ముంబై: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటతోనే కాకుండా ప్రచారకర్తగా కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ప్రముఖ స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ పూమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. దేశంలో ఒకే బ్రాండ్‌తో వంద కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న తొలి క్రీడాకారుడిగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డులకెక్కాడు. ఎనిమిది సంవత్సరాలకు రూ.110 కోట్లతో ప్రచారకర్తగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో కోహ్లి ప్రసిద్ధ క్రీడాకారులు జమైకా పరుగుల వీరులు ఉసెన్‌బోల్ట్, అసఫా పోవెల్, ఫుట్‌బాల్ ఆటగాళ్లు థీయరీ హెన్రీ, ఆలివర్ గిరౌడ్‌ల సరసన చేరాడు. ఒప్పందం ప్రకారం కోహ్లికి పూమా సంవత్సరానికి రూ.12 నుంచి రూ.14 కోట్లు ఇవ్వనుంది.
పూమాతో చాలకాలం ఒప్పందం కుదుర్చుకున్నానని, పూమా భారత్‌లో అతి తక్కువ కాలంలో పాపులారిటీ పొందడం తనను ఆకట్టుకుందని, గొప్ప చరిత్ర కలిగిన ఆటగాళ్లు పూమాకు ప్రచారకర్తలుగా ఉండటం సంతోషంగా ఉందని కోహ్లి తెలిపాడు. సచిన్, ధోని, వివిధ స్పోర్ట్స్, ఏజెన్సీల ఒప్పందాలతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరారు. సచిన్ 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 50కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించాడు. సచిన్ 1995లో వరల్డ్‌టెల్‌తో అత్యధికంగా రూ.30 కోట్లకుపైగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2001లో ఇదే ఒప్పందాన్ని డబుల్ రేటుతో పునరుద్ధరించుకున్నాడు. సాచి, సాచిస్ కంపెనీలకు ప్రచారకర్తగా 2006లో సచిన్ మూడు సంవత్సరాలకు రూ.175 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. సచిన్ తర్వాత అంత స్థాయిలో ప్రచారాల ద్వారా లబ్ధి పొందిన క్రికెటర్ ధోనినే. ప్రచారకర్తగా సుమారు రూ.180 కోట్లు ఆర్జించాడు. ధోని దెబ్బతో 2013లో 20 కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్న నటుడు షారుక్‌ఖాన్ అతని ఒప్పందం విరమించుకోవాల్సి వచ్చింది. కోహ్లి 2013లో అడిడాస్‌తో ఏడాదికి రూ.10 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్ వరకూ కొనసాగింది. తర్వాత ఈ ఒప్పందం పునరుద్దరించకపోవడంతో పూమాతో తాజాగా ఒప్పందం కుదుర్చుకున్నాడు.