సచిన్ చివరి మ్యాచ్: చరిత్ర సృష్టించిన క్రికెట్ దేవు | sachin tendulkar farewell match creates history in mumbai test | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 14 2013 8:52 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి 200వ టెస్టు మ్యాచ్ ఆడిన ఆటగాడిగా సచిన్ అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్తో గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో ఆరంభమైన రెండో టెస్టు, తన వీడ్కోలు మ్యాచ్లో మాస్టర్ అభిమానులను ఆకట్టుకున్నాడు. తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. సచిన్ (38 బ్యాటింగ్), పుజారా (34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మాస్టర్ బ్యాటింగ్కు దిగగానే ముంబై వాంఖడే స్టేడియం సచిన్ నామస్మరణతో మార్మోగిపోయింది. అభిమానుల ఆశల్ని వమ్ముచేయకుండా సచిన్ బ్యాట్తో రాణించాడు. అంతకుముందు భారత ఓపెనర్లు జట్టుకు శుభారంభం అందించారు. ఓపెనర్లు శిఖర్ ధవన్ (33).. మురళీవిజయ్ (43)లు 77 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ షిల్లింగ్ఫోర్డ్ బౌలింగ్లో అవుటయ్యారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన విండీస్ 182 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాదీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఐదు వికెట్లు తీశాడు. అశ్విన్ మూడు, షమీ, భువనేశ్వర్ ఒక్కో వికెట్ తీశారు. లంచ్ సమయానికి విండీస్ రెండు వికెట్లకు 93 పరుగులు చేసింది. ఆ తర్వాత విండీస్ వికెట్ల పతనం పేకమేడను తలపించింది. వెంటవెంటనే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్ ఆరంభంలో ఓజా వెంటవెంటనే పావెల్ (48), శామ్యూల్స్ (19)ను అవుట్ శాడు. సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ మొదట్లోనే 11పరుగులకు చాప చుట్టేశాడు. మహ్మద్ షమీ.. గేల్ను అవుట్ చేశాడు. లంచ్కు కాస్త ముందుగా డారెన్ బ్రావోను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. బ్రావో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు సచిన్ టెండూల్కర్ కుటుంబం మొత్తం వాంఖడే స్టేడియానికి చేరుకుంది. మ్యాచ్ను చూసేందుకు క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు, సినీతారలు, సచిన్ అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది. సచిన్కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement