
జనం కోరిక తీరింది
మైదానంలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ‘క్రికెట్ శిఖరం’ సచిన్ టెండూల్కర్... మైదానం ఆవలా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నాడు.
న్యూఢిల్లీ: మైదానంలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ‘క్రికెట్ శిఖరం’ సచిన్ టెండూల్కర్... మైదానం ఆవలా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నాడు. వాంఖడే స్టేడియంలో 200వ టెస్టు ఆడి 24 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొన్ని గంటలకే సచిన్ ఖాతాలో మరో ఆణిముత్యం చేరింది.
కోట్లాది మంది అభిమానుల ఆకాంక్ష నెరవేరింది. సచిన్ టెండూల్కర్‌ను దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో సత్కరించనున్నట్లు శనివారం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ‘సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రకటించారు’ అని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి వేణు రాజమణి ఒక ప్రకటనను విడుదల చేశారు. దాంతో ‘భారతరత్న’ పొందనున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా 40 ఏళ్ల సచిన్ రికార్డు సృష్టించాడు.
అంతేకాకుండా ఈ అత్యున్నత పురస్కారం దక్కించుకున్న పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. ‘నిస్సందేహంగా సచిన్ టెండూల్కర్ విశిష్ట క్రికెటర్. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన దిగ్గజం. 16 ఏళ్లకే కెరీర్‌ను మొదలుపెట్టి 24 ఏళ్లు దేశానికి సేవలు అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో క్రికెట్ ఆడాడు. దేశానికి ఎంతో ప్రతిష్టను తెచ్చాడు. ప్రపంచ క్రీడాపటంలో అసలైన భారత రాయబారిగా నిలిచాడు. క్రికెట్‌లో సచిన్ సాధించిన ఘనతలు, రికార్డులు అసమానం, అమేయం.
అతను కనబరిచిన క్రీడాస్ఫూర్తి ఆదర్శప్రాయం. క్రీడాకారుడిగా కనబరిచిన అసాధారణమైన ప్రతిభకు గుర్తింపుగా అతనికి ఎన్నో పురస్కారాలు లభించాయి’ అని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) తమ ప్రకటనలో సచిన్‌ను కొనియాడింది. సచిన్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలని గత మూడేళ్లుగా చర్చ కొనసాగుతోంది. నిబంధనల ప్రకారమైతే కేవలం కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక, సమాజ సేవ రంగా ల్లో విశిష్ట సేవలు అందించిన వారికే ‘భారతరత్న’ కు అర్హులు. అయితే ఈ నిబంధనలను సవరించి ఈ జాబితాలో క్రీడారంగాన్నీ చేర్చారు.
అన్నీ వచ్చేశాయి...
తాజాగా ‘భారతరత్న’ కూడా ఖాయం కావడంతో దేశంలోని ముఖ్యమైన పౌర పురస్కారాలు పొందిన క్రీడాకారుడిగా సచిన్ నిలిచాడు. 2008లో సచిన్ దేశ ద్వితీయ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’ అందుకున్నాడు. 1994లో ‘అర్జున అవార్డు’... 1998లో ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’... 1999లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి.
అభినందనల వెల్లువ...
సచిన్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. క్రికెట్ మేధావి ఆటకెంతో చేశాడని, ఇకపై కూడా అతని జీవితం ఆనందంగా సాగాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకాంక్షించారు. రిటైర్మెంట్‌తో పాటు సచిన్ భారతరత్న అవార్డుకు ఎంపికవడంపై ప్రధాని స్వయంగా ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఇతర ప్రముఖుల అభినందనలు వారి మాటల్లోనే...
క్రీడాకారులకు సచిన్ రోల్‌మోడల్. యువతకు స్ఫూర్తి. అలాంటి దిగ్గజానికి భారతరత్న దక్కడం హర్షణీయం.
- సోనియా గాంధీ (కాంగ్రెస్ అధినేత్రి)
భారతరత్నకు సచిన్ ముమ్మాటికీ అర్హుడు. క్రికెటర్లకే కాదు క్రీడాకారులందరికీ అతనే రోల్‌మోడల్.
- శ్రీనివాసన్ (బీసీసీఐ చీఫ్)
మాస్టర్‌లాంటి ఆటగాళ్లు చాలా అరుదు. క్రికెట్‌కే వన్నే తెచ్చిన అతన్ని యావత్ ప్రపంచం గౌరవిస్తుంది. ప్రత్యర్థులు సైతం జేజేలు పలికే ఒక్క ఆటగాడు సచిన్. - రిచర్డ్‌సన్ (ఐసీసీ సీఈఓ)
సచిన్ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. ఇక మీదట ‘ఆట’లేని అతని జీవితం కూడా అద్భుతంగా సాగాలని ఆశిస్తున్నా.
- ఫెడరర్
క్రికెట్ చరిత్రలోనే ఓ గొప్ప మ్యాచ్ ఇది. ఇలాంటి మ్యాచ్‌కు మళ్లీ సాక్షులం కాలేం. మా ముందుండి నడిపించిన సచిన్‌కు వందనం.
