బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 85 పరుగుల వద్ద మూడో వికెట్టును కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ రోజర్స్(55) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అంతకుమందు ఆసీస్ డేవిడ్ వార్నర్(6), షేన్ వాట్సన్(0)వికెట్లను కోల్పోయింది. ఈ మూడు వికెట్లు ఇషాంత్ శర్మకు దక్కడం విశేషం. ప్రస్తుతం 86 పరుగులతో ఆటను కొనసాగిస్తున్న ఆసీస్ విజయానికి 42 పరుగులు అవసరం.
వికెట్టు నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుస వికెట్లను కోల్పోయింది. లంచ్ సమయానికే ఏడు వికెట్లను నష్టపోయిన టీమిండియా ఒక్కసారిగా చతికిలబడింది. అజ్యింకా రహానే (10) పరుగులు చేసి పెవిలియన్ చేరగా, రోహిత్ శర్మ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డకౌట్ లుగా వెనుదిరిగి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. అనంతరం ఓపెనర్ శిఖర్ కు ఉమేశ్ యాదవ్ జతకలిసి కాసేపు మరమ్మత్తులు చేపట్టాడు.
ఇరువురూ కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో టీమిండియాకు కాస్త ఊరట లభించింది. ఉమేశ్ యాదవ్ ను అవతలి ఎండ్ లో ఎక్కువ సమయం ఉంచిన శిఖర్ థావన్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఉమేశ్ యాదవ్ (30) పరుగులు చేసి చివరి వికెట్టుగా పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్ లో 224 పరుగులు చేసింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 505 పరుగులు చేసింది.