సచిన్ 55 బ్యాటింగ్
లాహ్లి: వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు ముగింపు పలకనున్న సచిన్ టెండూల్కర్ తన చివరి రంజీ మ్యాచ్‌లో అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆ సిరీస్‌కు సన్నాహకంగా హర్యానాతో రంజీ ఆడుతున్న మాస్టర్ నిలకడైన ఆటతీరుతో జట్టును విజయం ముంగిట చేర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులకే అవుటైనా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అజేయ అర్ధ సెంచరీ (122 బంతుల్లో 55 బ్యాటింగ్; 4 ఫోర్లు)తో అభిమానులకు కనువిందు చేశాడు.
ఉదయం నుంచి సచిన్ బ్యాటింగ్ కోసం ఆరు వేల మంది ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా వారినే మాత్రం నిరాశపరచకుండా తన క్లాస్ షాట్లతో అలరించాడు. బౌన్సీ పిచ్‌పై ప్రమాదకరంగా వస్తున్న బంతులను ఆచితూచి ఓపిగ్గా ఆడాడు. ఫలితంగా ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. చివరి రోజు ఆట మిగిలి ఉండగా విజయానికి ఇంకా 39 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో సచిన్‌తో పాటు ధావల్ కులకర్ణి (6) ఉన్నాడు. అంతకుముందు హర్యానా తమ రెండో ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటయ్యింది. హెచ్‌వీ పటేల్ (33 బంతుల్లో 33; 2 ఫోర్లు; 3 సిక్స్) వేగంగా ఆడాడు.
జహీర్, ధబోల్కర్ నాలుగేసి వికెట్లు తీశారు. అనంతరం 240 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఒక్క పరుగుకే తొలి వికెట్‌ను కోల్పోయినా... కౌస్తుబ్ పవార్ (136 బంతుల్లో 47; 5 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 40; 4 ఫోర్లు) ఆదుకున్నారు. ఇక సచిన్ రాకతో మైదానం హోరెత్తింది. ఆశిష్ హుడా బౌలింగ్‌లో చక్కటి కవర్ డ్రైవ్ సాధించిన సచిన్ తన పాత రోజులను గుర్తుచేశాడు. అయితే తన ఆటతీరులో ఎలాంటి దూకుడు లేకున్నా పరిస్థితిని అంచనా వేసి నిదానంగా పరుగులు రాబడుతూ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 115వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మోహిత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.