కోహ్లి ఒక బ్రాండ్..కానీ
న్యూఢిల్లీ:భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్తో పోల్చే స్థాయి మాత్రం కాదని ఫుట్బాల్ మాజీ కెప్టెన్ బైచింగ్ భూటియా అభిప్రాయపడ్డాడు. గత కొంతకాలంగా విరాట్ సాధించిన ఘనతలతో అతనొక బ్రాండ్గా మారిపోయాడని భూటియా తెలిపాడు. 'ప్రస్తుతం విరాట్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఓవరాల్గా చూస్తే కోహ్లి పేరే ఒక బ్రాండ్ గా మారిపోయింది. కానీ సచిన్ టెండూల్కర్తో విరాట్ ను పోల్చడం మాత్రం కరెక్టు కాదు. సచిన్ సాధించిన ఘనతలు అసాధారణం. సచిన్ చాలా మైలురాళ్లను సృష్టించిన దిగ్గజ క్రికెటర్. విరాట్ను వేరుగా, సచిన్ను వేరుగా చూస్తేనే మంచింది. సచిన్తో పోల్చదగిన స్థాయికి ఇంకా విరాట్ చేరలేదు'అని బైచింగ్ భూటియా అన్నాడు.
ఈ ఏడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 2,595 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు సాధించిన కోహ్లి..13 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.అత్యంత నిలకడైన ప్రదర్శనతో వరల్డ్ క్రికెట్ను శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలోనే సచిన్ తో విరాట్ ను పలువురు పోల్చుతుండగా, కొంతమంది మాత్రం ఆ పోలికతో విభేదిస్తున్నారు.