థాంక్యూ...గుడ్ బై..
ఎందుకు కన్నీళ్లు ఆగడం లేదు..!
ఏదో ఓ రూపంలో మళ్లీ కనిపిస్తాడని తెలుసు. అయినా
మనసెందుకు మాట వినడం లేదు. ఈ బాధెందుకు తగ్గడం లేదు... రెండు పుష్కరాల పాటు మనసులను రంజింపజేసిన ఆట మళ్లీ కనపడదనా..!
క్రికెట్‌కే కొత్త నిర్వచనం చెప్పిన ‘దేవుడు’ ఇక ఆటలో భాగం కాలేడనా..!
సచిన్ కంటే ముందు ఎందరో దిగ్గజాలు క్రికెట్ ఆడారు. సచిన్‌తో కలిసి ఆడిన గొప్ప క్రికెటర్లున్నారు. భవిష్యత్‌లోనూ ఎవరో ఒకరు అదే స్థాయిలో ఆడే ఆటగాడొస్తాడు.
కానీ మళ్లీ సచిన్ రాడు...
ఏనాడూ ప్రత్యర్థిపై నోరు పారేసుకుని ఎరగడు. ఎంత డబ్బు ఇస్తానన్నా మద్యం, సిగరెట్లకు ప్రచారం చేయలేదు. బయటా ఎవరినీ పల్లెత్తు మాట అనడు.... ఈ లక్షణాలున్న మరో క్రికెటర్ ప్రపంచానికి దొరకుతాడా..!
మనసు ఇంకా మాస్టర్ ఆట చూడాలంటోంది. ఏం చేయాలి..? ఒక జీవితానికి సరిపడా అందించిన జ్ఞాపకాలను నెమరువేసుకుందాం...
రెండు పుష్కరాల పాటు ఆట ద్వారా ఆనందం పంచినందుకు
థాంక్స్...
వీడలేమని మేమంటున్నా... నువ్వు వీడ్కోలన్నావు. నీ మీద ప్రేమతోనే నీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం.
గుడ్‌బై ‘గాడ్’..!
‘ఆట’ ముగించిన మాస్టర్
అనూహ్యమేమీ కాదు... అయినా సరే అందరిలోనూ అదే ఉద్వేగం... మైదానంలోని ప్రేక్షకులు... కుటుంబ సభ్యులు... సహచరులు... ఇలా ఒక్కరేమిటి... అందరిదీ అదే స్థితి... కొంత మంది భోరున ఏడ్చేశారు. మరి కొంత మంది ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేసినా... అది సాధ్యం కావడం లేదు... ఆత్మీయుడెవరో దూరమవుతున్న బాధ...
క్రికెట్ అంటే అతనే అని ఇంత కాలం భావిస్తూ బతికిన తరానికి గుండె బద్దలవుతున్న క్షణం...
మరి సచిన్ పరిస్థితి... ఎన్ని ఆలోచనలు రేకెత్తి ఉంటాయి... ఎంత అలజడి సాగుతూ ఉంటుంది...
తన జీవితమే ముగిసిపోతున్నట్లు... క్రికెట్ లేకుండా ఎలా బతకగలనంటూ...
ఎలాంటి సంబంధం లేకుండానే పాతికేళ్ల పాటు తమలో ఒకడిగా మార్చుకున్న కోటానుకోట్ల ఆత్మీయులకు ఎలా కృతజ్ఞత చెప్పాలంటూ...
విజయాలు... పరాజయాలను సమంగా స్వీకరిస్తూ భావోద్వేగాలు కనపడకుండా ఇన్నాళ్లు దాచగలిగిన శిఖర సమానుడు తన ప్రియమైన ఆటను వీడుతున్న సమయాన మాత్రం చిన్న పిల్లాడిలా రోదించాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ మైదానం వీడాడు...
