
బరువెక్కిన హృదయంతో..!
ముగిసిన సచిన్ ‘ఇన్నింగ్స్’
ముంబై: దేవుడిని ఎన్నో కోరికలు కోరతాం...అన్నీ నెరవేరతాయా! శుక్రవారం వాంఖడే మైదానంలో కూడా సరిగ్గా అదే జరిగింది. సచిన్ అర్ధ సెంచరీ చేశాక...74 పరుగులకు చేరాక అభిమానులంతా మాస్టర్ కచ్చితంగా శతకం అందుకుంటాడనే భావించారు. కానీ వారి కోరికను ‘దేవుడు’ నెరవేర్చలేదు. సెంచరీకి దూరంగా తన పరుగును ఆపేశాడు. అయితే ఏమిటి...బ్రాడ్‌మన్ చేసిన ‘సున్నా’ పరుగులకంటే 74 చేయడం విశేషమే కదా! అప్పటి వరకు చకచకా పరుగులు తీస్తూ దూకుడు ప్రదర్శించిన సచిన్ అదే వేగంతో క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు.
దేవ్‌నారాయణ్ బౌలింగ్‌లో స్యామీకి క్యాచ్ ఇచ్చిన సమయంలో సరిగ్గా ఉదయం 10.38 గంటలకు వాంఖడే స్టేడియం స్థంభించింది. ఒక్కసారిగా ఏం జరిగిందో ప్రేక్షకులకు అర్థం కాలేదు. కోలుకునే సరికి మాస్టర్ పెవిలియన్ వైపు వెళుతూ కనిపించాడు. అంతే...మైదానంలో ప్రేక్షకులు, వీఐపీలు, కుటుంబ సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో క్రికెట్ వీరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
సచిన్ కూడా కొద్దిసేపు లోకాన్ని కోల్పోయినట్లు భావించాడేమో...చాలా దూరం మామూలుగానే వచ్చేశాడు. అయితే అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ఒక్కసారిగా గుర్తుకొచ్చినట్లుంది. సైట్ స్క్రీన్ సమీపానికి వచ్చాక హెల్మెట్ తీసి బ్యాట్‌ను ప్రేక్షకుల వైపు చూపించాడు. అతను డ్రెస్సింగ్ రూమ్‌లో చేరి తన సీట్లో కూర్చునే వరకు కెమెరా కళ్లన్నీ అతనిపైనే...ఇంకా చెప్పాలంటే సచిన్ నుంచి కెమెరా జరపలేమంటూ టీవీ ప్రసారంలో చాలా సేపటి వరకు ఒక్కసారి కూడా రీప్లే చూపించకపోవడం విశేషం.
కోచ్ కన్నీళ్లు....
సచిన్ అవుటైన క్షణాన సన్నిహితుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన హావభావాలు కనిపించాయి. అంజలి కొద్దిగా గాంభీర్యం ప్రదర్శించగా...తల్లి రజని చిరునవ్వుతో కొడుకు వైపు చూసింది. మాస్టర్‌కు మార్గదర్శిగా నిలిచిన సోదరుడు అజిత్ ఉద్వేగంగా కనిపించగా...కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. బౌండరీ బయట బాల్‌బాయ్‌గా కూర్చున్న అర్జున్ మాత్రం తన వయసుకు తగ్గట్లు చప్పట్లతో తండ్రిని అభినందిస్తూ ఉత్సాహంగా కనిపించాడు. అన్నట్లు... ప్రేక్షకుల స్టాండింగ్ ఒవేషన్‌కు సచిన్ కళ్లల్లో కూడా నీళ్లు వచ్చి ఉంటాయా...అంటే చెప్పలేం. బహుశా కొద్ది సేపు వాటిని నియంత్రించుకొని ఉంటాడేమో...కానీ ఒక్కటి మాత్రం నిజం...మాస్టర్ నిష్ర్కమించిన వేళ ప్రత్యక్షంగా గానీ, టీవీల్లో కానీ చూస్తున్న ప్రేక్షకుల్లో ఉద్వేగానికి లోను కానివారు ఎవరైనా ఉంటారా!
బెస్ట్ కాదు వరస్ట్...
సచిన్‌ను ఆఖరి సారి అవుట్ చేసిన బౌలర్ చరిత్ర పుటల్లోకెక్కడం ఖాయం. ఆ విషయం టినో బెస్ట్‌కు కూడా చాలా బాగా తెలుసు. అందుకే శుక్రవారం సచిన్‌కు బౌలింగ్ చేస్తూ పదే పదే రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. వరుసగా షార్ట్ బంతులు, బౌన్సర్లు వేస్తూ తీవ్రంగా శ్రమించాడు. అవసరం ఉన్నా, లేకపోయినా అప్పీల్ చేశాడు. సచిన్ చేయికి బంతి తగిలినట్లుగా చూపించాడు. అయితే వాటిని అంపైర్ తిరస్కరించడంతో అతని మొహం వాడిపోయింది. ఇంకా చెప్పాలంటే ఏ బౌలరూ సాహసించని రీతిలో మాస్టర్ సొంతగడ్డపై ఒక రకమైన స్లెడ్జింగ్‌కు ప్రయత్నించాడు. ఒక దశలో ‘ఏక్ ఔర్ ఏక్...బెస్ట్‌కో బాహర్ ఫేంక్’...అనే నినాదం మైదానమంతా మార్మోగింది. మరోవైపు సచిన్ మాత్రం బెస్ట్‌ను చాలా తేలిగ్గా తీసుకున్నాడు.
హనుమంతుడి ముందు కుప్పిగంతులా...అన్న తీరుగా రెండు చక్కటి ఫోర్లతో జవాబిచ్చాడు. చిరునవ్వులు చిందిస్తూ బెస్ట్‌ను మరింత ఉడికించాడు. చివరకు మోకాళ్లపై కూలిపోయిన బెస్ట్ దగ్గరికి వెళ్లి అతని భుజంపై తడుతూ ముందుకు సాగాడు. ఇది నా రోజు నీది కాదు...అనే ఓదార్పు అందులో కనిపించింది.
మరో వైపు ప్రఖ్యాత ‘టైమ్’మ్యాగజైన్ సచిన్‌ను ‘మ్యాన్ ఆఫ్ ది మూమెంట్’ అంటూ ప్రశంసలు కురిపించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ కూడా సచిన్ రిటైర్మెంట్ సందర్భంగా తన అభినందలు తెలిపారు. స్టార్ స్పోర్ట్స్ చానల్ కూడా కొత్తగా సచిన్ మెమరీ ప్రాజెక్ట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.