‘మాస్టర్’ స్ట్రోక్ | sachin tendulkar stroke in first innings | Sakshi
Sakshi News home page

‘మాస్టర్’ స్ట్రోక్

Published Fri, Nov 15 2013 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

‘మాస్టర్’ స్ట్రోక్

‘మాస్టర్’ స్ట్రోక్

గురువారం మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాలు... వాంఖడే ఒక్కసారిగా హోరెత్తింది. తన చివరి టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు సచిన్ పెవిలియన్ మెట్లు దిగుతూ బ్యాటింగ్‌కు వచ్చాడు. 32 వేలమంది ప్రేక్షకులు లేచి నిలబడి మాస్టర్‌ను స్వాగతించారు. ఇన్నాళ్లూ తనకెంతో ఇచ్చిన 22 అడుగుల పిచ్‌కు మొక్కుతూ... తన తల్లి తొలిసారి ప్రత్యక్షంగా తిలకిస్తుండగా క్రీజులోకి వచ్చాడు. తాను ఎదుర్కొన్న  తొలి బంతిని ఫార్వర్డ్ షార్ట్‌లెగ్‌లోకి ఆడాడు. చుట్టూ నలుగురు ఫీల్డర్లను మోహరించినా... షిల్లింగ్‌ఫోర్డ్ వేసిన తర్వాతి ఓవర్‌లో అందమైన కట్‌షాట్‌తో తొలి బౌండరీ కొట్టాడు.
 
  ఆ తర్వాత వచ్చిన దూస్రాకు చూడ చక్కని కవర్ డ్రైవ్‌తో సమాధానమిచ్చాడు. పేసర్ గాబ్రియెల్ వేసిన మరో బంతిని కవర్ డ్రైవ్ ద్వారా బౌండరీ దాటించాడు. షిల్లింగ్‌ఫోర్డ్ రెచ్చగొట్టే  తరహాలో ఫ్లయిట్ బంతులు వేసినా డిఫెన్సివ్ స్ట్రోక్‌తో అడ్డు కట్టవేశాడు. శామ్యూల్స్ ఓవర్‌లో ఆఫ్ బ్రేక్‌ను అద్భుతంగా లెగ్‌సైడ్ గ్లాన్స్ చేసి నాలుగో బౌండరీని, ఫైన్‌లెగ్‌లోకి మరో ఫోర్‌తో ఐదో బౌండరీని అందుకున్నాడు. ఇక స్యామీ బౌలింగ్‌లో కొట్టిన ఆన్ డ్రైవ్ ఫోర్ కళాత్మకం. మొత్తానికి సచిన్ అభిమానులను నిరాశపరచలేదు. ఇక రెండో రోజు కూడా కావలసినంత వినోదం. మాస్టర్ ఇదే జోరును కొనసాగించి శతకం సాధించాలని కోరుకుందాం.
 
 సచిన్‌కు అంకితం
 ‘సచిన్ స్పెషల్ టెస్టులో 5 వికెట్లు తీయడం చాలా ఆనందంగా ఉంది. నా ఈ ప్రదర్శన మాస్టర్‌కే అంకితం’     
 - ఓజా
 
 49 అత్యధిక టెస్టులకు నాయకత్వం వహించిన భారత కెప్టెన్‌గా గంగూలీ (49) రికార్డును ధోని సమం చేశాడు.
 
 18 భారత్ తరఫున వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్. 18వ మ్యాచ్‌లోనే ఈ ఘనతను సాధించాడు.
 
 1 వెస్టిండీస్ తరఫున 150 టెస్టులు ఆడిన మొదటి క్రికెటర్‌గా చందర్‌పాల్ రికార్డు.  ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడు (39 ఏళ్ల 3 నెలలు) కూడా.
 
 నవంబర్ 15
 సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఇదే రోజు సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement