యువ హోరు షురూ | young batmen glitz in team india | Sakshi
Sakshi News home page

యువ హోరు షురూ

Published Tue, Dec 24 2013 12:39 AM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM

యువ హోరు షురూ - Sakshi

యువ హోరు షురూ

 చరిత్రలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం లాగా... క్రికెట్‌లోనూ సచిన్‌కు పూర్వం.. సచిన్ శకం... సచిన్ తర్వాత... అనే మూడు దశలు ఉన్నాయి. ఇందులో మూడో దశ మొదలైంది ఈ ఏడాదే. 2013 క్రికెట్ అభిమానులకు కావలసినంత వినోదాన్నిచ్చింది. అదే సమయంలో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్‌తో అభిమానులను కన్నీరు పెట్టించింది. చాంపియన్స్ ట్రోఫీలో విజయంతో ధోనిసేన ఈ ఏడాదిని చిరస్మరణీయంగా మార్చింది. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌తో ఆట మీద దెబ్బ పడుతుందేమో అని భయపడినా... యువ క్రికెటర్లు తమ అసమాన ఆటతీరుతో దేశంలో ఆట ప్రతిష్టను  కాపాడారు.
 
 సచిన్ రిటైర్మెంట్... రోహిత్ శర్మ డబుల్ సెంచరీ... వన్డేల్లో ధోనిసేన వరుస విజయాలు... స్వదేశంలో టెస్టుల్లో తిరుగులేని ప్రదర్శన... విరాట్ కోహ్లి సూపర్ ఫామ్... ఇలా 2013లో భారత క్రికెట్‌లో చెప్పుకోదగ్గ అంశాలు చాలానే ఉన్నాయి. ఏడాది ఆరంభం నుంచి చివరి వరకు విరామం లేని క్రికెట్‌తో ఎప్పటిలాగే క్రికెటర్లు బిజీబిజీగా గడిపారు. ఐపీఎల్ సమయంలో వెలుగులోకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం దేశంలో పెద్ద కలకలం. శ్రీశాంత్ లాంటి పేరున్న బౌలర్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇది పెద్ద మచ్చే అయినా... మొత్తం మీద ఈ ఏడాది భారత క్రికెట్ సరైన దిశలోనే నడిచిందని అనుకోవాలి. ఇక మిగిలిన దేశాల క్రికెట్‌లోనూ హడావుడి బాగానే ఉంది. యాషెస్ రెండు సార్లు జరగడంతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బిజీబిజీగా మారాయి. ఈ ఏడాది క్రికెట్‌లో విశేషాలు...      - సాక్షి క్రీడావిభాగం
 
 ముగిసిన సచిన్ శకం
 16 నవంబరు 2013... భారత దేశంలో కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కన్నీరు పెట్టిన రోజు. రెండు దశాబ్దాలకు పైగా అలుపెరగని యోధుడిలా క్రికెట్ మైదానంలో పోరాడుతూ... అవిశ్రాంతంగా అభిమానులను అలరించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతరాత్మ ప్రబోధానుసారమే రిటైర్మెంట్ నిర్ణయం ఉంటుందని పలు సందర్భాల్లో చెప్పిన సచిన్... తన వీడ్కోలు అంశాన్ని నెల రోజుల ముందే ప్రకటించాడు. తన దగ్గరి నుంచి ప్రకటన వచ్చిన క్షణం నుంచి... వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసేవరకు సచిన్ మేనియాతో దేశం ఊగిపోయింది. తన సొంతగడ్డ ముంబైలో తల్లి, భార్య, పిల్లలు, సన్నిహితులు, అభిమానుల మధ్య మాస్టర్ 200వ టెస్టు మ్యాచ్ ఆడాడు. క్రికెట్‌లో తనకే సాధ్యమైన చక్కటి షాట్లు ఆడి చివరిసారిగా అభిమానులను ఆటతో అలరించాడు. వెస్టిండీస్‌పై సిరీస్‌ను ధోని అండ్ కో క్లీన్‌స్వీప్ చేసి...మాస్టర్‌కు వీడ్కోలు పలికారు. భారమైన హృదయంతో అభిమానులను ఉద్దేశించి ప్రసంగించి... చివరిసారి పిచ్‌కు నమస్కరించి కన్నీళ్లతో క్రికెట్ ‘దేవుడు’ వెళ్లిపోతున్న దృశ్యం... అది చూసిన వాళ్లందరికీ ఎప్పటికీ ఓ జ్ఞాపకం.
 
 రోహిత్ ‘డబుల్’
 వన్డేల్లో డబుల్ సెంచరీ అనే కలను ఈ ఏడాది రోహిత్ సాకారం చేసుకున్నాడు. సచిన్, సెహ్వాగ్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన వన్డేలో విశ్వరూపం చూపించి 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి.
 
 ధోని ధమాకా
 వెస్టిండీస్‌లో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో భారత కెప్టెన్ ధోని సంచలనాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 145/5 స్కోరుతో నిలిచింది. ఆ సమయంలో ధోని స్కోరు 2 పరుగులు! ఈ దశలో టెయిలెండర్ల సహకారంతో చివరి వరకు నిలిచి ధోని ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. గెలిచేందుకు కావాల్సిన 57 పరుగులలో ధోని ఒక్కడే 43 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా, ధోని వరుసగా 6,4,6 బాదడంతో ఒక వికెట్ తేడాతో భారత్ సంచలన విజయం సాధించింది.  
 
 భారీ చేజింగ్
 ఆస్ట్రేలియాతో జైపూర్‌లో జరిగిన వన్డేలో భారత్ 360 పరుగుల లక్ష్యాన్ని ఊదిపారేసింది. రోహిత్ శర్మ (141 నాటౌట్), విరాట్ కోహ్లి (100 నాటౌట్) శతకాలతో పాటు ధావన్ (95) చెలరేగడంతో 43.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి భారత్ ఈ స్కోరును అందుకోవడం విశేషం. భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ (52 బంతుల్లో) చేసిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.
 
 ‘స్పాట్’ పెట్టారు
 ఈ ఏడాది భారత క్రికెట్‌కు అతి పెద్ద మచ్చ స్పాట్ ఫిక్సింగ్. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, చండిలా, చవాన్ ‘స్పాట్ ఫిక్సింగ్’కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వీరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మే 17న ఈ ఉదంతం బయటకు వచ్చింది. అటు ఐపీఎల్ జట్ల యజమానులు కూడా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం ఉదంతంపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. శ్రీశాంత్, చండిలా, చవాన్ ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్నారు. కానీ బోర్డు నుంచి నిషేధం ఎదుర్కొంటున్నారు. శ్రీశాంత్‌పై బోర్డు జీవితకాల నిషేధం విధించింది.
 
 కొత్త సంచలనాలు
 ఈ ఏడాది భారత క్రికెట్‌లో కొత్తగా సంచలనాలు సృష్టించిన క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్. వన్డేల్లో రెండు కొత్త బంతులు నిబంధనను అందరికంటే బాగా ఉపయోగించుకున్న బౌలర్ భువనేశ్వర్. తన స్వింగ్ బౌలింగ్‌తో ఈ ఏడాది భారత్ వన్డేల్లో విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అటు శిఖర్ ధావన్ టెస్టుల్లో అరంగేట్రంలోనే చెలరేగిపోయాడు.
 
 ఆ ‘త్రయం’ మిస్!
 ఈ ఏడాది భారత క్రికెట్‌లో అతి పెద్ద మిస్సింగ్ సెహ్వాగ్, గంభీర్, హర్భజన్. దాదాపు దశాబ్దానికి పైగా భారత క్రికెట్‌లో భాగంగా ఉన్న హర్భజన్, సెహ్వాగ్ జట్టులో స్థానం కోల్పోయారు. సీజన్ ఆరంభంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆడినా... ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయారు. ఫామ్ కోల్పోయిన స్టార్ క్రికెటర్ గంభీర్ ఈ ఏడాది వన్డేల్లో కనిపించినా ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయాడు.
 
 చివరిసారి మనమే...
 ఇంగ్లండ్‌లో ఈ ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో ఇక ఈ మెగా టోర్నీకి మంగళం పాడేశామని ఐసీసీ ప్రకటించింది. అయితే టెస్టు చాంపియన్ షిప్‌పై సందేహాలు పెరిగిన నేపథ్యంలో భవిష్యత్‌లో మళ్లీ ఈ టోర్నీ తెరమీదకు వస్తుందేమో తెలియదు. ఇక ఇదే చివరిసారి అని చెప్పిన ఏడాదిలో ధోనిసేన  టైటిల్ సాధించింది. లీగ్ దశలో పాకిస్థాన్‌ను ఓడించి సెమీస్‌కు చేరిన భారత్... అక్కడ శ్రీలంకను చిత్తు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఫైనల్ వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌గా మారింది. తొలుత భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు కేవలం 129 పరుగులు చేసి... అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను 124/8 స్కోర్‌కు నియంత్రించి టైటిల్ సాధించింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన శిఖర్ ధావన్ (363) గోల్డెన్ బ్యాట్ అవార్డు గెలుచుకోగా... ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు గోల్డెన్ బాల్ అవార్డు లభించింది.
 