ముంబై: అవును....సచిన్ రమేశ్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంనుంచి వీడ్కోలు తీసుకున్నాడు. వాంఖడే స్టేడియంలో శనివారం ఉదయం 11.47 గంటలకు ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌తో ఈ దిగ్గజం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై సచిన్ ఆటను చూసే అవకాశం, అదృష్టం మనకు లేదు. కానీ అతను మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం మనతో నిలిచే ఉంటాయి.
24 ఏళ్ల ఒక రోజు...
షమీ బౌలింగ్‌లో గాబ్రియెల్ క్లీన్‌బౌల్డ్ కావడంతో సచిన్ రెండు పుష్కరాల కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడింది. స్టేడియంలోని దాదాపు 25 వేల మంది ప్రేక్షకులు ఈ చిరస్మరణీయ ఘట్టానికి సాక్షిగా నిలిచారు. మ్యాచ్ ముగియగానే టీమిండియా ఆటగాళ్లు సచిన్‌కు స్టంప్‌ను జ్ఞాపికగా ఇచ్చారు. సహచరులందరినీ ఆలింగనం చేసుకున్న తర్వాత వెస్టిండీస్ ఆటగాళ్లు ఒక్కొక్కరితో మాస్టర్ కరచాలనం చేశాడు. 1989 నవంబర్ 15న తొలి టెస్టు బరిలోకి దిగిన సచిన్ సరిగ్గా 24 ఏళ్ల ఒక రోజు తర్వాత కెరీర్‌ను ముగించాడు.
మొబైల్ గార్డ్ ఆఫ్ ఆనర్
మాస్టర్‌ను భారత క్రికెట్ జట్టు ఘనంగా గౌరవించింది. సాధారణంగా దిగ్గజ క్రికెటర్లు రిటైరైతే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు. (ఇరువైపులా నిలబడి బయటకు పంపడం). సచిన్ విషయంలో భారత యువ జట్టు ఒక అడుగు ముందుకేసి మొబైల్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చింది. క్రికెటర్లంతా లైన్‌లో నిలుచున్న తర్వాత మాస్టర్ ముందుకు వెళ్లే కొద్దీ వరుసలో ఆఖరన ఉన్న ఆటగాడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు చేరి బౌండరీ రోప్ వరకు తీసుకొచ్చారు.
చివరిసారిగా పిచ్‌పై...
మ్యాచ్ ముగిశాక సచిన్ మైదానాన్ని వీడుతున్న వేళ స్టేడియంలో ప్రతీ ఒక్కరు లేచి నిలబడి ఆ దిగ్గజానికి సలామ్ చేశారు. ఆ తర్వాత మాస్టర్ తన భార్య, పిల్లలతో కలిసి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి వచ్చాడు. 24 ఏళ్ల పాటు తనకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు చెబుతూ భావోద్వేగ ప్రసంగం చేశాడు.
అనంతరం కెప్టెన్ ధోనితో పాటు కోహ్లి, ధావన్ తదితరులు తమ భుజాలపై సచిన్‌ను స్టేడియం అంతా ఊరేగించారు. త్రివర్ణ పతాకంతో మాస్టర్ మైదానమంతా కలియదిరిగి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. అనంతరం తన ఉజ్వల కెరీర్‌కు ‘బాట’ పరిచిన పిచ్ దగ్గరికి వచ్చి ఆఖరి సారిగా దానికి మొక్కి ఉద్వేగంగా నిష్ర్కమించాడు. స్టేడియం బయటికి వచ్చాక కూడా టీమ్ బస్సులోంచి అభిమానులకు ఆఖరిసారిగా చేయి ఊపి... క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు.
పేరుపేరునా కృతజ్ఞతలు
మాస్టర్ బ్లాస్టర్ చివరిసారిగా క్రికెట్ మైదానంలో చేసిన ప్రసంగం యథాతథంగా...
స్నేహితులారా, (స్టేడియం హోరెత్తింది) నన్ను మాట్లాడనివ్వండి... లేదంటే నేను ఇంకా ఎక్కువ భావోద్వేగానికి లోనవుతాను. 24 ఏళ్లుగా 22 గజాల మధ్య గడిపిన నేను రిటైర్ అవుతున్నాననే విషయం నమ్మలేకపోతున్నాను. నేను ఇక్కడి వరకు రావడానికి నా జీవితంలో మద్దతుగా నిలబడిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. ఎవరినైనా మరచిపోతానేమో అని జాబితా రాసుకుని వచ్చాను. ఒకవేళ పొరపాటున ఎవరినైనా మరచిపోతే క్షమించండి.
అంకుల్, ఆంటీ, సోదరులు
నా స్కూల్ రోజు ల్లో మా అంకుల్, ఆంటీ వాళ్ల ఇంట్లో ఉండేవాడిని. వాళ్లు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. నే ను ఆడి అలసిపోతే మగత నిద్రలోనే ఆంటీ నాకు ఏదైనా తినిపించి మళ్లీ ఆడేందుకు సిద్ధం చేసేది. మా పెద్దన్నయ్య నితిన్... ‘నువ్వు ఏం చేసినా కరెక్ట్‌గానే చేస్తావు. నీ మీద నమ్మకం ఉంది’ అని చెప్పేవాడు. నా తొలి క్రికెట్ బ్యాట్ ఇచ్చింది మా అక్క సవిత. కాశ్మీర్ విల్లో బ్యాట్ అది.
ఇప్పటికీ నేను ఆడుతుంటే తను ఉపవాసం ఉంటుంది. మరో అన్నయ్య అజిత్ గురించి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. నా కోసం తన కెరీర్‌ను వదిలేసుకున్నాడు. 11 ఏళ్ల వయసులో రమాకాంత్ అచ్రేకర్ సర్ దగ్గరకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి నా జీవితం మారిపోయింది. శువ్రారం రాత్రి కూడా ఫోన్‌లో నా ఆట గురించి చర్చించుకున్నాం. నా కెరీర్ అంతా నా ఆట గురించి చర్చించుకున్నాం, వాదించుకున్నాం. అదే లేకపోతే నేను ఈ స్థాయికి చేరేవాడిని కాదు.
అత్తా మామలు...
నా అత్తామామలు అన్నాబెల్, ఆనంద్ మెహతా... నాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. వాళ్లతో అనేక విషయాలు చర్చించేవాడిని. నేను అంజలిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు థాంక్స్.
స్నేహితులు
నా జీవితంలో అండగా నిలబడిన స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ల పనులు వదిలేసుకుని నాకు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేయడానికి వచ్చేవారు. గాయాలైనప్పుడు నా కెరీర్ ముగిసిందనుకున్నాను. కానీ ఉ.3 గం. సమయంలోనూ ఫోన్లలో నా స్నేహితులు స్పందిం చారు. నా కెరీర్ చాలా ఉందని ధైర్యం చెప్పారు.
గురువు అచ్రేకర్...
నా ఆట 11 ఏళ్ల వయసులో ప్రారంభమైంది. అచ్రేకర్ సార్ నన్ను తన స్కూటర్ మీద ముంబైలోని మైదానాలకు తిప్పేవారు. ప్రాక్టీస్ కోసం ఉదయం ఒక మైదానంలో, మధ్యాహ్నం ఒక గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడటానికి తీసుకెళ్లేవారు. ఇప్పటివరకూ ఎప్పుడూ ఆయన నన్ను బాగా ఆడానని ప్రశంసించలేదు. దీనివల్ల అలసత్వం వస్తుందని ప్రశంసించలేదు. సర్... నేను రిటైర్ అవుతున్నా కాబట్టి ఇప్పుడైనా నేను బాగా ఆడానని మీరు అనవచ్చు...
బీసీసీఐ, సహచరులు...
ఇదే మైదానంలో నా క్రికెట్ ప్రారంభమైంది. అందరిలాగే భారత్‌కు ఆడాలనేదే నా కల. 16 ఏళ్ల వయసులో బీసీసీఐ నన్ను నమ్మి అవకాశం ఇచ్చింది. చాలామంది క్రికెటర్లతో కలిసి ఆడాను. అందరూ నాకు సహాయం చేశారు. ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ, ఇక్కడలేని కుంబ్లే, నా సహచర క్రికెటర్లు... మీరంతా నాకు కుటుంబంలాంటి వారు. ధోని నాకు 200 టెస్టు క్యాప్ ఇచ్చినప్పుడు... ‘మనమంతా జట్టుగా ఇక్కడ ఉన్నందుకు గర్విద్దాం. మీ పూర్తి సామర్థ్ధ్యంతో దేశానికి సేవ చేస్తారని భావిస్తున్నాను. భగవంతుడు మనకు ఈ అవకాశం ఇచ్చాడు. దీనిని సరైన దిశలో ఉపయోగించుకోవాలి. క్రికెట్ ప్రతిష్టను పెంచాలి’ అన్నాను. ఇంతకాలం నాకు వైద్యం చేసిన డాక్టర్లు, ఫిజియోలకు కృతజ్ఞతలు. మీరు లేకుంటే ఇంతకాలం నేను క్రికెట్ ఆడేవాడినే కాదు.
మేనేజర్స్...
నా స్నేహితుడు, నా తొలి మేనేజర్ మార్క్ దురదృష్టశాత్తు ఇప్పుడు లేరు. తను లేకుంటే ఇదంతా సాధించేవాడినే కాదు. స్పాన్సర్లు, ప్రమోషన్‌ల ఒత్తిడి నా మీద లేకుండా స్వేచ్ఛగా క్రికెట్ ఆడుకోగలిగేలా చూశాడు. ఆ తర్వాత నా మేనేజర్ వినోద్ నాయుడు కూడా నా కుటుంబంలో ఒకడిలా కలిసిపోయాడు. నా కోసం తన కుటుంబాన్ని వదిలి వచ్చి పనిచేశాడు. తనతో పాటు వినోద్ కుటుంబానికి కూడా నా కృతజ్ఞతలు.
మీడియా, ఫొటోగ్రాఫర్స్...
స్కూల్ రోజుల్లో నేను బాగా ఆడినప్పుడు మీడియా ప్రోత్సహించింది. ఈ రోజు ఉదయం వరకు కూడా నా గురించి రాస్తూనే ఉన్నారు. నేను మరింత బాగా ఆడేందుకు ఇవి తోడ్పడ్డాయి. నా జీవితాంతం భద్రపరచుకుని ఆనందించేలా అనేక ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్లకూ థాంక్స్.
అభిమానులు...
ఇక అందరికంటే ముఖ్యంగా మీరు... (అభిమానులను ఉద్దేశించి) నేను డకౌట్ అయినా, సెంచరీ కొట్టినా అండగానే నిలబడ్డారు. నా కోసం ప్రార్థనలు చేశారు, ఉపవాసాలూ ఉన్నారు. ఇక్కడి ‘సచిన్.. సచిన్...’ అనే హోరు నేను బతికున్నంత కాలం నా చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది.
అందరికీ కృతజ్ఞతలు.
ఏదైనా మరచిపోయి ఉంటే క్షమించండి. గుడ్‌బై..!
ఇక కొన్ని ఇంటి బాధ్యతలు అప్పగిస్తా: అంజలి
సచిన్ లేని క్రికెట్‌ను ఊహించొచ్చు కానీ క్రికెట్ లేని సచిన్‌ను ఊహించలేకపోతున్నా. ఇక సచిన్‌కు కొన్ని ఇంటి బాధ్యతలు కూడా అప్పగిస్తా. సచిన్ సాధారణంగా భావోద్వేగాలను బయటపడనీయడు. సాధారణంగా నేను కూడా బయటపడను. కానీ నెల రోజులుగా ఈ రిటైర్మెంట్ రోజును తలచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి.
ఎప్పుడు రిటైర్ అవ్వాలనేది తేల్చుకోవడానికి సమయం తీసుకున్నాడు. కానీ నిర్ణయం తీసుకున్నాక దానిని చక్కగా హ్యాండిల్ చేశాడు. ఎక్కడ ఉన్నా ఆట నుంచి దూరమయ్యేవాడు కాదు. నెల రోజులు సెలవులు గడపడానికి వెళ్లినప్పుడు కూడా... ఎక్కువగా తినేవాడు కాదు. క్రికెట్ ఆడాలి, తినను అనేవాడు. సారా, అర్జున్ పుట్టే సమయానికే వాళ్ల నాన్న దేశానికి క్రికెట్ ఆడుతున్నాడు. ఆయన గొప్పతనమేంటో ఇప్పుడు వాళ్లకు బాగా తెలుస్తుంది. పెళ్లి చేసుకోవడానికి ముందే సచిన్ గురించి నాకు అర్థమైంది. తను మొదట ముంబైకి, భారతదేశానికి చెందిన వ్యక్తి. ఆ తర్వాతే నాకు.
-అంజలి (సచిన్ భార్య)
అంజలి, సారా, అర్జున్...
నా జీవితంలో అద్భుతమైన క్షణం 1990లో అంజలి పరిచయం. ఒక డాక్టర్‌గా తనకు కెరీర్ ఉంది. కానీ పిల్లల గురించి నేను చూసుకుంటా... నువ్వు ఆడుకో అని నా కెరీర్ ఇబ్బందులు లేకుండా కొనసాగేలా చేసింది. నేను మాట్లాడిన అనేక చెత్త విషయాలను భరించింది. నా జీవితంలో అద్భుతమైన భాగస్వామ్యం అందించినందుకు థ్యాంక్స్.
సారా, అర్జున్ నా జీవితంలో రెండు విలువైన వజ్రాలు. అమ్మాయికి 16 ఏళ్లు, అబ్బాయికి 14 ఏళ్లు. టైమ్ అలా గడిచిపోయింది. వాళ్ల పుట్టిన రోజులకు, వార్షికోత్సవాలకు, స్పోర్ట్స్ డేస్‌కు నేను లేను. కానీ దానిని వాళ్లు అర్థం చేసుకున్నారు. (పిల్లలిద్దరితో) మీ ఇద్దరూ నాకు ఎంతో ప్రత్యేకం. నేను మీతో తగినంత సమయం గడపలేదు. కానీ వచ్చే 16 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం మీతోనే సమయం గడుపుతానని హామీ ఇస్తున్నా.
నాన్న... రమేశ్ టెండూల్కర్
తొలుత నా జీవితంలో అందరికంటే ముఖ్యమైన వ్యక్తి మా నాన్న. 1999లో మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన మార్గదర్శనం లేకపోతే ఈరోజు ఇక్కడ నిలబడేవాడిని కాదు. ‘కలలను వె ంటాడు. నీ లక్ష్యంలో ఇబ్బందులు ఎదురైనా ఎప్పుడూ వదిలేయకు. ముఖ్యంగా మంచి మనిషిగా ఎదుగు’ అని ఆయన చెప్పేవారు. నేను సెంచరీ చేసిన ప్రతిసారీ పైకి చూసి, అభివాదం చేసేది ఆయనకే.
అమ్మ... రజనీ టెండూల్కర్
మా అమ్మ... నా లాంటి అల్లరి పిల్లాడిని ఎలా పెంచిందో. నా ఆరోగ్యం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకునేది. నా కెరీర్ ప్రారంభం కాకముందు నుంచి కూడా నా కోసం ప్రార్థనలు చేసేది. అవే నాకు బలాన్నిచ్చాయి.