‘గాబా’లో నగుబాటు... | Fiery Johnson knocks India out | Sakshi
Sakshi News home page

‘గాబా’లో నగుబాటు...

Published Sun, Dec 21 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

‘గాబా’లో నగుబాటు...

‘గాబా’లో నగుబాటు...

 రెండో టెస్టులో భారత్‌కు పరాభవం
 4 వికెట్లతో గెలిచిన ఆస్ట్రేలియా
 రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన టీమిండియా
 సిరీస్‌లో 2-0తో ఆసీస్ ముందంజ
 

 అనూహ్యం... అవమానకరం!  భారీ స్కోరు చేసి ఐదో రోజు ప్రత్యర్థికి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందని భావించిన భారత్ ఒక్కసారిగా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా పరుగులు చేసి కూడా నాలుగు రోజుల్లోపే ఓటమి పాలైంది. కనీస ప్రతిఘటన ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్ దాసోహమనడంతో జట్టు ఖాతాలో మరో ఓటమి చేరింది.
 
 11 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు... నాలుగో రోజు ఆట ఆరంభంలో భారత్ పరిస్థితి ఇది. ఇక ఆ తర్వాత కోలుకునే అవకాశమే దక్కలేదు. సిరీస్‌లో ఇప్పటి వరకు ప్రభావం చూపని జాన్సన్, కీలక సమయంలో తన సత్తా చాటడంతో భారత్ చేతులెత్తేసింది. ఫలితంగా జట్టు కనీసం 70 ఓవర్లు కూడా ఆడలేకపోయింది.
 
 స్వల్ప లక్ష్యమే అయినా... వరుస వికెట్లతో ఆసీస్‌ను భారత్ ఒత్తిడిలోకి నెట్టగలిగినా, విజయం మాత్రం సాధ్యం కాలేదు. మరో 50 పరుగులు అదనంగా చేసినా మనోళ్లకు అదృష్టం కలిసొచ్చేదేమో... తొలి ఇన్నింగ్స్ 97 పరుగుల విలువేమిటో ఇక్కడే కనిపించింది.


 ‘ఎంత దగ్గరికొచ్చామన్నది కాదు... వాస్తవంగా ఏం జరిగింది అనేదే ముఖ్యం’... మ్యాచ్ తర్వాత ధోని వ్యాఖ్య ఇది. ధావన్ ‘గాయం’ గురించి చెప్పినా... కుర్రాళ్లు ఇంకా నేర్చుకుంటు న్నారని వాదించినా... జట్టు ప్రదర్శన మాత్రం పేలవంగా ఉందనేది కెప్టెన్‌కూ తెలుసు. అసలు ఓటమి ఆలోచనే రాని చోట మన జట్టు పరాజయం పాలుకావడం నిజంగా విశేషం.
 
 బ్రిస్బేన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఊహించని రీతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. నాలుగో రోజు ఆట ఆరంభానికి ముందు పటిష్ట స్థితిలోనే కనిపించిన జట్టు పేలవమైన బ్యాటింగ్‌తో చేజేతులా పరాజయం కొనితెచ్చుకుంది. శనివారం నాలుగో రోజే ముగిసిన ఈ టెస్టులో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 71/1తో ఆట ప్రారంభించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 64.3 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (145 బంతుల్లో 81; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, పుజారా (93 బంతుల్లో 43; 7 ఫోర్లు), ఉమేశ్ యాదవ్ (42 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కొద్దిగా పోరాడగలిగారు. ఇతర  97 పరుగుల ఆధిక్యాన్ని మినహాయిస్తే ఆసీస్ ముందు కేవలం 128 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
 
  దీన్ని ఛేదించడంలోనూ తడబడిన ఆసీస్ ఎట్టకేలకు 23.1 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రోజర్స్ (57 బంతుల్లో 55; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్మిత్ (39 బంతుల్లో 28; 4 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. తాజా ఫలితంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఆ జట్టు సిరీస్ ఓడిపోయే అవకాశం లేదు. ఇరు జట్ల మధ్య మూడోదైన ‘బాక్సింగ్ డే’ టెస్టు ఈ నెల 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.
 
 ఆ క్యాచ్ పట్టుంటే..!
 స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ స్కోరు 63/2... ఇంకా సగం దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ సమయంలో స్మిత్ 9 పరుగులతో ఆడుతున్నాడు. అయితే ఆరోన్ బౌలింగ్‌లో మూడో స్లిప్‌లో స్మిత్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కోహ్లి నేలపాలు చేశాడు. అక్కడే స్మిత్ అవుటై ఉంటే మ్యాచ్ పరిస్థితి మారేదేమో.
 
 సెషన్-1: టపటపా
 నాలుగో రోజు ఆటకు ముందు ప్రాక్టీస్‌లో తగిలిన గాయంతో ధావన్ రాకపోవడంతో పుజారాకి జతగా కోహ్లి క్రీజ్‌లోకి దిగాడు. అయితే ఆట నాలుగో ఓవర్లోనే అద్భుత బంతితో కోహ్లి (1)ను బౌల్డ్ చేసిన జాన్సన్, భారత్ పతనానికి పరదా తీశాడు. తన తర్వాతి ఓవర్లోనే రహానే (10), రోహిత్ (0)లను కూడా జాన్సన్ అవుట్ చేశాడు. మరుసటి ఓవర్లో హాజల్‌వుడ్ చక్కటి బంతికి ధోని (0) వెనుదిరగడంతో భారత్ తీవ్ర కష్టాల్లో పడింది. అశ్విన్ (19) కొద్దిగా పోరాడే ప్రయత్నం చేసినా అంపైర్ తప్పుడు నిర్ణయంతో  పెవిలియన్ చేరాడు. మరోవైపు ఓపిగ్గా ఆడిన పుజారా కూడా చెత్త షాట్‌తో లయోన్ చేతికి చిక్కాడు.
 ఓవర్లు: 24, పరుగులు: 86, వికెట్లు: 6
 
 సెషన్-2: కీలక భాగస్వామ్యం
 లంచ్ విరామానికి ఓవరాల్‌గా భారత్ కేవలం 60 పరుగులు మాత్రమే ముందంజలో ఉంది. ఈ దశలో ధావన్, ఉమేశ్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ధావన్ 101 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే లయోన్ బౌలింగ్‌లో ధావన్ ఎల్బీగా అవుట్ కావడంతో భారత్ ఆశలు కోల్పోయింది. మరోవైపు లయోన్ బౌలింగ్‌లోనే రెండు సిక్సర్లు బాది ఉమేశ్ దూకుడు ప్రదర్శించినా... తక్కువ వ్యవధిలోనే ఆరోన్, యాదవ్‌లను అవుట్ చేసి కంగారూలు, భారత ఇన్నింగ్స్‌ను ముగించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్‌కు ఇషాంత్ షాక్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో అతను వార్నర్ (6), వాట్సన్ (0)లను అవుట్ చేశాడు.
 ఓవర్లు (భారత్): 17.3, పరుగులు: 67, వికెట్లు: 3
 ఓవర్లు (ఆస్ట్రేలియా): 7, పరుగులు: 25,  వికెట్లు 2
 
 
 సెషన్-3: రోజర్స్ జోరు
 టీ తర్వాత రోజర్స్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. స్మిత్ కూడా అతనికి అండగా నిలిచాడు. స్మిత్ క్యాచ్‌ను కోహ్లి వదిలేయడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చింది. ఈ క్రమంలో 50 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోజర్స్ కూడా ఇషాంత్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో షాన్ మార్ష్ (17) కూడా అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే రెండో పరుగు కోసం ప్రయత్నించి స్మిత్ రనౌట్ కావడం, అదే స్కోరు వద్ద హాడిన్ వెనుదిరగడంతో భారత్ సంచలనాన్ని ఆశించింది. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో భారత్ వరుసగా వికెట్లు తీసి ఒత్తిడి పెంచినా లాభం లేకపోయింది. ఆసీస్ చివరి ఆటగాళ్లు ఆందోళనకు గురి కాకుండా మ్యాచ్‌ను ముగించారు.
 ఓవర్లు: 16.1, పరుగులు: 105, వికెట్లు: 4
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: 408, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 505, భారత్  రెండో ఇన్నింగ్స్: విజయ్ (బి) స్టార్క్ 27, ధావన్ (ఎల్బీ) (బి) లయోన్ 81; పుజారా (సి) లయోన్ (బి) హాజల్‌వుడ్ 43; కోహ్లి (బి) జాన్సన్ 1; రహానే (సి) లయోన్ (బి) జాన్సన్ 10; రోహిత్ (సి) హాడిన్ (బి) జాన్సన్ 0; ధోని (ఎల్బీ) (బి) హాజల్‌వుడ్ 0; అశ్విన్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 19; ఉమేశ్ (సి) హాడిన్ (బి) జాన్సన్ 30; ఆరోన్ (సి) హాజల్‌వుడ్ (బి) లయోన్ 3; ఇషాంత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (64.3 ఓవర్లలో ఆలౌట్) 224
 వికెట్ల పతనం: 1-41; 2-76; 3-86; 4-86; 5-87; 6-117; 7-143; 8-203; 9-211; 10-224.
 
 బౌలింగ్: జాన్సన్ 17.3-4-61-4; హాజల్‌వుడ్ 16-0-74-2; స్టార్క్ 8-1-27-2; వాట్సన్ 13-6-27-0; లయోన్ 10-1-33-2.
 
 ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: రోజర్స్ (సి) ధావన్ (బి) ఇషాంత్ 55; వార్నర్ (సి) ధోని (బి) ఇషాంత్ 6; వాట్సన్ (సి) ధోని (బి) ఇషాంత్ 0; స్మిత్ (రనౌట్) 28; షాన్ మార్ష్ (సి) ధోని (బి) ఉమేశ్ 17; హాడిన్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 1; మిషెల్ మార్ష్ (నాటౌట్) 6; జాన్సన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (23.1 ఓవర్లలో 6 వికెట్లకు) 130
 వికెట్ల పతనం: 1-18; 2-22; 3-85; 4-114; 5-122; 6-122.
 బౌలింగ్: ఇషాంత్ 9-2-38-3; ఉమేశ్ 9-0-46-2; ఆరోన్ 5.1-0-38-0.
 
 ‘ఓటమి నిరాశ కలిగించింది. తొలి సెషన్‌లో కనీసం ఒక మంచి భాగస్వామ్యంతో మరో 20-25 నిమిషాలు క్రీజ్‌లో నిలబడితే పరిస్థితి మరోలా ఉండేది. తప్పులు సరిదిద్దుకోవాల్సి ఉంది. మ్యాచ్ ఐదో రోజుకు సాగితే మేం కొంత ప్రభావం చూపించగలిగేవాళ్లమేమో. జాన్సన్ బ్యాటింగ్‌పై మా వ్యూహాలు పని చేయకపోవడం కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చింది. పరిధిలో ఉన్నంత వరకు దూకుడుగా ఉంటే తప్పు లేదు. గత సిరీస్‌లో మేం అసలు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాం. ఈ సారి ఓడినా రెండు టెస్టులూ బాగానే ఆడాం. కొంత అనుభవం వస్తే ఈ కుర్రాళ్లంతా భవిష్యత్తులో బాగా ఆడతారు.’       
 -ధోని, భారత కెప్టెన్
 
 ‘మా బౌలర్ల ప్రదర్శనతోనే ఈ విజయం సాధ్యమైంది. తొలి రోజు మాకు భారంగా ముగిసింది. అయితే రెండో రోజు మా బౌలర్లు రాణించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. 90 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్ మారింది. కెప్టెన్‌గా చాలా సంతృప్తిగా ఉంది.’
 -స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement