
పరుగు ఆగింది!
క్రికెట్ దిగ్గజం...పరిపూర్ణ బ్యాట్స్‌మన్...మాస్టర్ బ్లాస్టర్...రికార్డుల రారాజు...సచిన్ టెండూల్కర్ గురించి చెప్పడానికి ఏ విశేషణాలు సరిపోతాయి! క్రికెట్‌నే మతంగా భావించే దేశంలో 24 ఏళ్లు పాటు అతనే దేవుడిగా నిలిచాడు. పదో తరగతి పరీక్షల్లో పాస్ అయ్యేందుకు కుర్రాళ్లు ఆపసోపాలు పడే 16 ఏళ్ల వయసులో ఈ బాలమేధావి దేశానికే ప్రాతినిధ్యం వహించాడు. ఆనాటి నుంచి ఇంతింతై వటుడింతై... అన్నట్లు శిఖరానికి ఎదిగాడు. కోట్లాది భారతీయుల అభిమాన ఆటగాడు ఇక చాలంటూ ఈ రంగం నుంచి తప్పుకున్నాడు.
పరుగు ప్రారంభం...
పాకిస్థాన్‌తో కరాచీలో ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లో సచిన్ 15 పరుగులకే అవుటయ్యాడు. అయితే తర్వాతి మ్యాచ్‌లోనే పాక్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించాడు. వన్డేల్లోనైతే తొలి రెండు మ్యాచుల్లో డకౌట్! అలా ప్రారంభించిన ఈ ప్రయాణం ఇంత సుదీర్ఘ కాలం పాటు సాగుతుందని ఎవరూ ఊహించలేదు.
కానీ సచిన్ నిలబడ్డాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే మాంచెస్టర్‌లో సెంచరీ సాధించి తనేంటో నిరూపించుకున్నాడు. అది మొదలు 90వ దశకం అంతా సచిన్ భారత్‌కు ఆపద్భాంధవుడి పాత్ర పోషించాడు. నిలకడ లేని భారత బ్యాటింగ్ కూలడం, సచిన్ ఒంటరి పోరాటం చేయడం అందరికీ చర్విత చర్వణమే! సచిన్ క్రీజ్‌లో ఉన్నాడంటే అదో అభయం... అవుటయ్యాడంటే మ్యాచ్ చూడటం అనవసరం అనుకోని అభిమాని అప్పట్లో ఎవరూ లేరంటే ఆశ్చర్యమే!
పెదవి దాటని మాట...
రికీ పాంటింగ్‌లా తప్పతాగి బార్‌లో తన్నులు తినలేదు... బ్రియాన్ లారాలా సొంత బోర్డుతో గొడవలు పెట్టుకోలేదు... కలిస్‌లా అమ్మాయిలతో కలిసి తిరిగే పుకార్లు రాలేదు... రికార్డులతో తనతో పోటీ పడిన అనేక మంది క్రికెటర్లలో లేని గొప్పతనం సచిన్‌లో ఉంది. ఆటతోపాటే మంచి వ్యక్తిత్వంతో మాస్టర్ అందరికంటే ఎంతో ఎత్తులో నిలబడ్డాడు. ఏనాడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గానీ, మైదానంలో బూతును వాడటం కానీ ఎన్నడూ చేయలేదు. మంకీ గేట్... ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా...లాంటివి సచిన్‌కు సంబంధించిన వివాదాలు అనడం అర్ధ రహితం. ఎందుకంటే వాటిలో మాస్టర్ పాత్ర ఏమీ లేదు. అవి కేవలం కొంత మంది వ్యక్తుల అభిప్రాయాలు మాత్రమే!
అందరికంటే ప్రత్యేకం...
సచిన్‌కంటే ముందు కూడా భారత క్రికెట్‌లో గవాస్కర్, కపిల్‌దేవ్ లాంటి అనేక మంది దిగ్గజ ఆటగాళ్లు వచ్చారు. ప్రపంచ క్రికెట్‌లో ఈ సంఖ్య మరింత ఎక్కువ. వీరిలో ఎవరికీ లేని ప్రత్యేకత సచిన్‌కు ఎందుకు వచ్చింది! గణాంకాలను మించిన గొప్పతనం సచిన్‌లో ఉండటమే అందుకు కారణం. సచిన్ కేవలం ఒక ఆటగాడిగా మిగిలిపోలేదు. ఆట స్థాయిని పెంచి చూపించాడు. ఈనాడు యువ క్రికెటర్లకు లభిస్తున్న క్రేజ్, అందుతున్న డబ్బు సచిన్ చలవే అంటే అతిశయోక్తి కాదు! 90లలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు మార్కెట్ పెరగడంలో పరోక్షంగా సచిన్ పాత్రను విస్మరించలేం. ఆ సమయంలో సచిన్ చుట్టే క్రికెట్ పరిభ్రమించింది. మాస్టర్ కూడా అందుకు తగినట్లుగా తన అద్భుత ప్రదర్శనతో వెలుగు వెలిగాడు. ఒక క్రికెటర్ బ్రాండింగ్ చేస్తే దానికి ఎంతటి ప్రచారం లభిస్తుందో సచిన్ తర్వాతే అందరికీ తెలిసింది.
ఆలస్యం చేశాడా!
దాదాపు ఏడేళ్ల క్రితమే సచిన్ రిటైర్మెంట్‌పై ‘ఎండూల్కర్’ అంటూ కథనాలు వచ్చాయి. తనతో కలిసి ఆడిన సహచరులు తనపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడం అతడిని బాధించింది. అయితే ఎన్నో ఏళ్ల పాటు కోట్లాది మంది అంచనాలు మోస్తూ... తీవ్ర ఒత్తిడి మధ్య ఆడిన మాస్టర్, తనలో వాడి తగ్గలేదని నిరూపించేందుకే సిద్ధమయ్యాడు.
జట్టులో సీనియర్‌గా ముందుండి నడిపిస్తూ అనేక చారిత్రాత్మక విజయాల్లో భాగమయ్యాడు. 2011 వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాతే సచిన్ తప్పుకోవాల్సిందని చాలా మంది అభిప్రాయ పడ్డారు. కేవలం ఆటపై ప్రేమే అతడిని మరికొంత కాలం ఆడేలా ప్రోత్సహించిందన్నది సత్యం. ఇంకెప్పుడూ రిటైర్ అవుతాడ్రా బాబూ...అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలను చదువుతూ వచ్చిన వారు కూడా సచిన్ రిటైర్ కాగానే అయ్యో అని బాధ పడకుండా ఉంటారా!
- సాక్షి క్రీడా విభాగం