సచిన్‌కు మరో పురస్కారం!
ముంబై: భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ‘ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో’ ప్రదానం చేయనున్న ‘ఈ తరం క్రికెటర్’ అవార్డు రేసులో సచిన్ ముందంజలో ఉన్నాడు. ‘
క్రిక్‌ఇన్ఫో’ వెబ్‌సైట్ 20వ వార్షికోత్సవం సందర్భంగా 1993 నుంచి 2013 వరకు క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి ‘ఈ తరం క్రికెటర్’ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కోసం విఖ్యాత మాజీ క్రికెటర్లు లారా, మురళీధరన్ పోటీపడినా.. తుది జాబితాలో ‘మాస్టర్’తోపాటు ఆస్ట్రేలియా మేటి స్పిన్నర్ షేన్ వార్న్, దక్షిణాఫ్రికా స్టార్ కలిస్ చోటు సంపాదించారు. ఈ 20 ఏళ్ల కాలంలో ఈ ముగ్గురు లెజెండరీ క్రికెటర్లు తమ కెరీర్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. మాస్టర్ సచిన్ బ్యాటింగ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టించగా... వార్న్ తన స్పిన్ మ్యాజిక్‌తో అద్భుతాలు చేశాడు. ఇక కలిస్ సూపర్ ఆల్‌రౌండర్‌గా అందరి మన్ననలు పొందాడు. దీంతో 50 మంది సభ్యుల జ్యూరీ సచిన్, వార్న్, కలిస్‌లను తుది జాబితాకు ఎంపిక చేసింది. ఈ జ్యూరీలో అంతర్జాతీయ క్రికెటర్లు, మాజీలు, క్రికెట్ రచయితలు, టీవీ వ్యాఖ్యాతలు ఉన్నారు.
తిరుగులేని మాస్టర్...
క్రికెట్ కెరీర్‌లో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్న సచిన్ ‘ఈ తరం క్రికెటర్’ అవార్డు రేసులో వార్న్, కలిస్‌లకు అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇప్పటికే సచిన్‌కు 65 శాతానికిపైగా ఓట్లు పడ్డాయి. సచిన్ జోరు ముందు వార్న్, కలిస్‌లు వెనకబడిపోయారు. అయితే ఈ ఓటింగ్‌లో మీరూ పాల్గొనవచ్చు. ఠీఠీఠీ.్ఛటఞఛిటజీఛిజీజౌ. ఛిౌఝ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి ‘ఈ తరం క్రికెటర్’ను ఎంపిక చేయవచ్చు. విజేతగా నిలిచిన వారికి నేడు ముంబైలో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేస్తారు.