న ప్రేక్షకుల్లో ఉద్వేగానికి లోను కానివారు ఎవరైనా ఉంటారా! బెస్ట్ కాదు వరస్ట్... సచిన్‌ను ఆఖరి సారి అవుట్ చేసిన బౌలర్ చరిత్ర పుటల్లోకెక్కడం ఖాయం. ఆ విషయం టినో బెస్ట్‌కు కూడా చాలా బాగా తెలుసు. అందుకే శుక్రవారం సచిన్‌కు బౌలింగ్ చేస్తూ పదే పదే రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. వరుసగా షార్ట్ బంతులు, బౌన్సర్లు వేస్తూ తీవ్రంగా శ్రమించాడు. అవసరం ఉన్నా, లేకపోయినా అప్పీల్ చేశాడు. సచిన్ చేయికి బంతి తగిలినట్లుగా చూపించాడు. అయితే వాటిని అంపైర్ తిరస్కరించడంతో అతని మొహం వాడిపోయింది. ఇంకా చెప్పాలంటే ఏ బౌలరూ సాహసించని రీతిలో మాస్టర్ సొంతగడ్డపై ఒక రకమైన స్లెడ్జింగ్‌కు ప్రయత్నించాడు. ఒక దశలో ‘ఏక్ ఔర్ ఏక్...బెస్ట్కో బాహర్ ఫేంక్’...అనే నినాదం మైదానమంతా మార్మోగింది. మరోవైపు సచిన్ మాత్రం బెస్ట్‌ను చాలా తేలిగ్గా తీసుకున్నాడు. హనుమంతుడి ముందు కుప్పిగంతులా...అన్న తీరుగా రెండు చక్కటి ఫోర్లతో జవాబిచ్చాడు. చిరునవ్వులు చిందిస్తూ బెస్ట్‌ను మరింత ఉడికించాడు. చివరకు మోకాళ్లపై కూలిపోయిన బెస్ట్ దగ్గరికి వెళ్లి అతని భుజంపై తడుతూ ముందుకు సాగాడు. ఇది నా రోజు నీది కాదు...అనే ఓదార్పు అందులో కనిపించింది. మరో వైపు ప్రఖ్యాత ‘టైమ్’మ్యాగజైన్ సచిన్‌ను ‘మ్యాన్ ఆఫ్ ది మూమెంట్’ అంటూ ప్రశంసలు కురిపించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ కూడా సచిన్ రిటైర్మెంట్ సందర్భంగా తన అభినందలు తెలిపారు. స్టార్ స్పోర్ట్స్ చానల్ కూడా కొత్తగా సచిన్ మెమరీ ప్రాజెక్ట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
ఘనంగా ఆరంభం
ముంబై: ఓ చారిత్రాత్మక తుది ఘట్టానికి తెరలేచిన వేళ... ముంబై వాసులు నిద్రమత్తు వీడి వాంఖడే వైపు పరుగులు తీస్తున్న తరుణం... కాలం ఆగకపోయినా... వేగం పెరిగిన క్షణం... జీవితంలో చూడలేని, మర్చిపోలేని ఓ అంకం కోసం.... గ్యాలరీలు నిండాయి... కుటుంబం సహా విశిష్ట అతిథులూ ఆసీనులయ్యారు... భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని టాస్ గెలిచి ప్రత్యర్థులకు బ్యాటింగ్ అప్పగించాడు. అంతే బరిలోకి దిగిన బౌలర్లు మాస్టర్‌కు ఘనమైన కానుక ఇచ్చేందు సర్వం ఒడ్డారు. తొలి సెషన్లో రెండే వికెట్లు తీసినా... రెండో సెషన్లో హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (5/40) మ్యాజిక్ స్పెల్‌తో రెచ్చిపోయాడు. దీంతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 55.2 ఓవర్లలో 182 పరుగులకే కుప్పకూలింది. పావెల్ (48), బ్రేవో (29) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు చేసింది. సచిన్ (73 బంతుల్లో 6 ఫోర్లతో 38 బ్యాటింగ్), పుజారా (49 బంతుల్లో 4 ఫోర్లతో 34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయ్ (43), ధావన్ (33) ఫర్వాలేదనిపించారు. షిల్లింగ్‌ఫోర్డ్ 2 వికెట్లు పడగొట్టాడు. గేల్ మళ్లీ విఫలం క్రీజులో అసౌకర్యంగా కదిలిన విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ (11) షమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. షమీ స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్ ఆరంభంలో పరుగులు సమర్పించుకున్నా... 25వ ఓవర్లో బ్రేవోను అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. విండీస్ లంచ్ వరకు 2 వికెట్లకు 93 పరుగులు చేసింది. ఓజా సూపర్ బౌలింగ్ లంచ్ తర్వాత తన రెండో ఓవర్లోనే ఓజా పావెల్‌ను అవుట్ చేశాడు. చందర్‌పాల్ ఓ భారీ సిక్సర్‌తో ఖాతా ప్రారంభించినా పెద్దగా ఆడలేకపోయాడు. ఏడో ఓవర్లో ఓజా... శామ్యూల్స్ (19)ను అవుట్ చేయగా, ఆ తర్వాత చందర్‌పాల్‌ను భువనేశ్వర్ బోల్తా కొట్టించాడు. దీంతో 148 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. 49వ ఓవర్లో అశ్విన్ మూడు బంతుల తేడాతో దేవ్‌నారాయణ్ (21), స్యామీ (0)లను అవుట్ చేశాడు. తర్వాత ఓవర్లలో ఓజా... షిల్లింగ్‌ఫోర్డ్ (0), బెస్ట్ (0), గాబ్రియెల్ (1)లకు షాకిచ్చాడు. దీంతో ఓ దశలో 97/2తో పటిష్ట స్థితిలో ఉన్న విండీస్ 85 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ల శుభారంభం టీ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు ధావన్, విజయ్‌లు శుభారంభాన్నిచ్చారు. గాబ్రియెల్, స్యామీ బౌలింగ్‌లో చెరో నాలుగు ఫోర్లు కొట్టి గాడిలో పడ్డారు. అయితే పేసర్లు ప్రభావం చూపకపోవడంతో ఓ ఎండ్‌లో స్పిన్నర్ షిల్లింగ్‌ఫోర్డ్‌ను బరిలోకి తెచ్చాడు. ఈ వ్యూహం ఫలించి 14వ ఓవర్లో మూడు బంతుల వ్యవధిలో ధావన్, విజయ్‌లను అవుట్ చేశాడు. దీంతో 77 పరుగుల వద్దే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పుజారా తో జత కలిసిన సచిన్ తన మార్క్ షాట్లతో అలరించాడు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా బౌండరీలు కొట్టాడు. పుజారా కూడా ఆకట్టుకోవడంతో భారత్ స్కోరు వేగంగా పెరిగింది. ఈ జోడి మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించింది. స్కోరు వివరాలు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: గేల్ (సి) రోహిత్ (బి) షమీ 11; పావెల్ (సి) ధావన్ (బి) ఓజా 48; డారెన్ బ్రేవో (సి) ధోని (బి) అశ్విన్ 29; శామ్యూల్స్ (సి) విజయ్ (బి) ఓజా 19; చందర్‌పాల్ (సి) అశ్విన్ (బి) భువనేశ్వర్ 25; దేవ్ నారాయణ్ (సి) విజయ్ (బి) అశ్విన్ 21; రామ్‌దిన్ నాటౌట్ 12; స్యామీ (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; షిల్లింగ్‌ఫోర్డ్ ఎల్బీడబ్ల్యూ (బి) ఓజా 0; బెస్ట్ (సి) ధోని (బి) ఓజా 0; గాబ్రియెల్ (సి) ధోని (బి) ఓజా 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం: (55.2 ఓవర్లలో ఆలౌట్) 182. వికెట్ల పతనం: 1-25; 2-86; 3-97; 4-140; 5-148; 6-162; 7-162; 8-162; 9-172; 10-182 బౌలింగ్: భువనేశ్వర్ 17-2-45-1; మహ్మద్ షమీ 12-2-36-1; అశ్విన్ 15-2-45-3; ప్రజ్ఞాన్ ఓజా 11.2-2-40-5 భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ (సి) స్యామీ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 43; ధావన్ (సి) చందర్‌పాల్ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 33; పుజారా బ్యాటింగ్ 34; సచిన్ బ్యాటింగ్ 38; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (34 ఓవర్లలో 2 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-77; 2-77 బౌలింగ్: స్యామీ 6-0-27-0; గాబ్రియెల్ 6-0-32-0; షిల్లింగ్‌ఫోర్డ్ 12-1-46-2; బెస్ట్ 5-0-27-0; శామ్యూల్స్ 5-0-17-0. ఏ సెషన్లో ఎన్ని... సెషన్-1 ఓవర్లు: 28; పరుగులు: 93; వికెట్లు: 2 సెషన్-2 ఓవర్లు: 27.2; పరుగులు: 89; వికెట్లు: 8 సెషన్-3 ఓవర్లు: 34; పరుగులు: 157; వికెట్లు: 2 -
సోలో ‘షో’
ముంబై: కోట్లాది భారతీయులు, అభిమానులు ఎదురు చూసిన ఆ క్షణం గురువారం రానే వచ్చింది. క్రికెట్ కింగ్ సచిన్ టెండూల్కర్ తన ఆఖరి టెస్టు ఆడేందుకు బరిలోకి దిగిన వేళ....అభిమానుల హోరుతో వాంఖడే దద్దరిల్లింది. గ్యాలరీలో తన పక్కన కూర్చున్నవాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా వినిపించని స్థాయిలో మైదానంలో సచిన్...సచిన్...మంత్రం ప్రతిధ్వనించింది. తొలి రోజు ఆటలో అతను వేసిన ప్రతీ అడుగు, తీసిన ప్రతీ పరుగు ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తింది. దాదాపు 100 నిమిషాలు మాస్టర్ బ్యాటింగ్ చేసిన తర్వాత అభిమానులందరికీ ఒకే సందేహం వచ్చి ఉంటుంది. ఇంత చక్కగా ఆడుతూ అసలు సచిన్ రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడు అని! రెప్ప వేయవద్దు! వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో సచిన్ ఫీల్డింగ్ చేస్తున్నంత సేపు ప్రేక్షకులు ఆనందానికి అదుపు లేదు. సచిన్ కదిలినా, ఒక్కసారి ప్రేక్షకుల వైపు తిరిగినా వారికి పండుగలా అనిపించింది. ఇక ఫీల్డ్‌లో బంతి మాస్టర్ దగ్గరికి వెళ్లినప్పుడైతే చెప్పేదేముంది! భారత ఇన్నింగ్స్ 14వ ఓవర్లో సచిన్ బ్యాటింగ్‌ను చూసే అదృష్టం కలిగింది. తనకు అలవాటైన రీతిలో ఆకాశం వైపు చూస్తూ సచిన్ మైదానంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఏ క్షణాన్ని కోల్పోకూడదంటూ ‘కనురెప్ప కూడా వేయవద్దు’ అని భారీ స్క్రీన్‌పై కనిపించిన వాక్యాన్ని అచ్చంగా అభిమానులు పాటించినట్లున్నారు. విండీస్ ఆటగాళ్లు కూడా మాస్టర్ వస్తున్నప్పుడు ఇరు వైపులా నిలబడి చప్పట్లతో ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇచ్చారు. అభినందనల పర్వం మ్యాచ్‌కు ముందు సచిన్ కోసం వేర్వేరు కార్యక్రమాలు జరిగాయి. బీసీసీఐ తరఫున అధ్యక్షుడు శ్రీనివాసన్ ఒక జ్ఞాపికను ఇవ్వగా, కార్యదర్శి సంజయ్ పటేల్ ప్రత్యేక చిత్రపటాన్ని అందజేశారు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ప్రత్యేక జెర్సీలను ధరించారు. జెర్సీ ఎడమ వైపు బీసీసీఐ లోగో కింద ‘సచిన్ రమేశ్ టెండూల్కర్ 200వ టెస్టు’ అని ముద్రించి ఉంది. గతంలో ఏ క్రికెటర్ కోసమూ ఇలా చేయలేదు. కామెంటేటర్లు కూడా ఎస్ఆర్టీ 200 అని ముద్రించి ఉన్న ప్రత్యేక జాకెట్లను ధరించారు. టీమిండియా కెప్టెన్ ధోని... ‘200’ అని ముద్రించి ఉన్న ఒక ప్రత్యేక క్యాప్‌ను మాస్టర్‌కు అందజేశాడు. విండీస్ జట్టు సభ్యులు కూడా ఆటోగ్రాఫ్‌లు చేసిన ప్రత్యేక టీ షర్ట్ ఫ్రేమ్‌ను అందించారు. సచిన్ బొమ్మతో ప్రత్యేకంగా తయారు చేసిన నాణాన్నే టాస్ కోసం ఉపయోగించారు. టాస్ తర్వాత కేంద్ర మంత్రి కపిల్ సిబాల్... సచిన్‌పై ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. భారత్‌లో మదర్ థెరిసా తర్వాత బ్రతికుండగానే ఈ గౌరవం దక్కించుకున్న రెండో వ్యక్తి సచిన్ కావడం విశేషం. సన్నిహితుల సమక్షంలో... సచిన్ 200వ టెస్టుకు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు మాజీ ఆటగాళ్లు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సచిన్ తల్లి రజని టెండూల్కర్ జీవితంలో తొలిసారి తన కొడుకు ఆటను ప్రత్యక్షంగా చూడటం విశేషం. సోదరుడు అజిత్, భార్య అంజలి, పిల్లలు అర్జున్, సారాలతో పాటు అతని అత్తమామలు కూడా మ్యాచ్‌కు వచ్చారు. మాస్టర్‌కు ఓనమాలు నేర్పిన గురువు రమాకాంత్ అచ్రేకర్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. క్రికెట్ దిగ్గజాలు క్లైవ్ లాయిడ్, బ్రియాన్ లారాలతో పాటు సినీ హీరో ఆమిర్ ఖాన్, నీతా అంబానీ తదితరులు సచిన్ చివరి టెస్టు తొలిరోజును ఆస్వాదించారు. ఈ మ్యాచ్ కోసం ముంబై క్రికెట్ సంఘం సచిన్‌కు 500 ప్రత్యేక పాస్‌లు కేటాయించింది. మరోవైపు స్టేడియంలో ఏర్పాటు చేసిన సచిన్ 51 టెస్టుల చిత్రాలకు విరాట్ కోహ్లి ప్రకటనలు అడ్డుగా రావడంపై బుధవారం విమర్శలు వచ్చాయి. దాంతో ముంబై క్రికెట్ సంఘం మ్యాచ్‌కు ముందు వాటిని తొలగించింది. బ్యాట్ త్రివర్ణ రంజితం... తన చివరి, 200వ టెస్టులో సచిన్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బ్యాట్‌తో బరిలోకి దిగాడు. సాధారణంగా తన బ్యాట్‌కు నలుపు రంగు గ్రిప్‌ను వాడే సచిన్ ఈ సారి భారత జాతీయ పతాకాన్ని పోలిన మువ్వన్నెల గ్రిప్‌ను ఎంచుకున్నాడు. బ్యాట్ వెనుక భాగం, బ్లేడ్ భాగం కూడా త్రివర్ణ రంజితంగా మార్చి తన భారతీయతను చాటుకున్నాడు. ‘సచిన్ తన కెరీర్‌ను దేశానికి అంకితం చేయాలని భావించాడు. అందుకే బ్యాట్‌ను ప్రత్యేకంగా చేయించాం’ అని అడిడాస్-ఎస్టీ బ్యాట్ రూపకర్తలు వెల్లడించారు. కొసమెరుపు: తొలి రోజు ధోని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగానే ఈ రోజు సచిన్ ఆటను చూడటం సాధ్యం కాకపోవచ్చని చాలా మంది భావించారు. కానీ అతను బ్యాటింగ్‌కు వచ్చాడు. మరి రెండో రోజు అతను సెంచరీ సాధిస్తాడా... డబుల్ సెంచరీ చేస్తాడా అన్నది ఆసక్తికరం. మరి ఇప్పుడు భారత అభిమానులకు శుక్రవారం ఆఫీసు ఎగ్గొట్టేందుకు అర్జంటుగా ఒక సాకు కావాలి. ఎంత మందికి తల నొప్పి వస్తుందో...ఎంత మందిని కడుపు నొప్పి బాధిస్తుందో... చూడాలి! భారతదేశంలో బ్రతికున్న వ్యక్తి పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం ఇది రెండోసారి మాత్రమే. మదర్ థెరిసా తర్వాత ఈ గౌరవాన్ని దక్కించుకున్న వ్యక్తి సచిన్. -
‘మాస్టర్’ స్ట్రోక్
గురువారం మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాలు... వాంఖడే ఒక్కసారిగా హోరెత్తింది. తన చివరి టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు సచిన్ పెవిలియన్ మెట్లు దిగుతూ బ్యాటింగ్‌కు వచ్చాడు. 32 వేలమంది ప్రేక్షకులు లేచి నిలబడి మాస్టర్‌ను స్వాగతించారు. ఇన్నాళ్లూ తనకెంతో ఇచ్చిన 22 అడుగుల పిచ్‌కు మొక్కుతూ... తన తల్లి తొలిసారి ప్రత్యక్షంగా తిలకిస్తుండగా క్రీజులోకి వచ్చాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతిని ఫార్వర్డ్ షార్ట్లెగ్లోకి ఆడాడు. చుట్టూ నలుగురు ఫీల్డర్లను మోహరించినా... షిల్లింగ్‌ఫోర్డ్ వేసిన తర్వాతి ఓవర్లో అందమైన కట్‌షాట్‌తో తొలి బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన దూస్రాకు చూడ చక్కని కవర్ డ్రైవ్‌తో సమాధానమిచ్చాడు. పేసర్ గాబ్రియెల్ వేసిన మరో బంతిని కవర్ డ్రైవ్ ద్వారా బౌండరీ దాటించాడు. షిల్లింగ్‌ఫోర్డ్ రెచ్చగొట్టే తరహాలో ఫ్లయిట్ బంతులు వేసినా డిఫెన్సివ్ స్ట్రోక్‌తో అడ్డు కట్టవేశాడు. శామ్యూల్స్ ఓవర్లో ఆఫ్ బ్రేక్‌ను అద్భుతంగా లెగ్‌సైడ్ గ్లాన్స్ చేసి నాలుగో బౌండరీని, ఫైన్‌లెగ్‌లోకి మరో ఫోర్‌తో ఐదో బౌండరీని అందుకున్నాడు. ఇక స్యామీ బౌలింగ్‌లో కొట్టిన ఆన్ డ్రైవ్ ఫోర్ కళాత్మకం. మొత్తానికి సచిన్ అభిమానులను నిరాశపరచలేదు. ఇక రెండో రోజు కూడా కావలసినంత వినోదం. మాస్టర్ ఇదే జోరును కొనసాగించి శతకం సాధించాలని కోరుకుందాం. సచిన్‌కు అంకితం ‘సచిన్ స్పెషల్ టెస్టులో 5 వికెట్లు తీయడం చాలా ఆనందంగా ఉంది. నా ఈ ప్రదర్శన మాస్టర్‌కే అంకితం’ - ఓజా 49 అత్యధిక టెస్టులకు నాయకత్వం వహించిన భారత కెప్టెన్‌గా గంగూలీ (49) రికార్డును ధోని సమం చేశాడు. 18 భారత్ తరఫున వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్. 18వ మ్యాచ్‌లోనే ఈ ఘనతను సాధించాడు. 1 వెస్టిండీస్ తరఫున 150 టెస్టులు ఆడిన మొదటి క్రికెటర్‌గా చందర్‌పాల్ రికార్డు. ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడు (39 ఏళ్ల 3 నెలలు) కూడా. నవంబర్ 15 సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఇదే రోజు సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు -
సచిన్ దేవోభవ..!
అబ్బ వీళ్లు అవుటైతే బాగు... సచిన్ వస్తాడు..! గత రెండు దశాబ్దాల్లో టెస్టుల్లో భారత ఓపెనర్లు అవుట్ కావాలని కోరుకున్న అభిమానులు కోకొల్లలు. అవును మరి... సచిన్ కోసం అంత తహతహలాడారు. దేశం లో కోట్లాది మంది సచిన్‌ను చూస్తూనే పెరిగారు... కోట్లాది మంది అతడి ఆటను ఆస్వాదిస్తూనే ముసలి వాళ్లయ్యారు. చాలామంది అభిమానులకు సచిన్‌తో ఓ రకమైన బంధం పెనవేసుకుని ఉంది. దేశంలో ప్రజలకు ఆనందాన్ని అందించిన వ్యక్తులను తెలుసు కోవడానికి ఏదైనా కొలమానం ఉండుంటే... అది కచ్చితంగా సచిన్ పేరునే ముందు చూపించేది. ప్రపంచంలో క్రికెట్ గురించి ఏ ఇద్దరు చర్చించుకున్నా అందులో కచ్చితంగా సచిన్ పేరు ఉండాల్సిందే. ప్రతి భారతీయుడూ గర్వపడాల్సిన అంశం ఇది. సరైన సమయంలో.... ఓ రకంగా సచిన్ తన రిటెర్మంట్ నిర్ణయాన్ని నెల రోజుల ముందే ప్రకటించి మంచి పని చేశాడు. చివరిసారి మాస్టర్ ఆటను ఆస్వాదించే అవకాశాన్ని అభిమానులకు అందించాడు. గతంలో గంగూలీ మినహా ఓ సిరీస్‌కు ముందే రిటెర్మంట్ గురించి ప్రకటించిన భారత క్రికెటర్లెవరూ లేరు. ప్రతి క్రికెటర్ ఏదో ఒక రోజు రిటైర్ కావలసిందే. సచిన్ కూడా 18 నెలలుగా చర్చల్లో నానుతున్న అంశమే. అయినా ఆ రోజు దగ్గరకు వచ్చేసరికి అదో బాధ. ‘సచిన్ రిటైరైతే క్రికెట్ చూడటం మానేస్తాం’ అన్న వ్యక్తులు లేకపోలేదు. ఆటను ఎంత ప్రేమించారో, సచిన్‌నూ అంతే ఆరాధించారు. అందుకే ఇకపై సచిన్ కనిపించడనే ఆలోచననే కోట్లాదిమంది భరించలేకపోతున్నారు. తన రిటెర్మంట్పై చాలా చర్చే జరిగింది. తనలో ఆడే సామర్థ్యం ఎంతుంది? తన వల్ల జట్టుకు మేలు జరుగుతుందా లేదా? అనే విషయాలను అందరికంటే బాగా అంచనా చేయగలిగింది అతడే. అందుకే ఇక విమర్శలకు తావివ్వకుండా...‘ఇంకా ఆడాలని అభిమానులు కోరుకుంటున్న సమయంలో’నే వీడ్కోలు చెప్పాడు. బౌలర్లకు ఊరట ఇకపై ప్రపంచంలో బౌలర్లంతా ఊపిరి పీల్చుకోవచ్చు. బౌలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే ఆలోచించాల్సిన పనిలేదు. మిగిలిన క్రికెటర్లంతా ఒకెత్తయితే... సచిన్ ఒకెత్తు. మాస్టర్ వికెట్ తీస్తే పొందే ఆనందం... ప్రతి బౌలర్ కెరీర్లోనే అతి గొప్పది. గత 24 సంవత్సరాలుగా ప్రతి ప్రత్యర్థీ ... మాస్టర్ వికెట్ తీస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే భావించాడు. క్రికెట్ రక్షకుడు... ఇప్పుడు భారత జట్టు అనేక విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో ఎన్నో విజయాలను అందుకుంది. కానీ 1990ల్లో భారత జట్టు పరిస్థితి అలా లేదు. వరుస ఓటములతో ఒక దశలో హాకీ తరహాలో ఇబ్బందిని ఎదుర్కొంది. ఆ సమయంలో భారత క్రికెట్‌ను రక్షించిన రక్షకుడు సచిన్. టెక్నాలజీకి థాంక్యూ! సచిన్ కంటే ముందు బ్రాడ్‌మన్‌లాంటి అనేకమంది దిగ్గజాలు క్రికెట్ ఆడారు. కానీ వీళ్ల ఆటని ప్రపంచం టీవీల్లో ప్రత్యక్షంగా చూడలేకపోయింది. సచిన్ వచ్చే సమయానికి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి అభిమానులు టెక్నాలజీకి థాంక్స్ చెప్పుకోవాల్సిందే. -
సత్యసాయికి ప్రియ భక్తుడు
మైదానంలో పరుగుల వరద పారించే సచిన్‌కు భగవంతుడిపై అపార భక్తి విశ్వాసాలు న్నాయి. ముఖ్యంగా పుట్టపర్తి సత్యసాయి బాబా అంటే అతడికి అమిత ఇష్టం. బాబా ఆశీస్సుల కోసం పుట్టపర్తికి ఎన్నో సార్లు వచ్చాడు. ఓసారి బాబా సన్నిధిలోనే జరిగిన యూనిటీ కప్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో సచిన్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. బాబా శివైక్యం వార్త తెలియగానే సచిన్ తట్టుకోలేక పోయాడు. ఆ సమయంలో ఐపీఎల్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్న మాస్టర్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లి పార్థివ దేహాన్ని దర్శించుకున్నాడు. ఈ సమయంలో దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. అదే రోజు తన పుట్టిన రోజైనా ఆ వేడుకలకు దూరమయ్యాడు. అలాగే విఘ్నేశ్వరుడినీ మాస్టర్ అమితంగా ఆరాధిస్తాడు. ఇంట్లో గణేష్చతుర్థి వేడుకలను ఘనంగా జరుపుకుంటాడు. అర్ధరాత్రుల్లో అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో గుళ్లను సందర్శించుకుంటాడు. అలాగే మ్యాచ్‌ల కోసం ఆయా ప్రదేశాల్లో పర్యటించినప్పుడు అక్కడి ప్రసిద్ధ ఆలయాలకు వెళుతుంటాడు. -
ఒక శకం ముగిసింది...
ఫ్యాబ్యులస్ 4 ... భారత టెస్టు క్రికెట్ దశ, దిశను మార్చిన నలుగురు దిగ్గజ ఆటగాళ్లు. గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్‌ల రిటైర్మెంట్తో రంగంలో మిగిలిన ఏకైక ఆటగాడు సచిన్. ఇప్పుడు అతను కూడా కెరీర్‌కు గుడ్‌బై చెప్పడంతో భారత టెస్టు చరిత్రలో ఒక శకం ముగుస్తోంది. ఎన్నో అపూర్వ, అనూహ్య, అద్భుత విజయాలు అందించిన ఈ నలుగురు తమదైన ముద్ర వేసి నిష్ర్కమించారు. వ్యక్తిగత ప్రదర్శన ప్రకారం చూస్తే వీరందరి ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే ఈ దిగ్గజాలు తమ వ్యక్తిగత ఘనతల కంటే చేసింది చాలా ఎక్కువ. నలుగురిలో అందరికంటే ముందుగా 1989లో సచిన్ అరంగేట్రం జరిగింది. మరో ఏడేళ్ల తర్వాత గంగూలీ, ద్రవిడ్ ఒకే టెస్టుతో దూసుకొచ్చారు. ఈ ఇద్దరి నాలుగో టెస్టు, హైదరాబాదీ లక్ష్మణ్‌కు తొలి టెస్టు. ఈ నలుగురు జట్టులోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల పాటు భారత క్రికెట్లో పెద్దగా పురోగతి ఏమీ లేదు. విదేశాల్లోనైతే విజయాల మాట దేవుడెరుగు...డ్రాతో గట్టెక్కితే చాలనే పరిస్థితి. అద్భుతాలు అనదగ్గ విజయాలేవీ దక్కలేదు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం దేశాన్ని కుదిపేసింది. దీని తర్వాత నిలిచిన ఈ నలుగురు జట్టుకు మార్గనిర్దేశం చేశారు. కొత్త మిలీనియంలో సాధించే విజయాలకు వేదికను సిద్ధం చేశారు. కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ భారత జట్టుకు దూకుడు నేర్పిస్తే... ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్ ఎన్నో అపురూప ఇన్నింగ్స్ ఆడారు. ఇప్పుడు వస్తున్న విజయాలకు పునాది వేసింది మాత్రం వీళ్లే. ఈ దిగ్గజాలు జట్టులో ఉండగా 2000 తర్వాత భారత్ సాధించిన అపూర్వ విజయాలు ఎన్నో... ఇంగ్లండ్‌లో 21 ఏళ్ల తర్వాత తొలి సిరీస్ విజయం.... వెస్టిండీస్‌లో 35 ఏళ్ల తర్వాత...న్యూజిలాండ్‌లో 33 ఏళ్ల తర్వాత...పాకిస్థాన్‌లో తొలిసారి సిరీస్ విజయాలు... దక్షిణాఫ్రికాలో టెస్టు విజయం.... అప్పటి వరకు అజేయంగా కనిపించిన ఆస్ట్రేలియాను మూడుసార్లు సొంతగడ్డపై చిత్తు చేస్తే, వారి గడ్డపై రెండుసార్లు విజయానికి చేరువగా వచ్చాం. 2000 నుంచి 2012 వరకు భారత్ 48 టెస్టులు గెలిస్తే, 27 మ్యాచ్‌ల్లోనే ఓడింది. సొంతగడ్డపై 52 టెస్టుల్లో ఓడింది 7 మ్యాచ్‌లే. 2009 డిసెంబర్లో భారత్ తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. 2008లో ఆసీస్‌తో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో గంగూలీ రిటైర్ అయ్యాడు. 2012లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర వైఫల్యం తర్వాత ద్రవిడ్ గుడ్‌బై చెప్పేశాడు. అనూహ్య పరిస్థితుల్లో లక్ష్మణ్ గత ఏడాదే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు సచిన్ వంతు. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు ఎంత మంది వచ్చినా ఈ దిగ్గజాల స్థానాలను భర్తీ చేయలేరు. ఎందుకంటే వారి విలువను గుర్తించేందుకు కేవలం గణాంకాలు సరిపోవు. థర్డ్ అంపైర్ అవుటిచ్చిన తొలి అంతర్జాతీయ బ్యాట్స్‌మన్ సచిన్. 1992 డర్బన్ టెస్టు రెండో రోజు జాంటీ రోడ్స్ వేసిన త్రోకు రనౌటయ్యాడు. 19 ఏళ్ల వయసులో కౌంటీ క్రికెట్ ఆడిన తొలి భారతీయ యువ క్రికెటర్‌గా అవతరించాడు. మాస్టర్ నటించిన తొలి వాణిజ్య ప్రకటన ‘స్టిక్కింగ్ ప్లాస్టర్’. బూస్ట్‌తో తొలి వాణిజ్య ఒప్పందం. కపిల్‌తో కలిసి అప్పట్లో నటించిన ప్రకటన అందరినీ ఆకట్టుకుంది. మహారాష్ట్ర ఫేమస్ స్నాక్స్ అయిన ‘వడా-పావ్’ అంటే మాస్టర్‌కు చాలా ఇష్టం. దాన్ని తినడంలో సహచరులు కాంబ్లీ, అంకోలాలతో పోటీ పడేవాడు. వాంపైర్ బ్యాట్‌ను అమితంగా ఇష్టపడే సచిన్ టెస్టుల్లో 50వ శతకం చేసేందుకు దాన్నే ఉపయోగించాడు. సౌరవ్ గంగూలీని సచిన్ ‘బాబు మోషాయ్’ అని పిలిస్తే... దాదా మాస్టర్‌ను ‘చోటా బాబు’ అని పిలిచేవాడు. నెట్ సెషన్లో అవుట్ కాకుండా ఆడిన ఆటగాడికి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ఒక కాయిన్ ఇచ్చే వారట. సచిన్ 13సార్లు అవుట్ కాకుండా ఆడి కాయిన్స్ గెలుచుకున్నాడు. టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడటం సచిన్‌కు మహా సరదా. వర్షం విరామంలో దీనితో క్రికెట్ ఆడేవాడు. కెరీర్ తొలినాళ్లలో ఫాస్ట్ బౌలర్ కావాలన్న మాస్టర్ కలను డెన్నిస్ లిల్లీ తోసిపుచ్చాడు. 1987లో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. 1987 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ బాల్‌బాయ్‌గా పని చేశాడు. అప్పుడు అతని వయసు 14 ఏళ్లు 1988 బ్రబౌర్న్‌లో భారత్‌తో జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సచిన్ పాక్ తరఫున సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా పని చేశాడు. -
24 క్యారెట్ గోల్డ్
పసిప్రాయంలో వేసిన ప్రతి అడుగు... పరుగుల సునామీని సృష్టించింది. బ్యాట్ పట్టిన బుల్లి చేతులు... ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించాయి. ఒకటి, రెండు, మూడు అని లెక్కించినంత సులువుగా రెండు దశాబ్దాల కెరీర్.... వన్నె తగ్గని మేలిమి ‘పసిడి’లా మిలమిలలాడింది. 14 ఏళ్ల వయసులో మొదలుపెట్టిన మూడు స్టంప్‌ల ఆటకు నాలుగు పదుల వయసులోనూ రత్నాలు పొదిగాడు. క్రికెట్ అంటే నేనే అన్నంతగా అల్లుకుపోయిన 24 ఏళ్ల ‘బంధం’లో మాస్టర్ వేసిన ఒక్కో అడుగు... విలువ కట్టలేని ఒక్కో క్యారెట్ బంగారమే. ఈ సుదీర్ఘ కెరీర్లో ప్రతీ ఏడాది సచిన్ సాధించిన ఒక్కో ఘనత ఓ ‘కోహినూర్’తో సమానమే! 1988 సెయింట్ జేవియర్‌తో జరిగిన మ్యాచ్‌లో శారదాశ్రమం తరఫున బరిలోకి దిగిన 14 ఏళ్ల సచిన్ (326 నాటౌట్), కాంబ్లీ (349 నాటౌట్)తో కలిసి 664 పరుగులు జోడించి రికార్డు సృష్టించాడు. తర్వాత డిసెంబర్లో వాంఖడేలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల సచిన్ శతకంతో చెలరేగాడు. దీంతో ఫస్ట్‌క్లాస్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కి అందరి దృష్టిని ఆకర్షించాడు. 1989 అంతర్జాతీయ క్రికెట్లో సంచలన అరంగేట్రం. 1990 17 ఏళ్ల 112 రోజుల వయసులో ఇంగ్లండ్ (ఓల్డ్ ట్రాఫోర్డ్)పై అజేయ సెంచరీ సాధించాడు. దీంతో టెస్టు చరిత్రలో శతకం సాధించిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. 1991 టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. అయితే వన్డేల్లో మాత్రం ఓ స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 1992 ఈ ఏడాది అత్యంత ప్రమాదకరమైన ‘వాకా’ పిచ్‌పై చెలరేగిన సచిన్ పరుగుల వరద పారించాడు. తర్వాత ఇంగ్లండ్ కౌంటీ జట్టు యార్క్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్న తొలి విదేశీ ఆటగాడయ్యాడు. అదే ఏడాది నవంబర్‌లో టెస్టుల్లో వెయ్యి పరుగులు సాధించిన పిన్న వయస్కుడిగా మరో రికార్డు సృష్టించాడు. 1993 సొంతగడ్డపై టెస్టుల్లో తొలి సెంచరీ. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగులు చేయడంతో భారత్ ఇన్నింగ్స్ 22 పరుగుల తేడాతో గెలిచింది. ఇదే ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన హీరో కప్ సెమీస్‌లో మాస్టర్ బంతితోనూ మ్యాజిక్ చేశాడు. ప్రొటీస్ జట్టు విజయానికి ఆఖరి ఓవర్లో 6 పరుగులు కావాల్సిన దశలో 3 పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. 1994 న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తొలిసారి ఓపెనింగ్ చేశాడు. 49 బంతుల్లో 82 పరుగులతో అదరగొట్టాడు. 1995 వరల్డ్ టెల్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. దాని విలువ రూ. 31.50 కోట్లు. దీంతో ప్రపంచలోనే అత్యంత ధనిక క్రికెటర్‌గా అవిర్భవించాడు. 1996 ఉపఖండంలో జరిగిన ప్రపంచ కప్‌లో 87.16 సగటుతో 523 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఆగస్టులో 23 ఏళ్ల వయసులో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా నియామకం. 1997 కెప్టెన్‌గా ఘోర వైఫల్యం. కానీ బ్యాటింగ్‌లో విశేషంగా రాణించాడు. 12 టెస్టుల్లో 4 సెంచరీలు చేశాడు. అయితే 39 వన్డేలు ఆడితే రెండు శతకాలు మాత్రమే సాధించాడు. 1998 15 నెలల వ్యవధిలో కెప్టెన్సీ కోల్పోయాడు. అయితే అద్భుత బ్యాటింగ్‌తో ఒక క్యాలెండర్ ఇయర్లో వన్డేల్లో అత్యధిక పరుగులు (1894) చేసిన సంవత్సరం ఇదే. 1999 చెన్నైలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్ను నొప్పితో బరిలోకి దిగిన సచిన్ 136 పరుగులు చేశాడు. మరో 17 పరుగులు చేస్తే గెలుస్తుందన్న దశలో అవుట్ కావడంతో భారత్ 13 పరుగుల తేడాతో చివరి మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ 12 పరుగులతో గెలిచింది. జూలైలో కెప్టెన్‌గా రెండోసారి నియామకం. 2000 టెస్టుల్లో ఓ మోస్తరుగా ఆడాడు. 6 టెస్టుల్లో 2 శతకాలు చేయగా... ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉంది. 34 వన్డేల్లో 3 శతకాలతో రాణించాడు. 2001 వన్డేల్లో 10 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కూడా ఇదే ఏడాది జరిగింది. 2002 టెస్టుల్లో 29 సెంచరీలు చేసి డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. హెడింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్సయినా ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. 2003 ప్రపంచకప్‌లో 61.18 సగటుతో 673 పరుగులు చేశాడు. పాక్‌పై చేసిన 98 పరుగులు బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ టోర్నీలో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. 2004 ముల్తాన్‌లో పాక్‌తో జరిగిన టెస్టులో సచిన్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ ద్రవిడ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మాస్టర్ డిక్లేర్ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాడు. ఆగస్టులో టెన్నిస్ ఎల్బో గాయమైంది. 2005 కోల్‌కతాలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు చేసిన సచిన్ టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన ఐదో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. డిసెంబర్లో శ్రీలంకపై సెంచరీ చేయడం ద్వారా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటరయ్యాడు. ఈ సందర్భంగా గవాస్కర్ (34) రికార్డును అధిగమించాడు. 2006 భుజం గాయానికి శస్త్ర చికిత్స కోసం ఇంగ్లండ్‌కు వెళ్లాడు. దీంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, విండీస్ పర్యటనకు దూరమయ్యాడు. సెప్టెంబర్‌లో జరిగిన డీఎల్ఎఫ్ కప్‌లో విండీస్‌పై 141 పరుగులతో జట్టును గెలిపించాడు. 2007 కెరీర్లో తొలిసారి విశ్రాంతి కోరాడు. దీంతో బంగ్లాతో జరిగిన వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. అయితే దాని తర్వాత జరిగిన టెస్టుల్లో రెండు సెంచరీలతో చెలరేగాడు. ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించి ఉపఖండం బయట భారత జట్టు టెస్టు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2008 ఆస్ట్రేలియా గడ్డపై తొలి వన్డే సెంచరీ సాధించాడు. టెస్టుల్లో బ్రియాన్ లారా పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. 2009 వన్డేల్లో 17 వేల పరుగులు చేశాడు. 2010 గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్ 147 బంతుల్లోనే ‘డబుల్ సెంచరీ’ సాధించాడు. తొలిసారి ఐసీసీ నుంచి 2010 ఏడాది అత్యుత్తమ క్రికెటర్‌గా ‘సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ని గెలుచుకున్నాడు. వారం రోజుల తర్వాత టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి (2002 తర్వాత) చేరుకున్నాడు. తర్వాత టెస్టుల్లో 50 శతకాలు చేసిన క్రికెటరయ్యాడు. 2011 భారత్‌లో జరిగిన ప్రపంచకప్ ట్రోఫీని గెలిచి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. ప్రపంచకప్‌లలో 2 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్ అయ్యాడు. 2012 ఆసియా కప్‌లో బంగ్లాపై 114 పరుగులు చేసి అంతర్జాతీయ కెరీర్లో ‘వంద సెంచరీ’ల అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. డిసెంబర్లో వన్డే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2013 టెస్టులకూ గుడ్‌బై. విండీస్‌తో రెండు టెస్టుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు మాస్టర్ ప్రకటించాడు. సచిన్‌తో కలిసి ఆడిన అత్యధిక వయసు ఉన్న ఆటగాడు (జాన్ ట్రైకోస్, 1945లో పుట్టాడు), అతి చిన్న వయసు ఉన్న ఆటగాడు (బ్రాత్‌వైట్-1992లో) మధ్య 45 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అరంగేట్రం టెస్టులో గవాస్కర్ బహుకరించిన ప్యాడ్లను కట్టుకుని బరిలోకి దిగాడు. టెన్నిస్ దిగ్గజం జాన్ మెకన్రోకు సచిన్ పెద్ద అభిమాని. అతనిలాగే మాస్టర్ కూడా తన జుట్టును బ్యాండ్‌తో ముడివేసేవాడు. కిశోర్ కుమార్ పాటలు, రాక్ గ్రూప్ డైర్ స్ట్రెయిట్స్ సంగీతమంటే సచిన్‌కు మహా ఇష్టం. మిస్‌యు మాస్టర్ జర్నలిస్ట్ డైరీ జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకుని... ముఖ్యంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావడం నేను జీవితంలో చేసిన ఎంత మంచిపని..! సచిన్‌తో నా అనుభవాలను గుర్తు చేసుకుంటే ఇదే అనిపిస్తుంది. 1989లో సచిన్ అరంగేట్రం చేసినప్పుడు నాకు పదేళ్లు. 1992 ప్రపంచకప్ ద్వారా మొదటిసారి సచిన్ ఆటను నేను ప్రత్యక్షంగా చూశాను. ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్‌లను చూడటానికి తెల్లవారుజామున నిద్రమత్తును బలవంతంగా వదిలించుకున్నా... అప్పటికి సచిన్ ఓ సాధారణ క్రికెటరే. దేశంలోని కోట్లాదిమంది అభిమానుల్లాగే నేను కూడా సచిన్ ఫ్యాన్నే. తన ఆట చూస్తూనే నా కాలేజీ రోజులు గడిచిపోయాయి. తన ని చూస్తూనే ఆట మీద ఆసక్తి పెరిగింది. సచిన్ టెస్టు మ్యాచ్ ఆడుతుంటే... పరీక్షకు ఆలస్యంగా వెళ్లి తిట్లు తిన్న రోజులు ఇప్పటికీ గుర్తే. జర్నలిజంలోకి వచ్చిన తర్వాత కేవలం ఏడాదికే నా కల సాకార మైంది. మొట్టమొదటిసారి 2005 ఫిబ్రవరిలో సచిన్ టెండూల్కర్ ను ఇంటర్వ్యూ చేయగలిగాను. దానికోసం పడ్డ కష్టమంతా సచిన్‌తో చేసిన కరచాలనంతో మరచిపోగలిగాను. కానీ అసలు షాక్ ఏడాది తర్వాత సచిన్ ఇచ్చాడు. నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ కవర్ చేయడానికి వెళ్లిన నన్ను ‘హలో.. హౌ ఆర్ యూ’ అని పలకరించాడు. నాకు షాక్. సుదీర్ఘ కెరీర్లో కొన్ని వేలమంది జర్నలిస్ట్‌ల ను కలిసిన సచిన్... నన్ను గుర్తుపెట్టుకుని తనంతట తాను పలకరించడం... వాహ్... తన మీద అభిమానంతో పాటు గౌరవం కూడా రెట్టింపయింది. మనసులోనే మాస్టర్‌కు శాల్యూట్. అక్కడ మొదలై న పరిచయం అలా కొనసాగుతూనే ఉంది. 2008లో చెన్నైలో, 2011లో లండన్‌లో... సచిన్‌తో చేసిన ఇంటర్వ్యూలు, ఆ మాటలు ఇప్పటికీ ఎప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటాయి. సచిన్‌తో అరగంట సేపు హోటల్ లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడే అవకాశం వస్తుంద నేది జీవితంలో ఎప్పుడూ ఊహించని అంశం. సచిన్‌తో మాట్లాడటం ఓ పాఠం. తనతో మాట్లాడుతూనే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇంటర్వ్యూ సమయంలో ఎంత సీరియస్‌గా మాట్లాడతాడో, అది అయిపోగానే అంత ఫ్రీ అయిపోతాడు. రోజూ మనల్ని పలకరించే స్నేహితుడిలా ఆప్యాయంగా మాట్లాడతాడు. జీవితంలో ఎంతోమంది క్రికెటర్లను కలిసినా, ఎంతోమందితో మాట్లాడినా... సచిన్‌తో ఎవరినీ పోల్చలేం. చాలామంది నవ్వుతూ అయినా అంటారు... సచిన్ ఫ్యాన్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నాడని, అందుకే పదే పదే అతడి వార్తలకు ప్రాధాన్యం ఉంటుందని. కానీ సచిన్‌ను ప్రేమించని స్పోర్ట్స్ జర్నలిస్ట్‌ను భారత్‌లో ఒక్కరిని చూపించడం కూడా అసాధ్యం. అందుకే సాధారణ అభిమానుల కంటే ఎక్కువగానే మాస్టర్ రిటైర్మెంట్ వార్త నన్ను బాధించింది. సచిన్ ఆట నుంచి వైదొలగొచ్చు. ఇకపై మాస్టర్ మైదానంలో చేసే బ్యాటింగ్ విన్యాసాల్ని వర్ణించే అవకాశం లేకపోవచ్చు. కానీ సచిన్‌ను మాత్రం జీవితంలో మరచిపోలేం. ఒక ఆటగాడిగానే కాదు... వ్యక్తిగా కూడా సచిన్ ఓ శిఖరం. డిసెంబర్లోనే అధిక పరుగులు సచిన్ ఇప్పటిదాకా సాధించిన 15,847 టెస్టు పరుగుల్లో 18 శాతం డిసెంబర్ నెలలోనే సాధించాడు. అలాగే వన్డేల్లో చేసిన 18,426 పరుగుల్లో 3,971 పరుగులు ఆదివారాల్లో చేశాడు. 154 వికెట్లలో 33 ఆదివారం తీసినవే. బత్తినేని జయప్రకాష్, సాక్షి -
క్రికెట్ దేవుడి వీడ్కోలు ఉత్సవంలో పాల్గొనండి
క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పడు ముంబై టెస్టుపైనే. క్రికెట్ దేవుడి నిష్క్రమణకు వేదికయిన వాంఖేడ్ మైదానంలో మాస్టర్ ఆటను వీక్షించేందుకు యావత్ దేశం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. నిలకడైన ఆటతో, ఒద్దికైన ప్రవర్తనతో దాదాపు రెండున్న దశాబ్దాలు తమను అలరించిన 'లిటిల్ మాస్టర్' సచిన్ టెండూల్కర్‌కు ఘన వీడ్కోలు పలికేందుకు క్రికెట్ లవర్స్ సిద్ధమయ్యారు. రికార్డుల రారాజు కొత్తగా సాధించాల్సింది ఏమీ లేకున్నా అద్భుత ప్రదర్శనతో ఆటకు వీడ్కోలు పలకాలని అంతా కోరుకుంటున్నారు. చివరి అంకంలోనూ చరిత్ర సృష్టించాలని ఆశ పడుతున్నారు. ఎందుకంటే క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లుగా నిలిచినవాళ్లలో ఎక్కువ మంది వైఫల్యంతోనే ఇన్నింగ్స్ ముగించారు మరి! కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఇప్పుడు సచిన్ నామస్మరణతో మార్మోగుతోంది. బ్యానర్ల రెపరెపలు, పోస్టర్ల ప్రదర్శన.. పూలతో బ్యాట్లు, బంతులు.. సైకత శిల్పాలు, కేక్ కటింగ్‌లు, మాస్క్‌లతో పాఠశాలల్లో విద్యార్థులు! ఇలా ఒకటేమిటి.. దేశమంతా ఎక్కడ చూసినా సచిన్‌మయం. ఇక సచిన్ సొంత నగరం ముంబైలో అయితే సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 200 టెస్టుతో ఆటకు స్వస్తి చెబుతున్న 'ఫ్యాన్స్ క్రికెట్ గాడ్'పై తమ అభిమానాన్ని విభిన్న రీతుల్లో చాటుకుంటున్నారు అభిమానులు. క్రికెట్ దేవుడి వీడ్కోలు ఉత్సవంలో పాల్గొంటూనే ఆట అనంతర జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు. మీరు కూడా 'సాక్షి డాట్ కామ్' ద్వారా సచిన్‌కు విషెస్ తెలపండి. -
