ఓవర్ టు యు గైస్...
సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెటర్ మళ్లీ రాడు... ఇందులో అతిశయోక్తేం లేదు. తనకంటే గొప్పగా బ్యాటింగ్ చేసే క్రికెటర్ రావొచ్చేమో... కానీ మైదానంలో తనలా ‘కూల్’గా ఉండే వ్యక్తి... సహచరుల్లో స్ఫూర్తిని నింపే క్రికెటర్ రాడు... రాబోడు కూడా..!
ఫామ్‌లో ఉన్నా లేకపోయినా సచిన్ జట్టులో ఉన్నాడంటే అదో ధైర్యం. జట్టు ఎంత కష్టాల్లో ఉన్నా... మాస్టర్ ఆడతున్నాడనే ధీమా..! అభిమానులకు ఇంత ధైర్యాన్ని ఇచ్చే క్రికెటర్ మళ్లీ వస్తాడో రాడో తెలియదు.
కానీ ఒక వ్యక్తితో ఆట ఆగిపోదు... కాలం అంతకంటే ఆగదు. కచ్చితంగా తర్వాతి తరం దీనిని అందిపుచ్చుకోవాలి. భారత క్రికెట్‌ను నడిపించే వ్యక్తులు కావాలి. ఇప్పటికే నైపుణ్యం ఉన్న అనేకమంది క్రికెటర్లు ఉన్నారు. కానీ ప్రధానంగా సచిన్ నుంచి బాధ్యతలు తీసుకోవలసిన క్రికెటర్లు ముగ్గురు... ధోని, రోహిత్, కోహ్లి.
కెప్టెన్‌గా ధోని ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. కావలసినంత అనుభవమూ ఉంది. ప్రస్తుత తరం క్రికెటర్లలో మాస్టర్‌తో అందరికంటే ఎక్కువ కాలం గడిపిన ఆటగాడు. కాబట్టి సచిన్ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఏం చేసేవాడనేది అందరికంటే ధోనికే బాగా తెలుసు. ఎంతటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా సహచరుల్లో స్ఫూర్తి నింపడంలో సచిన్ దిట్ట. ఇకపై పెద్దన్న పాత్ర పోషించాల్సింది ధోనియే.
ఇక ఆటపరంగా తన వారసులంటూ కోహ్లి, రోహిత్‌లకు సచిన్ ఇప్పటికే కితాబిచ్చాడు. వన్డేల్లో కోహ్లి రెండేళ్లుగా సంచలనాత్మకంగా ఆడుతున్నాడు. ఇక రోహిత్ అటు వన్డే డబుల్ సెంచరీ, ఇటు అరంగేట్రంలోనే టెస్టు సెంచరీతో తానేంటో నిరూపించాడు. ఇక భారత బ్యాటింగ్ భారాన్ని ప్రధానంగా మోయాల్సింది వీరిద్దరే. రెండు పుష్కరాల మాస్టర్ ప్రస్థానం ముగిసింది.
ఇక ఓవర్ టు యు గైస్...