
మీడియాతో బైచుంగ్ భూటియా
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్, ఫుట్‌బాల్ ప్లేయర్ బైచుంగ్ భూటియా కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరును ‘హమ్‌రో సిక్కిం’గా ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పార్టీ పేరును వెల్లడిస్తూ.. రాష్ట్ర ప్రజల కోసమే తన పార్టీ పనిచేస్తుందన్నారు. ఇటీవల తృణముల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి రాజీనామా చేసిన భూటియా.. కొంత కాలానికే నూతన పార్టీని స్థాపించడం గమనార్హం. ఈ సందర్భంగా భూటియా మాట్లాడుతూ.. సిక్కిం రాష్ట్ర ప్రజలకు తన పార్టీ అంకితం అవుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విధానాలు సరిగా లేవని ఆయన ఆరోపించారు. విధానాల నిర్ణయాల రూపకల్పనలో ప్రతి ఒక్కరినీ చేర్చుకోవడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమన్నారు. ఢిల్లీలో సిక్కిం ప్రాధాన్యాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తానని ఆయన ప్రకటించారు.
ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్‌కు భూటియా 2011లో రిటైర్మెంట్ ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలని భావించిన భూటియా మమతా బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ పార్టీలో 2013లో చేరారు. అయితే కొంతకాలంగా ఆయనకు పార్టీ నేతలతో పొసగడం లేదని వార్తలొచ్చాయి. ప్రత్యేక గోర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ డార్జిలింగ్‌వాసులు 104 రోజుల ఆందోళన నిర్వహించిన సమయంలో భూటియా వారికి మద్దతు తెలిపారు. దీంతో టీఎంసీతో ఆయనకు భేదాభిప్రాయాలు మరింతగా పెరిగాయి. అధిష్టానంతో విభేదాలు, ఇతరత్రా కారణాలతో జనవరి 30న ఆయన టీఎంసీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.