Sachin Tendhular
-
ఫస్ట్‌క్రై లిస్టింగ్: సచిన్‌కు రూ. 3.35కోట్ల లాభం
ఫస్ట్‌క్రై మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ షేర్లు మంగళవారం దలాల్ స్ట్రీట్ అరంగేట్రంలో పెట్టుబడిదారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఒక్కసారిగా సచిన్ టెండూల్కర్, రతన్ టాటాతో సహా ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు భారీ లాభాలను పొందారు.బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ మొదటిరోజే 40 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇప్పటికే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. షేర్లు భారీగా పెరగటంతో ఆయన ఒక్కరోజులోనే 3.35 కోట్లకు పైగా లాభం పొందారు. సచిన్ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్‌లో అక్టోబర్ 2023లో రూ. 10 కోట్ల పెట్టుబడులు పెట్టారు. సచిన్ ఒక్కో షేరుకు రూ.487.44 వెచ్చించారు. ఆ షేర్లే ఇప్పుడు భారీగా పెరిగాయి. సచిన్ ఏకంగా కోట్ల లాభాలను పొందగలిగారు.రతన్ టాటా కూడా రూ.5.50 కోట్లు లాభం పొందారు. 2016లో 77900 ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.84.72 చొప్పున కొనుగోలు చేసేందుకు కంపెనీలో రూ.66 లక్షలు పెట్టుబడి పెట్టారు. లిస్టింగ్‌లో తన పెట్టుబడి రూ.5 కోట్ల మార్కును తాకింది.బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ ఐపీఓ ఆగష్టు 6 - ఆగస్ట్ 8 మధ్య నడిచింది. ఫస్ట్‌క్రై పేరెంట్ 32 షేర్ల లాట్ సైజుతో ఒక్కో షేరుకు రూ. 440-465 ధర బ్యాండ్‌లో షేర్లను అందించింది. కంపెనీ తన ఐపీఓ నుంచి మొత్తం రూ. 4,193.73 కోట్లను సేకరించింది. ఇది మొత్తం 12.22 రెట్లు కంటే ఎక్కువ. -
‘ఓటు వేయాలంటూ.. సెలబ్రిటీల ప్రచారం’
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 04న విడుదలవుతాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లులో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ, క్రీడా సెలబ్రిటీలతో ఓ వీడియో రూపొందించింది. ఈ వీడియోలో..‘తప్పకుండా ఓటు వేయండి.. ఓటు వేయటం మీ కర్తవ్యం’అని సెలబ్రిటీలంతా కోరుతారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించటం గమనార్హం. క్రీడా రంగం నుంచి సచిన్ టెండుల్కర్, సినిమా రంగం నుంచి పలువురు బాలీవుడ్, కోలివుడ్ ప్రముఖలు ఉన్నారు. వారివారి శైలీలో ఓటు వేయాలని కోరారు. ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోపై ఓ లుక్కేయండి.. -
సచిన్‌కు రూ.27 కోట్ల లాభం.. ఎలా అంటే?
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ గాడ్ 'సచిన్ టెండూల్కర్' (Sachin Tendulkar) హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌లో పెట్టిన పెట్టుబడులు గురువారం భారీ వృద్ధిని సాధించడంతో ఏకంగా రూ.27 కోట్లు సంపాదించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆజాద్ ఇంజినీరింగ్‌లో సచిన్ 2023 మార్చిలో రూ.5 కోట్లు ఇన్వెస్ట్ చేసి రూ. 114.10 ప్రైజ్ పాయింట్లో 4,38,210 షేర్లు కొనుగోలు చేశారు. వాటి విలువ నిన్న (డిసెంబర్ 28) ఏకంగా 7 రెట్లు పెరిగి స్టాక్ వ్యాల్యూ రూ. 720కి చేరింది. దీంతో షేర్స్ విలువ సుమారు రూ.32 కోట్లకు చేరాయి. సచిన్ టెండూల్కర్ మాత్రమే కాకుండా.. ఆజాద్ ఇంజినీరింగ్‌లో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, పీవీ సింధు, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, నిఖిత్ జరీన్ కూడా పెట్టుబడులు పెట్టారు, ఇందులో వారికి కూడా వాటాలున్నాయి. ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థ రక్షణ, ఏరోస్పేస్, ఇంధన, చమురు పరిశ్రమలకు చెందిన కంపెనీలకు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. అంతే కాకుండా మిట్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్, సీమెన్స్ ఎనర్జీ, హనీవెల్ ఇంటర్నేషనల్, జనరల్ ఎలక్ట్రిక్, ఈటన్ ఏరోస్పేస్, ఎంఏఎన్ ఎనర్జీ సొల్యూషన్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఆజాద్ ఇంజినీరింగ్‌కు వినియోగదారులుగా ఉన్నట్లు సమాచారం. మిచెల్ కంటే ఎక్కువ ఆజాద్ ఇంజినీరింగ్‌లో ఒకే సారి రూ. 27 కోట్లు రావడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ఆస్ట్రేలియా పేసర్ 'మిచెల్ స్టార్క్'ను మించిపోయాడు. డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్2024 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మిచెల్‌ను రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పోలిస్తే సచిన్‌కు వచ్చిన లాభాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. -
'సచిన్, కోహ్లి కాదు.. అతడే గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాటర్'
భారత క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరంటే మనకు టక్కున గుర్తు వచ్చేది లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ప్రస్తుత తరంలో అయితే చాలా మంది విరాట్ కోహ్లి పేరు చెబుతారు. ఎందుకంటే సచిన్ సాధించిన ఆల్‌టైమ్ రికార్డులను ఒక్కొక్కటిగా విరాట్ బ్రేక్ చేస్తాడు. ఇటీవలే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన టెండూల్కర్ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు. వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ కొనసాగుతుంటే.. టీ20ల్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా కోహ్లి ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా పాకిస్తాన్ వెటరన్ పేసర్ జునైద్ ఖాన్‌కు ఓ ఇంటర్వ్యూలో సచిన్, కోహ్లిలలో గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదులుగా అతడు సచిన్,కోహ్లిలను కాకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఎంచుకున్నాడు. "విరాట కోహ్లి గొప్ప ఆటగాడు ఆనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు వరల్డ్ క్రికెట్లోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. సచిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరంలో సచిన్ ఆడివుంటే 100 కంటే ఎక్కువ సెంచరీలు చేసి ఉండేవాడు. కానీ నా వరకు అయితే గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాటర్ అంటే వీరిద్దరు కాకుండా రోహిత్ శర్మ పేరునే చెబుతాను. రోహిత్ అన్ని రకాల షాట్లు ఆడగలడు. రోహిత్ శర్మను అందరూ ది హిట్‌మ్యాన్ అని పిలుస్తారు. అతడు వన్డేల్లో సాధించిన 264 పరుగుల రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు. వన్డేల్లో అతడు మూడు సార్లు డబుల్ సెంచరీలు చేశాడు. ఒక క్రికెటర్ వైట్‌బాల్ ఫార్మాట్లో ఇన్ని డబుల్ సెంచరీలు సాధించడం అంత ఈజీ కాదు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా హిట్‌మ్యాన్ పేరిటే ఉంది. అందుకే రోహిత్‌ను అత్యుత్తమ భారత క్రికెటర్‌గా ఎంచుకున్నాను" అని నాదిర్ అలీ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జునైద్ ఖాన్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: 'టీమిండియాకు మరో ఫినిషర్ దొరికేశాడు.. భయం లేకుండా దుమ్మురేపుతున్నాడు' -
చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. అలా అయితే సచిన్, గంగూలీ!
