అంతా నీ నామస్మరణే...!
క్రికెట్ ప్రపంచంలో ఈ ఏడాది మార్మోగిన పేరు సచిన్ టెండూల్కర్. సమకాలిన క్రికెట్లో రికార్డుల రారాజుగా వెలుగొందిన ఈ స్టార్ ఆటగాడు క్రికెట్ నుంచి వీడ్కోలు పలకడంతో యావత్ క్రీడాలోకం అతడి నామస్మరణలో మునిగి తేలింది. ఈ ఏడాది ద్వితీయార్థం అంతా సచిన్కు సంబంధించిన వార్తా విశేషాలతో గడిచింది. సొంత మైదానంలో సచిన్ వీడ్కోలు చెప్పడంతో అభిమానుల భావోద్వేగం తారాస్థాయికి చేరింది. క్రికెట్ గురించి తెలియని వారిని కూడా సచిన్ రిటైర్మెంట్ కదిలించింది.
ఇరవై నాలుగేళ్లు తన ఆటతో అలరించిన ఈ క్రికెట్ ‘దేవుడు’ అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. వేలకు వేలు పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఆటతోనే కాదు తన ప్రవర్తన ద్వారా అభిమానులను సంపాదించుకున్నాడు. క్రికెట్లో దాదాపు అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్న మాస్టర్ బ్లాస్టర్ ఆటతోనే కాదు తన ప్రవర్తన ద్వారా అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే అతడు ఆటకు దూరమవుతున్నాడన్న విషయాన్ని అభిమానులు త్వరగా జీర్ణించుకోలేకపోయారు.
క్రికెట్నే శ్వాసగా భావించిన సచిన్ వీడ్కోలు వేళ ఉద్వేగానికి లోనయ్యాడు. 24 ఏళ్లుగా 22 గజాల మధ్య గడిపిన నేను రిటైర్ అవుతున్నాననే విషయం నమ్మలేకపోతున్నానని చెప్పి వినమ్రంగా మైదానం నుంచి నిష్క్రమించాడు. ఆటకు దూరమైనా క్రికెట్ తన అనుంబంధం కొనసాగుతుందని తెలిపాడు. సచిన్ లేని క్రికెట్‌ను ఊహించొచ్చు కానీ క్రికెట్ లేని సచిన్‌ను ఊహించలేకపోతున్నానని అతడి భార్య అంజలి చేసిన వ్యాఖ్యలు- క్రికెట్పై 'మాస్టర్'కున్న మమకారాన్ని తెలుపుతున్నాయి.
క్రీడా రంగంలో అన్ని అవార్డులు అందుకున్న దేశంలో ముఖ్యమైన పౌర పురస్కారాలు పొందిన క్రీడాకారుడిగా కూడా సచిన్ ఖ్యాతి కెక్కాడు. తాజాగా 'భారతరత్న'మయ్యాడు. ఆటకు దూరమైనా సచిన్కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. బీహార్‌లోని కైమూర్ జిల్లా అతర్‌వాలియా గ్రామంలో క్రికెట్ దేవుడికి గుడి కట్టారు. సమాజ్పార్టీ నుంచి అతడికి ఆహ్వానం అందింది. యూనిసెఫ్ దక్షిణాసియా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. సచిన్ జీవిత చర్రితను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2013 సంవత్సరంలో ఇంటర్నెట్లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రీడాకారుల్లో కూడా సచిన్ ముందున్నాడు. దటీజ్ సచిన్!