- ధోని
డ్రెస్సింగ్‌రూమ్ వెలవెలబోవడం ఖాయం. అతని అమూల్యమైన మార్గదర్శనాన్ని జట్టు కోల్పోతోంది.
- రోహిత్ శర్మ
రిటైర్ అయ్యాడనే విషయం వినడానికే కష్టంగా ఉంది. నాలో ఒక భాగం పోయినట్లు అనిపిస్తోంది. కానీ నా జీవితంలో మరో సచిన్ మాత్రం ఎప్పటికీ రాడు. గుడ్‌బై... నాకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు.
- యువరాజ్ సింగ్
సెల్యూట్ సచిన్. నీవు లేని క్రికెట్ నీలా ఉండదు. నాకు సంబంధించి క్రికెట్ అంటే నువ్వే.
- హర్భజన్
అతను రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటీ నుంచే నేను ఉద్వేగాన్ని ఎదుర్కొంటున్నా. నా మనసులో అతనికున్న స్థానం మహోన్నతమైంది.
- సెహ్వాగ్
ఇక మేమంతా నీ ఆటను కోల్పోతున్నాం. నాకే కాదు మొత్తం దేశానికే ఇవి ఉద్విగ్న క్షణాలు.
- సానియా
వ్యక్తిత్వంలోనూ సచిన్ మనుసున్న మారాజు. అతనికి అంతా మంచే జరగాలి.
- లతా మంగేష్కర్
అసాధ్యాలను సుసాధ్యం చేసిన సచిన్‌కు థాంక్స్.
- అమితాబ్ బచ్చన్
సచిన్‌లాంటి గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్, మేటి ఇన్నింగ్స్‌లను ఇక చూడలేం.
-శ్రీదేవి, సినీ తార
రాష్ట్రంలోనూ...
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ లభించడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్‌ను సత్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి స్వాగతించారు.
‘ప్రపంచ క్రికెట్‌లో సచిన్ సువర్ణాధ్యాయాన్ని లిఖించాడు. దేశంలోని ఆటగాళ్లందరికీ అతనే ప్రేరణ. అలాంటి సచిన్‌కు భారతరత్నతో ప్రభుత్వం గుర్తింపునివ్వడం శుభపరిణామం. ఆటపై నిబద్ధత, అంకితభావాన్ని అతడి నుంచి నేర్చుకోవాలి ’
- వై.ఎస్. జగన్ (వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత)
‘సచిన్‌ను చూసి యువత స్ఫూర్తిపొందాలి. భారత అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యే అర్హతలన్నీ సచిన్‌లో ఉన్నాయి’
- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు
రికార్డుల రారాజు
సచిన్ అంటేనే రికార్డుల రారాజు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని ప్రతీ పరుగు అమూల్యం. అనితర సాధ్యమైన రికార్డులను ఎన్నింటినో మాస్టర్ సొంతం చేసుకున్నాడు.
అతి చిన్న వయసులో....అందరికంటే వేగంగా...అందరికంటే ముందుగా....ఇలా ఎన్నో రికార్డులు మాస్టర్‌కు దాసోహమయ్యాయి. ఇందులో కొన్ని బద్దలు అయ్యే అవకాశం ఉన్నా...మరి కొన్ని ఎప్పటికీ చెరిగిపోనివి. సచిన్ చలవతో పాతికేళ్లుగా క్రికెట్ గణాంక నిపుణులకు చేతి నిండా పని. అలాంటి ఉజ్వల కెరీర్‌లో కీలక అంకెలపై దృష్టి సారిస్తే....
టెస్టుల్లో....
అత్యధిక పరుగులు (15,921)
అత్యధిక ఫోర్లు (2,059)
అత్యధిక సెంచరీలు (51)
అత్యధిక అర్ధ సెంచరీలు (68)
విదేశాల్లో అత్యధిక రన్స్(8,705)
నాలుగో స్థానంలో 13,492 పరుగులు చేసిన సచిన్, ఈ స్థానంలోనే 44 సెంచరీలు చేశాడు.
67 సార్లు జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఘనత
వన్డేల్లో....
అత్యధిక మ్యాచ్‌లు (463)
అత్యధిక బంతులు (21,367) ఎదుర్కొన్న ఆటగాడు
అత్యధిక ఫోర్లు (2,016)
అత్యధిక సెంచరీలు (49)
అత్యధిక అర్ధ సెంచరీలు (96)
అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (62)
అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు (15)
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు (1,894 పరుగులు-1998లో) చేసిన రికార్డు
వరుసగా 185 మ్యాచుల్లో పాల్గొన్న ఘనత (1990 ఏప్రిల్ నుంచి 1998 ఏప్రిల్ వరకు)
అత్యధిక కాలం సాగిన కెరీర్ (22 ఏళ్ల 91 రోజులు)