భారత్‌కు చేరిన ప్రపంచ నంబర్‌వన్ కార్ల్సన్
చెన్నై: దేశమంతా సచిన్ టెండూల్కర్ ఫేర్వెల్ టెస్టు సిరీస్ ‘మేనియా’తో ఊగిపోతున్న సమయంలో.... చెస్‌లో అత్యున్నత సమరం కూడా మన దేశంలోనే జరుగబోతోంది. ఈనెల 9 నుంచి 28 వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు చెన్నై వేదిక కానుంది. భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) మధ్య 12 రౌండ్ల పాటు ఈ పోరు జరుగనుంది. ఆనంద్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ టోర్నీని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తూ రికార్డు స్థాయిలో రూ.29 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పోరు కోసం సోమవారం కార్ల్సన్ చెన్నై చేరుకున్నాడు. అతడికి ఫిడే ఉపాధ్యక్షుడు డీవీ సుందర్, ఏఐసీఎఫ్ అధ్యక్షుడు జేసీడీ ప్రభాకర్, ప్రపంచ చాంపియన్‌షిప్ నిర్వాహక కార్యదర్శి వి.హరిహరన్ స్వాగతం పలికారు. 2012 మాస్కోలో జరిగిన చివరి చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఆనంద్ 6-6, 2.5-1.5 (టైబ్రేక్) తేడాతో గెల్ఫాండ్ను ఓడించాడు. అయితే ఇప్పటిదాకా కార్ల్సన్, ఆనంద్ పలు గేమ్స్‌లో ముఖాముఖి తలపడినా నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం ఆడలేదు. 2005 నుంచి ఇప్పటిదాకా 62 గేమ్స్‌లో ఆనంద్ 15 సార్లు, కార్ల్సన్ 11 సార్లు గెలవగా 36 గేమ్‌లు డ్రాగా ముగిశాయి. క్లాసికల్ చెస్‌లో ఆడిన 29 గేమ్‌ల్లో ఆనంద్ ఆరు సార్లు, కార్ల్సన్ మూడు సార్లు నెగ్గారు. 7న టోర్నీ ఆరంభం ఈనెల 7న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత టోర్నీని ఆరంభిస్తారు. 9న తొలి గేమ్ జరుగుతుంది. ఒక్కో ఆటగాడు ఆరు సార్లు తెల్ల పావులు, ఆరు సార్లు నల్ల పావులతో ఆడాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతీ గేమ్ ఆరు గంటలపాటు ఉంటుంది. ఏ ఆటగాడైతే ముందుగా 6.5 పాయింట్లు సాధిస్తే అతడినే విజేతగా ప్రకటిస్తారు. ఓవరాల్ ప్రైజ్ మనీ రూ.14 కోట్లు కాగా టైటిల్ నెగ్గిన ఆటగాడికి 60 శాతం, రన్నరప్‌కు 40 శాతం సొమ్ము దక్కుతుంది. టోర్నీ వేదిక హోటల్ హయత్ రెజెన్సీకి ఆనంద్‌తో పాటు అతడి భార్య, కుమారుడు శుక్రవారమే చేరుకున్నారు. అయితే కార్ల్సన్ మాత్రం బయటకు వెల్లడించని రిసార్ట్‌లో బస చేస్తాడని సమాచారమున్నా అధికారికరంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఫిడే ఉపాధ్యక్షుడు సుందర్ చెప్పారు. తమకు తెలిసి అతడు కూడా హయత్‌లోనే ఉండే అవకాశం ఉందని అన్నారు. అలాగే ఈ ఇద్దరు ఆటగాళ్లు కలిసి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కార్ల్సన్ వెంట అతడి తల్లిదండ్రులు, ముగ్గురు సోదరీమణులు, సహాయక సిబ్బంది వచ్చారు. ఈ టోర్నీ కారణంగా హోటళ్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు -
ఎల్లకాలం ఆడలేడుగా..!
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వాగతించారు. ఈ నిర్ణయం తమను ఆశ్చర్యపరచలేదని మాస్టర్ సోదరుడు అజిత్ టెండూల్కర్ చెప్పారు. కొంతకాలంగా అతడు ఈ విషయంపై ఆలోచిస్తున్నాడని అన్నారు. ఎవరైనా ఆట నుంచి తప్పుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడని అజిత్ తన సోదరుడి గురించి ఓ టీవీ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. అతి పిన్న వయస్సులోనే సచిన్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని తామెప్పుడూ అనుకోలేదని, సరైన సమయంలోనే రిటైర్మెంట్ ప్రకటించాడని అన్నారు. ‘16 ఏళ్ల వయస్సులో సచిన్ దేశానికి ఆడతాడని మా కుటుంబంలో ఎవరూ అనుకోలేదు. అంత చిన్నప్పుడే భారత్‌కు ఆడి రికార్డులు సృష్టించాడు. 1989లో పాక్ పర్యటన కోసం తొలిసారిగా జట్టుకు ఎంపికైనప్పుడు మా ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఏదో ఒక నాడు రిటైర్మెంట్ తప్పదు. ఎవరూ ఎల్లకాలం ఆడలేరుగా. కొంతకాలంగా ప్రతీ పర్యటన అనంతరం ఈ విషయం గురించి ఓ అంచనాకు వస్తున్నాడు. కుటుంబ సభ్యుల మధ్య ఈ అంశంపై చాలా చర్చలు జరిగాయి. తుది నిర్ణయం సచిన్‌కే అప్పగించాం. అందుకే ఆ నిర్ణయం మాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు’ అని అజిత్ వివరించారు. ‘క్రికెట్ అంటే ప్రాణం’ క్రికెట్‌ను సచిన్ ఎంతగా ప్రేమిస్తాడో 1999లో జరిగిన సంఘటనను అజిత్ ఉదాహరణగా చెప్పాడు. ‘1995 ఫిబ్రవరి 28న మా తండ్రికి గుండెపోటు వచ్చింది. ఈ విషయం సచిన్‌కు తెలీదు. అతడు ఆ తర్వాతి రోజు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. మ్యాచ్‌కు అది చివరి రోజు కూడా. 1999 ప్రపంచకప్ సమయంలోనూ ఇలాగే జరిగింది. తండ్రి మరణం తర్వాత ఇంగ్లండ్ వెళ్లమని మేం అడగలేకపోయాం. అయితే సచిన్‌కు తండ్రి గురించి బాగా తెలుసు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆయన ఆడమనే సలహా ఇచ్చేవారు. అందుకే మనసులో ఎంత బాధ ఉన్నా అన్నింటినీ అధిగమించి మిగతా టోర్నీ ఆడేందుకు వెళ్లాడు’ అని గుర్తుచేశారు.