year ender 2013
-
వచ్చే నెలలో భారతరత్న అందుకోనున్న సచిన్
-
వచ్చే నెలలో భారతరత్న అందుకోనున్న సచిన్
ఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వచ్చే నెల్లో భారతరత్న అవార్డు అందుకోనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన రాష్ట్రపతి చేతులు మీదుగా సచిన్ ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు.ఇరవై నాలుగేళ్లుగా క్రికెట్లో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సచిన్ తన 200వ టెస్టుతో నవంబర్ 16న ఆట నుంచి వైదొలిగారు. అదేరోజు ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఇప్పటికే ఆయన పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. క్రీడా ప్రపంచంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అసలైన రాయబారి టెండ్కూలర్ అని కేంద్రం అధికారిక ప్రకటనలో పేర్కొంది. -
'రావూరి'కు జ్ఞాన్‌పీఠ్ అవార్డు
సినీ ప్రపంచంలో చీకటి కోణాలను ఆవిష్కరించిన నవల 'పాకుడురాళ్లు'. దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞాన్‌పీఠ్ అవార్డు-2012ను ఈ నవల అందుకుంది. ప్రముఖ తెలుగు కవి, నవలాకారుడు, నాటక రచయిత రావూరి భరద్వాజ 1965లో పాకుడురాళ్లు నవలను రాశారు. తెలుగులో తొలి వాస్తవికతా రచన ఇది. సినిమా రంగంపై ఆ తర్వాత ఎన్ని రచనలు వచ్చినా పాకుడురాళ్లు స్థాయిని అందుకోలేకపోయాయి. తెలుగు సాహిత్యంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, ఆధునిక కవి సి. నారాయణరెడ్డి తరువాత ఈ ప్రసిద్ధ అవార్డును అందుకున్న మూడో వ్యక్తి భరద్వాజ. ఆచార్య నాగార్జున, విజ్ఞాన్ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో రావూరిని సత్కరిస్తే కేంద్ర ప్రభుత్వ జ్ఞానపీఠ్ పురస్కారం అందించింది. తెలుగు సాహితీ జగత్తులో కేవలం స్వయంకృషితో,ప్రతిభా పాటవాలతో ఎదిగిన గొప్ప రచయిత రావూరి. రచనే శ్వాసగా జీవించిన రావూరి 1927 జూలై 5న కృష్ణాజిల్లా నందిగామ తాలూకా మొగులూరులో జన్మించారు. ఆయన 70 ఏళ్లపాటు విరమం లేకుండా 187 రచనలు, 17 నవలలు, 500 కథలు, పలు తెలుగు సినిమాలకు కథలు, మాటలు రాశారు. రావూరి కిడ్ని వ్యాధితో అక్టోబర్ 18న కన్నుమూశారు. జ్ఞానపీఠ్’ వరించిన ఆరు నెలలకే రావూరి కన్నుమూయడం పాఠకులను కలచివేసింది. కాత్యాయనీ విద్మహేకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రముఖ తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు, కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ అనే సాహిత్య విమర్శ గ్రంథానికి గాను ఆమెకు ఈ పురస్కారం దక్కింది. 22 భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ-2013 పురస్కారాలకు ఎంపికైన రచయితల్లో ... బాలీవుడ్ సినీ రచయిత జావేద్ అక్తర్‌కు ఉర్దూ విభాగంలో లావా కవితా సంపుటికిగాను అవార్డు దక్కింది. వచ్చే ఏడాది మార్చి 11న జరిగే అకాడమీ వార్షిక సాహిత్యోత్సవంలో విజేతలను రూ.లక్ష నగదు, తామ్రపత్రంతో సత్కరిస్తారు. చివరకు మిగిలేది- మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా విమర్శపై కాత్యాయని పీహెచ్డీ చేశారు. పలు సాహిత్య, సామాజిక అంశాలపై 285 వ్యాసాలు రాశారు. 275 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆమె మూడున్నర దశాబ్దాలుగా కాకతీయ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కాత్యాయని వద్ద 11మంది పీహెచ్డీ డిగ్రీలు పొందారు. తెలంగాణ సాహిత్యం-ప్రాంతీయత, తెలుగు నవలాకథానిక విమర్శ పరిణామం, ఆధునిక తెలుగుసాహిత్యం స్త్రీవాద భూమిక వంటి ఎన్నో రచనలు చేశారు. పులికంటి కృష్ణారెడ్డి అవార్డు, రంగవల్లి స్మారక పురస్కారం తదితర అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ర్ట కార్యదర్శిగా, మానవహక్కుల వేదిక సభ్యురాలిగా ఉన్నారు. -
సచిన్, సీఎన్ఆర్ రావులకు భారతరత్న
భారతదేశంలో 2013 సంవత్సరంలో పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని అవార్డులు వరించాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది భారతరత్న. భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'. కళలు, సాహిత్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలు, ప్రజా సేవల రంగాలలో అత్యున్నత కృషికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ , సైన్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన సిఎన్ఎస్ రావులను ఈ ఏడాది ఈ పురస్కారం వరించింది. 2011లో క్రీడలను కూడా భారతరత్న పురస్కారాన్ని ఈ జాబితాలో చేర్చారు. సచిన్ టెండూల్కర్ 24 ఏళ్లుగా క్రికెట్లో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సచిన్ తన 200వ టెస్టుతో నవంబర్ 16న ఆట నుంచి వైదొలిగారు. అదేరోజు ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఇప్పటికే ఆయన పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. క్రీడా ప్రపంచంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అసలైన రాయబారి టెండ్కూలర్ అని కేంద్రం అధికారిక ప్రకటనలో పేర్కొంది. 16 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌పై కరాచీలో 1989, నవంబర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో సచిన్ టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టారు. టెస్టుల్లో మొత్తం 15,921 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 248 నాటౌట్. అదేవిధంగా 1989, డిసెంబర్ 18న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే క్రికెట్లో కాలుమోపారు. వన్డేల్లో మొత్తం 463 మ్యాచ్‌లు ఆడి, 18,426 పరుగులు చేశారు. ఇందులో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 200 నాటౌట్. ఈ అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు, అతి పిన్న వయస్కుడుగా సచిన్‌కు గుర్తింపు దక్కింది. ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు పూర్తిపేరు చింతామణి నాగేశ రామచంద్రరావు. 2005 నుంచి ప్రధానమంత్రి శాస్త్ర సలహామండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సీఎన్ఆర్ రావును కేంద్రం రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఆయన సాలిడ్ స్టేట్, మెటీరియల్స్ కెమిస్ట్రీలో అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన శాస్త్రవేత్త. నాన్ మెటీరియల్స్, గ్రాఫీన్‌లపై రెండు దశాబ్దాలుగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఆయన దాదాపు 1400 పరిశోధన పత్రాలు, 45 పుస్తకాలు ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా 60 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సీఎన్ఆర్ రావు 1934, జూన్ 30న బెంగళూరులో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చేశారు. అమెరికాలోని పర్డ్యు యూనివర్సిటీ నుంచి 1958లో పీహెచ్డీ అందుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో రసాయనశాస్త్ర అధిపతిగా 13 ఏళ్లు పనిచేశారు. 1984లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు 2005లో నోబెల్ బహుమతితో సమానమైన పది లక్షల డాలర్ల డాన్ డేవిడ్ ప్రైజ్ లభించింది. సర్ సి.వి.రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత భారతరత్నకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు. భారతరత్నతో పాటు సీఎన్ఆర్ రావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్(సీఏఎస్)లో ఆయనకు గౌరవ విదేశీ సభ్యుడి హోదా దక్కింది. ఇప్పటివరకూ ఈ అవార్డును మొత్తం 41 మంది అందుకున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 1954లో ఏర్పాటు చేశారు. భారతరత్న పురస్కారాన్ని చివరిసారిగా 2009లో పండిట్ భీమ్సేన్ జోషికి ప్రదానం చేశారు. ఈ అవార్డును మరణానంతరం పొందిన మొదటి వ్యక్తి భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఆయనకు 1966లో ఈ అవార్డు లభించింది. భారతరత్న పొందిన మొదటి మహిళ ఇందిరాగాంధీ (1971). భారతరత్న ఇద్దరు విదేశీయులకు కూడా లభించింది. 1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (పాకిస్థాన్)కు, 1990లో నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా)కు లభించింది. -
జంట నగరాలకు వరం.. మెట్రో రైలు!
రాష్ట్ర రాజధానిలో రోడ్డు మీదకు వెళ్లాలంటే చాలు.. విపరీతమైన దుమ్ము, పొగ. దానికితోడు విపరీతమైన ట్రాఫిక్ జామ్. ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి వెళ్లాలంటే కనీసం మూడు నాలుగు గంటల సమయం పడుతుంది. ఇలాంటి కష్టాల నుంచి నగరవాసులకు విముక్తి కలిగించేందుకు దూసుకొచ్చేస్తోంది.. మెట్రో రైలు. 2012లోనే ప్రారంభమైన మెట్రోరైలు పనులు.. 2013 సంవత్సరంలో పూర్తి స్థాయిలో జరిగాయి. పిల్లర్లు లేవడం దగ్గర్నుంచి వయడక్టులు వేయడం, వాటిపైన పట్టాలు పరవడం వరకు కూడా కొన్ని మార్గాల్లో పూర్తయింది. ఇక వచ్చే సంవత్సరం ఉగాది నాటికి.. అంటే, తెలుగు కొత్త సంవత్సరంలో మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఒక మార్గంలో మాత్రం అప్పటికి నడుస్తుందని, మిగిలిన అన్ని కారిడార్లలో పూర్తి కావాలంటే మరింత సమయం పడుతుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు అయిన మెట్రోరైలు తొలి దశలో ఉప్పల్ నుంచి మెట్టుగూడ మార్గంలో 2014 ఉగాది నాటికి నడుస్తుందని అధికారులు అంటున్నారు. దీనికి అనుగుణంగా నాగోల్ నుంచి మెట్టుగూడ మార్గంలో 8 కిలోమీటర్ల పొడవున మెట్రో వయడక్ట్ మీద పట్టాలు పరిచే పని ఈ సంవత్సరం నవంబర్‌లో మొదలైంది. మొత్తం 16,735 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 204 ఎకరాల భూమి అవసరం. ఇందులో చాలా భాగాన్ని ఇప్పటికే సేకరించారు. ప్రాజెక్టులో ఇప్పటికి నాలుగోవంతు పనులు మాత్రమే పూర్తయినా.. ఇప్పటినుంచి శరవేగంగా పనులు నడుస్తుండటంతో 2015 నాటికి పూర్తి స్థాయిలో మెట్రో సేవలు జంట నగరాల వాసులకు అందుబాటులోకి వచ్చేలా ఉన్నాయి. మెట్రోరైలు మార్గంలో మొత్తం 2700 పిల్లర్లున్నాయి. వీటిలో 1100 పిల్లర్లకు పునాదులు పూర్తయ్యాయి. మరో 1600 పిల్లర్లకు పునాదులు వేయాలి. ఒక్కో పిల్లర్ పూర్తిచేయడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుంది. ఉప్పల్ డిపో పనులు 86% పూర్తయ్యాయి, రెండు నెలల్లో ముగుస్తాయి. మియాపూర్ డిపోలో 68% పనులు పూర్తయ్యాయి. 10 కిలోమీటర్ల మేర వయడక్టులు వేసే పని పూర్తయింది. కొన్నిచోట్ల మినహా ఉప్పల్-మెట్టుగూడ మార్గం పని మొత్తం పూర్తయింది. -
సంచలనాల సింధు!
పూసర్ల వెంకట సింధు.. ఈ ఏడాది భారత్ బ్యాడ్మింటన్‌లో దూసుకుపోయిన తార. సంచలన విజయాలతో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తనదైన ముద్ర వేసింది ఈ రైజింగ్ స్టార్. నిలకడైన ఆటతీరుతో విజయాలు సాధిస్తూ 2013 సంవత్సరాన్ని ప్రత్యేకంగా మలుచుకుంది ఈ 18 ఏళ్ల తెలుగు తేజం. భారత్‌లో బ్యాడ్మింటన్‌కు చిరునామాగా మారిన హైదరాబాద్‌లోనే పుట్టిన సింధు చిరుప్రాయంలోనే వరల్డ్ టైటిల్స్ నెగ్గి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది సింధు సాధించిన విజయాల్లో ప్రాధానంగా చెప్పుకోదగ్గది ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం. ప్రకాశ్ పదుకొనే తర్వాత వ్యక్తిగత విభాగంలో మెడల్ గెలిచిన భారత క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. దీంతో పాటు గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలలో రెండు స్వర్ణాలు పతకాలు నెగ్గింది. మలేసియా ఓపెన్, మకావు ఓపెన్ టైటిల్స్ గెలిచి సత్తా చాటింది. జాతీయస్థాయి సీనియర్ టైటిల్ రెండోసారి సొంతం చేసుకుని తన హవా కొనసాగింది. సింధుకు 2103 బాగానే కలిసివచ్చిందని చెప్పాలి. ఈ ఏడాదే కేంద్ర క్రీడాపురస్కారం ‘అర్జున అవార్డు’ పొందింది. ఐపీఎల్ తరహాలో బ్యాడ్మింటన్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లోనూ తన టీమ్‌ను ఫైనల్ వరకూ తీసుకొచ్చింది. ఈ ఏడాది సైనా నెహ్వాల్ కంటే మెరుగ్గా రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధుతో ఒప్పందం చేసుకునేందుకు విఖ్యాత క్రీడాసామాగ్రి తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి. 2014లోనూ ఈ జోరు కొనసాగించాలని సింధు పట్టుదలగా ఉంది. -
ఆనంద్‌కు అచ్చిరాలేదు!
భారత చదరంగ రారాజుగా వెలుగొందున్న విశ్వనాథన్ ఆనంద్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్ కిరీటాన్ని దక్కించుకున్న విషీకి 2013 చేదు అనుభవాల్నే మిగిల్చింది. ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాలన్న అతడి ఆశలు సఫలం కాలేదు. సొంతగడ్డపై వరల్డ్ విజేతగా నిలవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. చెన్నైలో నవంబర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ చెస్ పోటీలో ఆనంద్ అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఒత్తిడి లోనయి తన వయసులో సగం వయసున్న కార్ల్సెన్ చేతిలో ఓడిపోయి టైటిల్ చేజార్చుకున్నాడు. టోర్నీ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఆనంద్ ఆ తర్వాత పట్టుసడలించాడు. ఈ బిగ్ ఈవెంట్ కోసం బాగా సన్నద్ధమయినప్పటికీ కార్ల్సెన్ పెట్టిన మానసిక ఒత్తిడికి విషీ బోల్తా పడ్డాడు. ప్రత్యర్థి ఆటకట్టించే స్థాయిలో ఎత్తులు వేయకపోవడంతో ఆనంద్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో ఆరోసారి ప్రపంచ టైటిల్ అందుకోలేకపోయాడు. ఇక డిసెంబర్లో జరిగిన లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లోనూ విశ్వనాథన్ ఉస్సూరనిపించాడు. వరల్డ్ టైటిల్ ఓటమి నుంచి తేరుకోక ముందే మరో పరాజయాన్ని చవిచూశాడు. ప్రత్యర్థుల ముందు అతడి ఎత్తులు పారకపోవడంతో క్వార్టర్ ఫైనల్స్‌లోనే టోర్ని నుంచి నిష్క్రమించాడు. మే నెలలో జరిగిన నార్వే సూపర్ చెస్ టోర్నమెంట్లో కూడా ఆనంద్‌కు కలిసి రాలేదు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో తడబడి టైటిల్ కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2013 మిగిల్చిన చేదు అనుభవాల నుంచి తొందరగా బయటపడాలని విశ్వానాథన్ ఆనంద్ తపిస్తున్నాడు. విజయం కోసం తహతహ లాడుతున్నాడు. గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. అయితే వయసు తనకు అడ్డంకి కాదంటున్నాడు 44 ఏళ్ల ఈ చదరంగ మేధావి. టాప్‌టెన్‌లో ఎక్కువగా యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ తాను ఆ దిశగా ఆలోచించడం లేదంటున్నాడు. అయితే 50 ఏళ్లు వచ్చే వరకు చెస్ ఆడనని స్పష్టం చేశాడు. ఎన్నేళ్లకు రిటైర్ అవుతానన్నది మాత్రం చెప్పలేదు. 2014 తనకు కలిసొస్తుందని విషీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. మార్చిలో జరగనున్న ‘క్యాండిడేట్స్ టోర్నీ’లో విజేతగా నిలిచేందుకు సన్నద్దమవుతున్నాడు. -
అంతా నీ నామస్మరణే...!
క్రికెట్ ప్రపంచంలో ఈ ఏడాది మార్మోగిన పేరు సచిన్ టెండూల్కర్. సమకాలిన క్రికెట్లో రికార్డుల రారాజుగా వెలుగొందిన ఈ స్టార్ ఆటగాడు క్రికెట్ నుంచి వీడ్కోలు పలకడంతో యావత్ క్రీడాలోకం అతడి నామస్మరణలో మునిగి తేలింది. ఈ ఏడాది ద్వితీయార్థం అంతా సచిన్‌కు సంబంధించిన వార్తా విశేషాలతో గడిచింది. సొంత మైదానంలో సచిన్ వీడ్కోలు చెప్పడంతో అభిమానుల భావోద్వేగం తారాస్థాయికి చేరింది. క్రికెట్ గురించి తెలియని వారిని కూడా సచిన్ రిటైర్మెంట్ కదిలించింది. ఇరవై నాలుగేళ్లు తన ఆటతో అలరించిన ఈ క్రికెట్ ‘దేవుడు’ అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. వేలకు వేలు పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఆటతోనే కాదు తన ప్రవర్తన ద్వారా అభిమానులను సంపాదించుకున్నాడు. క్రికెట్లో దాదాపు అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్న మాస్టర్ బ్లాస్టర్ ఆటతోనే కాదు తన ప్రవర్తన ద్వారా అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే అతడు ఆటకు దూరమవుతున్నాడన్న విషయాన్ని అభిమానులు త్వరగా జీర్ణించుకోలేకపోయారు. క్రికెట్‌నే శ్వాసగా భావించిన సచిన్ వీడ్కోలు వేళ ఉద్వేగానికి లోనయ్యాడు. 24 ఏళ్లుగా 22 గజాల మధ్య గడిపిన నేను రిటైర్ అవుతున్నాననే విషయం నమ్మలేకపోతున్నానని చెప్పి వినమ్రంగా మైదానం నుంచి నిష్క్రమించాడు. ఆటకు దూరమైనా క్రికెట్ తన అనుంబంధం కొనసాగుతుందని తెలిపాడు. సచిన్ లేని క్రికెట్‌ను ఊహించొచ్చు కానీ క్రికెట్ లేని సచిన్‌ను ఊహించలేకపోతున్నానని అతడి భార్య అంజలి చేసిన వ్యాఖ్యలు- క్రికెట్‌పై 'మాస్టర్'కున్న మమకారాన్ని తెలుపుతున్నాయి. క్రీడా రంగంలో అన్ని అవార్డులు అందుకున్న దేశంలో ముఖ్యమైన పౌర పురస్కారాలు పొందిన క్రీడాకారుడిగా కూడా సచిన్ ఖ్యాతి కెక్కాడు. తాజాగా 'భారతరత్న'మయ్యాడు. ఆటకు దూరమైనా సచిన్‌కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. బీహార్‌లోని కైమూర్ జిల్లా అతర్వాలియా గ్రామంలో క్రికెట్ దేవుడికి గుడి కట్టారు. సమాజ్‌పార్టీ నుంచి అతడికి ఆహ్వానం అందింది. యూనిసెఫ్ దక్షిణాసియా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. సచిన్ జీవిత చర్రితను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2013 సంవత్సరంలో ఇంటర్నెట్లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రీడాకారుల్లో కూడా సచిన్ ముందున్నాడు. దటీజ్ సచిన్! -
అన్వేషణలో హైదరాబాద్‌కు అగ్రస్థానం!
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఈ ఏడాది నెటిజన్ల హాట్ ఫేవరేట్‌గా నిలిచింది. మన దేశంలో అత్యధిక మంది నెటిజన్లు భాగ్యనగరం కోసం ఇంటర్నెట్లో శోధించారు. సెర్జ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లో 2013లో ఎక్కువ మంది హైదరాబాద్ సమాచారం కోసం అన్వేషించారు. మెట్రో నగరాలు ముంబై, బెంగళూరులను వెనక్కి నెట్టి 'మన సిటీ' కోసం వెతికారు. ఫిబ్రవరిలో దిల్‌షుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లు సంభవించడంతో హైదరాబాద్ సమాచారం కోసం ఎక్కువ మంది ఆన్లైన్లో అన్వేషించారు. జంట పేలుళ్లకు 17 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన జూలై, ఆగస్టు మాసాల్లో కూడా హైదరాబాద్ కోసం అత్యధికులు శోధించారు. సెప్టెంబర్‌లో ఐపీఎల్, తీవ్రవాది యాసిన్ భత్కల్ను హైదరాబాద్ పోలీసులు ప్రశ్నించినప్పుడు, అక్టోబర్‌లో వాల్వో బస్సు దుర్ఘటన జరిగినప్పుడు భాగ్యనగరం కోసం నెటిజన్లు ఆతృతగా శోధించారని గూగుల్ ఇండియా వెల్లడించింది. -
హిప్.. హిప్.. ముర్రే!
సమకాలిన టెన్నిస్ క్రీడలో పట్టువదలని విక్రమార్కుడిలా పయనం సాగించిన ఆటగాడు ఆండీ ముర్రే. కెరీర్ ఆరంభంలో ఎన్ని పరాజయాలు ఎదురైనా లెక్కచేయకుండా పోరాటం సాగించిన యోధుడు. టైటిళ్ల వేటలో ఎన్నోసార్లు చివరిమెట్టుపై బోల్తా పడినా ఈ స్కాట్లాండ్ ఆటగాడు టెన్నిట్ రాకెట్ వదిలిపెట్ట లేదు. రాజీలేని పోరాటంతో రన్నరప్‌గా మిగిలిన చోటే విజేతగా అవరించాడు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో పంతం పట్టాడు. చివరకు విజయాల బాట పట్టాడు. తమ దేశానికి చారిత్రక విజయాన్ని అందించి టెన్నిస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. 77 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను బ్రిటన్‌కు సాధించిపెట్టాడు ఆండీ ముర్రే. ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను మట్టికరిపించి అతడీ టైటిల్ సాధించడం విశేషం. 1896లో హరోల్డ్ మహోనీ తర్వాత వింబుల్డన్ టైటిల్ నెగ్గిన స్కాట్లాండ్ ప్లేయర్‌గా ఆండీ ముర్రే ఘనత సాధించాడు. అంతేకాదు తన గురువు ఇవాన్ లెండిల్కు తీరని కలగా ఉన్న వింబుల్డన్‌ను తాను సాకారం చేశాడు. వింబుల్డన్‌లో ఈ ఏడాది జూలై 7న ముర్రే, జొకోవిచ్ మధ్య జరిగిన తుది సమరం సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. వింబుల్డన్‌లో చివరిసారి బ్రిటన్ నుంచి వర్జీనియా వేడ్ 1977లో టైటిల్ సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ఫ్రెడ్ పెర్రీ టైటిల్ గెలిచి ఈ సంవత్సరానికి 77 ఏళ్లయింది. ఈసారి ఫైనల్ మ్యాచ్ ఏడో నెల జూలైలో 7వ తేదీనే జరిగింది. ముర్రే (15-5-1987), జొకోవిచ్ (22-5-1987) పుట్టిన రోజులోనూ తేడా 7 రోజులు ఉంది. పడిలేచిన కెరటానికి ప్రతీకగా నిలుస్తాడు 26 ఏళ్ల ఆండీ ముర్రే. గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఎన్నోసార్లు తృటిలో చేజారినా నిరుత్సాహ పడలేదు. సడలని సంకల్పంతో అపూర్వ విజయాలు సొంతం చేసుకున్నాడు. అందుకే ప్రఖ్యాత మీడియా సంస్థ ‘బీబీసీ’ అతడికి 2013 సంవత్సరానికి గానూ వార్షిక ఉత్తమ క్రీడాకారుడు పురస్కారం అందజేసింది. అథ్లెట్ మో ఫరా... ‘టూర్ డి ఫ్రాన్స్’ విజేత క్రిస్ ఫ్రూమ్... యూఎస్ ఓపెన్ గోల్ఫ్ చాంపియన్ జస్టిన్ రోస్ కాదని ముర్రేకు ఈ పురస్కారం కట్టబెట్టారు. ముర్రే మరిన్ని సంచలనాలు సృష్టిచాలని టెన్నిస్ అభిమానులు కోరుకుంటున్నారు.