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో రోహిత్ మరో 175 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ,రికీ పాంటింగ్, జాక్వాస్ కల్లిస్, ధోని వంటి దిగ్గజ క్రికెటర్లను రోహిత్ అధిగమిస్తాడు. ఇప్పటి వరకు 236 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన హిట్‌మ్యాన్ 9825 పరుగులు చేశాడు. రోహిత్ వన్డే కెరీర్లో 30 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి కేవలం 205 ఇన్నింగ్స్‌లలోనే అందుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి తర్వాత స్ధానంలో సచిన్ టెండూల్కర్(259 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు. ఇక మూడు వన్డే సిరీస్‌లో భాగంగా విండీస్-భారత్ మధ్య తొలి వన్డే గురువారం బార్బడస్ వేదికగా జరగనుంది. సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా తొలి వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే బార్బడస్లో గురువారం భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అక్కడి వాతవారణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా వర్షం కారణంగా భారత్-విండీస్ రెండో టెస్టు ఆఖరి రోజు ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే.. విరాట్ కోహ్లి: (205 ఇన్నింగ్స్‌లు) సచిన్ టెండూల్కర్:(259 ఇన్నింగ్స్‌లు) సౌరవ్ గంగూలీ: (263 ఇన్నింగ్స్‌లు) రికీ పాంటింగ్: (266 ఇన్నింగ్స్‌లు) జాక్వెస్ కల్లిస్: (272 ఇన్నింగ్స్‌లు) ఎంఎస్ ధోని: (273 ఇన్నింగ్స్‌లు) రాహుల్ ద్రవిడ్: (287 ఇన్నింగ్స్‌లు) తొలి వన్డేకు తుది జట్లు(అంచనా) భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ , సిరాజ్ విండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్, జేడెన్ సీల్స్ చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్! -
సచిన్ ఆస్తుల విలువ ఎంతంటే..?
-
సినిమా రేంజ్ లో సచిన్ - అంజలి లవ్ స్టోరీ...!
-
క్రికెట్ దేవుడు సచిన్‌కు ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
క్రికెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. కాబట్టి సచిన్ టెండూల్కర్ గురించి దాదాపు అందరికి తెలుసు. సచిన్ ఆటల్లో మాత్రమే కాదు ఆటో మోటివ్ ఔత్సాహికుడు కూడా అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. ఈ రోజు క్రికెట్ గాడ్ సచిన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆస్తులు విలువ ఎంత? లగ్జరీ కార్లు ఎన్ని ఉన్నాయి వంటి విషయాలతో వాటితో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. క్రికెట్ తన ఊపిరిగా క్రికెట్ ద్వారానే ఉన్నత స్థాయికి ఎదిగిన సచిన్ నికర ఆస్తుల విలువ కొన్ని నివేదికల ప్రకారం సుమారు 165 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1350 కోట్ల కంటే ఎక్కువ. బెంగళూరులో రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయని సమాచారం. (ఇదీ చదవండి: సత్య నాదెళ్ల లగ్జరీ హౌస్ చూసారా - రెండంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్ మరెన్నో..) 11 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలకు ఓర్చుకుని ఇప్పుడు క్రికెట్ గాడ్ అయ్యాడు. గుజరాతీ కుటుంబానికి చెందిన అంజలిని వివాహం చేసుకున్న సచిన్ ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నారు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు. (ఇదీ చదవండి: 28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని) క్రికెట్ అంటే ప్రాణమిచ్చే సచిన్ మొదటి కారు మారుతి 800 కావడం గమనార్హం. ప్రస్తుతం అత్యంత ఖరీదైన బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో బిఎండబ్ల్యూ 30 జహ్రే ఎమ్5, ఎమ్ 6 గ్రాన్ కూపే, 7 సిరీస్, నిస్సాన్ జిటి-ఆర్, ఐ8, ఫెరారీ-360-మొడెనా మొదలైనవి ఉన్నాయి. సచిన్ వద్ద ఉన్న కార్ల ఖరీదు రూ. 15 కోట్లకంటే ఎక్కువ. ఖరీదైన కార్లు, బంగ్లా కలిగి ఉన్న సచిన్ పెప్సి, అడిడాస్, టీవీఎస్, బ్రిటానియా, వీసా, బూస్ట్, ఎయిర్టెల్, కోకాకోలా, కోల్గేట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. దీని ద్వారా వచ్చే వార్షిక ఆదాయం సుమారు రూ. 17 నుంచి 20 కోట్లు. -
వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ ఎవరో తెలుసా..?
వైట్ బాల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా.. క్రికెట్ చాలా మారింది. క్రికెట్ ను ఓ క్రీడగా చూసే రోజులు పోయి.. భారీ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ జరిగే రోజులొచ్చేశాయి. ముఖ్యంగా ఐపీఎల్ రాకతో మార్కెట్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇండియాలో మొత్తం క్రీడల పేరుతో జరుగుతున్న సింహ భాగం బిజినెస్ క్రికెట్ దే. ఈ గణాంకాలు చూస్తే చాలు.. దేశంలో క్రికెట్ మానియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిషర్లు వదిలి వెళ్లిన క్రికెట్.. ఇప్పుడు ఇండియాలో మార్కెట్‌ను శాసిస్తోంది. అలాంటి జెంటిల్ మెన్ గేమ్‌లో జూలు విదిల్చి ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డ్‌ను అలుపు లేకుండా పరుగులు పెట్టించే క్రీడాకారులు సంపాదనలో సైతం పోటీపడుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ టెక్ కంపెనీల సీఈవో సంపాదన కంటే వీళ్ల ధనార్జనే ఎక్కువ. అంత క్రేజ్ ఉన్న క్రికెట్ క్రీడా విభాగంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో మీకు తెలుసా? సీఈవో వరల్డ్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం..ఆడమ్ గిల్‌క్రిస్ట్ నెట్ వర్త్ 380 మిలియన్ డాలర్లు, సచిన్ టెండూల్కర్ నెట్ వర్త్ 170 మిలియన్లు, ఎంఎస్ ధోనీ 115 మిలియన్లు, విరాట్ కోహ్లీ 112 మిలియన్లు, రికీ పాంటింగ్ 75 మిలియన్లు, జాక్వెస్ కల్లిస్ 70 మిలియన్లు, బ్రియాన్ లారా 60 మిలియన్లు, వీరేంద్ర సెహ్వాగ్ 40 మిలియన్లు, యువరాజ్ సింగ్ 35 మిలియన్లు, స్టీవ్ స్మిత్ 30 మిలియన్లతో అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్నారు. Top 10 Richest Cricketers In The World, 2023 🇦🇺AC Gilchrist: $380m (estimated net worth) 🇮🇳SR Tendulkar: $170m 🇮🇳MS Dhoni: $115m 🇮🇳V Kohli: $112m 🇦🇺RT Ponting: $75m 🇿🇦JH Kallis: $70m 🌴BC Lara: $60m 🇮🇳V Sehwag: $40m 🇮🇳Yuvraj Singh: $35m 🇦🇺Steve Smith: $30m (CEOWORLD magazine) — World Index (@theworldindex) March 14, 2023 -
సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లి! మనసులో మాట చెప్పిన రికార్డుల రారాజు
India vs Sri Lanka, 3rd ODI- Virat Kohli: ‘‘నాకసలు ఈ రికార్డుల గురించి ఐడియా లేదు. ఆటను ఆస్వాదిస్తూ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడటమే నా పని. టీమ్‌ను గెలిపించాలనే మైండ్‌సెట్‌తోనే బ్యాటింగ్ చేస్తాను. నా ఆటకు అదనంగా వచ్చేవే ఈ రికార్డులు. కుదిరన్నన్నాళ్లు ఆడుతూనే ఉంటాను. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో పునరగామనం చేసినప్పటి నుంచి నూతనోత్సాహంతో ముందుకు సాగుతున్నా. మైలురాళ్లను చేరుకోవాలని తహతహలాడే తత్వం కాదు నాది. రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు. కేవలం ఆటను ఆస్వాదించమే నాకు తెలుసు. ప్రస్తుతం నేను కాస్త రిలాక్స్ అవ్వగలుగుతున్నాను. ఈ ఫామ్‌ను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా’’ అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఆగని రన్ మెషీన్ శ్రీలంకతో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో రెండు సెంచరీలు నమోదైన విషయం తెలిసిందే. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 116 పరుగులు చేయగా.. కోహ్లి 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా వన్డే కెరీర్లో 46వ శతకం, ఓవరాల్‌గా 74వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో ఎన్నో అరుదైన ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్ కోహ్లి. అదే విధంగా లంకతో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్‌లో రెండు శతకాలు బాదిన ఈ రన్‌మెషీన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తన సంతోషాన్ని పంచుకున్నాడు. సచిన్ రికార్డుకు చేరువలో రికార్డుల కన్నా జట్టు ప్రయోజనాల గురించే ఎక్కువగా ఆలోచిస్తానని రికార్డుల రారాజు కోహ్లి మరోసారి స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి మరో 3 సెంచరీలు బాదితే వన్డేల్లో సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు(49) బద్దలవుతుంది. ఈ నేపథ్యంలో కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక తిరువనంతపురంలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల భారీ తేడాతో గెలుపొంది శ్రీలంకతో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అంతకు ముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. చదవండి: IND vs SL: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే? IND vs SL: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా 𝗕𝗶𝗴𝗴𝗲𝘀𝘁 𝘄𝗶𝗻 𝗯𝘆 𝗺𝗮𝗿𝗴𝗶𝗻 𝗼𝗳 𝗿𝘂𝗻𝘀 𝗶𝗻 𝗢𝗗𝗜𝘀!#TeamIndia register a comprehensive victory by 3️⃣1️⃣7️⃣ runs and seal the @mastercardindia #INDvSL ODI series 3️⃣-0️⃣ 👏👏 Scorecard ▶️ https://t.co/q4nA9Ff9Q2……… pic.twitter.com/FYpWkPLPJA — BCCI (@BCCI) January 15, 2023 -
అరుదైన రికార్డు.. సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా.. గర్వంగా ఉంది!
Ranji Trophy 2022- Mumbai: రంజీ ట్రోఫీ 2021-22 రెండో సెమీఫైనల్లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 227 బంతుల్లో 100 పరుగులు చేసిన ఈ యువ ఆటగాడు.. రెండో ఇన్నింగ్స్‌లో 372 బంతుల్లో 181 పరుగులతో సత్తా చాటాడు. ఒకే మ్యాచ్‌లో ఇలా రెండు సెంచరీలు సాధించి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. చరిత్రకెక్కిన యశస్వి తద్వారా రంజీ ట్రోఫీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు యశస్వి జైశ్వాల్. ఒకే మ్యాచ్‌లో రెండు శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే, వసీం జాఫర్ తదితరుల సరసన చేరాడు. సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా! ఈ విషయంపై స్పందించిన యశస్వి జైశ్వాల్.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఉన్న జాబితాలో తన పేరు కూడా చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. మ్యాచ్ సమయంలో రికార్డు గురించి తనకు అసలు అవగాహన లేదని, డ్రెసింగ్స్ రూమ్‌కి వెళ్లిన తర్వాత సహచర ఆటగాళ్లు చెప్పినపుడే ఈ విషయం తెలిసిందని పేర్కొన్నాడు. ఓపికగా వేచి చూశాను! ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో యశస్వి మాట్లాడుతూ.. ‘‘వికెట్‌ను బాగా అర్థం చేసుకున్నాను. కాస్త స్లోగా ఉన్నట్లు అనిపించింది. పృథ్వీ అవుటైన తర్వాత ఆర్మాన్ జాఫర్‌తో చర్చించి ఎలా ఆడాలన్న అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. క్రీజులో నిలదొక్కుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా సరే.. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. నిజానికి సెంచరీ మార్కు చేరుకోవడానికి చాలా బంతులు తీసుకున్నానని తెలుసు. అయితే, క్రీజులో ఉండటమే అన్నింటి కంటే ముఖ్యమైనది అనిపించింది. అందుకే ఓపికగా ఎదురుచూశాను. నిజానికి ఈ మ్యాచ్‌లో నేను సాధించిన రికార్డు గురించి నాకు తెలియదు. డ్రెస్సింగ్ రూమ్‌కు రాగానే నా తోటి ఆటగాళ్లు దీని గురించి చెప్పారు. సచిన్ సర్, వసీం సర్, రోహిత్, అజింక్య వంటి దిగ్గజాల సరసన నా పేరు చూసుకోవడం నిజంగా నాకు గర్వకారణం’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా 54వ బంతి వద్ద పరుగుల ఖాతా తెరిచిన యశస్వి.. ఆ తర్వాత అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 47వ సారి ముంబై ఈ క్రమంలో ముంబై మొదటి ఇన్నింగ్స్‌లో 393 పరుగులు చేయగా.. 4 వికెట్ల నష్టానికి 533 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఉత్తరప్రదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 180కే ఆలౌట్ అయిన నేపథ్యంలో ముంబై ఫైనల్‌కు చేరుకుంది. ఇక ముంబై జట్టు రంజీ ట్రోఫీలో ఫైనల్ చేరడం ఇది 47వ సారి. ఇప్పటి వరకు 41 సార్లు విజేతగా నిలిచింది. జూన్ 22 నుంచి మధ్యప్రదేశ్‌తో ఈ సీజన్ ఫైనల్లో ముంబై తలపడనుంది. చదవండి: IRE vs IND: ఐర్లాండ్‌తో సిరీస్‌కు అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది: గవాస్కర్ -
Sara Tendulkar: నైట్ డేట్‌కు వెళ్లిన సారా.. ఫొటోలు వైరల్.. ఇంతకీ ఎవరా వ్యక్తి!
Sachin Tendulkar Daughter Sara Tendulkar Goes on Date Night Guess Who: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్డేట్లు పంచుకుంటూ ఫాలోవర్లకు చేరువగా ఉంటుంది. ముఖ్యంగా టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ పోస్టులకు సారా.. స్పందించడం.. అతడు కూడా ఆమెతో సరదాగా సంభాషించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఈ విషయంపై ఇద్దరూ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే.. ఇటీవల గిల్... ‘‘దేవతలతో ప్రేమలో పడకూడదు’’ అన్న కొటేషన్ రాసి ఉన్న షర్టు ధరించి ఫొటో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీళ్లిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ గాసిప్ రాయుళ్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో సారా చేసిన తాజా పోస్టు మరోసారి ఊహాగానాలకు తావిచ్చింది. ఓ వ్యక్తి చేయి పట్టుకున్న సారా.. డేట్ నైట్ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ క్రమంలో.. ‘‘గిల్ టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ బిజీగా ఉంటే.. సారా మాత్రం డేట్‌కి వెళ్లింది.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ అనుమానాలను పటాపంచలు చేసేలా సింగర్ కనికా కపూర్ సైతం ఇదే తరహా పోస్టు పంచుకున్నారు. సారాతో డేట్‌కు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. చదవండి: David Warner: ‘అప్పు’ను గుర్తుచేసిన వార్నర్.. అదైతే కష్టం కానీ! మరి ఆర్సీబీకి ఆడతావా బ్రో! -
సచిన్ చేసిన పనికి ఒక్కసారిగా జడుసుకున్నారు
-
సచిన్ చేసిన పనికి ఒక్కసారిగా జడుసుకున్నారు
ముంబై: కరోనా విజృంభణ వల్ల ఆటగాళ్లకు ప్రతి రోజు ప్రాక్టీస్ ఎంత ముఖ్యమో.. కోవిడ్ టెస్ట్ కూడా అంతే ముఖ్యమైనది. వారి జీవితంలో ప్రతి రోజు కోవిడ్ పరీక్ష తప్పని సరి అయ్యింది. ఈ క్రమంలో కరోనా టెస్ట్ చేస్తుండగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన ప్రాంక్ వీడియో వైరలవుతోంది. ప్రస్తుతం సచిన్ రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్ కోసం రాయ్‌పూర్‌లో ఉన్నాడు. ప్రొటోకాల్ ప్రకారం సచిన్‌కు కోవిడ్ టెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు వైద్య సిబ్బంది. ఈ క్రమంలో సచిన్ తనకు కరోనా టెస్ట్ చేయడానికి వచ్చిన మెడికల్ టీమ్‌తో ప్రాంక్ చేయాలని భావించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మెడికల్ సిబ్బంది ఒకరు సచిన్ ముక్కు నుంచి స్వాబ్ తీసుకుంటుండగా.. నొప్పితో బాధపడినట్లు నటించాడు. దాంతో శాంపిల్స్ తీసుకుంటున్న వ్యక్తి కంగారు పడ్డాడు. స్వాబ్ కలెక్ట్ చేయడం పూర్తయిన తర్వాత సచిన్ వెంటనే తుమ్మాడు. దాంతో అక్కడున్న వారు కంగారు పడ్డారు. అది చూసిన సచిన్ తాను ఊరికే నటించానని.. వారిని నవ్వించేందుకే ఇలా చేశానని తెలిపాడు. ఆ తర్వాత సచిన్ నోటి నుంచి శాంపిల్స్ సేకరించారు వైద్య సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియోని సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘200 టెస్టులు ఆడాను.. 277 సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను.. వైద్య సిబ్బందిని చీరప్ చేయడం కోసం ఇలా చిన్న ప్రాంక్ చేశాను. ఓ మంచి కారణం కోసం మేం ఈ సిరీస్ ఆడుతున్నాం. ఈ క్రమంలో మా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ.. మాకు సాయం చేసస్తోన్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలువుతోంది. రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇండియా లెజెండ్స్, ఇంగ్లండ్ లెజెండ్స్‌తో తల పడనుంది. గతేడాది ప్రారంభం అయిన రోడ్ సేఫ్టీ సిరీస్ కరోనా కారణంగా ఆగి పోయింది. అయితే తాజాగా ఈ నెల ఐదో తారీఖు నుంచి గతేడాది ఎక్కడైతే ఆగిపోయిందో మళ్లీ అ్కడి నుంచే సిరీస్ పునఃప్రారంభం అయ్యింది. చదవండి: వయసు పెరిగినా పదును మాత్రం తగ్గలేదు మా పాజీ తర్వాత మ్యాచ్ ఆడుతాడా! -
కోహ్లి సాధిస్తాడా!.. అనుమానమే?
హైదరాబాద్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అనేక రికార్డులను టీమిండియా సారథి విరాట్ కోహ్లి బద్దలుకొట్టగలడా అనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మజీ సారథి, దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్. కోహ్లి అత్యుత్తమ బ్యాట్మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదని కానీ సచిన్‌తో పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అనేక రికార్డులను నెలకొల్పాడాడని గుర్తుచేసిన అక్రమ్.. సచిన్ పేరిట ఉన్న పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేస్తాడా లేడా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలన్నాడు. ‘నేను మనసులో ఏది అనుకుంటే అది నిర్మోహమాటంగా బయటకు చెబుతాను. సచిన్, కోహ్లి ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు, ఇప్పటికే కోహ్లి అనేక రికార్డులను నెలకొల్పాడు. కానీ వీరిద్దరిని పోల్చడం సరికాదు. ఇద్దరి బ్యాటింగ్‌లో, బాడీ లాంగ్వేజీలో చాలా తేడాలు ఉన్నాయి. అయితే సచిన్, కోహ్లిలు దూకుడైన ఆటగాళ్లు. అయితే ఇద్దరిలో ఒక తేడా ఉంది. సచిన్‌ను స్లెడ్జింగ్ చేస్తే నవ్వుతూ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్తాడు. ప్రత్యర్థి బౌలర్ కవ్వింపు చర్యలకు దిగితే సచిన్ మరింత ఏకాగ్రతతో వ్యవహరిస్తాడు. కానీ కోహ్లి ఏకాగ్రతను దెబ్బతీయం చాలా సులువు. అతడిని స్లెడ్జింగ్ చేస్తే చాలా సులువుగా తన సహనాన్ని కోల్పోతాడు. అయితే ఇలా సహనం కోల్పోతే వికెట్ కోల్పోయే ప్రమాదం ఉంది’ అని వసీం అక్రమ్ వ్యాఖ్యానించాడు. చదవండి: ‘కెప్టెన్సీ పంచుకోవడం కోహ్లికి నచ్చదు’ 'పాంటింగ్ నిర్ణయం మా కొంప ముంచింది' -
సచిన్‌కు ఎక్స్ కేటగిరి భద్రత తొలగింపు
-
సచిన్ టెండుల్కర్ క్రికెట్ గురువు ఆచ్రేకర్ కన్నుమూత
-
అపోలో టైర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాస్టర్ బ్లాస్టర్
న్యూఢిల్లీ: ప్రముఖ టైర్ల కంపెనీ అయిన అపోలో టైర్స్ తన సంస్థ ప్రచారకర్తగా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను నియమించింది. కంపెనీకి ఐదేళ్ల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు అపోలో టైర్స్ కంపెనీ సచిన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఒక సెలబ్రిటిని బ్రాండ్ అంబాసిడర్‌గా కుదుర్చుకోవడం ఇదే మొదటిసారని అపోలో టైర్స్ తెలిపింది. సచిన్ టెండూల్కర్‌తో అనుబంధం తమకు ప్రయోజనం కలిగిస్తుందని కంఎనీ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కన్వర్ వెల్లడించారు. సచిన్‌తో తమ ప్రయాణం సుదీర్ఘ కాలం సాగించడానికే ఇష్టపడతున్నామన్నారు. భారత్‌లో ఇండియన్ సూపర్ లీగ్‌లో చెన్నయన్ ఎఫ్సీకి ప్రధాన స్పాన్సరర్‌గా, మినర్వా పంజాబ్ ఎఫ్సీకి టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్నామని తెలిపారు. కాగా విదేశాల్లోని ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ క్లబ్, మాంఛెస్టర్ యునైటెడ్ లాంటి వాటికి అపోలో టైర్స్ గ్లోబల్ టైర్ పార్టనర్‌గా ఉన్న కంపెనీ దేశీయంగా కూడా తమ ఉత్పత్తులను మరింత పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతోనే సచిన్ లాంటి సెలబ్రిటీతో ఒప్పందాలు కుదుర్చుకుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆ నలుగురుకీ రూ.కోటిన్నర...
చెన్నై: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీకి బీసీసీఐ నుంచి భారీగా సొమ్ము అందనుంది. ఏక మొత్తం ప్రయోజనం కింద వీరికి రూ. కోటీ 50 లక్షల చొప్పున ఇచ్చేందుకు బోర్డు ఆర్థిక కమిటీ నిర్ణయించింది. జాతీయ జట్టు తరఫున టెస్టు మ్యాచ్‌లు ఆడి రిటైర్ అయిన వారికి ఈ స్కీం కింద బోర్డు నగదు చెల్లిస్తూ వస్తోంది. మరోవైపు బీసీసీఐలో పాలనా సంస్కరణల గురించి సుప్రీం కోర్టు నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసిన లోధా కమిటీపై ఇప్పటిదాకా రూ.3.90 కోట్లు ఖర్చు చేసినట్టు వచ్చిన కథనాలు అవాస్తవమని బోర్డు తెలిపింది. ఈ మొత్తంలో పదో వంతు మాత్రమే ఖర్చయ్యిందని పేర్కొంది. -
అత్యుత్తమ వన్డే క్రికెటర్ సచినా, ధోనియా?
రేసులో గిల్‌క్రిస్ట్, అక్రమ్, రిచర్డ్స్ న్యూఢిల్లీ: వన్డే క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ ఎవరనే దానిపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్, కెప్టెన్ ఎం.ఎస్.ధోనిల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఇద్దరితో పాటు గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా), వసీమ్ అక్రమ్ (పాకిస్తాన్), వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)లు కూడా దీని కోసం పోటీపడుతున్నారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు చెందిన ‘క్రికెట్ మంత్లీ’ అనే మ్యాగజైన్ ఈ సర్వేను చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 50 మంది దిగ్గజ ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు, క్రికెట్ కాలమిస్ట్‌లతో కూడిన జ్యూరీ ఈ ఐదుగురిలో ఒక్కర్ని ఎంపిక చేయనుంది. మరో రెండు వారాల్లో విజేతను ప్రకటించనున్నారు. సమకాలీన క్రికెటర్లలో సచిన్ అంతకాలం ఆట ఆడిన మరో ఆటగాడు లేడు. ఈ విషయంలో మాస్టర్‌కు ఎవరూ సాటిరారు. దాంతోపాటు క్రికెట్లో ఉన్న దాదాపు అన్ని రికార్డులను అతను తిరగరాశాడు. మరోవైపు వన్డేల్లో అత్యుత్తమ ఫినిషిర్‌గా పేరు తెచ్చుకున్న ధోని.. భారత్ జట్టుకు ఊహించని విజయాలు అందించాడు. 2011 ప్ర పంచకప్ టైటిల్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇక తన 12 ఏళ్ల కెరీర్లో ఆసీస్‌కు లెక్కలేనన్నీ విజయాలు అందించిన గిల్‌క్రిస్ట్ మంచి స్ట్రోక్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. -
సచిన్‌ను అధిగమించిన కోహ్లి
ట్విట్టర్లో అగ్రస్థానం ముంబై: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. అయితే ఇది ఏ పరుగుల విషయంలోనో అనుకుంటే పొరపాటే. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో అత్యధిక సంఖ్యలో అభిమానులు కలిగిన భారతీయ క్రీడాకారుడిగా కోహ్లి (@iamvkohli) తొలి స్థానంలో నిలిచాడు. ఈ విషయంలో సచిన్‌ను తోసిరాజని కోహ్లి 48 లక్షల 70 వేల 190 మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. సచిన్‌ను 48,69,849 మంది అనుసరిస్తున్నారు. కెప్టెన్ ధోని (33,27,033), యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టాప్-10 క్రీడాకారుల్లో తొమ్మిది మంది క్రికెటర్లే ఉండగా... ఇతర క్రీడల నుంచి సానియా మీర్జాకు టాప్-10 జాబితాలో చోటు దక్కింది. -
ఆ శతకం... కెరీర్‌ను మార్చేసింది
పెర్త్ ఇన్నింగ్స్‌పై సచిన్ వ్యాఖ్య ముంబై: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, బౌన్సీ వికెట్... ఆపై నిప్పులు చెరిగే ఆస్ట్రేలియా పేసర్లు.. బంతిని ముట్టుకోవాలంటే.. ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి వాకా పిచ్‌పై 1992లో చేసిన సెంచరీ తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. ఆ ఇన్నింగ్స్ తనలో ఎనలేని విశ్వాసాన్ని నింపిందన్నాడు. ‘పెర్త్ ఇన్నింగ్స్ నా కెరీర్‌కు ఓ రూపు తెచ్చింది. బౌన్సీ పిచ్‌పై ఆసీస్ పేసర్లను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు నా వయసు 19 ఏళ్లు... అయినా సెంచరీ కొట్టా. దాని కంటే రెండు మ్యాచ్‌ల ముందు సిడ్నీలో శతకం చేశా. అయితే ఈ రెండు పిచ్‌లకు చాలా తేడాలున్నాయి. పెర్త్‌లాంటి వికెట్ ప్రపంచంలో ఎక్కడా లభించదు. అలాంటి పిచ్‌పై పరుగులు చేస్తే ప్రపంచంలోని బౌన్సీ, ఫాస్ట్ వికెట్లపై సులువుగా రన్స్ చేయొచ్చు. అప్పుడప్పుడే ప్రారంభమైన నా కెరీర్ పెర్త్ ఇన్నింగ్స్ తర్వాత వేగం పుంజుకుంది’ అని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ పేర్కొన్నాడు. -
సచిన్‌కు మరో పురస్కారం!
ముంబై: భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ‘ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో’ ప్రదానం చేయనున్న ‘ఈ తరం క్రికెటర్’ అవార్డు రేసులో సచిన్ ముందంజలో ఉన్నాడు. ‘ క్రిక్ఇన్ఫో’ వెబ్సైట్ 20వ వార్షికోత్సవం సందర్భంగా 1993 నుంచి 2013 వరకు క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి ‘ఈ తరం క్రికెటర్’ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కోసం విఖ్యాత మాజీ క్రికెటర్లు లారా, మురళీధరన్ పోటీపడినా.. తుది జాబితాలో ‘మాస్టర్’తోపాటు ఆస్ట్రేలియా మేటి స్పిన్నర్ షేన్ వార్న్, దక్షిణాఫ్రికా స్టార్ కలిస్ చోటు సంపాదించారు. ఈ 20 ఏళ్ల కాలంలో ఈ ముగ్గురు లెజెండరీ క్రికెటర్లు తమ కెరీర్లో అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. మాస్టర్ సచిన్ బ్యాటింగ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టించగా... వార్న్ తన స్పిన్ మ్యాజిక్‌తో అద్భుతాలు చేశాడు. ఇక కలిస్ సూపర్ ఆల్‌రౌండర్‌గా అందరి మన్ననలు పొందాడు. దీంతో 50 మంది సభ్యుల జ్యూరీ సచిన్, వార్న్, కలిస్‌లను తుది జాబితాకు ఎంపిక చేసింది. ఈ జ్యూరీలో అంతర్జాతీయ క్రికెటర్లు, మాజీలు, క్రికెట్ రచయితలు, టీవీ వ్యాఖ్యాతలు ఉన్నారు. తిరుగులేని మాస్టర్... క్రికెట్ కెరీర్లో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్న సచిన్ ‘ఈ తరం క్రికెటర్’ అవార్డు రేసులో వార్న్, కలిస్‌లకు అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇప్పటికే సచిన్‌కు 65 శాతానికిపైగా ఓట్లు పడ్డాయి. సచిన్ జోరు ముందు వార్న్, కలిస్లు వెనకబడిపోయారు. అయితే ఈ ఓటింగ్‌లో మీరూ పాల్గొనవచ్చు. ఠీఠీఠీ.్ఛటఞఛిటజీఛిజీజౌ. ఛిౌఝ వెబ్సైట్లోకి లాగిన్ అయి ‘ఈ తరం క్రికెటర్’ను ఎంపిక చేయవచ్చు. విజేతగా నిలిచిన వారికి నేడు ముంబైలో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేస్తారు. -
అతని జ్ఞాపకాలు మనవే
క్రికెట్ సారాన్ని, సంస్కృతిని, చరిత్రను మార్చిన క్రీడాకారుని ఖ్యాతి ఒక్కరికే. క్రికెట్‌ను భారత ఊహాశక్తి మహానగరంగా, పచ్చని స్టేడియంగా, వాస్తవికతగానూ, భ్రమాత్మక వాస్తవికతగానూ భాసించే టెలివిజన్‌గా మార్చేసిన వాస్తుశిల్పి సచిన్. ‘సచిన్’ అనే అద్భుత స్వప్నాన్ని వీక్షించిన అభిమానులకు ఆ జ్ఞాపకాలను తిరిగి కచ్చితంగా చెప్పడం ఎలాగో తెలియదు. వాస్తవం అతిశయోక్తిగా మారక తప్పదు. 60 ఏళ్లు దాటాక సచిన్... పదిమందీ చెప్పుకునే కథల్లో తనను గుర్తించవచ్చు. సచిన్ టెండూల్కర్‌కు అప్పుడు పదేళ్లు. 1983లో భారత క్రికెట్ హఠాత్తుగా ఎవరూ ఊహించని రీతిన రివ్వున రోదసికి ఎగసే సీతాకోక చిలుకగా మారిపోయింది. బ్రిటిష్ వాళ్లు మొదట బ్యాటు, బంతి పట్టినది మొదలుకొని అంత వరకు మన క్రికెట్ గొంగళి పురుగులాగా కాళ్లీడ్చుకుంటూ గడిపింది. కపిల్‌దేవ్ ఆ ఏడు ఇంగ్లండ్‌కు తీసుకుపోయిన టీంలో ఎలాంటి ప్రత్యేకతా లేదు. కపిల్ ఒక్కడే అందుకు మినహాయింపు. అప్పుడప్పుడే తనలో దాగిన ఆత్మవిశ్వాసాన్ని గుర్తిస్తున్న నూతన భారతావని నుంచి బయటకు తొంగి చూస్తున్న క్రికెటర్లలో అతడే అత్యంత ఉత్కృష్ట క్రీడాకారుడు. పరిమితమైన తన ఇంగ్లిషు భాషా పరిజ్ఞానాన్ని కపిల్ తన విలక్షణమైన నవ్వుతో విదిల్చి పారేసేవాడు. అ నవ్వు ఎదుటివారిని నొప్పించే తుంటరితనంతో కూడినదీ కాదు, అణకువతో ముడుచుపోయి ఆత్మన్యూనతా భావానికి గురయ్యేలా చేసేదీ కాదు. ప్రపంచం తన భాషను అర్థం చేసుకునే వరకు కపిల్ బ్యాట్, బంతితోనే మాట్లాడాడు. తన కాలం రాక ముందే ఏ ప్రవక్తా జన్మించడు. 