
సోలో ‘షో’
ముంబై: కోట్లాది భారతీయులు, అభిమానులు ఎదురు చూసిన ఆ క్షణం గురువారం రానే వచ్చింది. క్రికెట్ కింగ్ సచిన్ టెండూల్కర్ తన ఆఖరి టెస్టు ఆడేందుకు బరిలోకి దిగిన వేళ....అభిమానుల హోరుతో వాంఖడే దద్దరిల్లింది. గ్యాలరీలో తన పక్కన కూర్చున్నవాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా వినిపించని స్థాయిలో మైదానంలో సచిన్...సచిన్...మంత్రం ప్రతిధ్వనించింది. తొలి రోజు ఆటలో అతను వేసిన ప్రతీ అడుగు, తీసిన ప్రతీ పరుగు ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తింది. దాదాపు 100 నిమిషాలు మాస్టర్ బ్యాటింగ్ చేసిన తర్వాత అభిమానులందరికీ ఒకే సందేహం వచ్చి ఉంటుంది. ఇంత చక్కగా ఆడుతూ అసలు సచిన్ రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడు అని!
రెప్ప వేయవద్దు!
వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో సచిన్ ఫీల్డింగ్ చేస్తున్నంత సేపు ప్రేక్షకులు ఆనందానికి అదుపు లేదు. సచిన్ కదిలినా, ఒక్కసారి ప్రేక్షకుల వైపు తిరిగినా వారికి పండుగలా అనిపించింది. ఇక ఫీల్డ్‌లో బంతి మాస్టర్ దగ్గరికి వెళ్లినప్పుడైతే చెప్పేదేముంది! భారత ఇన్నింగ్స్ 14వ ఓవర్లో సచిన్ బ్యాటింగ్‌ను చూసే అదృష్టం కలిగింది. తనకు అలవాటైన రీతిలో ఆకాశం వైపు చూస్తూ సచిన్ మైదానంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఏ క్షణాన్ని కోల్పోకూడదంటూ ‘కనురెప్ప కూడా వేయవద్దు’ అని భారీ స్క్రీన్‌పై కనిపించిన వాక్యాన్ని అచ్చంగా అభిమానులు పాటించినట్లున్నారు. విండీస్ ఆటగాళ్లు కూడా మాస్టర్ వస్తున్నప్పుడు ఇరు వైపులా నిలబడి చప్పట్లతో ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇచ్చారు.
అభినందనల పర్వం
మ్యాచ్‌కు ముందు సచిన్ కోసం వేర్వేరు కార్యక్రమాలు జరిగాయి. బీసీసీఐ తరఫున అధ్యక్షుడు శ్రీనివాసన్ ఒక జ్ఞాపికను ఇవ్వగా, కార్యదర్శి సంజయ్ పటేల్ ప్రత్యేక చిత్రపటాన్ని అందజేశారు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ప్రత్యేక జెర్సీలను ధరించారు. జెర్సీ ఎడమ వైపు బీసీసీఐ లోగో కింద ‘సచిన్ రమేశ్ టెండూల్కర్ 200వ టెస్టు’ అని ముద్రించి ఉంది. గతంలో ఏ క్రికెటర్ కోసమూ ఇలా చేయలేదు. కామెంటేటర్లు కూడా ఎస్‌ఆర్‌టీ 200 అని ముద్రించి ఉన్న ప్రత్యేక జాకెట్లను ధరించారు. టీమిండియా కెప్టెన్ ధోని... ‘200’ అని ముద్రించి ఉన్న ఒక ప్రత్యేక క్యాప్‌ను మాస్టర్‌కు అందజేశాడు. విండీస్ జట్టు సభ్యులు కూడా ఆటోగ్రాఫ్‌లు చేసిన ప్రత్యేక టీ షర్ట్ ఫ్రేమ్‌ను అందించారు. సచిన్ బొమ్మతో ప్రత్యేకంగా తయారు చేసిన నాణాన్నే టాస్ కోసం ఉపయోగించారు. టాస్ తర్వాత కేంద్ర మంత్రి కపిల్ సిబాల్... సచిన్‌పై ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. భారత్‌లో మదర్ థెరిసా తర్వాత బ్రతికుండగానే ఈ గౌరవం దక్కించుకున్న రెండో వ్యక్తి సచిన్ కావడం విశేషం.
సన్నిహితుల సమక్షంలో...
సచిన్ 200వ టెస్టుకు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు మాజీ ఆటగాళ్లు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సచిన్ తల్లి రజని టెండూల్కర్ జీవితంలో తొలిసారి తన కొడుకు ఆటను ప్రత్యక్షంగా చూడటం విశేషం. సోదరుడు అజిత్, భార్య అంజలి, పిల్లలు అర్జున్, సారాలతో పాటు అతని అత్తమామలు కూడా మ్యాచ్‌కు వచ్చారు. మాస్టర్‌కు ఓనమాలు నేర్పిన గురువు రమాకాంత్ అచ్రేకర్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు.
క్రికెట్ దిగ్గజాలు క్లైవ్ లాయిడ్, బ్రియాన్ లారాలతో పాటు సినీ హీరో ఆమిర్ ఖాన్, నీతా అంబానీ తదితరులు సచిన్ చివరి టెస్టు తొలిరోజును ఆస్వాదించారు. ఈ మ్యాచ్ కోసం ముంబై క్రికెట్ సంఘం సచిన్‌కు 500 ప్రత్యేక పాస్‌లు కేటాయించింది. మరోవైపు స్టేడియంలో ఏర్పాటు చేసిన సచిన్ 51 టెస్టుల చిత్రాలకు విరాట్ కోహ్లి ప్రకటనలు అడ్డుగా రావడంపై బుధవారం విమర్శలు వచ్చాయి. దాంతో ముంబై క్రికెట్ సంఘం మ్యాచ్‌కు ముందు వాటిని తొలగించింది.
బ్యాట్ త్రివర్ణ రంజితం...
తన చివరి, 200వ టెస్టులో సచిన్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బ్యాట్‌తో బరిలోకి దిగాడు. సాధారణంగా తన బ్యాట్‌కు నలుపు రంగు గ్రిప్‌ను వాడే సచిన్ ఈ సారి భారత జాతీయ పతాకాన్ని పోలిన మువ్వన్నెల గ్రిప్‌ను ఎంచుకున్నాడు. బ్యాట్ వెనుక భాగం, బ్లేడ్ భాగం కూడా త్రివర్ణ రంజితంగా మార్చి తన భారతీయతను చాటుకున్నాడు. ‘సచిన్ తన కెరీర్‌ను దేశానికి అంకితం చేయాలని భావించాడు. అందుకే బ్యాట్‌ను ప్రత్యేకంగా చేయించాం’ అని అడిడాస్-ఎస్‌టీ బ్యాట్ రూపకర్తలు వెల్లడించారు.
కొసమెరుపు: తొలి రోజు ధోని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగానే ఈ రోజు సచిన్ ఆటను చూడటం సాధ్యం కాకపోవచ్చని చాలా మంది భావించారు. కానీ అతను బ్యాటింగ్‌కు వచ్చాడు. మరి రెండో రోజు అతను సెంచరీ సాధిస్తాడా... డబుల్ సెంచరీ చేస్తాడా అన్నది ఆసక్తికరం. మరి ఇప్పుడు భారత అభిమానులకు శుక్రవారం ఆఫీసు ఎగ్గొట్టేందుకు అర్జంటుగా ఒక సాకు కావాలి. ఎంత మందికి తల నొప్పి వస్తుందో...ఎంత మందిని కడుపు నొప్పి బాధిస్తుందో... చూడాలి!
భారతదేశంలో బ్రతికున్న వ్యక్తి పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం ఇది రెండోసారి మాత్రమే. మదర్ థెరిసా తర్వాత ఈ గౌరవాన్ని దక్కించుకున్న వ్యక్తి సచిన్.