ఆనంద్కు అచ్చిరాలేదు!
భారత చదరంగ రారాజుగా వెలుగొందున్న విశ్వనాథన్ ఆనంద్కు ఈ ఏడాది కలిసి రాలేదు. ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్ కిరీటాన్ని దక్కించుకున్న విషీకి 2013 చేదు అనుభవాల్నే మిగిల్చింది. ఆరోసారి ప్రపంచ చాంపియన్గా అవతరించాలన్న అతడి ఆశలు సఫలం కాలేదు. సొంతగడ్డపై వరల్డ్ విజేతగా నిలవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు.
చెన్నైలో నవంబర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ చెస్ పోటీలో ఆనంద్ అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఒత్తిడి లోనయి తన వయసులో సగం వయసున్న కార్ల్‌సెన్ చేతిలో ఓడిపోయి టైటిల్ చేజార్చుకున్నాడు. టోర్నీ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఆనంద్ ఆ తర్వాత పట్టుసడలించాడు. ఈ బిగ్ ఈవెంట్ కోసం బాగా సన్నద్ధమయినప్పటికీ కార్ల్‌సెన్ పెట్టిన మానసిక ఒత్తిడికి విషీ బోల్తా పడ్డాడు. ప్రత్యర్థి ఆటకట్టించే స్థాయిలో ఎత్తులు వేయకపోవడంతో ఆనంద్కు భంగపాటు తప్పలేదు. దీంతో ఆరోసారి ప్రపంచ టైటిల్ అందుకోలేకపోయాడు.
ఇక డిసెంబర్లో జరిగిన లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లోనూ విశ్వనాథన్ ఉస్సూరనిపించాడు. వరల్డ్ టైటిల్ ఓటమి నుంచి తేరుకోక ముందే మరో పరాజయాన్ని చవిచూశాడు. ప్రత్యర్థుల ముందు అతడి ఎత్తులు పారకపోవడంతో క్వార్టర్ ఫైనల్స్‌లోనే టోర్ని నుంచి నిష్క్రమించాడు. మే నెలలో జరిగిన నార్వే సూపర్ చెస్ టోర్నమెంట్‌లో కూడా ఆనంద్కు కలిసి రాలేదు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో తడబడి టైటిల్ కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
2013 మిగిల్చిన చేదు అనుభవాల నుంచి తొందరగా బయటపడాలని విశ్వానాథన్ ఆనంద్ తపిస్తున్నాడు. విజయం కోసం తహతహ లాడుతున్నాడు. గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. అయితే వయసు తనకు అడ్డంకి కాదంటున్నాడు 44 ఏళ్ల ఈ చదరంగ మేధావి. టాప్టెన్లో ఎక్కువగా యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ తాను ఆ దిశగా ఆలోచించడం లేదంటున్నాడు. అయితే 50 ఏళ్లు వచ్చే వరకు చెస్ ఆడనని స్పష్టం చేశాడు. ఎన్నేళ్లకు రిటైర్ అవుతానన్నది మాత్రం చెప్పలేదు. 2014 తనకు కలిసొస్తుందని విషీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. మార్చిలో జరగనున్న ‘క్యాండిడేట్స్ టోర్నీ’లో విజేతగా నిలిచేందుకు సన్నద్దమవుతున్నాడు.