సచిన్ ‘పోస్టల్’ వివాదం!
స్టాంప్ కోసం నిబంధనల ఉల్లంఘన
ముంబై: కెరీర్ ఆసాంతం వివాదాలకు దూరంగా ఉన్న మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్... తన ప్రమేయం లేకుండా కొత్త వివాదంలో చిక్కుకున్నారు. సచిన్ రిటైర్మెంట్ సందర్భంగా పోస్టల్ స్టాంప్ విడుదల సందర్భంగా సంబంధిత అధికారులు నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం బతికున్నవారిపై స్టాంప్ విడుదల చేయరాదు.
వారు చనిపోయిన కనీసం పదేళ్ల తర్వాతే స్టాంప్ ముద్రించవచ్చు. అదీ 10వ వర్ధంతి లేదా 25వ లేదా వర్ధంతి...ఇలా ప్రత్యేక రోజునే విడుదల చేయవచ్చు. సచిన్ విషయంలో కేంద్ర మంత్రి శరద్ పవార్ అతి చొరవతో ఇదంతా వేగంగా జరిగిపోయింది. పోస్టల్ శాఖకు కనీస సమయం కూడా ఇవ్వకుండా ప్రతిపాదించిన 20 రోజుల్లోపే సచిన్ స్టాంప్‌ను పవార్ సిద్ధం చేయించారు. ఈ మొత్తం ప్రక్రియలో అధికారులు అన్ని నిబంధనలు ఉల్లంఘించడం వివాదానికి తావిచ్చింది.