sachin retirement
-
సచిన్ ‘పోస్టల్’ వివాదం!
స్టాంప్ కోసం నిబంధనల ఉల్లంఘన ముంబై: కెరీర్ ఆసాంతం వివాదాలకు దూరంగా ఉన్న మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్... తన ప్రమేయం లేకుండా కొత్త వివాదంలో చిక్కుకున్నారు. సచిన్ రిటైర్మెంట్ సందర్భంగా పోస్టల్ స్టాంప్ విడుదల సందర్భంగా సంబంధిత అధికారులు నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం బతికున్నవారిపై స్టాంప్ విడుదల చేయరాదు. వారు చనిపోయిన కనీసం పదేళ్ల తర్వాతే స్టాంప్ ముద్రించవచ్చు. అదీ 10వ వర్ధంతి లేదా 25వ లేదా వర్ధంతి...ఇలా ప్రత్యేక రోజునే విడుదల చేయవచ్చు. సచిన్ విషయంలో కేంద్ర మంత్రి శరద్ పవార్ అతి చొరవతో ఇదంతా వేగంగా జరిగిపోయింది. పోస్టల్ శాఖకు కనీస సమయం కూడా ఇవ్వకుండా ప్రతిపాదించిన 20 రోజుల్లోపే సచిన్ స్టాంప్‌ను పవార్ సిద్ధం చేయించారు. ఈ మొత్తం ప్రక్రియలో అధికారులు అన్ని నిబంధనలు ఉల్లంఘించడం వివాదానికి తావిచ్చింది. -
కోచ్ అవతారం ఎత్తుతున్న టెండూల్కర్
క్రికెట్‌కు దూరమయ్యానన్న ఆవేదన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లో బాగా కనిపిస్తున్నట్లుంది. అందుకే.. ఏదో ఒక రూపంలో మళ్లీ ఆ ఆటకు దగ్గర కావాలనుకున్నాడు. అంతే, ఇప్పుడు కోచ్ అవతారం ఎత్తాడు. యువ క్రికెటర్లు పర్వేజ్ రసూల్, ఉన్ముక్త్ చంద్‌లతో సహా పలువురికి శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు సచిన్ టెండూల్కర్. ప్రముఖ క్రీడా సామగ్రి సంస్థ అడిడాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 11 మంది యువ క్రికెటర్లకు సచిన్ శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ ఇద్దరితో పాటు విజయ్ జోల్, మనన్ వోహ్రా, మన్‌ప్రీత్ జునేజా, రష్ కలారియా, చిరాగ్ ఖురానా, బాబా అపరాజిత్ లాంటి యువ క్రికెటర్లు కూడా ఈ టీమ్‌లో ఉన్నారు. యువ క్రికెటర్లలోని నైపుణ్యాన్ని ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న అడిడాస్‌కు అభినందనలు చెప్పాడు టెండూల్కర్. యువ క్రికెటర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా క్రికెట్‌కు తాను ఎంతో కొంత తిరిగిస్తున్నానన్న సంతృప్తి తనకు కలుగుతుందని అన్నాడు. -
యువ హోరు షురూ
చరిత్రలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం లాగా... క్రికెట్లోనూ సచిన్‌కు పూర్వం.. సచిన్ శకం... సచిన్ తర్వాత... అనే మూడు దశలు ఉన్నాయి. ఇందులో మూడో దశ మొదలైంది ఈ ఏడాదే. 2013 క్రికెట్ అభిమానులకు కావలసినంత వినోదాన్నిచ్చింది. అదే సమయంలో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్తో అభిమానులను కన్నీరు పెట్టించింది. చాంపియన్స్ ట్రోఫీలో విజయంతో ధోనిసేన ఈ ఏడాదిని చిరస్మరణీయంగా మార్చింది. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌తో ఆట మీద దెబ్బ పడుతుందేమో అని భయపడినా... యువ క్రికెటర్లు తమ అసమాన ఆటతీరుతో దేశంలో ఆట ప్రతిష్టను కాపాడారు. సచిన్ రిటైర్మెంట్... రోహిత్ శర్మ డబుల్ సెంచరీ... వన్డేల్లో ధోనిసేన వరుస విజయాలు... స్వదేశంలో టెస్టుల్లో తిరుగులేని ప్రదర్శన... విరాట్ కోహ్లి సూపర్ ఫామ్... ఇలా 2013లో భారత క్రికెట్లో చెప్పుకోదగ్గ అంశాలు చాలానే ఉన్నాయి. ఏడాది ఆరంభం నుంచి చివరి వరకు విరామం లేని క్రికెట్‌తో ఎప్పటిలాగే క్రికెటర్లు బిజీబిజీగా గడిపారు. ఐపీఎల్ సమయంలో వెలుగులోకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం దేశంలో పెద్ద కలకలం. శ్రీశాంత్ లాంటి పేరున్న బౌలర్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇది పెద్ద మచ్చే అయినా... మొత్తం మీద ఈ ఏడాది భారత క్రికెట్ సరైన దిశలోనే నడిచిందని అనుకోవాలి. ఇక మిగిలిన దేశాల క్రికెట్లోనూ హడావుడి బాగానే ఉంది. యాషెస్ రెండు సార్లు జరగడంతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బిజీబిజీగా మారాయి. ఈ ఏడాది క్రికెట్లో విశేషాలు... - సాక్షి క్రీడావిభాగం ముగిసిన సచిన్ శకం 16 నవంబరు 2013... భారత దేశంలో కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కన్నీరు పెట్టిన రోజు. రెండు దశాబ్దాలకు పైగా అలుపెరగని యోధుడిలా క్రికెట్ మైదానంలో పోరాడుతూ... అవిశ్రాంతంగా అభిమానులను అలరించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతరాత్మ ప్రబోధానుసారమే రిటైర్మెంట్ నిర్ణయం ఉంటుందని పలు సందర్భాల్లో చెప్పిన సచిన్... తన వీడ్కోలు అంశాన్ని నెల రోజుల ముందే ప్రకటించాడు. తన దగ్గరి నుంచి ప్రకటన వచ్చిన క్షణం నుంచి... వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసేవరకు సచిన్ మేనియాతో దేశం ఊగిపోయింది. తన సొంతగడ్డ ముంబైలో తల్లి, భార్య, పిల్లలు, సన్నిహితులు, అభిమానుల మధ్య మాస్టర్ 200వ టెస్టు మ్యాచ్ ఆడాడు. క్రికెట్లో తనకే సాధ్యమైన చక్కటి షాట్లు ఆడి చివరిసారిగా అభిమానులను ఆటతో అలరించాడు. వెస్టిండీస్‌పై సిరీస్‌ను ధోని అండ్ కో క్లీన్‌స్వీప్ చేసి...మాస్టర్‌కు వీడ్కోలు పలికారు. భారమైన హృదయంతో అభిమానులను ఉద్దేశించి ప్రసంగించి... చివరిసారి పిచ్‌కు నమస్కరించి కన్నీళ్లతో క్రికెట్ ‘దేవుడు’ వెళ్లిపోతున్న దృశ్యం... అది చూసిన వాళ్లందరికీ ఎప్పటికీ ఓ జ్ఞాపకం. రోహిత్ ‘డబుల్’ వన్డేల్లో డబుల్ సెంచరీ అనే కలను ఈ ఏడాది రోహిత్ సాకారం చేసుకున్నాడు. సచిన్, సెహ్వాగ్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన వన్డేలో విశ్వరూపం చూపించి 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. ధోని ధమాకా వెస్టిండీస్‌లో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో భారత కెప్టెన్ ధోని సంచలనాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 145/5 స్కోరుతో నిలిచింది. ఆ సమయంలో ధోని స్కోరు 2 పరుగులు! ఈ దశలో టెయిలెండర్ల సహకారంతో చివరి వరకు నిలిచి ధోని ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. గెలిచేందుకు కావాల్సిన 57 పరుగులలో ధోని ఒక్కడే 43 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా, ధోని వరుసగా 6,4,6 బాదడంతో ఒక వికెట్ తేడాతో భారత్ సంచలన విజయం సాధించింది. భారీ చేజింగ్ ఆస్ట్రేలియాతో జైపూర్‌లో జరిగిన వన్డేలో భారత్ 360 పరుగుల లక్ష్యాన్ని ఊదిపారేసింది. రోహిత్ శర్మ (141 నాటౌట్), విరాట్ కోహ్లి (100 నాటౌట్) శతకాలతో పాటు ధావన్ (95) చెలరేగడంతో 43.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి భారత్ ఈ స్కోరును అందుకోవడం విశేషం. భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ (52 బంతుల్లో) చేసిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ‘స్పాట్’ పెట్టారు ఈ ఏడాది భారత క్రికెట్‌కు అతి పెద్ద మచ్చ స్పాట్ ఫిక్సింగ్. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, చండిలా, చవాన్ ‘స్పాట్ ఫిక్సింగ్’కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వీరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మే 17న ఈ ఉదంతం బయటకు వచ్చింది. అటు ఐపీఎల్ జట్ల యజమానులు కూడా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం ఉదంతంపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. శ్రీశాంత్, చండిలా, చవాన్ ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్నారు. కానీ బోర్డు నుంచి నిషేధం ఎదుర్కొంటున్నారు. శ్రీశాంత్‌పై బోర్డు జీవితకాల నిషేధం విధించింది. కొత్త సంచలనాలు ఈ ఏడాది భారత క్రికెట్లో కొత్తగా సంచలనాలు సృష్టించిన క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్. వన్డేల్లో రెండు కొత్త బంతులు నిబంధనను అందరికంటే బాగా ఉపయోగించుకున్న బౌలర్ భువనేశ్వర్. తన స్వింగ్ బౌలింగ్‌తో ఈ ఏడాది భారత్ వన్డేల్లో విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అటు శిఖర్ ధావన్ టెస్టుల్లో అరంగేట్రంలోనే చెలరేగిపోయాడు. ఆ ‘త్రయం’ మిస్! ఈ ఏడాది భారత క్రికెట్లో అతి పెద్ద మిస్సింగ్ సెహ్వాగ్, గంభీర్, హర్భజన్. దాదాపు దశాబ్దానికి పైగా భారత క్రికెట్లో భాగంగా ఉన్న హర్భజన్, సెహ్వాగ్ జట్టులో స్థానం కోల్పోయారు. సీజన్ ఆరంభంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆడినా... ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయారు. ఫామ్ కోల్పోయిన స్టార్ క్రికెటర్ గంభీర్ ఈ ఏడాది వన్డేల్లో కనిపించినా ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయాడు. చివరిసారి మనమే... ఇంగ్లండ్‌లో ఈ ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో ఇక ఈ మెగా టోర్నీకి మంగళం పాడేశామని ఐసీసీ ప్రకటించింది. అయితే టెస్టు చాంపియన్ షిప్‌పై సందేహాలు పెరిగిన నేపథ్యంలో భవిష్యత్‌లో మళ్లీ ఈ టోర్నీ తెరమీదకు వస్తుందేమో తెలియదు. ఇక ఇదే చివరిసారి అని చెప్పిన ఏడాదిలో ధోనిసేన టైటిల్ సాధించింది. లీగ్ దశలో పాకిస్థాన్‌ను ఓడించి సెమీస్‌కు చేరిన భారత్... అక్కడ శ్రీలంకను చిత్తు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఫైనల్ వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌గా మారింది. తొలుత భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు కేవలం 129 పరుగులు చేసి... అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను 124/8 స్కోర్‌కు నియంత్రించి టైటిల్ సాధించింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన శిఖర్ ధావన్ (363) గోల్డెన్ బ్యాట్ అవార్డు గెలుచుకోగా... ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు గోల్డెన్ బాల్ అవార్డు లభించింది. వన్డేల్లో సిక్సర్... టెస్టుల్లో స్వీప్! భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది స్ఫూర్తిదాయకంగా ఆడింది. చాంపియన్స్ ట్రోఫీతో సహా మొత్తం ఎనిమిది వన్డే టోర్నీలు/సిరీస్‌లు ఆడిన ధోనిసేన ఏకంగా ఆరుసార్లు విజయం సాధించింది. ఏడాది ఆరంభంలో పాకిస్థాన్‌తో 1-2తో సిరీస్‌ను కోల్పోయిన భారత్... చివరగా దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌లోనూ 0-2తో ఓడింది. ఈ మధ్యలో మాత్రం సిక్సర్ కొట్టింది. ఇంగ్లండ్‌తో స్వదేశంలో 3-2తో సిరీస్ గెలిచింది. చాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి... వెస్టిండీస్‌లో జరిగిన ముక్కోణపు టోర్నీలో ఫైనల్లో లంకను ఓడించి టైటిల్ సాధించింది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి కోహ్లి సారథ్యంలో జింబాబ్వే వెళ్లి 5-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశారు. మళ్లీ స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఏడు వన్డేల సిరీస్‌ను 3-2తో గెలిచారు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో 2-1తో విజయం సాధించారు. ఇక టెస్టుల విషయానికొస్తే ఈ ఏడాది తక్కువగానే ఆడారు. ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 4-0తో క్లీన్‌స్వీప్ చేసి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని గెలిచారు. నవంబరులో వెస్టిండీస్‌తో జరిగిన సచిన్ వీడ్కోలు సిరీస్‌నూ 2-0తో స్వీప్ చేశారు. ‘చాంపియన్’ ముంబై ఈ ఏడాది అదరగొట్టే ఆటతీరుతో ముంబై ఇండియన్స్ జట్టు అటు ఐపీఎల్, ఇటు చాంపియన్స్ లీగ్‌లోనూ విజేతగా నిలిచింది. ఐపీఎల్లో ప్రత్యేకంగా కెప్టెన్సీ కోసం పాంటింగ్‌ను పిలిపించుకున్నారు. కానీ రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక జట్టు ఒక్కసారిగా కొత్తగా కనిపించింది. తన నాయకత్వ ప్రతిభతో రోహిత్ రెండు టోర్నీల్లోనూ ఆకట్టుకున్నాడు. చెన్నైను కంగుతినిపించి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ముంబై ... చాంపియన్స్ లీగ్ ఫైనల్లో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. ‘యాషెస్’ రెండుసార్లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ప్రతీకార పోరుగా భావించే ‘యాషెస్’ ఈ ఏడాది రెండుసార్లు జరిగింది. వన్డే ప్రపంచకప్ ఏర్పాట్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గానే ఒకే ఏడాది రెండుసార్లు ఈ సిరీస్ నిర్వహించారు. ఆగస్టులో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో గెలుచుకుంది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే క్లార్క్‌సేన 3-0తో యాషెస్‌ను సాధించింది. మిగిలిన దేశాలలో చెప్పుకోదగ్గ సంచలనాలు ఏమీ లేవు. దక్షిణాఫ్రికా టెస్టుల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ దూసుకుపోతోంది. శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌ల నుంచి సంచలన ఫలితాలేమీ రాలేదు. అఫ్ఘానిస్థాన్ జట్టు వన్డే ప్రపంచకప్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడం చిన్న దేశాల విషయంలో చెప్పుకోదగ్గ ఘనత. అన్నిటికంటే పెద్ద ట్విస్ట్... నేపాల్ జట్టు టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడం. ఈ ఏడాది టాపర్స్ టెస్టులు అత్యధిక వికెట్లు: స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్-59 వికెట్లు) అత్యధిక పరుగులు: మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా - 1077 పరుగులు) అత్యధిక విజయాలు (జట్టు): ఆస్ట్రేలియా (13 టెస్టుల్లో 7 విజయాలు) వన్డేలు అత్యధిక వికెట్లు: అజ్మల్ (పాకిస్థాన్- 56 వికెట్లు) అత్యధిక పరుగులు: మిస్బావుల్ (పాకిస్థాన్- 1322 పరుగులు) అత్యధిక విజయాలు (జట్టు): భారత్ (34 వన్డేల్లో 22 విజయాలు) -
మనసు మాట విన్నాను : సచిన్
ఆట ముగిసింది... ఇక ఆ తర్వాత ఏమిటి... సచిన్ రిటైర్మెంట్ తర్వాత అనేక రకాల చర్చలు. వాంఖడేలో శనివారం తన ప్రసంగంతో అభిమానులతో కన్నీరు పెట్టించిన మాస్టర్... ఆదివారం మీడియా ముందుకు వచ్చి మరిన్ని విషయాలు పంచుకున్నాడు. వేర్వేరు అంశాలపై మనసు విప్పి మాట్లాడాడు. ఇన్నేళ్ల కెరీర్... ఎత్తుపల్లాలు... భవిష్యత్తు... ఇలా అనేక విషయాలపై ఒక ప్రవాహంలా మీడియా సమావేశం సాగిపోయింది. ముంబై: క్రికెట్ నుంచి తాను రిటైర్ కావడానికి ఇదే సరైన సమయంగా భావించినట్లు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ఈ నిర్ణయం తనను బాధించలేదని అతను అన్నాడు. ఇంకా ఆడాలని అనిపిస్తున్నా తన శరీరం సహకరించకపోవడమే తప్పుకోవడానికి కారణమని మాస్టర్ చెప్పాడు. ఆదివారం విలేకరుల ముందుకు వచ్చిన సచిన్ క్రికెట్ మొదలు కుటుంబం వరకు అనేక విషయాలు పంచుకున్నాడు. సచిన్ మనోభావాలు అతని మాటల్లోనే.... రిటైర్మెంట్ నిర్ణయంపై.. నేను ఇకపై క్రికెట్ ఆడలేననే బాధ లేదు. ఇదో కలల ప్రయాణం. ఆటను వీడుతున్నందుకు ఎలాంటి చింతా లేదు. తప్పుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. దీనిపై నన్ను నేను ప్రశ్నించుకుంటే రిటైర్ కావాలనే సమాధానం వచ్చింది. నేను ఆటను ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. నేను ఆడలేనని అనుకున్న రోజున తప్పుకుంటాననే గతంలోనే చెప్పాను. ఇప్పుడు నాకు అలా అనిపించింది. ఇంతకంటే ఎక్కువ బరువు నా వల్ల కాదంటూ... మరింత భారం మోయలేనంటూ శరీరం సంకేతాలిస్తుంది. దానికి విశ్రాంతి అవసరం. ఇంతకు ముందు ప్రాక్టీస్ ఆటోమేటిక్‌గా సాగిపోయేది. కానీ దానిని కొనసాగించాలంటే తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. దాచుకోలేకపోయాను మైదానంలో చివరి క్షణాలు చాలా ఉద్వేగభరితం. రిటైర్మెంట్ గురించి ఆలోచించినప్పుడు ఇంత భావోద్వేగానికి గురి కాలేదు. ఎందుకంటే అది సరైందేనని అప్పుడు భావించాను. కానీ ఆటగాళ్లు నాకు ఇచ్చిన వీడ్కోలు తర్వాత ఒక్కసారిగా నాలో భావోద్వేగాలు చెలరేగాయి. సాధారణంగా నేను ఆ తరహాలో బయట పడను. కానీ నేను ఇంత మంది ప్రేక్షకుల మధ్య ఇకపై భారత్‌కు ఆడలేననే బాధ నాకు కన్నీళ్లు తెప్పించింది. నా చేతిలో ఇకపై బ్యాట్ ఉండదని భావించిన క్షణమది. డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళుతున్నప్పుడు విండీస్ ఆటగాళ్లు ఎవరితో కరచాలనం చేశానో కూడా కనిపించలేదు. ఎందుకంటే అప్పుడు నా కళ్లల్లో నీళ్లు ఉన్నాయి! ప్రేక్షకులు వాటిని చూడొద్దని అనుకున్నాను. ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉందో మాటల్లో చెప్పలేను. అమ్మ కోసమే... మా అమ్మ నా ఆట చూడాలన్న కోరికతోనే ఆఖరి టెస్టును ముంబైలో నిర్వహించమని బీసీసీఐకి విజ్ఞప్తి చేశా. ఈ విషయం చెప్పకుండా ఆమెను ఆశ్చర్యపరుద్దామని అనుకున్నా. కానీ మీడియా ద్వారా అమ్మకు తెలిసిపోయింది. అందుకే ఈ మ్యాచ్ నాకు ఎంతో ప్రత్యేకం. నేను ఆడిన ఒక్క బంతిని కూడా ఆమె అంతకు ముందు చూడలేదు. నేను చేసిన 74 పరుగులతో ఆమె ఎంతో సంతోషించింది. నా ప్రదర్శనను బట్టి వారి స్పందన మారలేదు. ఎంత స్కోరు చేసినా తల్లిదండ్రులు, కొడుకును చూసే తీరులో ఎలాంటి తేడా రాలేదు. అన్నయ్య ప్రత్యేకం... నేను దేశానికి ఆడటంలో నా అన్నయ్య అజిత్ పాత్ర గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆఖరి రోజు అతను కూడా ఎంతో ఉద్వేగానికి గురైనా బయటపడలేదు. రిటైర్మెంట్ను దేవుడు నిర్ణయించాడు. అజిత్ కూడా అదే భావించాడు. అయితే నేను రిటైర్ కావడం, అభిమానుల స్పందన చూసి అతను కూడా సంతృప్తి చెందాడు. అమ్మలందరికీ అంకితం... అత్యుత్తమ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉంది. నా కోసం పడిన శ్రమకు మా అమ్మకు అంకితమిస్తున్నానని శనివారం చెప్పాను. కానీ ఇది భారతదేశంలోని అందరు అమ్మలకు అంకితం. తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లులందరితో ఈ అవార్డును పంచుకోవాలనుకుంటున్నా. నాతో పాటు అవార్డుకు ఎంపికైన సీఎన్ఆర్ రావుకు కూడా నా అభినందనలు. భారతరత్న గురించి తెలియగానే నాకు మాట రాలేదు. కానీ అంజలి మాత్రం ఎగిరి గంతేసింది. నాకు అవార్డు రావడంతో ఇకపై క్రీడాకారులకు ఇచ్చేందుకు అవకాశం కలిగింది. భవిష్యత్తులో దేశానికి కీర్తి తెచ్చే ఉత్తమ క్రీడాకారులు, క్రీడాకారిణులు దీనిని అందుకోవాలని కోరుకుంటున్నా. భారతీయులందరి తరఫున నేను దీనిని స్వీకరిస్తున్నా. కొత్త కొత్తగా... ‘ఉదయం 6.50 గంటలకు నిద్ర లేచాను. అంత తొందరగా స్నానం చేయాల్సిన అవసరం లేదనిపించింది. టీ తాగాను...ఆ తర్వాత భార్యతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాను. ఉదయం సమయమంతా చాలా ప్రశాంతంగా గడిచింది. చాలా మంది నాకు మెసేజ్‌లు ఇచ్చారు. వాటికి సమాధానం ఇస్తూ చాలా సమయం గడిపాను.’ 18వ ర్యాంక్‌తో ముగింపు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంతో సచిన్ తన కెరీర్‌ను ముగించాడు. విండీస్‌తో సిరీస్‌కు ముందు మాస్టర్ 24వ ర్యాంక్‌లో ఉన్నాడు అర్జున్ గురించి... అతడిని ఒంటరిగా వదిలేయమని ఒక తండ్రిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక స్థాయి వరకు ఆడాను కాబట్టి అతను కూడా అలాగే ఆడాలని కోరుకోవద్దు. మా నాన్న ప్రొఫెసర్. మీ అబ్బాయి కలం ఎందుకు పట్టలేదని ఆయన్ను ప్రశ్నించలేదు కదా! అర్జున్ క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడన్నది నిజం. నేను అతనిపై ఎలాంటి ఒత్తిడి పెంచదల్చుకోలేదు. విమర్శకులపై... ఆరంభంలో కొంత కాలం ఏం రాశారో, ఏం రాయలేదో నేను చూసేవాడిని. అయితే ఆ తర్వాత ప్రతీ ఒక్కరికి తమ అభిప్రాయాలు ఉంటాయని, ఎవరి విమర్శలు స్వీకరించాలో, వేటిని పట్టించుకోకూడదో అర్థం చేసుకుంటూ వచ్చాను. కాబట్టి వాటిని ఎక్కువగా పట్టించుకోలేదు. ఎందుకంటే నన్ను సరైన దిశలో నడిపించేవారు నా చుట్టూనే ఉన్నారు. వారిలో బ్యాట్ పట్టినవారే తప్ప ఎవరూ ‘రాతలు రాసినవారు’ కాదు. కాబట్టి వారి సహకారంతో పరుగులు సాధించడంపైనే దృష్టి పెట్టాను. సహచరులపై... నా జట్టు సభ్యులలో ప్రతీ ఒక్కరి ప్రదర్శనను నేను ఎంజాయ్ చేశాను. టీమ్ గేమ్‌లో ఎవరు బాగా ఆడారన్నది ముఖ్యం కాదు. ఇద్దరు, ముగ్గురు అద్భుతంగా ఆడితే మిగతా వారు అతనికి సహకరించడం సహజం. కొత్త తరంలోని ఆటగాళ్లందరితో కలిసి ఆడగలిగాను. నా అనుభవాలు వారితో పంచుకున్నాను. నేను ఆడటం మొదలు పెట్టినప్పుడు భువనేశ్వర్ ఇంకా పుట్టలేదు కూడా. నేను డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చినప్పుడు ‘గుడ్‌మార్నింగ్ సర్’ అనాలని కొంత మందితో సరదాగా జోక్ చేసేవాడిని. కీలక క్షణాలు... రెండేళ్ల క్రితం వన్డే ప్రపంచ కప్ నెగ్గడమే నా దృష్టిలో అత్యుత్తమ క్షణం. దాని కోసం నేను 22 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. శనివారం ప్రేక్షకులు మైదానంలో స్పందించిన ఘట్టం కూడా ఎంతో ప్రత్యేకం. 2003 ప్రపంచకప్‌లో మేం చాలా అద్భుతంగా ఆడినా ఫైనల్లో ఓడిపోవడం బాధించిన క్షణం. అది నన్ను చాలా రోజులు వెంటాడింది. వెల్డన్ సచిన్... అచ్రేకర్ సర్ నేను బాగా ఆడానని ఎప్పుడూ మెచ్చుకోలేదు. మేం ఎప్పుడైనా బాగా ఆడి ఈ సారైనా అంటారేమో అని ఎదురు చూసేవాళ్లం. కానీ అది జరగలేదు. ఆటగాడికంటే ఎప్పుడైనా ఆటే గొప్ప అని ఆయన చెప్పిన మాటనే నేను గౌరవించాను. అందుకే ఇప్పుడు ఆయన నన్ను అభినందించవచ్చని నా ప్రసంగంలో కోరాను. భారతరత్న ప్రకటించగానే సర్ నాకు కాల్ చేసి ‘వెల్డన్’ అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇలాంటి వార్తను మీకు ఇష్టమైనవారితో పంచుకున్నప్పుడు ఆనందం రెట్టింపవుతుంది. కెరీర్లో గాయాలు... నా 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో సవాళ్లు వచ్చాయి. కానీ దేశానికి ఆడాలన్న కోరిక బలంగా ఉండటంతో వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాను. ముఖ్యంగా గాయాలను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాను. వాటిని అధిగమించి మళ్లీ ఆడటం అంత సులభం కాదు. టెన్నిస్ ఎల్బోతో నాలుగు నెలలు దూరమయ్యాను. అర్జున్ ఆడే ప్లాస్టిక్ బ్యాట్ కూడా పట్టుకోలేకపోయేవాడిని. కొన్ని సందర్భాల్లో నేను ఇంకెప్పుడూ ఆడలేనని కూడా అనిపించింది. అది నా జీవితంలో అత్యంత క్లిష్టదశ. పిచ్‌కు నమస్కరించడం నన్ను ఈ స్థాయికి చేర్చిన ఆటకు కృతజ్ఞతలు చెప్పడంలో భాగంగానే అలా చేశాను. 22 గజాల ఆ పిచ్‌పైనే నా జీవితం ఆరంభమైంది. నాకు అన్నీ ఇచ్చిన ఆ పిచ్ నాకు దేవాలయంవంటిది. జీవితంలో ఇంకెప్పుడూ పిచ్ దగ్గరకు వెళ్లలేనని, అలా మొక్కలేనని తెలుసు. అందుకే దానికి నమస్కరించాను. తప్పుకున్న తర్వాత... క్రికెట్ నా జీవితం. అది నాకు ఆక్సిజన్వంటిది. 40 ఏళ్ల నా జీవితంలో 30 ఏళ్లపాటు... అంటే 75 శాతం క్రికెట్టే ఆడాను. కాబట్టి భవిష్యత్తులోనూ ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది. అయితే అది ఇప్పుడేకాదు. నేను రిటైర్ అయి 24 గంటలే అయింది. కనీసం నాకు 24 రోజులు విశ్రాంతి తీసుకునే సమయం ఇవ్వండి. నేను క్రికెట్ ఆడకపోయినా, జట్టులో సభ్యుడిని కాకపోయినా ఎప్పుడూ భారత జట్టు కోసమే ప్రార్థిస్తా. రిటైర్మెంట్కు ముందు కూడా నేను యువ ఆటగాళ్లకు సూచనలిస్తూ ఆట గురించే మాట్లాడేవాడిని. వాటి ద్వారా నేను కూడా చాలా నేర్చుకున్నాను. దీని కోసం ప్రత్యేకంగా అకాడమీ పెట్టాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోకి కూడా వచ్చే ఆలోచన లేదు. ఒక క్రికెటర్‌గానే నేను గుర్తుండాలని కోరుకుంటున్నా. -
మదిలో పదిలం
మేలిమి ముత్యాలు ముందుంచి వాటిలో మంచిది ఎంచుకోమంటే ఏం చేస్తాం...సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల గురించి చెప్పాలన్నా సరిగ్గా అదే పరిస్థితి. ఒకటా, రెండా...ఎన్నో గొప్ప ప్రదర్శనలు. అయితే అద్భుతాల్లోనూ మహాద్భుతాలు అన్నట్లు...కొన్ని ఇన్నింగ్స్‌లు క్రికెట్ ప్రపంచం, అభిమానుల మదిలో మెదిలే చిరస్మరణీయ జ్ఞాపకాలు... టెస్టులు... 119* ఇంగ్లండ్‌పై-1990, మాంచెస్టర్‌లో 17 ఏళ్ల చిరు ప్రాయంలోనే భారత్‌ను ఓటమి కోరలనుంచి రక్షించిన ఈ ఇన్నింగ్స్ సచిన్ రాకను ప్రపంచానికి చాటింది. 408 పరుగుల విజయలక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన భారత్ 127 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అద్భుతమైన ఆటతీరు కనబర్చి జట్టును కాపాడాడు. 114 ఆస్ట్రేలియాపై, 1992, పెర్త్‌లో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పిచ్‌గా గుర్తింపు ఉన్న వాకా మైదానంలో చేసిన ఈ సెంచరీ సచిన్ సత్తాను చాటింది. ఇలాంటి ఆట చూసి ఎన్నాళ్లైందంటూ ఆసీస్ మీడియా ప్రశంసలు కురిపించింది. భారత్ ఓడినా...సచిన్ సెంచరీ మాత్రం గుర్తుండిపోయింది. 136 పాకిస్థాన్‌పై-1999, చెన్నైలో సచిన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ విషాదంగా మారిన మ్యాచ్ ఇది. 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్ 82 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. తీవ్రమైన వెన్నునొప్పి బాధిస్తున్నా భరిస్తూ ఆరున్నర గంటల పాటు ఆడి అద్భుతమైన సెంచరీ సాధించాడు. జట్టును విజయానికి 15 పరుగుల దూరంలో నిలిపి ఏడో వికెట్‌గా అవుటయ్యాడు. అంతే...మరో 4 పరుగులకు మిగతా ముగ్గురు అవుట్...12 పరుగులతో భారత్ ఓటమి. ఈ పరాజయంతో మాస్టర్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. 103 ఇంగ్లండ్‌పై 2008,చెన్నైలో ముంబైపై తీవ్రవాదుల దాడి జరిగిన కొద్ది రోజులకే జరిగిన ఈ టెస్టుతో భారతీయుల భావోద్వేగాలు ముడిపడ్డాయి. గతంలో ఎన్నో రికార్డులు ఉన్నా నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి సచిన్ భారత్‌ను ఎప్పుడూ గెలిపించలేదు. దానికి సమాధానమే ఈ మ్యాచ్. 387 పరుగుల లక్ష్య ఛేదనలో... తీవ్ర ఒత్తిడి మధ్య సచిన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన సెంచరీ, జట్టు విజయం ఒకే బంతికి పూర్తయ్యాక తన శైలికి భిన్నంగా సచిన్ గాల్లోకి ఎగురుతూ విజయనాదం చేశాడు. నమ్మకాలూ ఎక్కువే క్రీజులోకి దిగేముందు సచిన్ తన ఎడమ కాలు ప్యాడ్‌ను ముందుగా కట్టుకుంటాడు. అయితే ఇదేమీ కాకతాళీయంగా అతడికి అలవాటు కాలేదు. 15 ఏళ్ల వయసులో తొలి రంజీ మ్యాచ్ ఆడినప్పటి నుంచే సచిన్ ఈ పద్ధతి పాటిస్తున్నాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో అనిల్‌కుంబ్లే సాధించిన పదికి పది వికెట్ల ఘనత ఎవరూ మర్చిపోరు. అయితే దీని వెనకాల కూడా సచిన్ నమ్మకం పనిచేసింది. కుంబ్లే ఓవర్ వేసేందుకు వచ్చినప్పుడల్లా అతడి క్యాప్, స్వెటర్‌ను తానే అంపైర్‌కు ఇచ్చాడు. అలా సచిన్ చేసిన ప్రతిసారీ కుంబ్లే అనూహ్యంగా వికెట్ తీశాడు. ఓపెనర్‌గా అవకాశం వచ్చినపుడల్లా ప్రతిసారీ నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లోనే ఉండేందుకు ఇష్టపడతాడు. 2004కు ముందు మాత్రం 47 సార్లు స్ట్రయికర్‌గా బరిలోకి దిగాడు. మ్యాచ్ ఆడే బ్యాట్‌ను టీమ్ కిట్‌లో పెట్టడు. ఓ విధంగా బ్యాట్‌ను పూజిస్తాడు. ఇంట్లో కూడా వినాయకుడి ఫొటో పక్కనే బ్యాట్‌ను ఉంచుతాడు. తన బ్యాట్‌కు ఏ మరమ్మత్తై తనే చేసుకుంటాడు. తన కిట్ బాక్స్‌లో సత్యసాయి బాబా ఫొటో, గణేశుడి ఫొటో తప్పకుండా ఉంటాయి. 28 సచిన్ ఆడిన సమయాన్ని లెక్కిస్తే అది 28 రోజుల 13 గంటల 54 నిమిషాల పాటు తేలింది. నిమిషా ల్లో లెక్కిస్తే ఇది 41 వేల 154 నిమిషాలు. (199 టెస్టుల వరకు) 988 అంతర్జాతీయ కెరీర్లో సచిన్ మొత్తం 988 మందితో సహచ రుడిగా లేదా ప్రత్యర్థిగా కలిసి ఆడాడు. ఇందులో 142 మంది భారత ఆటగాళ్లు కాగా, 846మంది ఇతర జట్ల క్రికెటర్లు. 38 సచిన్ అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు 38 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకున్నాయి. నేను అదృష్టవంతుడ్ని... మాస్టర్ బ్లాస్టర్‌కు నెట్స్‌లోనే బౌలింగ్ చేసే భాగ్యం దక్కింది. లేదంటే నేనూ బాధితుడినే! - అనిల్ కుంబ్లే ఒక పార్టీలో అతిరథ మహారథుడి కోసం ఎగబడ్డారు. ముందుగా అమితాబ్ బచ్చన్ ఉండటంతో ఆయనే ఆ విశిష్ట వ్యక్తనుకున్నా... అప్పుడు సచిన్ వచ్చాడు. అమితాబ్ సహా అంతా వేచిచూసిన మహారథి సచినేనని అప్పుడు అర్థమైంది నాకు. - షారుక్ ఖాన్ (బాలీవుడ్ స్టార్) క్రికెట్ యుద్ధంలో బౌలర్లను ఓడించిన సచిన్‌ను చూస్తుంటే మెడల్స్‌ను ఎదపై గర్వంగా చాటే వెటరన్ కల్నల్ గుర్తుకొస్తాడు - అలెన్ డోనాల్డ్ (దక్షిణాఫ్రికా) సచిన్ వేర్వేరు మైలురాళ్లు (50...100...150...200) అధిగమించి నప్పుడు ప్రేక్షకుల వైపు చూస్తూ 396 సార్లు బ్యాట్ ఎత్తాడు. క్రికెట్ కెరీర్లో కొనసాగుతుండగానే రాజ్యసభకు నామినేట్ అయిన తొలి క్రికెటర్ సచిన్. రకరకాల పెర్ఫ్యూమ్స్, చేతి గడియారాలు సేకరించడం సచిన్‌కు చాలా ఇష్టం. టెండూల్కర్ వాడిన తొలి కారు మారుతీ-800 1992లో గుబురు మీసాలు, గడ్డంతో రోజా సినిమాను చూడటానికి థియేటర్‌కు వెళ్లాడు. అయితే మధ్యలో అతను పెట్టుకున్న గ్లాస్లు పడిపోవడంతో అందరూ గుర్తుపట్టేశారు. భారత ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర, అర్జున, పద్మ అవార్డులను అందుకున్న ఏకైక భారత క్రికెటర్. తన తల్లి వైద్యం కోసం సచిన్ ఒకసారి కప్ప వంటకాన్ని తయారు చేశాడు. ఫెరారీ కారు అంటే సచిన్‌కు చాలా ఇష్టం. ఆ కారును తన భార్య అంజలిని కూడా డ్రైవ్ చేయనిచ్చేవాడు కాదు. సచిన్ అప్పుడప్పుడు సరదా పనులతో సహచరులను ఆట పట్టించేవాడు. ఓసారి గంగూలీ రూమ్‌లోకి పైప్ పెట్టి ట్యాప్ విప్పేశాడు. వన్డేలు... 143 ఆస్ట్రేలియాపై, 1998, షార్జాలో ఇసుక తుపాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇన్నింగ్స్ ఇది. ఆసీస్ 284 పరుగులు చేయగా...కివీస్‌ను వెనక్కి నెట్టి భారత్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే 254 పరుగులు చేయాలి. మరో ఆటగాడి సహకారం లేకుండా సచిన్ ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 143 పరుగులు చేశాడు. సరిగ్గా రెండు రోజుల తర్వాత ఫైనల్లో మరో సెంచరీ కొట్టి జట్టుకు టైటిల్ అందించాడు. తాను నిద్రపోతే కలలో కూడా సచిన్ కొట్టిన సిక్సర్లే కనిపిస్తున్నాయని షేన్‌వార్న్ వ్యాఖ్యానించింది ఈ మ్యాచ్ గురించే. 140* కెన్యాపై, 1999, బ్రిస్టల్‌లో భారత్‌లో తండ్రి అంత్యక్రియలకు హాజరై, మ్యాచ్‌కు ముందు రోజే తిరిగొచ్చిన సచిన్ ఈ శతకాన్ని తండ్రికే అంకితమిచ్చాడు. మనసులో బాధను దిగమింగి జట్టు కోసం ఆడాడు. చిన్న జట్టే అయినా సచిన్ సెంచరీ చేసిన సందర్భం అత్యంత భారమైనది. ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్లో వచ్చి మాస్టర్ చేసిన తొలి సెంచరీ ఇది. 98 పాకిస్థాన్‌పై, 2003, సెంచూరియన్‌లో ఈ మ్యాచ్ కోసం 12 రాత్రులు సరిగా నిద్రపోకుండా ఎదురు చూశానని సచిన్ స్వయంగా చెప్పుకున్నాడు. ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ 273 పరుగులు చేసింది. కండరాలు పట్టేసినా ఓర్చుకొని సచిన్ కేవలం 75 బంతుల్లోనే 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 98 పరుగులు చేశాడు. శివరాత్రినాడు జరిగిన ఈ మ్యాచ్ పాక్‌కు కాళరాత్రినే మిగిల్చింది. 175 ఆస్ట్రేలియాపై, 2009, హైదరాబాద్‌లో సచిన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడినా గెలుపు దక్కని మ్యాచుల్లో ఇదొకటి. 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుతమైన బ్యాటింగ్‌తో 141 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 175 పరుగులు చేసినా 3 పరుగులతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడగలిగిన తెలుగు క్రికెట్ అభిమానులు నిజంగా అదృష్టవంతులు. 200* దక్షిణాఫ్రికాపై, 2010, గ్వాలియర్‌లో వన్డే పుట్టిన దాదాపు 40 ఏళ్లకు గానీ తొలి డబుల్ సెంచరీ నమోదు కాలేదు. అయితే అత్యుత్తమ ఆటగాడి ద్వారానే ఆ స్వప్నం సాకారం కావడం క్రికెట్ చేసుకున్న అదృష్టం. సచిన్ ఈ ఇన్నింగ్స్‌ను వర్ణించడానికి మాటలు సరిపోవు. -
ఓవర్ టు యు గైస్...
సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెటర్ మళ్లీ రాడు... ఇందులో అతిశయోక్తేం లేదు. తనకంటే గొప్పగా బ్యాటింగ్ చేసే క్రికెటర్ రావొచ్చేమో... కానీ మైదానంలో తనలా ‘కూల్’గా ఉండే వ్యక్తి... సహచరుల్లో స్ఫూర్తిని నింపే క్రికెటర్ రాడు... రాబోడు కూడా..! ఫామ్‌లో ఉన్నా లేకపోయినా సచిన్ జట్టులో ఉన్నాడంటే అదో ధైర్యం. జట్టు ఎంత కష్టాల్లో ఉన్నా... మాస్టర్ ఆడతున్నాడనే ధీమా..! అభిమానులకు ఇంత ధైర్యాన్ని ఇచ్చే క్రికెటర్ మళ్లీ వస్తాడో రాడో తెలియదు. కానీ ఒక వ్యక్తితో ఆట ఆగిపోదు... కాలం అంతకంటే ఆగదు. కచ్చితంగా తర్వాతి తరం దీనిని అందిపుచ్చుకోవాలి. భారత క్రికెట్‌ను నడిపించే వ్యక్తులు కావాలి. ఇప్పటికే నైపుణ్యం ఉన్న అనేకమంది క్రికెటర్లు ఉన్నారు. కానీ ప్రధానంగా సచిన్ నుంచి బాధ్యతలు తీసుకోవలసిన క్రికెటర్లు ముగ్గురు... ధోని, రోహిత్, కోహ్లి. కెప్టెన్‌గా ధోని ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. కావలసినంత అనుభవమూ ఉంది. ప్రస్తుత తరం క్రికెటర్లలో మాస్టర్‌తో అందరికంటే ఎక్కువ కాలం గడిపిన ఆటగాడు. కాబట్టి సచిన్ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఏం చేసేవాడనేది అందరికంటే ధోనికే బాగా తెలుసు. ఎంతటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా సహచరుల్లో స్ఫూర్తి నింపడంలో సచిన్ దిట్ట. ఇకపై పెద్దన్న పాత్ర పోషించాల్సింది ధోనియే. ఇక ఆటపరంగా తన వారసులంటూ కోహ్లి, రోహిత్‌లకు సచిన్ ఇప్పటికే కితాబిచ్చాడు. వన్డేల్లో కోహ్లి రెండేళ్లుగా సంచలనాత్మకంగా ఆడుతున్నాడు. ఇక రోహిత్ అటు వన్డే డబుల్ సెంచరీ, ఇటు అరంగేట్రంలోనే టెస్టు సెంచరీతో తానేంటో నిరూపించాడు. ఇక భారత బ్యాటింగ్ భారాన్ని ప్రధానంగా మోయాల్సింది వీరిద్దరే. రెండు పుష్కరాల మాస్టర్ ప్రస్థానం ముగిసింది. ఇక ఓవర్ టు యు గైస్... -
ఇక చాలు... ఆపండి!
ఇది సచిన్‌ను ఎవరైనా అన్న మాట కాదు. సచిన్ తన రిటైర్మెంట్ ప్రకటన ద్వారా విమర్శకులకు చెప్పిన జవాబు. రెండేళ్లుగా సచిన్ విఫలమవుతున్న మాట వాస్తవం. గతంలోలా సంచలన ఇన్నింగ్స్ ఆడటం లేదన్నదీ నిజం. 16 ఏళ్ల వయసులో, 30 ఏళ్లకు పరిణతి సాధించిన సమయంలో ఆడే షాట్లు... 40 ఏళ్లు దాటాక ఆడటం ఎవరికైనా కష్టమే. సచిన్ రిటైర్మెంట్ గురించి దశాబ్ద కాలంగా అతను విఫలమైన ప్రతిసారీ చర్చ జరుగుతూనే ఉంది. ప్రతిసారీ మైదానంలో ప్రదర్శనతోనే దానికి సమాధానం చెబుతూ వచ్చాడు. వన్డే ప్రపంచకప్ గెలిచాక సచిన్ వైదొలుగుతాడంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత కూడా ఆడి వందో అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. గత డిసెంబరులో వన్డేలకు వీడ్కోలు చెప్పాక... కనీసం ఓ రెండు మూడేళ్లు మళ్లీ ఆడతాడనే అంచనా ఏర్పడింది. కానీ... ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో వైఫల్యంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా... పదేపదే క్లీన్ బౌల్డ్ కావడంతో కాస్త ఈ జోరు పెరిగింది. మరో 2 టెస్టులు ఆడితే 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. కాబట్టి ఈ రికార్డు పూర్తి కాగానే వీడ్కోలు చెబుతాడు (చెప్పాలి) అంటూ విమర్శకులు గళమెత్తారు. ఈ లోగా బోర్డు స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను ఏర్పాటు చేసింది. కాబట్టి ఇదే ఆఖరంటూ ప్రచారం జరిగింది. దీనిపై పత్రికలు పలు కథనాలు రాశాయి. కానీ బోర్డు ప్రతిసారీ వీటిని ఖండించింది. ‘ఎప్పుడు రిటైరవ్వాలో నిర్ణయించుకోవాల్సింది సచిన్’ అని బోర్డు స్పష్టం చేసింది. తన ఆటతీరుపై సచిన్‌కు పూర్తిగా అవగాహన ఉంది. తన ఫిట్‌నెస్‌పై అంచనా ఉంది. కాబట్టి ‘ఇక చాలు’ అనే నిర్ణయం సచిన్ తీసుకున్నాడు. నిజానికి చాంపియన్స్ లీగ్ సమయంలోనూ మాస్టర్ దీని గురించి ఆలోచించలేదు. లీగ్ ముగిసిన నాలుగు రోజులు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించిన మాస్టర్... వేరే ఎవరూ మాట్లాడే అవకాశం లేకుండా ప్రకటన చేశాడు. కోట్లాది మంది అభిమానులను బాధపెట్టాడు. చల్తే...చల్తే... ...మేరే యే ‘రన్’ యాద్ రఖ్నా! రాజ్‌సింగ్ దుంగార్పూర్, ఆకాశ్ లాల్, రమేశ్ సక్సేనా, గుండప్ప విశ్వనాథ్, నరేన్ తమ్హానే...వీరంతా ఎవరనుకుంటున్నారా! భారతదేశానికి ఈ ఐదుగురు మహోపకారం చేశారు. 16 ఏళ్ల సచిన్‌ను భారత జట్టులోకి ఎంపిక చేసిన సెలక్టర్లు వీరే. అంతకు ముందు ఏడాదే తాను ఆడిన తొలి రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లలో సచిన్ సెంచరీలతో చెలరేగడంతో వయసు గురించి పట్టించుకోకుండా సత్తా ముఖ్యమంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అది మొదలు భారత క్రికెట్ ఒక కొత్త మలుపు తీసుకుంది. 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు...ఒకటా, రెండా ఎన్నని లెక్కించగలం. జట్టును గెలిపించినవి కొన్నయితే, జట్టును కష్టాలనుంచి రక్షించినవి మరికొన్ని...ఇవేవీ కాదు ఫలితం ఎలా ఉన్నా అభిమానులను అలరించినవి మరికొన్ని. వాటిలోంచి ఏది గొప్ప అంటే చెప్పడం కష్టం. కానీ టెస్టు క్రికెట్లో కొన్ని మ్యాచ్‌లు ఎప్పటికీ అలా మదిలో నిలిచిపోయే ఉంటాయి. -
సచిన్ రిటైర్మెంట్పై మీరేమంటారు?
న్యూఢిల్లీ: సమకాలిన క్రికెట్ శిఖర సమానుడిగా వెలుగొందుతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రీడా జీవితం ముగియనుంది. 200వ టెస్టు ఆడిన తర్వాత క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగుతానని బీసీసీఐ సచిన్ వర్తమానం పంపాడు. దీంతో ఇన్నాళ్లు సచిన్ రిటైర్ మెంట్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మాస్టర్ వైదొలగడానికి ఇదే సరైన సమయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే సచిన్ ఇంకా ఆడాలని కోరుకుంటున్న అభిమానులు లేకపోలేదు. సచిన్ రిటైర్మెంట్పై మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. -
ఇప్పుడే చెప్పలేను! రిటైర్మెంట్పై సచిన్ స్పందన
ముంబై: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే సొంత గడ్డపై వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఖరారు కావడంతో మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్పై మరో సారి చర్చ ప్రారంభమైంది. ఈ సిరీస్ తర్వాతే సచిన్ వీడ్కోలు చెప్పవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై సచిన్ ఏకవాక్యంలో తన మనసులో మాట వెల్లడించాడు. ‘ప్రస్తుతానికి నేను ఈ అంశంపై స్పందించను. ఒక టెస్టు మ్యాచ్ తర్వాతే మరో టెస్టు గురించి ఆలోచిస్తా’ అని స్పష్టం చేశాడు. ఈ వాక్యంలో వేర్వేరు అర్థాలు ధ్వనిస్తున్నాయి. ముంబైలో ఆఖరి టెస్టులో భారీ సెంచరీతో వీడ్కోలు పలకాలన్న కోరిక కావచ్చు...లేదా దక్షిణాఫ్రికా బౌన్సీ వికెట్లపై ఆడగల సత్తా తనలో ఇంకా ఉందనీ కావచ్చు. ఈ దిశగా ఒక్కో టెస్టును ఎంచుకుంటూ కెరీర్‌ను పెంచుకునే ఆలోచనతో కూడా మాస్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 2011 జనవరిలో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన తర్వాత సచిన్ గత 38 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒక్క శతకం కూడా చేయలేదు.