1983 ప్రపంచ కప్పు... భారత క్రికెట్ ఆధిక్యతా శిఖరాలను అందుకునే సాహస యాత్రకు ప్రారంభ స్థానం. క్రికెట్ క్రీడలోని మన శకి ్తసామర్థ్యాలు, సంపదలు గగనానికి దూసుకుపోవడం ప్రారంభించిన సమయానికే... సచిన్ సరిగ్గా తన టీనేజ్‌లోకి ప్రవేశించాడు. క్రికెట్లో అలాంటి శక్తిసామర్థ్యాలు, సంపదలను అంతకు ముందయితే అర్థరహితంగా, జానపద కథల్లాంటి కల్పనగా కొట్టిపారేసేవారే. నివ్వెరపోయి చూస్తున్న వెస్ట్ ఇండీస్‌ను ఓడించి భారత్ 1983 ప్రపంచ క్రికెట్ కప్‌ను గెలుచుకునే వరకు అంతర్జాతీయ క్రికెట్ దుర హంకార పూరితమైన కుల విభజనతో నడుస్తుండేది. బ్రాహ్మణులు, ఇంగ్లండూ, ఠాకూర్లు, ఆస్ట్రేలియా క్రీడను శాసిస్తుండేవారు. కొన్నిసార్లు వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు మెరుపుల్లాగా కళ్లు మిరిమిట్లు గొలిపింపజేసేవారు. గ్యారీ సోబర్స్, రోహాన్ కన్హాయ్, వెస్ హాల్, చార్లీ గ్రిఫిత్‌లను ఎవరు మరిచిపోగలరు? క్లైవ్ లాయడ్ ఒక టీమ్‌గా వారందరినీ గుదిగుచ్చే వరకు వారంతా 11 మంది ఆటగాళ్లు మాత్రమే. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్‌లు బడుగు ప్రపంచం. దక్షిణ ఆఫ్రికా అయితే విందుకు వచ్చిన దెయ్యమే (వారి ఆటను రేడియోలో వినడమే తప్ప చూసింది లేదు). గవాస్కర్ పాత ప్రపంచపు అత్యంత విశిష్ట క్రీడా నైపుణ్యం. సచిన్, మన మెరుగని ఖండఖండాతరాలను జయించడానికి బయల్దేరిన నౌకకు కెప్టెన్. వీక్షకుల విస్ఫోటనం బ్యాంకు ఖాతాల్లో ప్రతిధ్వనిస్తుండేది. సచిన్ మొట్టమొదటి వ్యాపార ప్రకటన ఒప్పందపు మొత్తం... భారీ పరిశ్రమను ప్రారంభించడానికి అవసరమయ్యే మూల ధనం అంత పెద్దది. అసాధారణమైన ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సాహసికుడు మార్క్ మాస్కరెనాస్. అది అతి మంచి వ్యాపార నిర్ణయమని అతనికి తెలుసు. యువ సచిన్‌కు సైతం ఆ విషయంలో ఎలాంటి సందేహాలూ లేవు. సచిన్‌కు ముందు కూడా క్రికెట్ మేధో దిగ్గజాల తారా తోరణం ఉండేది. సచిన్ రిటైరైన తర్వాత కూడా మరింత ఎక్కువ నైపుణ్యం ఉంటుంది. అయితే క్రికెట్ క్రీడ సారాన్ని, సంస్కృతిని, పరిధులను, చరిత్రను మార్చేసిన క్రీడాకారునిగా ఆ ఖ్యాతి దక్కేది మాత్రం శతాబ్దికి ఒక్కరికే. అక్కడక్కడా నలుసుల్లాగా ఒయాసిస్లున్న విశాలమైన బీడు భూమిని భారత ఊహాశక్తి మహానగరంగా, అవధులు లేని పచ్చని స్టేడియంగా, వాస్తవికతగానూ, వాస్తవమనిపించే భ్రమాత్మక వాస్తవికతగానూ కూడా భాసించే టెలివిజన్‌గా మార్చేసిన వాస్తుశిల్పి సచిన్. వివశులను చేసే సచిన్ సొగసరి క్రీడా నైపుణ్యానికి బ్యాట్ ఓ క్షణం శస్త్ర చికిత్సకు ఉపయోగించే కత్తిగా మారితే, మరో క్షణం నగల వర్తకుని పనిముట్టుగా మారేది, ఇక సచిన్ పిడుగులు కురిపించే మూడ్‌లో ఉన్నాడంటే అది నార్డిక్ ప్రజల దేవుడు ‘థోర్’ సమ్మెటగా మారిపోయేది. ఆ వశీకరణ శక్తిని గురించి చర్చించాల్సిన పని లేదు. దాన్ని కళ్లారా చూసి, చెవులారా విని పసందైన విందుగా ఆస్వాదించగలిగే శాశ్వత టెలివిజన్ యుగంలో మనం ఉన్నాం. ప్రతి వీక్షుకుడు తనంతకు తానే ఒక నెవిల్లె కార్డస్ (సుప్రసిద్ధ ఇంగ్లిషు క్రికెట్ విమర్శకుడు, రచయిత). సచిన్‌కు, అతని అభిమానుల విలక్షణ విశ్వంలో వెలుగుతుండే ప్రతి అభిమానికి మధ్యన అంతుపట్టని అనుబంధం ఉంది. కాబట్టి సచిన్ క్రీడా నైపుణ్యం గురించి చెప్పడమంటే ఆ అనుబంధంలోకి తలదూర్చడమే అవుతుంది. ఇది ఆరాధనే తప్ప మెచ్చుకోలు కాదు. సచిన్ కనీసం రెండు తరాలకు జీవితాంతం మాట్లాడుకోడానికి సరిపడా తన గొప్పదనం జ్ఞాపకాలను మిగిల్చాడు. సచిన్ గురించి డొంక తిరుగుడుగా మాట్లాడుకోవడం ముగిసింది. సూటి గా మాట్లాడుకోవడం ఇప్పుడే మొదలైంది. రెండు దశాబ్దాలు గడిచేసరికి జ్ఞాప కం ఎప్పటిలాగా తన పని తాను చేసుకుపోతుంది... వాస్తవాన్ని అతిశయించి చెబుతుంది. రోజువారీ జీవితం పంజరానికి వెలుపల తమ జీవిత కాలంలోనే అద్భుత స్వప్నాన్ని వీక్షించే విశేషావకాశం లభించిన సచిన్ అభిమానులకు ఆ జ్ఞాపకాలను తిరిగి కచ్చితంగా చెప్పడం ఎలాగో తెలియదు. వాస్తవం అతిశయోక్తిగా మారడం అనివార్యం. 60 ఏళ్లు దాటాక సచిన్... ఏ బార్లోనో లేదా ఏ డ్రాయింగ్ రూంలోనో పదిమందీ చేరి కాస్త ఉల్లాసంగా గడిపేటప్పుడు చెప్పుకునే కథల్లో తనను గుర్తించవచ్చు. ఆ నక్షత్ర ధూళి వ్యాపనంలో గణాంకాలను లేదా యదార్ధాలను చెబుతూ సచిన్ ఏ మాత్రం జోక్యం చేసుకోకూడదు. సచిన్ ‘తన’ జీవిత కాలంలోని పౌరాణిక నాయకుడు కాడు. మన జీవితాల్లోని పురాణ పురుషుడు. సచిన్ జీవితం సచిన్‌దే. అతని జ్ఞాపకాలు మాత్రం మనవే. - ఎం. జె. అక్బర్, సీనియర్ సంపాదకులు -
థాంక్యూ...గుడ్ బై..
ఎందుకు కన్నీళ్లు ఆగడం లేదు..! ఏదో ఓ రూపంలో మళ్లీ కనిపిస్తాడని తెలుసు. అయినా మనసెందుకు మాట వినడం లేదు. ఈ బాధెందుకు తగ్గడం లేదు... రెండు పుష్కరాల పాటు మనసులను రంజింపజేసిన ఆట మళ్లీ కనపడదనా..! క్రికెట్‌కే కొత్త నిర్వచనం చెప్పిన ‘దేవుడు’ ఇక ఆటలో భాగం కాలేడనా..! సచిన్ కంటే ముందు ఎందరో దిగ్గజాలు క్రికెట్ ఆడారు. సచిన్‌తో కలిసి ఆడిన గొప్ప క్రికెటర్లున్నారు. భవిష్యత్‌లోనూ ఎవరో ఒకరు అదే స్థాయిలో ఆడే ఆటగాడొస్తాడు. కానీ మళ్లీ సచిన్ రాడు... ఏనాడూ ప్రత్యర్థిపై నోరు పారేసుకుని ఎరగడు. ఎంత డబ్బు ఇస్తానన్నా మద్యం, సిగరెట్లకు ప్రచారం చేయలేదు. బయటా ఎవరినీ పల్లెత్తు మాట అనడు.... ఈ లక్షణాలున్న మరో క్రికెటర్ ప్రపంచానికి దొరకుతాడా..! మనసు ఇంకా మాస్టర్ ఆట చూడాలంటోంది. ఏం చేయాలి..? ఒక జీవితానికి సరిపడా అందించిన జ్ఞాపకాలను నెమరువేసుకుందాం... రెండు పుష్కరాల పాటు ఆట ద్వారా ఆనందం పంచినందుకు థాంక్స్... వీడలేమని మేమంటున్నా... నువ్వు వీడ్కోలన్నావు. నీ మీద ప్రేమతోనే నీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. గుడ్‌బై ‘గాడ్’..! ‘ఆట’ ముగించిన మాస్టర్ అనూహ్యమేమీ కాదు... అయినా సరే అందరిలోనూ అదే ఉద్వేగం... మైదానంలోని ప్రేక్షకులు... కుటుంబ సభ్యులు... సహచరులు... ఇలా ఒక్కరేమిటి... అందరిదీ అదే స్థితి... కొంత మంది భోరున ఏడ్చేశారు. మరి కొంత మంది ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేసినా... అది సాధ్యం కావడం లేదు... ఆత్మీయుడెవరో దూరమవుతున్న బాధ... క్రికెట్ అంటే అతనే అని ఇంత కాలం భావిస్తూ బతికిన తరానికి గుండె బద్దలవుతున్న క్షణం... మరి సచిన్ పరిస్థితి... ఎన్ని ఆలోచనలు రేకెత్తి ఉంటాయి... ఎంత అలజడి సాగుతూ ఉంటుంది... తన జీవితమే ముగిసిపోతున్నట్లు... క్రికెట్ లేకుండా ఎలా బతకగలనంటూ... ఎలాంటి సంబంధం లేకుండానే పాతికేళ్ల పాటు తమలో ఒకడిగా మార్చుకున్న కోటానుకోట్ల ఆత్మీయులకు ఎలా కృతజ్ఞత చెప్పాలంటూ... విజయాలు... పరాజయాలను సమంగా స్వీకరిస్తూ భావోద్వేగాలు కనపడకుండా ఇన్నాళ్లు దాచగలిగిన శిఖర సమానుడు తన ప్రియమైన ఆటను వీడుతున్న సమయాన మాత్రం చిన్న పిల్లాడిలా రోదించాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ మైదానం వీడాడు... ముంబై: అవును....సచిన్ రమేశ్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంనుంచి వీడ్కోలు తీసుకున్నాడు. వాంఖడే స్టేడియంలో శనివారం ఉదయం 11.47 గంటలకు ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌తో ఈ దిగ్గజం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై సచిన్ ఆటను చూసే అవకాశం, అదృష్టం మనకు లేదు. కానీ అతను మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం మనతో నిలిచే ఉంటాయి. 24 ఏళ్ల ఒక రోజు... షమీ బౌలింగ్‌లో గాబ్రియెల్ క్లీన్‌బౌల్డ్ కావడంతో సచిన్ రెండు పుష్కరాల కెరీర్‌కు ఫుల్స్టాప్ పడింది. స్టేడియంలోని దాదాపు 25 వేల మంది ప్రేక్షకులు ఈ చిరస్మరణీయ ఘట్టానికి సాక్షిగా నిలిచారు. మ్యాచ్ ముగియగానే టీమిండియా ఆటగాళ్లు సచిన్‌కు స్టంప్‌ను జ్ఞాపికగా ఇచ్చారు. సహచరులందరినీ ఆలింగనం చేసుకున్న తర్వాత వెస్టిండీస్ ఆటగాళ్లు ఒక్కొక్కరితో మాస్టర్ కరచాలనం చేశాడు. 1989 నవంబర్ 15న తొలి టెస్టు బరిలోకి దిగిన సచిన్ సరిగ్గా 24 ఏళ్ల ఒక రోజు తర్వాత కెరీర్‌ను ముగించాడు. మొబైల్ గార్డ్ ఆఫ్ ఆనర్ మాస్టర్‌ను భారత క్రికెట్ జట్టు ఘనంగా గౌరవించింది. సాధారణంగా దిగ్గజ క్రికెటర్లు రిటైరైతే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు. (ఇరువైపులా నిలబడి బయటకు పంపడం). సచిన్ విషయంలో భారత యువ జట్టు ఒక అడుగు ముందుకేసి మొబైల్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చింది. క్రికెటర్లంతా లైన్లో నిలుచున్న తర్వాత మాస్టర్ ముందుకు వెళ్లే కొద్దీ వరుసలో ఆఖరన ఉన్న ఆటగాడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు చేరి బౌండరీ రోప్ వరకు తీసుకొచ్చారు. చివరిసారిగా పిచ్‌పై... మ్యాచ్ ముగిశాక సచిన్ మైదానాన్ని వీడుతున్న వేళ స్టేడియంలో ప్రతీ ఒక్కరు లేచి నిలబడి ఆ దిగ్గజానికి సలామ్ చేశారు. ఆ తర్వాత మాస్టర్ తన భార్య, పిల్లలతో కలిసి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి వచ్చాడు. 24 ఏళ్ల పాటు తనకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు చెబుతూ భావోద్వేగ ప్రసంగం చేశాడు. అనంతరం కెప్టెన్ ధోనితో పాటు కోహ్లి, ధావన్ తదితరులు తమ భుజాలపై సచిన్‌ను స్టేడియం అంతా ఊరేగించారు. త్రివర్ణ పతాకంతో మాస్టర్ మైదానమంతా కలియదిరిగి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. అనంతరం తన ఉజ్వల కెరీర్‌కు ‘బాట’ పరిచిన పిచ్ దగ్గరికి వచ్చి ఆఖరి సారిగా దానికి మొక్కి ఉద్వేగంగా నిష్ర్కమించాడు. స్టేడియం బయటికి వచ్చాక కూడా టీమ్ బస్సులోంచి అభిమానులకు ఆఖరిసారిగా చేయి ఊపి... క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. పేరుపేరునా కృతజ్ఞతలు మాస్టర్ బ్లాస్టర్ చివరిసారిగా క్రికెట్ మైదానంలో చేసిన ప్రసంగం యథాతథంగా... స్నేహితులారా, (స్టేడియం హోరెత్తింది) నన్ను మాట్లాడనివ్వండి... లేదంటే నేను ఇంకా ఎక్కువ భావోద్వేగానికి లోనవుతాను. 24 ఏళ్లుగా 22 గజాల మధ్య గడిపిన నేను రిటైర్ అవుతున్నాననే విషయం నమ్మలేకపోతున్నాను. నేను ఇక్కడి వరకు రావడానికి నా జీవితంలో మద్దతుగా నిలబడిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. ఎవరినైనా మరచిపోతానేమో అని జాబితా రాసుకుని వచ్చాను. ఒకవేళ పొరపాటున ఎవరినైనా మరచిపోతే క్షమించండి. అంకుల్, ఆంటీ, సోదరులు నా స్కూల్ రోజు ల్లో మా అంకుల్, ఆంటీ వాళ్ల ఇంట్లో ఉండేవాడిని. వాళ్లు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. నే ను ఆడి అలసిపోతే మగత నిద్రలోనే ఆంటీ నాకు ఏదైనా తినిపించి మళ్లీ ఆడేందుకు సిద్ధం చేసేది. మా పెద్దన్నయ్య నితిన్... ‘నువ్వు ఏం చేసినా కరెక్ట్‌గానే చేస్తావు. నీ మీద నమ్మకం ఉంది’ అని చెప్పేవాడు. నా తొలి క్రికెట్ బ్యాట్ ఇచ్చింది మా అక్క సవిత. కాశ్మీర్ విల్లో బ్యాట్ అది. ఇప్పటికీ నేను ఆడుతుంటే తను ఉపవాసం ఉంటుంది. మరో అన్నయ్య అజిత్ గురించి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. నా కోసం తన కెరీర్‌ను వదిలేసుకున్నాడు. 11 ఏళ్ల వయసులో రమాకాంత్ అచ్రేకర్ సర్ దగ్గరకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి నా జీవితం మారిపోయింది. శువ్రారం రాత్రి కూడా ఫోన్లో నా ఆట గురించి చర్చించుకున్నాం. నా కెరీర్ అంతా నా ఆట గురించి చర్చించుకున్నాం, వాదించుకున్నాం. అదే లేకపోతే నేను ఈ స్థాయికి చేరేవాడిని కాదు. అత్తా మామలు... నా అత్తామామలు అన్నాబెల్, ఆనంద్ మెహతా... నాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. వాళ్లతో అనేక విషయాలు చర్చించేవాడిని. నేను అంజలిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు థాంక్స్. స్నేహితులు నా జీవితంలో అండగా నిలబడిన స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ల పనులు వదిలేసుకుని నాకు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేయడానికి వచ్చేవారు. గాయాలైనప్పుడు నా కెరీర్ ముగిసిందనుకున్నాను. కానీ ఉ.3 గం. సమయంలోనూ ఫోన్లలో నా స్నేహితులు స్పందిం చారు. నా కెరీర్ చాలా ఉందని ధైర్యం చెప్పారు. గురువు అచ్రేకర్... నా ఆట 11 ఏళ్ల వయసులో ప్రారంభమైంది. అచ్రేకర్ సార్ నన్ను తన స్కూటర్ మీద ముంబైలోని మైదానాలకు తిప్పేవారు. ప్రాక్టీస్ కోసం ఉదయం ఒక మైదానంలో, మధ్యాహ్నం ఒక గ్రౌండ్లో మ్యాచ్ ఆడటానికి తీసుకెళ్లేవారు. ఇప్పటివరకూ ఎప్పుడూ ఆయన నన్ను బాగా ఆడానని ప్రశంసించలేదు. దీనివల్ల అలసత్వం వస్తుందని ప్రశంసించలేదు. సర్... నేను రిటైర్ అవుతున్నా కాబట్టి ఇప్పుడైనా నేను బాగా ఆడానని మీరు అనవచ్చు... బీసీసీఐ, సహచరులు... ఇదే మైదానంలో నా క్రికెట్ ప్రారంభమైంది. అందరిలాగే భారత్‌కు ఆడాలనేదే నా కల. 16 ఏళ్ల వయసులో బీసీసీఐ నన్ను నమ్మి అవకాశం ఇచ్చింది. చాలామంది క్రికెటర్లతో కలిసి ఆడాను. అందరూ నాకు సహాయం చేశారు. ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ, ఇక్కడలేని కుంబ్లే, నా సహచర క్రికెటర్లు... మీరంతా నాకు కుటుంబంలాంటి వారు. ధోని నాకు 200 టెస్టు క్యాప్ ఇచ్చినప్పుడు... ‘మనమంతా జట్టుగా ఇక్కడ ఉన్నందుకు గర్విద్దాం. మీ పూర్తి సామర్థ్ధ్యంతో దేశానికి సేవ చేస్తారని భావిస్తున్నాను. భగవంతుడు మనకు ఈ అవకాశం ఇచ్చాడు. దీనిని సరైన దిశలో ఉపయోగించుకోవాలి. క్రికెట్ ప్రతిష్టను పెంచాలి’ అన్నాను. ఇంతకాలం నాకు వైద్యం చేసిన డాక్టర్లు, ఫిజియోలకు కృతజ్ఞతలు. మీరు లేకుంటే ఇంతకాలం నేను క్రికెట్ ఆడేవాడినే కాదు. మేనేజర్స్... నా స్నేహితుడు, నా తొలి మేనేజర్ మార్క్ దురదృష్టశాత్తు ఇప్పుడు లేరు. తను లేకుంటే ఇదంతా సాధించేవాడినే కాదు. స్పాన్సర్లు, ప్రమోషన్ల ఒత్తిడి నా మీద లేకుండా స్వేచ్ఛగా క్రికెట్ ఆడుకోగలిగేలా చూశాడు. ఆ తర్వాత నా మేనేజర్ వినోద్ నాయుడు కూడా నా కుటుంబంలో ఒకడిలా కలిసిపోయాడు. నా కోసం తన కుటుంబాన్ని వదిలి వచ్చి పనిచేశాడు. తనతో పాటు వినోద్ కుటుంబానికి కూడా నా కృతజ్ఞతలు. మీడియా, ఫొటోగ్రాఫర్స్... స్కూల్ రోజుల్లో నేను బాగా ఆడినప్పుడు మీడియా ప్రోత్సహించింది. ఈ రోజు ఉదయం వరకు కూడా నా గురించి రాస్తూనే ఉన్నారు. నేను మరింత బాగా ఆడేందుకు ఇవి తోడ్పడ్డాయి. నా జీవితాంతం భద్రపరచుకుని ఆనందించేలా అనేక ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్లకూ థాంక్స్. అభిమానులు... ఇక అందరికంటే ముఖ్యంగా మీరు... (అభిమానులను ఉద్దేశించి) నేను డకౌట్ అయినా, సెంచరీ కొట్టినా అండగానే నిలబడ్డారు. నా కోసం ప్రార్థనలు చేశారు, ఉపవాసాలూ ఉన్నారు. ఇక్కడి ‘సచిన్.. సచిన్...’ అనే హోరు నేను బతికున్నంత కాలం నా చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది. అందరికీ కృతజ్ఞతలు. ఏదైనా మరచిపోయి ఉంటే క్షమించండి. గుడ్‌బై..! ఇక కొన్ని ఇంటి బాధ్యతలు అప్పగిస్తా: అంజలి సచిన్ లేని క్రికెట్‌ను ఊహించొచ్చు కానీ క్రికెట్ లేని సచిన్‌ను ఊహించలేకపోతున్నా. ఇక సచిన్‌కు కొన్ని ఇంటి బాధ్యతలు కూడా అప్పగిస్తా. సచిన్ సాధారణంగా భావోద్వేగాలను బయటపడనీయడు. సాధారణంగా నేను కూడా బయటపడను. కానీ నెల రోజులుగా ఈ రిటైర్మెంట్ రోజును తలచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఎప్పుడు రిటైర్ అవ్వాలనేది తేల్చుకోవడానికి సమయం తీసుకున్నాడు. కానీ నిర్ణయం తీసుకున్నాక దానిని చక్కగా హ్యాండిల్ చేశాడు. ఎక్కడ ఉన్నా ఆట నుంచి దూరమయ్యేవాడు కాదు. నెల రోజులు సెలవులు గడపడానికి వెళ్లినప్పుడు కూడా... ఎక్కువగా తినేవాడు కాదు. క్రికెట్ ఆడాలి, తినను అనేవాడు. సారా, అర్జున్ పుట్టే సమయానికే వాళ్ల నాన్న దేశానికి క్రికెట్ ఆడుతున్నాడు. ఆయన గొప్పతనమేంటో ఇప్పుడు వాళ్లకు బాగా తెలుస్తుంది. పెళ్లి చేసుకోవడానికి ముందే సచిన్ గురించి నాకు అర్థమైంది. తను మొదట ముంబైకి, భారతదేశానికి చెందిన వ్యక్తి. ఆ తర్వాతే నాకు. -అంజలి (సచిన్ భార్య) అంజలి, సారా, అర్జున్... నా జీవితంలో అద్భుతమైన క్షణం 1990లో అంజలి పరిచయం. ఒక డాక్టర్‌గా తనకు కెరీర్ ఉంది. కానీ పిల్లల గురించి నేను చూసుకుంటా... నువ్వు ఆడుకో అని నా కెరీర్ ఇబ్బందులు లేకుండా కొనసాగేలా చేసింది. నేను మాట్లాడిన అనేక చెత్త విషయాలను భరించింది. నా జీవితంలో అద్భుతమైన భాగస్వామ్యం అందించినందుకు థ్యాంక్స్. సారా, అర్జున్ నా జీవితంలో రెండు విలువైన వజ్రాలు. అమ్మాయికి 16 ఏళ్లు, అబ్బాయికి 14 ఏళ్లు. టైమ్ అలా గడిచిపోయింది. వాళ్ల పుట్టిన రోజులకు, వార్షికోత్సవాలకు, స్పోర్ట్స్ డేస్‌కు నేను లేను. కానీ దానిని వాళ్లు అర్థం చేసుకున్నారు. (పిల్లలిద్దరితో) మీ ఇద్దరూ నాకు ఎంతో ప్రత్యేకం. నేను మీతో తగినంత సమయం గడపలేదు. కానీ వచ్చే 16 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం మీతోనే సమయం గడుపుతానని హామీ ఇస్తున్నా. నాన్న... రమేశ్ టెండూల్కర్ తొలుత నా జీవితంలో అందరికంటే ముఖ్యమైన వ్యక్తి మా నాన్న. 1999లో మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన మార్గదర్శనం లేకపోతే ఈరోజు ఇక్కడ నిలబడేవాడిని కాదు. ‘కలలను వె ంటాడు. నీ లక్ష్యంలో ఇబ్బందులు ఎదురైనా ఎప్పుడూ వదిలేయకు. ముఖ్యంగా మంచి మనిషిగా ఎదుగు’ అని ఆయన చెప్పేవారు. నేను సెంచరీ చేసిన ప్రతిసారీ పైకి చూసి, అభివాదం చేసేది ఆయనకే. అమ్మ... రజనీ టెండూల్కర్ మా అమ్మ... నా లాంటి అల్లరి పిల్లాడిని ఎలా పెంచిందో. నా ఆరోగ్యం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకునేది. నా కెరీర్ ప్రారంభం కాకముందు నుంచి కూడా నా కోసం ప్రార్థనలు చేసేది. అవే నాకు బలాన్నిచ్చాయి.