
ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్యను సమూలంగా మార్చేయాలి
కొత్త నియామావళి, ఎన్నికలు అవసరం
మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా వ్యాఖ్య
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అన్ని రకాలుగా అథమ స్థితికి చేరిందని, దీనిలో సమూల మార్పులు అవసరమని భారత మాజీ ఆటగాడు, మాజీ కెపె్టన్ భైచుంగ్ భూటియా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మన టీమ్ పరిస్థితి మరింత దిగజారడానికి ఏఐఎఫ్‌ఎఫ్ కారణమని అతను తీవ్రంగా విమర్శించాడు. జట్టు ప్రణాళికల విషయంలో ఎలాంటి ముందు చూపు లేకపోవడం వల్లే ఇటీవల కాంటినెంటల్ కప్‌లో సిరియా చేతిలో ఓటమి ఎదురైందని... బలహీనమైన మారిషస్‌తో కూడా మ్యాచ్ గెలవలేకపోయామని భూటియా అన్నాడు.
‘భారత ఫుట్‌బాల్‌కు సంబంధించి గత కొంత కాలంగా ఎలాంటి మంచి పరిణామాలు జరగడం లేదు. నిలకడగా 100వ ర్యాంక్‌లో ఉంటూ వచ్చిన జట్టు ఇప్పుడు 125కు పడిపోయింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. లేదంటే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. మన టీమ్‌కు సంబంధించి చర్చ అవసరం. ఏఐఎఫ్‌ఎఫ్ నియమావళిలోనే సమస్య ఉంది. దానిని మార్చాల్సిందే. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుకు సంబంధించి అడ్డంకులు తొలగిపోతే కొత్త కార్యవర్గాన్ని వెంటనే ఎంచుకోవాలి’ అని భూటియా చెప్పాడు.
ఏదో విజన్ 2046 అని కాగితాల్లో రాసుకుంటే కుదరదని, దాని కోసం పని చేయాల్సి ఉంటుందని అతను సూచించాడు. ‘గత రెండేళ్లుగా ఏఐఎఫ్‌ఎఫ్‌లో ఎన్నో ఆరోపణలు, వివాదాలు వచ్చి ఆటపై ప్రతికూల ప్రభావం చూపించాయి. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఫుట్‌బాల్‌కంటే కూడా సామాజిక అంశాలపై అంతా మాట్లాడటం చూసి ఆశ్చర్యమేసింది. ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఒక స్వచ్ఛంద సంస్థలాగా పని చేస్తే కుదరదు. ఫుట్‌బాల్ అభివృద్ధి, జట్టు విజయం అనేదే ప్రధాన బాధ్యత. నేను పదవుల కోసం పోరాడదల్చుకోలేదు. ఆటను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అంతా పని చేయాలి’ అని భూటియా వివరించాడు.