 వన్డేల్లో సిక్సర్... టెస్టుల్లో స్వీప్!
 భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది స్ఫూర్తిదాయకంగా ఆడింది. చాంపియన్స్ ట్రోఫీతో సహా మొత్తం ఎనిమిది వన్డే టోర్నీలు/సిరీస్‌లు ఆడిన ధోనిసేన ఏకంగా ఆరుసార్లు విజయం సాధించింది. ఏడాది ఆరంభంలో పాకిస్థాన్‌తో 1-2తో సిరీస్‌ను కోల్పోయిన భారత్... చివరగా దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌లోనూ 0-2తో ఓడింది. ఈ మధ్యలో మాత్రం సిక్సర్ కొట్టింది. ఇంగ్లండ్‌తో స్వదేశంలో 3-2తో సిరీస్ గెలిచింది. చాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి... వెస్టిండీస్‌లో జరిగిన ముక్కోణపు టోర్నీలో ఫైనల్లో లంకను ఓడించి టైటిల్ సాధించింది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి కోహ్లి సారథ్యంలో జింబాబ్వే వెళ్లి 5-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశారు. మళ్లీ స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఏడు వన్డేల సిరీస్‌ను 3-2తో గెలిచారు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో 2-1తో విజయం సాధించారు.
 
 ఇక టెస్టుల విషయానికొస్తే ఈ ఏడాది తక్కువగానే ఆడారు. ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 4-0తో క్లీన్‌స్వీప్ చేసి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని గెలిచారు. నవంబరులో వెస్టిండీస్‌తో జరిగిన సచిన్ వీడ్కోలు సిరీస్‌నూ 2-0తో స్వీప్ చేశారు.
 
 ‘చాంపియన్’ ముంబై
 ఈ ఏడాది అదరగొట్టే ఆటతీరుతో ముంబై ఇండియన్స్ జట్టు అటు ఐపీఎల్, ఇటు చాంపియన్స్ లీగ్‌లోనూ విజేతగా నిలిచింది. ఐపీఎల్‌లో ప్రత్యేకంగా కెప్టెన్సీ కోసం పాంటింగ్‌ను పిలిపించుకున్నారు. కానీ రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక జట్టు ఒక్కసారిగా కొత్తగా కనిపించింది. తన నాయకత్వ ప్రతిభతో రోహిత్ రెండు టోర్నీల్లోనూ ఆకట్టుకున్నాడు. చెన్నైను కంగుతినిపించి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ముంబై ... చాంపియన్స్ లీగ్ ఫైనల్లో రాజస్థాన్‌ను చిత్తు చేసింది.
 
 ‘యాషెస్’ రెండుసార్లు

 ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ప్రతీకార పోరుగా భావించే ‘యాషెస్’ ఈ ఏడాది రెండుసార్లు జరిగింది. వన్డే ప్రపంచకప్ ఏర్పాట్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గానే ఒకే ఏడాది రెండుసార్లు ఈ సిరీస్ నిర్వహించారు. ఆగస్టులో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో గెలుచుకుంది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే క్లార్క్‌సేన 3-0తో యాషెస్‌ను సాధించింది.
 
 మిగిలిన దేశాలలో చెప్పుకోదగ్గ సంచలనాలు ఏమీ లేవు. దక్షిణాఫ్రికా టెస్టుల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ దూసుకుపోతోంది. శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌ల నుంచి సంచలన ఫలితాలేమీ రాలేదు. అఫ్ఘానిస్థాన్ జట్టు వన్డే ప్రపంచకప్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడం చిన్న దేశాల విషయంలో చెప్పుకోదగ్గ ఘనత. అన్నిటికంటే పెద్ద ట్విస్ట్... నేపాల్ జట్టు టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడం.
 
 ఈ ఏడాది టాపర్స్
 
 టెస్టులు
 అత్యధిక వికెట్లు: స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్-59 వికెట్లు)
 అత్యధిక పరుగులు: మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా - 1077 పరుగులు)
 అత్యధిక విజయాలు (జట్టు): ఆస్ట్రేలియా (13 టెస్టుల్లో 7 విజయాలు)
 
 వన్డేలు
 అత్యధిక వికెట్లు: అజ్మల్ (పాకిస్థాన్- 56 వికెట్లు)
 అత్యధిక పరుగులు: మిస్బావుల్ (పాకిస్థాన్- 1322 పరుగులు)
 అత్యధిక విజయాలు (జట్టు): భారత్ (34 వన్డేల్లో 22 విజయాలు)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement