Bhaichung Bhutia
-
పురోగతి కోసం ప్రక్షాళన!
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అన్ని రకాలుగా అథమ స్థితికి చేరిందని, దీనిలో సమూల మార్పులు అవసరమని భారత మాజీ ఆటగాడు, మాజీ కెపె్టన్ భైచుంగ్ భూటియా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మన టీమ్ పరిస్థితి మరింత దిగజారడానికి ఏఐఎఫ్ఎఫ్ కారణమని అతను తీవ్రంగా విమర్శించాడు. జట్టు ప్రణాళికల విషయంలో ఎలాంటి ముందు చూపు లేకపోవడం వల్లే ఇటీవల కాంటినెంటల్ కప్‌లో సిరియా చేతిలో ఓటమి ఎదురైందని... బలహీనమైన మారిషస్‌తో కూడా మ్యాచ్ గెలవలేకపోయామని భూటియా అన్నాడు. ‘భారత ఫుట్‌బాల్‌కు సంబంధించి గత కొంత కాలంగా ఎలాంటి మంచి పరిణామాలు జరగడం లేదు. నిలకడగా 100వ ర్యాంక్‌లో ఉంటూ వచ్చిన జట్టు ఇప్పుడు 125కు పడిపోయింది. ఏఐఎఫ్ఎఫ్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. లేదంటే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. మన టీమ్‌కు సంబంధించి చర్చ అవసరం. ఏఐఎఫ్ఎఫ్ నియమావళిలోనే సమస్య ఉంది. దానిని మార్చాల్సిందే. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుకు సంబంధించి అడ్డంకులు తొలగిపోతే కొత్త కార్యవర్గాన్ని వెంటనే ఎంచుకోవాలి’ అని భూటియా చెప్పాడు. ఏదో విజన్ 2046 అని కాగితాల్లో రాసుకుంటే కుదరదని, దాని కోసం పని చేయాల్సి ఉంటుందని అతను సూచించాడు. ‘గత రెండేళ్లుగా ఏఐఎఫ్ఎఫ్లో ఎన్నో ఆరోపణలు, వివాదాలు వచ్చి ఆటపై ప్రతికూల ప్రభావం చూపించాయి. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఫుట్బాల్కంటే కూడా సామాజిక అంశాలపై అంతా మాట్లాడటం చూసి ఆశ్చర్యమేసింది. ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఒక స్వచ్ఛంద సంస్థలాగా పని చేస్తే కుదరదు. ఫుట్‌బాల్ అభివృద్ధి, జట్టు విజయం అనేదే ప్రధాన బాధ్యత. నేను పదవుల కోసం పోరాడదల్చుకోలేదు. ఆటను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అంతా పని చేయాలి’ అని భూటియా వివరించాడు. -
'ఫుట్‌బాల్ వదిలేద్దామనుకున్నా'
న్యూఢిల్లీ : కెరీర్ ప్రారంభంలో కోల్‌కతా మేటి క్లబ్ మోహన్ బగాన్ క్లబ్ తరఫున ఆడే సమయంలో ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేవాడినని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి గుర్తు చేసుకున్నాడు. ఒకానొక సమయంలో ఆటను వదిలేద్దామని కూడా అనుకున్నాడట! ఈ విషయాన్ని స్వయంగా అతనే చెప్పాడు. చివరకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇంతవరకు రాగలిగానని అన్నాడు. ‘ఆటలో తొలి ఏడాది బాగానే గడిచింది. అప్పుడే ప్రేక్షకులు నన్ను తమ అభిమాన ప్లేయర్ బైచుంగ్ భూటియాతో పోల్చేవారు. అంచనాలు అందుకోలేని సమయంలో తీవ్రంగా విమర్శించేవారు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి చాలా సార్లు ఏడ్చేవాడిని. ఓసారైతే మా నాన్నను పిలిచి ఇక ఫుట్‌బాల్ ఆడలేనని చెప్పాను. స్వతహాగా క్రీడాకారులైన నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు’ అని 35 ఏళ్ల ఛెత్రి తెలిపాడు. 18 ఏళ్ల తన కెరీర్లో ఛెత్రి భారత్ తరఫున 72 గోల్స్ చేశాడు. -
భవిష్యత్‌లో ఆలోచిస్తా!
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్ష పదవి గురించి భవిష్యత్‌లో కచ్చితంగా ఆలోచిస్తానని భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా అన్నాడు. ఫేస్బుక్ చిట్‌చాట్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భూటియా తన ఆకాంక్షను బయటపెట్టాడు. 2011లో కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సిక్కిం ఆటగాడు ప్రస్తుతం తన దృష్టంతా క్షేత్రస్థాయిలో ఫుట్‌బాల్ అభివృద్ధిపైనే ఉందని పేర్కొన్నాడు. ‘ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పదవికి భవిష్యత్‌లో ఏదో ఒక రోజు పోటీదారుగా ఉంటా. కానీ ప్రస్తుతానికైతే క్షేత్రస్థాయి నుంచి ఫుట్‌బాల్ క్రీడ అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూల్, యునైటెడ్ సిక్కిం క్లబ్‌ల ద్వారా నేను అదే పనిలో ఉన్నా’ అని 43 ఏళ్ల భూటియా అన్నాడు. ఫుట్‌బాల్‌లో అపార నైపుణ్యం ఉన్న భూటియా భారత్‌కు చెందిన మిడ్‌ఫీల్డర్ బ్రాండన్ ఫెర్నాండోస్పై ప్రశంసల వర్షం కురిపించాడు ‘ఈ కాలం స్ట్రయికర్లలో సునీల్ ఛెత్రి, మిడ్ ఫీల్డర్లలో బ్రాండన్ ఫెర్నాండోస్ ఉత్తమ ప్లేయర్లు. ఐఎస్ఎల్లో ఎఫ్‌సీ గోవా తరఫున బ్రాండన్ అద్భుతంగా ఆడుతున్నాడు. మైదానంలో అతని నైపుణ్యాలు గొప్పగా ఉంటాయి’ అని భూటియా తెలిపాడు. 1995 నుంచి 2011 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన భూటియా జూనియర్, సీనియర్ స్థాయిలలో కలిపి మొత్తం 104 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 40 గోల్స్ సాధించాడు. -
ఆ బిల్లుకు నేను పూర్తి వ్యతిరేకం: మాజీ కెప్టెన్
గ్యాంగ్‌టక్: వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లు 'అత్యంత ప్రమాదాకారి' అని భారత పుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా(43) అన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి భారత్‌కు తరలి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు తాను పూర్తి వ్యతిరేకిని అని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లు సిక్కిం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేయలేదని సిక్కింకు చెందిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం అభిప్రాయపడ్డారు. ‘బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉన్న కారణంగా ఇప్పటికే బెంగాల్, ఇతర ఈశాన్య రాష్ట్రాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇక సిక్కిం రాష్ట్రం కూడా బంగ్లాదేశ్‌కు చాలా దగ్గరగా ఉన్న కారణంగా దీర్ఘకాలంలో ప్రభావితమవుతుంది’ అని 'హమ్రో సిక్కిం పార్టీ' అధినేత భైచుంగ్ భూటియా పేర్కొన్నారు. సిక్కిం క్రాంతికారి మోర్చా, బీజేపీ సారథ్యంలో నడుస్తున్న సిక్కిం ప్రభుత్వం.. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇతర ఈశాన్య బీజేపీ మిత్రపక్షాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంతేకాక శాసనసభలో ఈ అంశానికి సంబంధించి తాను, తన పార్టీ వ్యతిరేకంగా వాదిస్తామన్నారు. సిక్కిం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హమ్రో సిక్కిం పార్టీ సిద్ధంగా ఉందని, అవసరమైతే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసేందుకు సిద్ధమని భైచుంగ్ అన్నారు. సిక్కింలో ఆర్టికల్ 371 (ఎఫ్)లో సిక్కిం సబ్జెక్ట్ యాక్ట్, రాజ్యాంగం ఉందన్నారు. కాగా ముస్లింలపై వివక్ష చూపేందుకు బీజేపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందని, ఈ మతతత్వ బిల్లుకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు వాదిస్తున్న విషయం తెలిసిందే. -
కొన్ని సార్లు అంతే.. గెలవలేరు!
హైదరాబాద్ : ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమణపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు కోహ్లి సేనపై దుమ్మెత్తిపోస్తుండగా.. మరికొందరు బాసటగా నిలుస్తున్నారు. అయితే తాజాగా భారత ఫుట్‌బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా కోహ్లి సేనకు మద్దతుగా నిలిచాడు. ‘కొన్ని సార్లు అత్యుత్తమ ఆటగాళ్లు, అత్యుత్తమ జట్లు విజయం సాధించలేవు. 45 నిమిషాల ఆటే ఓటమికి కారణమని కోహ్లి అన్నాడు. ఓడిపోతే ఓడిపోయినట్టే దానికి కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఆటలో గెలపోటములు చాలా సహజం. కానీ అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి టీమిండియా అంత చెత్తగా ఏమి ఆడలేదు. మైదానాల్లో కేవలం వారే కనిపిస్తున్నారు.. క్రికెట్‌ను మరిన్ని దేశాలకు విస్తరించేలా ఐసీసీ చర్యలు చేపట్టాలి. కేవలం పదిజట్లతోనే ప్రపంచకప్ నిర్వహించడం బావ్యం కాదు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఎక్కువ మ్యాచ్‌లు చూసింది భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు చెందిన వారే. మ్యాచ్ చూసే, ఆడే దేశాల సంఖ్య పెరగాలి. దీనిపై ఐసీసీ ప్రత్యేక దృష్టి పెట్టాలి’అంటూ భూటియా వ్యాఖ్యానించారు. ఇక ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కోహ్లి సేన ఫైనల్ చేరకుండానే ప్రపంచకప్ ప్రయాణం ముగించింది. -
టీమిండియా మాజీ కెప్టెన్ కొత్త పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్, ఫుట్‌బాల్ ప్లేయర్ బైచుంగ్ భూటియా కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరును ‘హమ్రో సిక్కిం’గా ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పార్టీ పేరును వెల్లడిస్తూ.. రాష్ట్ర ప్రజల కోసమే తన పార్టీ పనిచేస్తుందన్నారు. ఇటీవల తృణముల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి రాజీనామా చేసిన భూటియా.. కొంత కాలానికే నూతన పార్టీని స్థాపించడం గమనార్హం. ఈ సందర్భంగా భూటియా మాట్లాడుతూ.. సిక్కిం రాష్ట్ర ప్రజలకు తన పార్టీ అంకితం అవుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విధానాలు సరిగా లేవని ఆయన ఆరోపించారు. విధానాల నిర్ణయాల రూపకల్పనలో ప్రతి ఒక్కరినీ చేర్చుకోవడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమన్నారు. ఢిల్లీలో సిక్కిం ప్రాధాన్యాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్‌కు భూటియా 2011లో రిటైర్మెంట్ ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలని భావించిన భూటియా మమతా బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ పార్టీలో 2013లో చేరారు. అయితే కొంతకాలంగా ఆయనకు పార్టీ నేతలతో పొసగడం లేదని వార్తలొచ్చాయి. ప్రత్యేక గోర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ డార్జిలింగ్వాసులు 104 రోజుల ఆందోళన నిర్వహించిన సమయంలో భూటియా వారికి మద్దతు తెలిపారు. దీంతో టీఎంసీతో ఆయనకు భేదాభిప్రాయాలు మరింతగా పెరిగాయి. అధిష్టానంతో విభేదాలు, ఇతరత్రా కారణాలతో జనవరి 30న ఆయన టీఎంసీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
టీఎంసీకి టీమిండియా మాజీ కెప్టెన్ గుడ్‌బై
కోల్‌కతా: ఫుట్‌బాల్ ప్లేయర్, టీమిండియా మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ నుంచి తప్పుకున్నారు. అధిష్టానంతో విబేధాలు, ఇతరత్రా కారణాలతో టీఎంసీకి రాజీనామా చేసిన ఆయన ఈ మేరకు ట్వీటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘ నేడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. టీఎంసీకి సంబంధించిన అన్ని అధికారిక హోదాల నుంచి తప్పుకుంటున్నాను. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీలోను కొనసాగడం లేదంటూ’ భూటియా ట్వీట్ చేశారు. గతేడాది గోరక్లాండ్ ఉద్యమం విషయంలో టీఎంసీ అధిష్టానానికి, భూటియాకు మధ్య విబేధాలు తలెత్తాయి. టీఎంసీకి రాజీనామా చేసి సొంత రాష్ట్రం సిక్కింలోని ఏదైనా ప్రాంతీయ పార్టీలో చేరాలంటూ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు భూటియా ప్రకటించేశారు. గత కొంతకాలం నుంచి న్యూఢిల్లీలోని బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూళ్ల అభివృద్ధిపై ఆయన దృష్టిసారించారు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్ కు భూటియా 2011లో రిటైర్మెంట్ ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలని భావించిన భూటియా మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో 2013లో చేరిన విషయం తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా డార్జిలింగ్ నుంచి పోటీ చేసిన భూటియా బీజేపీ నేత ఎస్ఎస్ అహ్లువాలియా చేతిలో 1.96 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆపై 2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సిలిగురి నుంచి పోటీ చేయగా.. సీపీఐ(ఎం) అభ్యర్థి అశోక్ భట్టాచార్య చేతిలో ఓటమి చవిచూసిన సంగతి విదితమే. -
కోహ్లి ఒక బ్రాండ్..కానీ
న్యూఢిల్లీ:భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చే స్థాయి మాత్రం కాదని ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచింగ్ భూటియా అభిప్రాయపడ్డాడు. గత కొంతకాలంగా విరాట్ సాధించిన ఘనతలతో అతనొక బ్రాండ్‌గా మారిపోయాడని భూటియా తెలిపాడు. 'ప్రస్తుతం విరాట్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఓవరాల్‌గా చూస్తే కోహ్లి పేరే ఒక బ్రాండ్ గా మారిపోయింది. కానీ సచిన్ టెండూల్కర్‌తో విరాట్ ను పోల్చడం మాత్రం కరెక్టు కాదు. సచిన్ సాధించిన ఘనతలు అసాధారణం. సచిన్ చాలా మైలురాళ్లను సృష్టించిన దిగ్గజ క్రికెటర్. విరాట్‌ను వేరుగా, సచిన్‌ను వేరుగా చూస్తేనే మంచింది. సచిన్‌తో పోల్చదగిన స్థాయికి ఇంకా విరాట్ చేరలేదు'అని బైచింగ్ భూటియా అన్నాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 2,595 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు సాధించిన కోహ్లి..13 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.అత్యంత నిలకడైన ప్రదర్శనతో వరల్డ్ క్రికెట్‌ను శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలోనే సచిన్ తో విరాట్ ను పలువురు పోల్చుతుండగా, కొంతమంది మాత్రం ఆ పోలికతో విభేదిస్తున్నారు. సూపర్ మ్యాన్.. విరాట్ కోహ్లి(ఇక్కడ క్లిక్ చేయండి);