సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే. ఈ మూడు కుటుంబ పార్టీలే. వాటి డీఎన్‌ఏ కూడా ఒకటే. అందుకే ఆ మూడు పార్టీలు యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి)ను వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మహిళలకు హక్కులు వద్దంటున్నాయి..’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఈ మూడు పార్టీలు ఒకే గూటి పక్షులు. గతంలో పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో ఎవరికి ఓటేసినా బీఆర్‌ఎస్‌కు వేసినట్లే..’అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు.
అనంతరం క్లాక్‌టవర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభలో, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఉద్దేశపూర్వకంగా బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ఏ పార్టీతో కలవలేదని, భవిష్యత్తులో కూడా కలవబోదని చెప్పారు. ప్రజలను మోసం చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌దని, గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కా రని ధ్వజమెత్తారు. కుటుంబాల చేతుల్లో అధికారం ఉంటే దేశం బాగుపడదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని చెప్పారు.
ఇప్పటికీ వైఎస్ హయాంలోని రేషన్ కార్డులే..
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్‌కార్డులే తప్ప.. తెలంగాణలో కొత్తవి రాలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డులివ్వాలనే సోయి కేసీఆర్ సర్కారుకు లేదని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి.. వెన్నుపోటు పొడిచారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోశారని, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, దళితబంధు స్కీంను అమ్ముకుంటున్నారని, బీసీ బంధు పేరిట ఆ వర్గాలను మభ్యపెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.
బీఆర్‌ఎస్ ఆట కట్టించాలి..
దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో నాలుగు కోట్లకు పైగా ఇళ్లు కట్టించామని, తెలంగాణలోనూ ఇళ్లు కట్టించాలని కోరినా ఇక్కడి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా పేదలకు ఇళ్లు లేవు కానీ.. ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముఖ్యమంత్రి రాజభవనాన్ని కట్టుకున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాకుండా లిక్కర్ తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణను దోచుకుంటున్న బీఆర్‌ఎస్ ఆట కట్టించాల్సిన అవసరముందని అన్నారు.
నియంత పాలనను అంతమొందిస్తాం: డీకే అరుణ
తెలంగాణలో నియంతపాలన అంతమయ్యే దాకా బీజేపీ నిద్రపోదని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షు రాలు డీకే అరుణ అన్నారు. ఈ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చే వరకూ వదలబోమని, కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక తామే ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment