ఇండోర్ స్టేడియంలో ఆకట్టుకుంటున్న బొమ్మలు
క్రీడాకారుల చిత్రాలతో స్టేడియానికి కొత్త శోభ
మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. హైదరాబాద్‌లోని ఇండోర్ స్టేడియాలకు ధీటుగా పాలమూరులో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఈ స్టేడియంలో ఆరు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటుచేశారు.
ఆకట్టుకుంటున్న చిత్రాలు..
మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం బయట గోడలపై వేసిన క్రీడాకారుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఔత్సాహిక క్రీడాకారులకు అవగాహన కలిగేలా ఆయా క్రీడల్లో రాణిస్తున్న ప్రముఖ క్రీడాకారుల చిత్రాలు ఇండోర్ స్టేడియానికి కొత్త శోభను తెచ్చిపెట్టాయి. జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ ఆర్టిస్ట్ మధు క్రీడాకారుల చిత్రాలు గీశారు. స్టేడియం ప్రధాన ద్వారం గోడపై ఓవైపు ప్రముఖ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, మరోవైపు బాక్సర్ నిఖత్ జరీన్, మధ్యలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టేడియానికి మరోవైపు క్రికెటర్లు విరాట్ కొహ్లి, సిరాజ్, షటిల్ క్రీడాకారిణి గుత్తాజ్వాల, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, జావెలిన్‌త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా, కబడ్డీ క్రీడాకారుడు రాహుల్ చౌదరితో పాటు ఇతర క్రీడాకారుల చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది..
మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారుల చిత్రాలు గీయడానికి అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. గతంలో జిల్లా కేంద్రంలోని స్టేడియం ప్రహరీపై 36 గంటల్లోనే 300 లకుపైగా క్రీడలకు సంబంధించిన చిత్రాలను గీశాను. అదే విధంగా వాలీబాల్ అకాడమీలో క్రీడల బొమ్మలను వేశాను. – మధు, ఆర్టిస్ట్, మహబూబ్‌నగర్
ఇవి చదవండి: బోరు చుట్టూ.. ఇంకుడుగుంత నిర్మించడం ఎలా?
Comments
Please login to add a commentAdd a comment