వన్డే సిరీస్‌లో భారత్ విజయం తర్వాత ఇప్పుడు పరుగుల వేదిక టెస్టులకు మారింది. సొంత గడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్ అంటే క్రికెట్ వీరాభిమాని కూడా దానిని పెద్దగా పట్టించుకునేవాడు కాదేమో. అయితే ఇప్పుడు జరగబోయేది అలాంటిలాంటి సిరీస్ కాదు! ప్రపంచ క్రికెట్‌లో పాతికేళ్ల పాటు తనదైన ముద్ర వేసిన ఒక దిగ్గజ క్రికెటర్ రంగం నుంచి తప్పుకుంటున్న సందర్భమిది.
కాబట్టి రెండు టెస్టుల్లో అతని ప్రతి కదలిక, ప్రతి పరుగుపై చర్చ సహజం... అందరికీ ఆసక్తికరం. ఈ నేపథ్యంలో 199వ టెస్టు వేదిక అయిన కోల్‌కతా ఇప్పుడు మాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నామమే జపిస్తోంది.