మనసు మాట విన్నాను : సచిన్ | Sachin Tendulkar says his body told him to retire | Sakshi
Sakshi News home page

మనసు మాట విన్నాను : సచిన్

Published Mon, Nov 18 2013 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM

మనసు మాట విన్నాను : సచిన్

మనసు మాట విన్నాను : సచిన్

ఆట ముగిసింది... ఇక ఆ తర్వాత ఏమిటి... సచిన్ రిటైర్మెంట్ తర్వాత అనేక రకాల చర్చలు. వాంఖడేలో శనివారం తన ప్రసంగంతో అభిమానులతో కన్నీరు పెట్టించిన మాస్టర్... ఆదివారం మీడియా ముందుకు వచ్చి మరిన్ని విషయాలు పంచుకున్నాడు.  వేర్వేరు అంశాలపై మనసు విప్పి మాట్లాడాడు. ఇన్నేళ్ల కెరీర్... ఎత్తుపల్లాలు...  భవిష్యత్తు... ఇలా అనేక విషయాలపై ఒక ప్రవాహంలా మీడియా సమావేశం సాగిపోయింది.
 
 ముంబై: క్రికెట్ నుంచి తాను రిటైర్ కావడానికి ఇదే సరైన సమయంగా భావించినట్లు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ఈ నిర్ణయం తనను బాధించలేదని అతను అన్నాడు. ఇంకా ఆడాలని అనిపిస్తున్నా తన శరీరం సహకరించకపోవడమే తప్పుకోవడానికి కారణమని మాస్టర్ చెప్పాడు. ఆదివారం విలేకరుల ముందుకు వచ్చిన సచిన్ క్రికెట్ మొదలు కుటుంబం వరకు అనేక విషయాలు పంచుకున్నాడు. సచిన్ మనోభావాలు అతని మాటల్లోనే....
 
 
 రిటైర్మెంట్ నిర్ణయంపై..
 నేను ఇకపై క్రికెట్ ఆడలేననే బాధ లేదు. ఇదో కలల ప్రయాణం. ఆటను వీడుతున్నందుకు ఎలాంటి చింతా లేదు. తప్పుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. దీనిపై నన్ను నేను ప్రశ్నించుకుంటే రిటైర్ కావాలనే సమాధానం వచ్చింది. నేను ఆటను ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. నేను ఆడలేనని అనుకున్న రోజున తప్పుకుంటాననే గతంలోనే చెప్పాను. ఇప్పుడు నాకు అలా అనిపించింది. ఇంతకంటే ఎక్కువ బరువు నా వల్ల కాదంటూ... మరింత భారం మోయలేనంటూ శరీరం సంకేతాలిస్తుంది. దానికి విశ్రాంతి అవసరం. ఇంతకు ముందు ప్రాక్టీస్ ఆటోమేటిక్‌గా సాగిపోయేది. కానీ దానిని కొనసాగించాలంటే తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
 
 దాచుకోలేకపోయాను
 మైదానంలో చివరి క్షణాలు చాలా ఉద్వేగభరితం. రిటైర్మెంట్ గురించి ఆలోచించినప్పుడు  ఇంత భావోద్వేగానికి గురి కాలేదు. ఎందుకంటే అది సరైందేనని అప్పుడు భావించాను. కానీ ఆటగాళ్లు నాకు ఇచ్చిన వీడ్కోలు తర్వాత ఒక్కసారిగా నాలో భావోద్వేగాలు చెలరేగాయి. సాధారణంగా నేను ఆ తరహాలో బయట పడను. కానీ నేను ఇంత మంది ప్రేక్షకుల మధ్య ఇకపై భారత్‌కు ఆడలేననే బాధ నాకు కన్నీళ్లు తెప్పించింది. నా చేతిలో ఇకపై బ్యాట్ ఉండదని భావించిన క్షణమది. డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళుతున్నప్పుడు విండీస్ ఆటగాళ్లు ఎవరితో కరచాలనం చేశానో కూడా కనిపించలేదు. ఎందుకంటే అప్పుడు నా కళ్లల్లో నీళ్లు ఉన్నాయి! ప్రేక్షకులు వాటిని చూడొద్దని అనుకున్నాను. ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉందో మాటల్లో చెప్పలేను.
 
 అమ్మ కోసమే...
 మా అమ్మ నా ఆట చూడాలన్న కోరికతోనే ఆఖరి టెస్టును ముంబైలో నిర్వహించమని బీసీసీఐకి విజ్ఞప్తి చేశా. ఈ విషయం చెప్పకుండా ఆమెను ఆశ్చర్యపరుద్దామని అనుకున్నా. కానీ మీడియా ద్వారా అమ్మకు తెలిసిపోయింది. అందుకే ఈ మ్యాచ్ నాకు ఎంతో ప్రత్యేకం. నేను ఆడిన ఒక్క బంతిని కూడా ఆమె అంతకు ముందు చూడలేదు.  నేను చేసిన 74 పరుగులతో ఆమె ఎంతో సంతోషించింది.  నా ప్రదర్శనను బట్టి వారి స్పందన మారలేదు. ఎంత స్కోరు చేసినా తల్లిదండ్రులు, కొడుకును చూసే తీరులో ఎలాంటి తేడా రాలేదు.
 
 అన్నయ్య ప్రత్యేకం...
 నేను దేశానికి ఆడటంలో నా అన్నయ్య అజిత్ పాత్ర గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆఖరి రోజు అతను కూడా ఎంతో ఉద్వేగానికి గురైనా బయటపడలేదు.  రిటైర్మెంట్‌ను దేవుడు నిర్ణయించాడు. అజిత్ కూడా అదే భావించాడు. అయితే నేను రిటైర్ కావడం, అభిమానుల స్పందన చూసి అతను కూడా సంతృప్తి చెందాడు.
 
 అమ్మలందరికీ అంకితం...
 అత్యుత్తమ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉంది. నా కోసం పడిన శ్రమకు మా అమ్మకు అంకితమిస్తున్నానని శనివారం చెప్పాను. కానీ ఇది భారతదేశంలోని అందరు అమ్మలకు అంకితం. తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లులందరితో ఈ అవార్డును పంచుకోవాలనుకుంటున్నా. నాతో పాటు అవార్డుకు ఎంపికైన సీఎన్‌ఆర్ రావుకు కూడా నా అభినందనలు. భారతరత్న గురించి తెలియగానే నాకు మాట రాలేదు. కానీ అంజలి మాత్రం ఎగిరి గంతేసింది. నాకు అవార్డు రావడంతో ఇకపై క్రీడాకారులకు ఇచ్చేందుకు అవకాశం కలిగింది. భవిష్యత్తులో దేశానికి కీర్తి తెచ్చే ఉత్తమ క్రీడాకారులు, క్రీడాకారిణులు దీనిని అందుకోవాలని కోరుకుంటున్నా. భారతీయులందరి తరఫున నేను దీనిని స్వీకరిస్తున్నా.
 
 కొత్త కొత్తగా...
 ‘ఉదయం 6.50 గంటలకు నిద్ర లేచాను. అంత తొందరగా స్నానం చేయాల్సిన అవసరం లేదనిపించింది. టీ
 తాగాను...ఆ తర్వాత భార్యతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాను. ఉదయం సమయమంతా చాలా ప్రశాంతంగా గడిచింది. చాలా మంది నాకు మెసేజ్‌లు ఇచ్చారు. వాటికి సమాధానం ఇస్తూ చాలా సమయం గడిపాను.’
 
 18వ ర్యాంక్‌తో ముగింపు
 ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంతో సచిన్ తన కెరీర్‌ను ముగించాడు. విండీస్‌తో సిరీస్‌కు ముందు మాస్టర్ 24వ ర్యాంక్‌లో ఉన్నాడు
 
  అర్జున్ గురించి...
 అతడిని ఒంటరిగా వదిలేయమని ఒక తండ్రిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక స్థాయి వరకు ఆడాను కాబట్టి అతను కూడా అలాగే ఆడాలని కోరుకోవద్దు. మా నాన్న ప్రొఫెసర్. మీ అబ్బాయి కలం ఎందుకు పట్టలేదని ఆయన్ను ప్రశ్నించలేదు కదా! అర్జున్ క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడన్నది నిజం. నేను అతనిపై ఎలాంటి ఒత్తిడి పెంచదల్చుకోలేదు.
 
  విమర్శకులపై...
 ఆరంభంలో కొంత కాలం ఏం రాశారో, ఏం రాయలేదో నేను చూసేవాడిని. అయితే ఆ తర్వాత ప్రతీ ఒక్కరికి తమ అభిప్రాయాలు ఉంటాయని, ఎవరి విమర్శలు స్వీకరించాలో, వేటిని పట్టించుకోకూడదో అర్థం చేసుకుంటూ వచ్చాను. కాబట్టి వాటిని ఎక్కువగా పట్టించుకోలేదు. ఎందుకంటే నన్ను సరైన దిశలో నడిపించేవారు నా చుట్టూనే ఉన్నారు. వారిలో బ్యాట్ పట్టినవారే తప్ప ఎవరూ ‘రాతలు రాసినవారు’ కాదు. కాబట్టి వారి సహకారంతో  పరుగులు సాధించడంపైనే దృష్టి పెట్టాను.
 
 సహచరులపై...
 నా జట్టు సభ్యులలో ప్రతీ ఒక్కరి ప్రదర్శనను నేను ఎంజాయ్ చేశాను. టీమ్ గేమ్‌లో ఎవరు బాగా ఆడారన్నది ముఖ్యం కాదు. ఇద్దరు, ముగ్గురు అద్భుతంగా ఆడితే మిగతా వారు అతనికి సహకరించడం సహజం. కొత్త తరంలోని ఆటగాళ్లందరితో కలిసి ఆడగలిగాను. నా అనుభవాలు వారితో పంచుకున్నాను. నేను ఆడటం మొదలు పెట్టినప్పుడు భువనేశ్వర్ ఇంకా పుట్టలేదు కూడా. నేను డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చినప్పుడు ‘గుడ్‌మార్నింగ్ సర్’ అనాలని కొంత మందితో సరదాగా జోక్ చేసేవాడిని.
 
 కీలక క్షణాలు...
 రెండేళ్ల క్రితం వన్డే ప్రపంచ కప్ నెగ్గడమే నా దృష్టిలో అత్యుత్తమ క్షణం. దాని కోసం నేను 22 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. శనివారం ప్రేక్షకులు మైదానంలో స్పందించిన ఘట్టం కూడా ఎంతో ప్రత్యేకం. 2003 ప్రపంచకప్‌లో మేం చాలా అద్భుతంగా ఆడినా ఫైనల్లో ఓడిపోవడం బాధించిన క్షణం. అది నన్ను చాలా రోజులు వెంటాడింది.
 
 వెల్‌డన్ సచిన్...
 అచ్రేకర్ సర్ నేను బాగా ఆడానని ఎప్పుడూ మెచ్చుకోలేదు. మేం ఎప్పుడైనా బాగా ఆడి ఈ సారైనా అంటారేమో అని ఎదురు చూసేవాళ్లం. కానీ అది జరగలేదు. ఆటగాడికంటే ఎప్పుడైనా ఆటే గొప్ప అని ఆయన చెప్పిన మాటనే నేను గౌరవించాను. అందుకే ఇప్పుడు ఆయన నన్ను అభినందించవచ్చని నా ప్రసంగంలో కోరాను. భారతరత్న ప్రకటించగానే సర్ నాకు కాల్ చేసి ‘వెల్‌డన్’ అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇలాంటి వార్తను మీకు ఇష్టమైనవారితో పంచుకున్నప్పుడు ఆనందం రెట్టింపవుతుంది.
 
 కెరీర్‌లో గాయాలు...
 నా 24 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సవాళ్లు వచ్చాయి. కానీ దేశానికి ఆడాలన్న కోరిక బలంగా ఉండటంతో వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాను. ముఖ్యంగా గాయాలను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాను. వాటిని అధిగమించి మళ్లీ ఆడటం అంత సులభం కాదు. టెన్నిస్ ఎల్బోతో నాలుగు నెలలు దూరమయ్యాను. అర్జున్ ఆడే ప్లాస్టిక్ బ్యాట్ కూడా పట్టుకోలేకపోయేవాడిని. కొన్ని సందర్భాల్లో నేను ఇంకెప్పుడూ ఆడలేనని కూడా అనిపించింది.
 అది నా జీవితంలో అత్యంత క్లిష్టదశ.
 
 పిచ్‌కు నమస్కరించడం
 నన్ను ఈ స్థాయికి చేర్చిన ఆటకు కృతజ్ఞతలు చెప్పడంలో భాగంగానే అలా చేశాను. 22 గజాల ఆ పిచ్‌పైనే నా జీవితం ఆరంభమైంది. నాకు అన్నీ ఇచ్చిన ఆ పిచ్ నాకు దేవాలయంవంటిది. జీవితంలో ఇంకెప్పుడూ పిచ్ దగ్గరకు వెళ్లలేనని, అలా మొక్కలేనని తెలుసు. అందుకే దానికి నమస్కరించాను.
 
 తప్పుకున్న తర్వాత...
 క్రికెట్ నా జీవితం. అది నాకు ఆక్సిజన్‌వంటిది. 40 ఏళ్ల నా జీవితంలో 30 ఏళ్లపాటు... అంటే 75 శాతం క్రికెట్టే ఆడాను. కాబట్టి భవిష్యత్తులోనూ ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది. అయితే అది ఇప్పుడేకాదు. నేను రిటైర్ అయి 24 గంటలే అయింది. కనీసం నాకు 24 రోజులు విశ్రాంతి తీసుకునే సమయం ఇవ్వండి. నేను క్రికెట్ ఆడకపోయినా, జట్టులో సభ్యుడిని కాకపోయినా ఎప్పుడూ భారత జట్టు కోసమే ప్రార్థిస్తా. రిటైర్మెంట్‌కు ముందు కూడా నేను యువ ఆటగాళ్లకు సూచనలిస్తూ ఆట గురించే మాట్లాడేవాడిని. వాటి ద్వారా నేను కూడా చాలా నేర్చుకున్నాను. దీని కోసం ప్రత్యేకంగా అకాడమీ పెట్టాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోకి కూడా వచ్చే ఆలోచన లేదు. ఒక క్రికెటర్‌గానే నేను గుర్తుండాలని కోరుకుంటున్నా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement