బ్రిస్బేన్:టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం దిశగా కొనసాగుతోంది. 128 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆస్ట్రేలియా.. ఆదిలో రెండు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. డేవిడ్ వార్నర్(6), షేన్ వాట్సన్(0) లను ఇషాంత్ శర్మ పెవిలియన్ కు పంపి టీమిండియాలో ఆశలు రేకెత్తించాడు. అయితే అనంతరం క్రీజ్ లోకి వచ్చిన స్టీవెన్ స్మిత్(10), రోజర్స్(50 )పరుగులతో మరమ్మత్తులు చేయడంతో ఆసీస్ తిరిగి తేరుకుంది. ప్రస్తుతం రెండు వికెట్ల కోల్పోయిన ఆసీస్ 68 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఆసీస్ విజయానికి 55 పరుగులు అవసరమవ్వగా.. ఇంకా చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి.
అంతకుముందు వికెట్టు నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుస వికెట్లను కోల్పోయింది. లంచ్ సమయానికే ఏడు వికెట్లను నష్టపోయిన టీమిండియా ఒక్కసారిగా చతికిలబడింది. అజ్యింకా రహానే (10) పరుగులు చేసి పెవిలియన్ చేరగా, రోహిత్ శర్మ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డకౌట్ లుగా వెనుదిరిగి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. అనంతరం ఓపెనర్ శిఖర్ కు ఉమేశ్ యాదవ్ జతకలిసి కాసేపు మరమ్మత్తులు చేపట్టాడు.
ఇరువురూ కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో టీమిండియాకు కాస్త ఊరట లభించింది. ఉమేశ్ యాదవ్ ను అవతలి ఎండ్ లో ఎక్కువ సమయం ఉంచిన శిఖర్ థావన్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఉమేశ్ యాదవ్ (30) పరుగులు చేసి చివరి వికెట్టుగా పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్ లో 224 పరుగులు చేసింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 505 పరుగులు చేసింది. ప్రస్తుతం 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది.