వాంఖడే స్టేడియంలో సచిన్ రిటైర్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సచిన్ ఉద్వేగ భరితంగా మాట్లాడాడు. ఆ మాటల్లోని ముఖ్యాంశాలు...
''ఇంత అద్భుతమైన ప్రయాణం ముగిసిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి.. నా తండ్రి. ఆయన నాకు చిన్నతనంలోనే స్వేచ్ఛనిచ్చి, కోరుకున్న కెరీర్ ఎంచుకొమ్మన్నారు. నేను ఆయన అడుగుజాడల్లోనే నడిచాను. ఆయన అద్భుతమైన వ్యక్తి కూడా. ఆయన ఆశీస్సుల వల్లే ఇంత స్థాయికి ఎదిగాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత సులభం కాదు. కానీ అంజలి చాలా ఓర్పు, సహనంతో వ్యవహరించింది. ఆమె తన ఇద్దరు బిడ్డలతో పాటు.. నన్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంది. గడిచిన 24 ఏళ్లుగా దేశం కోసం ఆడాను. ఆమె ఎప్పుడూ ప్రార్థస్తూ ఉంది. ఆ ప్రార్థనల ఫలితం వల్లే నేను బాగా ఆడగలిగాను.
మా పెద్ద అన్నయ్య ఎప్పుడూ నాకు వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. అందుకే నేను దృష్టి పెట్టగలిగాను. మా సోదరి సబిత నాకు మొదటి బ్యాట్ కొనిచ్చింది. అందుకు చాలా కృతజ్ఞతలు. మా సోదరుడు అజిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రమాకాంత్ ఆచ్రేకర్ సార్ దగ్గరకి తనే తీసుకెళ్లాడు. ఆయన నాకు అన్నీ చెప్పకపోతే నేను క్రికెట్లో చాలా కిందిస్థాయిలో ఉండేవాడినేమో.
1990లో నేను అంజలిని కలవడం నా జీవితంలో చాలా అద్భుతమైన క్షణం. నేను అలా అడుగులో అడుగు వేసుకుంటూ తనవద్దకు వెళ్లాను. ఆమె ఓ డాక్టర్. తాను నన్ను క్రికెట్ ఆడమంది, తాను కుటుంబ బాధ్యతలు తీసుకుంటానంది. నా తప్పులు, ఒత్తిళ్లు తట్టుకున్నందుకు చాలా థాంక్స్. జీవితంలోని ఎత్తుపల్లాలన్నింటిలో తోడున్నందుకు థాంక్స్. (ఈమాట అనగానే అంజలి కంటివెంట కన్నీరు వచ్చింది). జీవితం నాకిచ్చిన రెండు వరాలు.. సారా, అర్జున్. ఇప్పుడు ఇప్పటికే పెరిగారు. వాళ్లకు కూడా నేను చాలా థాంక్స్ చెప్పాలి. వాళ్ల పుట్టినరోజులు, స్పోర్స్ట్ డేలు, ఏం జరిగినా ఎప్పుడూ నేను ఉండేవాడిని కాను. వాళ్లు నాకు ఎంత ప్రత్యేకమో వాళ్లు ఊహించలేరు. ఇన్నాళ్లుగా నేను మీకు సమయం కేటాయించలేకపోయాను. కానీ రాబోయే 16 ఏళ్లు పూర్తిగా మీతోనే ఉంటాను.
చిన్నతనంలో నాకు చాలామంది స్నేహితులుండేవారు. వాళ్లను నెట్స్‌లోకి పిలిచి నాకు బౌలింగ్ చేయమనేవాడిని. సెలవులు వచ్చినప్పుడల్లా నేను సరిగా ఆడుతున్నానో లేదోనని వాళ్లను వేధించేవాడిని. తెల్లవారుజామున మూడు గంటలకు కూడా నాతోపాటు వాళ్లు వచ్చి, నీ కెరీర్ అయిపోలేదని ప్రోత్సహించేవాళ్లు. వాళ్లందరికీ చాలా థాంక్స్. నేను 11 ఏళ్ల వయసులో క్రికెట్ కెరీర్ మొదలుపెట్టాను. ఆచ్రేకర్ సార్ నా కోచ్ అయిన తర్వాత జీవితం చాలా మారింది. ఆయనను చూసినప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. సార్ నన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని ముంబై మొత్తం మ్యాచ్‌ల కోసం తిప్పేవారు. గత 29 ఏళ్లుగా ఆయన నన్ను నడిపిస్తూనే ఉన్నారు. ఇక జీవితంలో మ్యాచ్‌లు చూడటమే తప్ప ఆడటం ఉండదు!! ముంబైలో.. ఇదే మైదానంలో నా ఆట మొదలైంది. అందుకే ఇప్పుడు కూడా ఇక్కడే ఆడాలనుకున్నాను.
బీసీసీఐ నన్ను 16 ఏళ్ల వయసులో ఎంపిక చేసింది. అప్పుడు నన్ను తీసుకున్న సెలెక్టర్లందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీ అందరి మద్దతు నాకు చాలా ఉంది. గాయపడినప్పుడు కూడా దగ్గరుండి చికిత్సలు చేయించి మళ్లీ భారత్ తరఫున ఆడేలా చేశారు. రాహుల్, లక్ష్మణ్, సౌరవ్... ఇలా వీళ్లందరూ నేను కుటుంబానికి ఊదరంగా ఉన్నప్పుడు డ్రస్సింగ్ రూంలో నాతో ఉండేవారు. వాళ్ల సాహచర్యం నాకు చాలా స్పెషల్. ఎంఎస్ ధోనీ నాకు 200 టెస్టు మ్యాచ్ క్యాప్ ఇచ్చినప్పుడు టీమ్ కోసం ఓ సందేశం ఇచ్చాను. మనమంతా భారత క్రికెట్ జట్టులో భాగమైనందుకు ఎంతో గర్వపడాలి. మీరు మీ పూర్తి సామర్థ్యంతో జాతికి సేవలు అందిండచం కొనసాగిస్తారని ఆశిస్తున్నా. నా డాక్టర్లు, ఫిజియోలు, ట్రైనర్లు.. వాళ్లను ప్రస్తావించకపోతే పెద్ద తప్పు చేసినట్లే. వాళ్లు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. నేను ఎక్కడున్నా గాయపడినప్పుడు వెంటనే వచ్చి, తీసుకెళ్లి మళ్లీ మామూలు సచిన్‌ను చేసేవారు. వినోద్ నాయుడు గత 14 ఏళ్లుగా మా కుటుంబంతో ఉన్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి నా కోసం పనిచేశాడు. స్కూలు సమయంలో ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు నన్ను ప్రోత్సహించిన మీడియాకు కృతజ్ఞతలు. ఫొటోగ్రాఫర్లు నావి మంచిమంచి ఫొటోలు తీశారు.
చివరిగా ఒక్కమాట.. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రేక్షకులు కూడా నన్ను చాలా చాలా ప్రోత్సహించారు. వాళ్ల ప్రోత్సాహమే లేకపోతే ఇదంతా ఉండేది కాదు. వాళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాచిన్.. సాచిన్.. అని అరుస్తుంటే నా గుండెల్లోంచి ఉద్వేగం పొంగుకొచ్చేది. థాంక్యూ వెరీమచ్. మీరంతా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థాంక్యూ..