మదిలో పదిలం | Number of crucial matches played by the sachin tendulkar | Sakshi
Sakshi News home page

మదిలో పదిలం

Published Thu, Nov 14 2013 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

మదిలో పదిలం

మదిలో పదిలం

మేలిమి ముత్యాలు ముందుంచి వాటిలో మంచిది ఎంచుకోమంటే ఏం చేస్తాం...సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల గురించి చెప్పాలన్నా సరిగ్గా అదే పరిస్థితి. ఒకటా, రెండా...ఎన్నో గొప్ప ప్రదర్శనలు. అయితే అద్భుతాల్లోనూ మహాద్భుతాలు అన్నట్లు...కొన్ని ఇన్నింగ్స్‌లు క్రికెట్ ప్రపంచం, అభిమానుల మదిలో మెదిలే
 చిరస్మరణీయ జ్ఞాపకాలు...
 
 టెస్టులు...
 119* ఇంగ్లండ్‌పై-1990, మాంచెస్టర్‌లో
 17 ఏళ్ల చిరు ప్రాయంలోనే భారత్‌ను ఓటమి కోరలనుంచి రక్షించిన ఈ ఇన్నింగ్స్ సచిన్ రాకను ప్రపంచానికి చాటింది. 408 పరుగుల విజయలక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన భారత్ 127 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అద్భుతమైన ఆటతీరు కనబర్చి జట్టును కాపాడాడు.
 
 
 114 ఆస్ట్రేలియాపై, 1992, పెర్త్‌లో
 ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పిచ్‌గా గుర్తింపు ఉన్న వాకా మైదానంలో చేసిన ఈ సెంచరీ సచిన్ సత్తాను చాటింది. ఇలాంటి ఆట చూసి ఎన్నాళ్లైందంటూ ఆసీస్ మీడియా ప్రశంసలు కురిపించింది. భారత్ ఓడినా...సచిన్ సెంచరీ మాత్రం గుర్తుండిపోయింది.
 
 
 136 పాకిస్థాన్‌పై-1999, చెన్నైలో
 సచిన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ విషాదంగా మారిన మ్యాచ్ ఇది.  271 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్ 82 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. తీవ్రమైన వెన్నునొప్పి బాధిస్తున్నా భరిస్తూ ఆరున్నర గంటల పాటు ఆడి అద్భుతమైన సెంచరీ సాధించాడు.  జట్టును విజయానికి 15 పరుగుల దూరంలో నిలిపి ఏడో వికెట్‌గా అవుటయ్యాడు. అంతే...మరో 4 పరుగులకు మిగతా ముగ్గురు అవుట్...12 పరుగులతో భారత్ ఓటమి. ఈ పరాజయంతో మాస్టర్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
 
 103 ఇంగ్లండ్‌పై 2008,చెన్నైలో
 ముంబైపై తీవ్రవాదుల దాడి జరిగిన కొద్ది రోజులకే జరిగిన ఈ టెస్టుతో భారతీయుల భావోద్వేగాలు ముడిపడ్డాయి. గతంలో ఎన్నో రికార్డులు ఉన్నా నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి సచిన్ భారత్‌ను ఎప్పుడూ గెలిపించలేదు. దానికి సమాధానమే ఈ మ్యాచ్. 387 పరుగుల లక్ష్య ఛేదనలో... తీవ్ర ఒత్తిడి మధ్య సచిన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన సెంచరీ, జట్టు విజయం ఒకే బంతికి పూర్తయ్యాక తన శైలికి భిన్నంగా సచిన్ గాల్లోకి ఎగురుతూ విజయనాదం చేశాడు.
 
 నమ్మకాలూ ఎక్కువే
 
 క్రీజులోకి దిగేముందు సచిన్ తన ఎడమ కాలు ప్యాడ్‌ను ముందుగా కట్టుకుంటాడు. అయితే ఇదేమీ కాకతాళీయంగా అతడికి అలవాటు కాలేదు. 15 ఏళ్ల వయసులో తొలి రంజీ మ్యాచ్ ఆడినప్పటి నుంచే సచిన్ ఈ పద్ధతి పాటిస్తున్నాడు.
 
 ఫిరోజ్ షా కోట్ల మైదానంలో అనిల్‌కుంబ్లే సాధించిన పదికి పది వికెట్ల ఘనత ఎవరూ మర్చిపోరు. అయితే దీని వెనకాల కూడా సచిన్ నమ్మకం పనిచేసింది. కుంబ్లే ఓవర్ వేసేందుకు వచ్చినప్పుడల్లా అతడి క్యాప్, స్వెటర్‌ను తానే అంపైర్‌కు ఇచ్చాడు. అలా సచిన్ చేసిన ప్రతిసారీ కుంబ్లే అనూహ్యంగా వికెట్ తీశాడు.
 
 ఓపెనర్‌గా అవకాశం వచ్చినపుడల్లా ప్రతిసారీ నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లోనే ఉండేందుకు ఇష్టపడతాడు. 2004కు ముందు మాత్రం 47 సార్లు స్ట్రయికర్‌గా బరిలోకి దిగాడు.
 
 మ్యాచ్ ఆడే బ్యాట్‌ను టీమ్ కిట్‌లో పెట్టడు. ఓ విధంగా బ్యాట్‌ను పూజిస్తాడు. ఇంట్లో కూడా వినాయకుడి ఫొటో పక్కనే బ్యాట్‌ను ఉంచుతాడు. తన బ్యాట్‌కు ఏ మరమ్మత్తై తనే చేసుకుంటాడు. తన కిట్ బాక్స్‌లో సత్యసాయి బాబా ఫొటో, గణేశుడి ఫొటో తప్పకుండా ఉంటాయి.
 
 28 సచిన్ ఆడిన సమయాన్ని లెక్కిస్తే అది 28 రోజుల 13 గంటల 54 నిమిషాల పాటు తేలింది. నిమిషా ల్లో లెక్కిస్తే ఇది 41 వేల 154 నిమిషాలు. (199 టెస్టుల వరకు)
 
 988 అంతర్జాతీయ  కెరీర్‌లో సచిన్ మొత్తం 988 మందితో సహచ రుడిగా లేదా ప్రత్యర్థిగా కలిసి ఆడాడు. ఇందులో 142 మంది భారత ఆటగాళ్లు కాగా, 846మంది ఇతర జట్ల క్రికెటర్లు.
 
 38 సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు 38 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకున్నాయి.
 
 నేను అదృష్టవంతుడ్ని... మాస్టర్ బ్లాస్టర్‌కు నెట్స్‌లోనే బౌలింగ్ చేసే భాగ్యం దక్కింది. లేదంటే నేనూ బాధితుడినే!
 - అనిల్ కుంబ్లే
 
 ఒక పార్టీలో అతిరథ మహారథుడి కోసం ఎగబడ్డారు. ముందుగా అమితాబ్ బచ్చన్ ఉండటంతో ఆయనే ఆ విశిష్ట వ్యక్తనుకున్నా... అప్పుడు సచిన్ వచ్చాడు. అమితాబ్ సహా అంతా వేచిచూసిన మహారథి సచినేనని అప్పుడు అర్థమైంది నాకు. - షారుక్ ఖాన్ (బాలీవుడ్ స్టార్)
 
 క్రికెట్ యుద్ధంలో బౌలర్లను ఓడించిన సచిన్‌ను చూస్తుంటే మెడల్స్‌ను ఎదపై గర్వంగా చాటే వెటరన్ కల్నల్ గుర్తుకొస్తాడు
 - అలెన్ డోనాల్డ్ (దక్షిణాఫ్రికా)
 
 సచిన్ వేర్వేరు మైలురాళ్లు (50...100...150...200) అధిగమించి నప్పుడు ప్రేక్షకుల వైపు చూస్తూ  396 సార్లు బ్యాట్ ఎత్తాడు.
 
 క్రికెట్ కెరీర్‌లో కొనసాగుతుండగానే రాజ్యసభకు
 నామినేట్ అయిన తొలి క్రికెటర్ సచిన్.
 
  రకరకాల పెర్‌ఫ్యూమ్స్, చేతి గడియారాలు
 సేకరించడం సచిన్‌కు చాలా ఇష్టం.
  టెండూల్కర్ వాడిన తొలి కారు మారుతీ-800
 
 1992లో గుబురు మీసాలు, గడ్డంతో రోజా సినిమాను చూడటానికి థియేటర్‌కు వెళ్లాడు. అయితే మధ్యలో అతను పెట్టుకున్న గ్లాస్‌లు పడిపోవడంతో అందరూ గుర్తుపట్టేశారు.
 భారత ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర, అర్జున, పద్మ అవార్డులను అందుకున్న ఏకైక భారత క్రికెటర్.
 
 తన తల్లి వైద్యం కోసం సచిన్ ఒకసారి కప్ప వంటకాన్ని తయారు చేశాడు.
 ఫెరారీ కారు అంటే సచిన్‌కు చాలా ఇష్టం. ఆ కారును తన భార్య అంజలిని కూడా డ్రైవ్ చేయనిచ్చేవాడు కాదు.
 
 సచిన్ అప్పుడప్పుడు సరదా పనులతో సహచరులను ఆట పట్టించేవాడు. ఓసారి గంగూలీ రూమ్‌లోకి పైప్ పెట్టి ట్యాప్ విప్పేశాడు.
 
 వన్డేలు...
 143 ఆస్ట్రేలియాపై, 1998, షార్జాలో
  ఇసుక తుపాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇన్నింగ్స్ ఇది. ఆసీస్ 284 పరుగులు చేయగా...కివీస్‌ను వెనక్కి నెట్టి భారత్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే 254 పరుగులు చేయాలి. మరో ఆటగాడి సహకారం లేకుండా సచిన్ ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
 
  131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 143 పరుగులు చేశాడు. సరిగ్గా రెండు రోజుల తర్వాత ఫైనల్లో మరో సెంచరీ కొట్టి జట్టుకు టైటిల్ అందించాడు. తాను నిద్రపోతే కలలో కూడా సచిన్ కొట్టిన సిక్సర్లే కనిపిస్తున్నాయని షేన్‌వార్న్ వ్యాఖ్యానించింది ఈ మ్యాచ్ గురించే.
 
 140* కెన్యాపై, 1999, బ్రిస్టల్‌లో
 భారత్‌లో తండ్రి అంత్యక్రియలకు హాజరై, మ్యాచ్‌కు ముందు రోజే తిరిగొచ్చిన సచిన్ ఈ శతకాన్ని తండ్రికే అంకితమిచ్చాడు. మనసులో బాధను దిగమింగి జట్టు కోసం ఆడాడు. చిన్న జట్టే అయినా సచిన్ సెంచరీ చేసిన సందర్భం అత్యంత భారమైనది. ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో వచ్చి మాస్టర్ చేసిన తొలి సెంచరీ ఇది.
 
 98 పాకిస్థాన్‌పై, 2003, సెంచూరియన్‌లో
 ఈ మ్యాచ్ కోసం 12 రాత్రులు సరిగా నిద్రపోకుండా ఎదురు చూశానని సచిన్ స్వయంగా చెప్పుకున్నాడు. ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ 273 పరుగులు చేసింది. కండరాలు పట్టేసినా ఓర్చుకొని సచిన్ కేవలం 75 బంతుల్లోనే 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 98 పరుగులు చేశాడు. శివరాత్రినాడు జరిగిన ఈ మ్యాచ్ పాక్‌కు కాళరాత్రినే మిగిల్చింది.
 
 175 ఆస్ట్రేలియాపై, 2009, హైదరాబాద్‌లో
 సచిన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడినా గెలుపు దక్కని మ్యాచుల్లో ఇదొకటి. 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుతమైన బ్యాటింగ్‌తో  141 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 175 పరుగులు చేసినా 3 పరుగులతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడగలిగిన తెలుగు క్రికెట్ అభిమానులు నిజంగా అదృష్టవంతులు.
 
 200* దక్షిణాఫ్రికాపై, 2010, గ్వాలియర్‌లో
 వన్డే పుట్టిన దాదాపు 40 ఏళ్లకు గానీ తొలి డబుల్ సెంచరీ నమోదు కాలేదు. అయితే అత్యుత్తమ ఆటగాడి ద్వారానే ఆ స్వప్నం సాకారం కావడం క్రికెట్ చేసుకున్న అదృష్టం. సచిన్ ఈ ఇన్నింగ్స్‌ను వర్ణించడానికి మాటలు సరిపోవు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement