టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్రిస్బేన్ టెస్టు ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. "అంతర్జాతీయ స్ధాయిలో భారత క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.
కానీ నాకు ఇష్టమైన క్రీడను మాత్రం ఇప్పటిలో విడిచిపెట్టను. ఇకపై క్లబ్ క్రికెట్‌లో మాత్రమే ఆడనున్నాను. భారత క్రికెట్‌తో నాకు ఎన్నో అద్బుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ 14 ఏళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన భారత క్రికెట్ బోర్డుకు, నా సహచరులకు ధన్యవాదాలు. అదే విధంగా కొంత మంది కోచ్‌లు కూడా నా కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు.
వారికి కూడా స్పెషల్ థాంక్స్. అంతేకాకుండా రోహిత్, విరాట్, అజింక్య రహానే, పుజారా వంటి ఆటగాళ్లు స్లిప్స్‌లో క్యాచ్‌లు అందుకోవడం వల్లే ఈ రోజు నేను ఇన్ని వికెట్లు సాధించగలిగాను" అని కెప్టెన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్ పేర్కొన్నాడు.
కాగా కాన్ఫరెన్స్‌లో అశ్విన్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అశ్విన్.. 14 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్‌కు తన సేవలను అందించాడు.
టెస్టు క్రికెట్ రారాజు..
కాగా టెస్టు క్రికెట్‌లో అశ్విన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన టెస్టు కెరీర్‌లో 106 టెస్టులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 537 వికెట్లు పడగొట్టాడు. భారత తరపున అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన జాబితాలో అశ్విన్(537) రెండో స్ధానంలో నిలిచాడు. అశ్విన్ కంటే ముందు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(619) ఉన్నాడు. అదే విధంగా టెస్టుల్లో అశ్విన్ ఖాతాలో 35 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి.
అంతేకాకుండా బ్యాట్‌తో కూడా చాలా మ్యాచ్‌ల్లో అశూ రాణించాడు. టెస్టుల్లో 6 సెంచరీలతో 3503 పరుగులు చేసిన అశ్విన్.. 14 సార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో అత్యధికసార్లు(11) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా ముత్తయ్య మురళీధరన్‌తో అశ్విన్ సమంగా ఉన్నాడు.
వైట్‌బాల్ క్రికెట్‌లో అశ్విన్ తన మార్క్‌ను చూపించాడు. 116 వన్డేల్లో 156 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, 65 టీ20 మ్యాచుల్లో 72 వికెట్లు తీశాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అశ్విన్ భారత తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment