
విజయంతో వీడ్కోలు
ముంబై: ప్రపంచ క్రికెట్‌లో ‘సచిన్ శకానికి’ ధోనిసేన విజయంతో వీడ్కోలు పలికింది. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేసి మాస్టర్ కెరీర్‌కు ఘనమైన ముగింపు నిచ్చింది. బ్యాట్స్‌మెన్ చూపిన అద్భుత ప్రదర్శనకు బౌలర్ల అసమాన తెగువ తోడు కావడంతో మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది.
వాంఖడేలో శనివారం మూడో రోజు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. రామ్‌దిన్ (53 నాటౌట్) టాప్ స్కోరర్. చందర్‌పాల్ (41), గేల్ (35) ఓ మోస్తరుగా ఆడారు. హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా మరోసారి ఐదు వికెట్లతో ఆకట్టుకోగా, అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి. వరుసగా రెండు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’; ఓజా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నారు.
రామ్‌దిన్ నిలబడినా...
43/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన విండీస్‌ను భారత స్పిన్నర్లు పూర్తిగా కట్టడి చేశారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ ఆరంభంలోనే ఎదురు దాడి మొదలుపెట్టాడు. ఆఫ్‌సైడ్‌లో 8 మంది ఫీల్డర్లను నిలబెట్టినా... అశ్విన్ వేసిన రెండో ఓవర్‌లో మూడు ఫోర్లు బాదాడు. అయితే రెండో ఎండ్‌లో శామ్యూల్స్ (11) కుదురుకునే లోపే ఓజా దెబ్బతీశాడు.
భారీ షాట్‌కు ప్రయత్నించి శామ్యూల్స్ స్టంపౌటయ్యాడు. తర్వాత ఓజా వరుస ఓవర్లలో గేల్, దేవ్‌నారాయణ్ (0)ను అవుట్ చేశాడు. అయితే చందర్‌పాల్, రామ్‌దిన్ కొద్దిసేపు ప్రతిఘటించారు. క్రీజులో నిలదొక్కుకున్న ఈ ఇద్దరూ... స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడి స్కోరు బోర్డును పెంచారు. నిలకడగా ఆడుతున్న చందర్‌పాల్‌ను 39వ ఓవర్‌లో అశ్విన్ బోల్తా కొట్టించాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏడో వికెట్‌కు నెలకొన్న 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన స్యామీ (1)ని తర్వాతి ఓవర్‌లోనే ఓజా వెనక్కిపంపాడు.
ఓ ఎండ్‌లో షిల్లింగ్‌ఫోర్డ్ (8)ను నిలబెట్టి రామ్‌దిన్ వేగంగా ఆడాడు. ఈ దశలో కొద్దిసేపు సచిన్‌తో బౌలింగ్ చేయించిన ధోని వికెట్లు పడకపోవడంతో మళ్లీ అశ్విన్‌ను రంగంలోకి దించాడు. చివరకు 45వ ఓవర్‌లో వేసిన ఫ్లయిట్ బంతిని స్వీప్ చేయబోయిన షిల్లింగ్‌ఫోర్డ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత వచ్చిన గాబ్రియెల్ (0)ను షమీ అవుట్ చేయడంతో భారత్ విజయం ఖరారైంది. ఇక ఈ రెండు జట్ల మధ్య ఈనెల 21 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే ఈనెల 21న కొచ్చిలో, రెండో వన్డే 24న విశాఖపట్నంలో, మూడో వన్డే 27న కాన్పూర్‌లో జరుగుతాయి.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 182 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 495 ఆలౌట్
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: గేల్ (సి) ధోని (బి) ఓజా 35; పావెల్ (సి) షమీ (బి) అశ్విన్ 9; బెస్ట్ ఎల్బీడబ్ల్యూ (బి) ఓజా 9; బ్రేవో (సి) విజయ్ (బి) అశ్విన్ 11; శామ్యూల్స్ (స్టంప్డ్) ధోని (బి) ఓజా 11; చందర్‌పాల్ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 41; దేవ్‌నారాయణ్ (సి) అండ్ (బి) ఓజా 0; రామ్‌దిన్ నాటౌట్ 53; స్యామీ ఎల్బీడబ్ల్యూ (బి) ఓజా 1; షిల్లింగ్‌ఫోర్డ్ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 8; గాబ్రియెల్ (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (47 ఓవర్లలో ఆలౌట్) 187.
వికెట్ల పతనం: 1-15; 2-28; 3-43; 4-74; 5-87; 6-89; 7-157; 8-162; 9-185; 10-187
బౌలింగ్: భువనేశ్వర్ 3-0-4-0; షమీ 7-0-28-1; అశ్విన్ 17-4-89-4; ప్రజ్ఞాన్ ఓజా 18-6-49-5; సచిన్ 2-0-8-0