ఇది సచిన్‌ను ఎవరైనా అన్న మాట కాదు. సచిన్ తన రిటైర్‌మెంట్ ప్రకటన ద్వారా విమర్శకులకు చెప్పిన జవాబు. రెండేళ్లుగా సచిన్ విఫలమవుతున్న మాట వాస్తవం. గతంలోలా సంచలన ఇన్నింగ్స్ ఆడటం లేదన్నదీ నిజం. 16 ఏళ్ల వయసులో, 30 ఏళ్లకు పరిణతి సాధించిన సమయంలో ఆడే షాట్లు... 40 ఏళ్లు దాటాక ఆడటం ఎవరికైనా కష్టమే. సచిన్ రిటైర్‌మెంట్ గురించి దశాబ్ద కాలంగా అతను విఫలమైన ప్రతిసారీ చర్చ జరుగుతూనే ఉంది. ప్రతిసారీ మైదానంలో ప్రదర్శనతోనే దానికి సమాధానం చెబుతూ వచ్చాడు. వన్డే ప్రపంచకప్ గెలిచాక సచిన్ వైదొలుగుతాడంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత కూడా ఆడి వందో అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. గత డిసెంబరులో వన్డేలకు వీడ్కోలు చెప్పాక... కనీసం ఓ రెండు మూడేళ్లు మళ్లీ ఆడతాడనే అంచనా ఏర్పడింది. కానీ... ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో వైఫల్యంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి.
కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా... పదేపదే క్లీన్ బౌల్డ్ కావడంతో కాస్త ఈ జోరు పెరిగింది. మరో 2 టెస్టులు ఆడితే 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. కాబట్టి ఈ రికార్డు పూర్తి కాగానే వీడ్కోలు చెబుతాడు (చెప్పాలి) అంటూ విమర్శకులు గళమెత్తారు. ఈ లోగా బోర్డు స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను ఏర్పాటు చేసింది. కాబట్టి ఇదే ఆఖరంటూ ప్రచారం జరిగింది. దీనిపై పత్రికలు పలు కథనాలు రాశాయి. కానీ బోర్డు ప్రతిసారీ వీటిని ఖండించింది. ‘ఎప్పుడు రిటైరవ్వాలో నిర్ణయించుకోవాల్సింది సచిన్’ అని బోర్డు స్పష్టం చేసింది.
తన ఆటతీరుపై సచిన్‌కు పూర్తిగా అవగాహన ఉంది. తన ఫిట్‌నెస్‌పై అంచనా ఉంది. కాబట్టి ‘ఇక చాలు’ అనే నిర్ణయం సచిన్ తీసుకున్నాడు. నిజానికి చాంపియన్స్ లీగ్ సమయంలోనూ మాస్టర్ దీని గురించి ఆలోచించలేదు. లీగ్ ముగిసిన నాలుగు రోజులు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించిన మాస్టర్... వేరే ఎవరూ మాట్లాడే అవకాశం లేకుండా ప్రకటన చేశాడు. కోట్లాది మంది అభిమానులను బాధపెట్టాడు.
చల్తే...చల్తే...
...మేరే యే ‘రన్’ యాద్ రఖ్‌నా!
రాజ్‌సింగ్ దుంగార్పూర్, ఆకాశ్ లాల్, రమేశ్ సక్సేనా, గుండప్ప విశ్వనాథ్, నరేన్ తమ్హానే...వీరంతా ఎవరనుకుంటున్నారా! భారతదేశానికి ఈ ఐదుగురు మహోపకారం చేశారు. 16 ఏళ్ల సచిన్‌ను భారత జట్టులోకి ఎంపిక చేసిన సెలక్టర్లు వీరే. అంతకు ముందు ఏడాదే తాను ఆడిన తొలి రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లలో సచిన్ సెంచరీలతో చెలరేగడంతో వయసు గురించి పట్టించుకోకుండా సత్తా ముఖ్యమంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అది మొదలు భారత క్రికెట్ ఒక కొత్త మలుపు తీసుకుంది. 24 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు...ఒకటా, రెండా ఎన్నని లెక్కించగలం. జట్టును గెలిపించినవి కొన్నయితే, జట్టును కష్టాలనుంచి రక్షించినవి మరికొన్ని...ఇవేవీ కాదు ఫలితం ఎలా ఉన్నా అభిమానులను అలరించినవి మరికొన్ని. వాటిలోంచి ఏది గొప్ప అంటే చెప్పడం కష్టం. కానీ టెస్టు క్రికెట్‌లో కొన్ని మ్యాచ్‌లు ఎప్పటికీ అలా మదిలో నిలిచిపోయే ఉంటాయి.
ఇక చాలు... ఆపండి!
Published Fri, Oct 11 2013 1:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
Advertisement
Advertisement