World Chess Championship
-
జాతికి గర్వకారణం
పది, పన్నెండేళ్ళుగా కంటున్న కలను నెరవేరిన తరుణం ఇది. చిన్నప్పుడు ఆడడం మొదలుపెడు తూనే మనసులో నాటిన లక్ష్యాన్ని సాధించిన చేరుకున్న దిగ్విజయ క్షణాలివి. అత్యంత పిన్నవయ స్కుడైన ప్రపంచ చదరంగ ఛాంపియన్‌గా నిలవడంతో పద్ధెనిమిదేళ్ళ దొమ్మరాజు గుకేశ్‌కు చిర కాలపు స్వప్నం సాకారమైంది. చరిత్రలో నిన్నటి వరకు గుకేశ్ కేవలం పిన్నవయస్కుడైన మూడో గ్రాండ్ మాస్టర్. కానీ, సింగపూర్‌లో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గురువారం సాయంకాలపు విజయంతో ఈ టీనేజ్ కుర్రాడు చదరంగ చరిత్రలో కొత్త అధ్యాయం రచించాడు. సుదీర్ఘ కాలం తరువాత మనవాడు ఒకడు ఇలా భారత ఘనవారసత్వ సంప్రదాయ ప్రాచీనక్రీడ చదరంగంలో జగజ్జేతగా నిలిచి, జాతికి గర్వకారణమయ్యాడు.చైనాకు చెందిన ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్‌పై చిరస్మరణీయ విజయంతో, అంచనాల్ని అధిగమించి, కాస్పరోవ్, మ్యాగ్నస్ కార్ల్సెన్ సరసన తన పేరు లిఖించాడు. గతంలో కాస్పరోవ్ పేరిట ఉన్న అత్యంత పిన్నవయస్కుడైన ప్రపంచ ఛాంపియన్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇది ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే క్షణం. మన చదరంగ క్రీడాలోకంలోనే కాదు... క్రీడాకారులందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తించే సందర్భం. నిజానికి, ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో కొన్నిసార్లు గుకేశ్ తడబడకపోలేదు. మొత్తం 14 గేమ్‌ల ఈ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్ ప్రస్థానం అతని పట్టుదల, వ్యూహచతురతకు నిదర్శనం. మొదట్లో తడబడి, ఓపెనింగ్ రౌండ్లో ఓటమి పాలయ్యాడు. కానీ, కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో విజృంభించాడు. విమర్శలను విజయసోపానాలుగా మలుచుకున్నాడు. పట్టువదలని విక్రమార్కు డిలా ఆటలో పైచేయి సాధించాడు. మొదటి నుంచి గుకేశ్ బృందం వేసుకున్న వ్యూహం ఒకటే. గుకేశ్ తన లాగా తాను ఆడాలి. అంతే! పక్కా ప్రణాళికతో ఈ యువ ఆటగాడు, అతని క్రీడాశిక్షకుడు, మిగతా బృందం పడ్డ శ్రమ ఫలించింది. కొన్నిసార్లు ఆట ఆరంభపుటెత్తులను ఆఖరి నిమిషంలో నిర్ణయిస్తే, మరికొన్నిసార్లు వాటి మీద వారాల తరబడి కసరత్తు చేస్తూ వచ్చారు. ఆ సాధన ఉపకరించింది. డింగ్‌తో ప్రతి గేమ్‌లోనూ తన ఓపెనింగ్స్ ద్వారా ప్రత్యర్థిని గుకేశ్ ఆశ్చర్యపరిచాడు. 14 గేమ్‌ల మ్యాచ్‌లో 13 గేమ్‌లు ముగిసినా, చెరి రెండు విజయాలతో టై నెలకొంది. ఆ పరిస్థితుల్లో గురువారం నాటి 14వ గేమ్ ఒక దశలో డ్రా దిశగా వెళుతున్నట్టు అనిపించినా, ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్ అనూహ్యంగా దిద్దుకోలేని తప్పు చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకొని, గుకేశ్ తన ప్రత్యర్థి ఆట కట్టించాడు. 2.5 మిలియన్ డాలర్ల బహుమతి నిధిలో సింహభాగాన్నిసంపాదించాడు. గతంలో ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన విశ్వనాథన్ ఆనందన్ తర్వాత మళ్ళీ ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడు అయ్యాడు.ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ చెన్నై చిన్నోడు ఈ విజయంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టిన క్షణాలు, బయటకు వస్తూనే తండ్రిని గాఢంగా హత్తుకొని మాటల కందని భావా లను మనసుతో పంచుకున్న దృశ్యాలు ఇప్పుడిప్పుడే ఎవరికీ మరపునకు రావు. గుకేశ్ ఇప్పుడు చద రంగ ప్రపంచానికి సరికొత్త రారాజు. లెక్కల్లో చూస్తే, ప్రపంచ చదరంగానికి 18వ చక్రవర్తి. చదరంగంలో గుకేశ్ ప్రస్థానం ఇప్పుడొక పూర్తి ఆవృత్తం పూర్తి చేసుకుందనుకోవచ్చు. 2013లో 7 ఏళ్ళ గుకేశ్ చెన్నైలో ప్రేక్షకుల మధ్య కూర్చొని, విశ్వనాథన్ ఆనంద్‌కూ, మ్యాగ్నస్ కార్ల్సెన్కూ మధ్య జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూశాడు. ఆ మ్యాచ్‌లో గెలిచిన కార్ల్సెన్ అప్పటి నుంచి గత ఏడాది వరకు ప్రపంచ ఛాంపియన్‌గా పట్టు కొనసాగించారు. నిరుడు డింగ్ ఆ పట్టం గెలిచారు. చిన్న నాటి నుంచి అలా సౌండ్‌ప్రూఫ్ గ్లాస్ బూత్‌లో కూర్చొని, ఆటలో గెలవాలని కలలు గన్న గుకేశ్ ఎట్టకే లకు ఆ స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు. అయితే, ఇంత త్వరగా తన ఆకాంక్ష నెరవేరుతుందని అతనూ ఊహించలేదు. కార్ల్సెన్ నంబర్ 1 ర్యాంకులో ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ తాను ప్రపంచ అత్యుత్తమ ఆటగాణ్ణి కాదని వినయం ప్రదర్శిస్తున్నాడు. ఏదో ఒక రోజున కార్ల్సెన్లా చెస్ ప్రపంచాన్ని ఏలాలని తమిళనాట పెరిగిన ఈ తెలుగు మూలాల టీనేజ్ కుర్రాడు ఆశిస్తున్నాడు. గతంలో 22 ఏళ్ళ వయసుకే గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్ సాధించారు. అప్పట్లో ఆయన అనటోలీ కార్పోవ్‌ను ఓడించి, ఆ టైటిల్ సాధించి, అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించారు. కేవలం పన్నెండేళ్ళ ఏడు నెలల వయసుకే గ్రాండ్ మాస్టరైన గుకేశ్ ఇప్పుడు 18వ ఏట ఆ ఘనత సాధించడం ఎలా చూసినా విశేషమే. గుకేశ్ బాటలోనే మన దేశ కీర్తిపతాకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగల సత్తా ఉన్న ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇటీవల బుడాపెస్ట్‌లో జరిగిన ఒలింపియాడ్‌లో ఓపెన్ గోల్డ్, ఉమెన్స్ గోల్డ్... రెంటినీ భారత చదరంగ జట్లు విజయవంతంగా గెలిచాయి. ప్రస్తుతం దాదాపు 85 మందికి పైగా గ్రాండ్ మాస్టర్లు భారత్‌లో ఉన్నారనేది ఆశ్చర్యపరిచే గణాంకం. పైగా, వారిలో చాలామంది ఇప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రానంతటి పిన్న వయస్కులు. అంటే ఈ విశ్వక్రీడలో భారత్‌కు ఎంతటి బంగారు భవిష్యత్తు ఉందో అర్థం చేసుకోవచ్చు. రాగల రోజుల్లో ప్రజ్ఞానంద లాంటి పలువురు ప్రపంచ ఛాంపియన్లుగా ఎదగగల సత్తా పుష్కలంగా ఉన్నవారు. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ శిష్యరికంలో ఈ స్థాయికి ఎదిగిన గుకేశ్ ఇప్పుడు అలాంటి ఎందరికో సరికొత్త ప్రేరణ. సుదీర్ఘ క్రీడా జీవితం ముందున్న ఈ టీనేజర్ భవిష్యత్ ప్రయాణంలో ఈ కొత్త ప్రపంచ కిరీటం ఓ మైలురాయి మాత్రమే. రానున్న రోజుల్లో ఇలాంటివి అనేకం కైవసం చేసుకొని, మరింత మంది గుకేశ్ల రూపకల్పనకు ఈ కుర్రాడు స్ఫూర్తి కిరణంగా భాసించడం ఖాయం. -
Gukesh: ‘ట్రోఫీ చాలా బాగుంది.. కానీ అప్పుడే దానిని ముట్టుకుంటా’
సింగపూర్ సిటీ: ‘ట్రోఫీ చూడటానికి చాలా బాగుంది. కానీ నేను ఇప్పుడు దీనిని ముట్టుకోను. బహుమతి ప్రదానోత్సవ సమయంలోనే అందుకుంటాను’... విశ్వ విజేతగా నిలిచిన తర్వాతి రోజు కొత్త ఉత్సాహంతో కనిపిస్తూ గుకేశ్ చెప్పిన మాట ఇది. ముగింపు కార్యక్రమానికి కొద్దిసేపు ముందు జరిగిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో ఇది చోటు చేసుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రోఫీని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి అంటూ గుకేశ్ తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ఫొటో షూట్ సమయంలోనూ అతను దానిని ముట్టుకోలేదు. ప్రపంచ చాంపియన్ హోదాలో శుక్రవారం గుకేశ్ బిజీబిజీగా గడిపాడు. ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు, ఇంటర్వ్యూలతో పాటు పెద్ద సంఖ్యలో చెస్ అభిమానులకు అతను ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. వీరిలో భారత అభిమానులతో పాటు సింగపూర్‌కు చెందిన చదరంగ ఔత్సాహికులు కూడా ఉన్నారు. తాము వెంట తెచ్చుకున్న చెస్ బోర్డులపై వారు వరల్డ్ చాంపియన్ ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నారు. ఆటోగ్రాఫ్ కోసం నిలబడిన వారి సంఖ్య అనంతంగా సాగింది. ఆ తర్వాత గుకేశ్ ఎంతగానో ఎదురు చూసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ‘ఫిడే’ అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్ జగజ్జేత గుకేశ్‌కు ట్రోఫీతో పాటు బంగారు పతకాన్ని, ప్రైజ్‌మనీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన భారత గ్రాండ్‌మాస్టర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుతమైన ఆట, చిరకాలం గుర్తుండిపోయే ప్రదర్శనగా గుకేశ్ విజయాన్ని ఆయన అభివర్ణించారు. తన విజయానందాన్ని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ...‘18వ ఏట 18వ చాంపియన్’ అంటూ గుకేశ్ ట్వీట్ చేశాడు. నా ప్రయాణం ఒక కలలా సాగిందిఇలాంటి క్షణం కోసం ఇంతకాలం ఎదురు చూశాను. ఇలాంటి రోజు కోసమే ప్రతీ రోజూ నిద్ర లేచేవాడిని. ఇప్పుడు ఈ ట్రోఫీని నా చేతుల్లో తీసుకున్న ఆనందంతో పోలిస్తే నా జీవితంలో ఏదీ సాటి రాదు. నా ప్రయాణం ఒక కలలా సాగింది. ఈ క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ నా చుట్టూ ఉన్నవారి అండతో అన్నింటినీ అధిగమించగలిగాను. కష్టాల్లో ఉన్న సమయంలో పరిష్కారం లభించనప్పుడు దేవుడే నాకు తగిన దారి చూపించాడు. –ట్రోఫీని అందుకున్న తర్వాత గుకేశ్ స్పందన -
గుకేశ్‌పై అక్కసు.. ప్రత్యర్థి కావాలనే ఓడిపోయాడంటూ
సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన 14 గేమ్‌ల పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్న్ ఓడించి గుకేశ్ విశ్వవిజేతగా నిలిచాడు. 13 గేమ్‌లు ముగిసేసరికి ఇద్దరూ 6.5–6.5 పాయింట్లతో సమంగా ఉండగా.. నిర్ణయాత్మకమైన ఆఖరి పోరులో గుకేశ్ తన స్కిల్స్‌ను ప్రదర్శించాడు.అయితే ఆఖరి గేమ్ కూడా ఇద్దరి మధ్య నువ్వానేనా అన్నట్టు సాగింది. కానీ గేమ్ డ్రా దిశగా సాగుతున్న సమయంలో 32 ఏళ్ల లిరెన్ భారీ తప్పదం చేశాడు. 55వ ఎత్తుగడలో రూక్(ఏనుగు)ను ఎఫ్2 గడిలోకి పంపించాడు. అతడి పేలవమైన మూవ్ చూసిన గుకేశ్ ఆశ్చర్యపోయాడు. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకున్నాడు. వెంటనే ఆ ఎనుగును తన ర్యాక్‌తో గుకేశ్ చెక్ పెట్టాడు. ఆ తర్వాత ప్రత్యర్ధికి గుకేశ్ ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. తన 58వ ఎత్తులో కింగ్‌ను ఇ5 గడిలోకి పంపి తన విజయాన్ని గుకేశ్ లాంఛనం చేశాడు. అయితే గుకేశ్ విజయాన్ని యావత్తు భారత్ సెలబ్రేట్ చేసుకుంటుండగా.. రష్యా చెస్ ఫెడరేషన్ మాత్రం సంచలన ఆరోపణలు చేసింది. చైనా గ్రాండ్ మాస్టర్ లిరెన్ కావాలనే ఓడిపోయాడని వ్యాఖ్యానించింది."గుకేశ్, లిరెన్న్ మధ్య జరిగిన చివరి గేమ్ ఫలితం నిపుణులు, చదరంగం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నిర్ణయాత్మక గేమ్‌లో చైనీస్ చెస్ ఆటగాడి చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. లిరెన్ ఉన్న స్థితిలో అతడు ఓడిపోతాడని ఎవరూ ఊహించలేదు.అతడు ఓటమి చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ప్రత్యేకంగా విచారణ జరపాలి" రష్యా చెస్ ఫెడరేషన్ చీఫ్ ఆండ్రీ ఫిలాటోవ్ పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో అతడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. కావాలనే ఆండ్రీ భారత్‌పై విషం చిమ్ముతున్నాడని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
చదరంగంలో కొత్త రారాజు.. వరల్డ్ ఛాంపియన్‌గా గుకేష్ (ఫోటోలు)
-
18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్.. కన్నీరు పెట్టుకున్న గుకేశ్! వీడియో
ప్రపంచ చదరంగంలో భారత గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ కొత్త అధ్యయనాన్ని లిఖించాడు. సింగ్‌పూర్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చైనా గ్రాండ్ మాస్టర్‌ను ఓడించి గుకేశ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అతిపిన్న వయస్సు ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.కేవలం 18 ఏళ్ల వయస్సులోనే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి విశ్వవేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. అద్బుతమైన చెక్‌మెట్‌లతో డిఫెండింగ్ ఛాంపియన్‌నే ఈ యువ గ్రాండ్ మాస్టర్ ఓడించాడు. ఈ క్రమంలో 140 కోట్ల మంది భారతీయులు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు.కన్నీరు పెట్టుకున్న గుకేశ్..ఆఖరి గేమ్‌లో విజయం ఖాయమైన అనంతరం గుకేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. చదరంగం బోర్డుపై పావులను సరిచేస్తూ గుకేశ్ కన్నీరు పెట్టుకున్నాడు. అయితే గెలిచిన వెంటనే పక్కన వున్నవారు చప్పట్లు కొట్టి అభినందిచండంతో గుకేశ్ నవ్వుతూ కన్పించాడు.ఆ తర్వాత తన సీట్ నుంచి లేచి విన్నింగ్ సెలబ్రేషన్స్‌ను అతడు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెస్.కామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.🥹🎉 @photochess pic.twitter.com/BOnIsfKtIw— Chess.com (@chesscom) December 12, 2024గుకేశ్ తండ్రి టెన్షన్ టెన్షన్..మరోవైపు లోపల ఫైనల్ గేమ్ జరుగుతుండగా గుకేశ్ తండ్రి రజనీకాంత్ సైతం తెగ టెన్షన్ పడ్డారు. గది బయట ఫోన్ చూసుకుంటూ అతడు ఆందోళనతో అటు ఇటు తిరుగుతూ కన్పించాడు. అయితే గుకేశ్ గెలిచిన వెంటనే రజనీకాంత్ అనందానికి అవధలు లేకుండా పోయాయి.తన కొడుకుని ఆలింగనం చేసుకుంటూ గెలుపు సంబరాలు జరుపునకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. అదే విధంగా గుకేశ్ తన ఫ్యామిలీతో డ్యాన్స్ చేస్తున్న ఓ పాత వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో షేర్ చేశాడు. "ఇప్పుడు యావత్ భారత్ మొత్తం మీతో కలిసి డ్యాన్స్ చేస్తుందని" ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ♥️ Gukesh's dad after he realized that his son had won the World Championship 👇#GukeshDing #DingGukesh pic.twitter.com/0WCwRbmzmd— Chess.com - India (@chesscom_in) December 12, 2024 All of India is dancing with you at this very moment @DGukesh ! #GukeshDing pic.twitter.com/dEzYkCRaEz— anand mahindra (@anandmahindra) December 12, 2024 -
గుకేశ్ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
18 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి నుంచి సామన్య ప్రజల వరకు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 14వ రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ టైటిల్‌ను ముద్దాడాడు. గేమ్ చివరి క్షణాల్లో అద్బుతమైన ఎత్తుగడలతో చైనా గ్రాండ్ మాస్టర్‌ను గుకేశ్ చిత్తు చేశాడు. తద్వారా వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో జగజ్జేతగా నిలిచిన గుకేశ్‌కు ఎంత ప్రైజ్ మనీ లభించిందో ఓ లుక్కేద్దాం.ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ నెగ్గిన దొమ్మరాజు గుకేశ్‌కు ట్రోఫీతో పాటు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ.11.45 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. అంతేకాకుండా మూడు గేమ్‌లు గెలిచినందుకు అదనంగా రూ.5.07 కోట్లు గుకేశ్ అందుకున్నాడు. మొత్తంగా అతడికి రూ.16.52 కోట్ల ప్రైజ్‌మనీ లభిచింది. అదే విధంగా రన్నరప్ డింగ్ లిరెన్ 11 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 75 లక్షలు) నగదు బహుమతి అందుకున్నాడు. రెండు గేమ్‌లు గెలిచిన లిరెన్‌కు రూ.3.38 కోట్లు దక్కాయి. మొత్తంగా చైనా గ్రాండ్ మాస్టర్ ఖాతాలో రూ.13.12 కోట్లు చేరాయి. కాగా మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్‌మనీ రూ.21.75 కోట్లు కావడం గమనార్హం.చదవండి: Chess World Championship: గుకేష్ విజయం వెనక వారిద్దరూ.. -
గుకేశ్ బృందమిదే...
వరల్డ్ ఛాంపియన్ షిప్ లాంటి మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాడి సన్నాహాలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. ఈ క్రమంలో అతను కేవలం తన బుర్రకు మాత్రమే పదును పెడితే సరిపోదు. వ్యూహ ప్రతివ్యూహాల విషయంలో అనేక మంది సహాయం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ట్రెయినర్లు, సెకండ్లు, ట్రెయినింగ్ పార్ట్నర్లు కూడా అతని విజయంలో భాగస్వాములే. గుకేశ్ టీమ్‌లో ఐదుగురు గ్రాండ్‌మాస్టర్లు (జీఎం), ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) ఉన్నారు. భారత ఆటగాడు, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఇందులో కీలక సభ్యుడు. పోలాండ్‌కు చెందిన నలుగురు గ్రాండ్‌మాస్టర్లు గ్రెగొర్జ్ గజేస్కీ, రడొస్లావ్ వొజాసెక్, జాన్ క్రిస్టాఫ్ డ్యూడాలతో పాటు పోలాండ్కే చెందిన ఐఎం జాన్ క్లిమ్కోవ్స్కీ వీరిలో ఉన్నారు. జర్మన్ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీపర్ కూడా గుకేశ్ టీమ్‌లో సభ్యుడే. వీరితో పాటు మానసికంగా దృఢంగా ఉండేందుకు మెంటల్ ట్రెయినర్ ప్యాడీ ఆప్టన్‌తో కూడా గుకేశ్ కలిసి పని చేయడం విశేషం. ప్యాడీ ఆప్టన్ 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుతో... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుతో కలిసి పనిచేశారు. -
గుకేష్ విజయం వెనక వారిద్దరూ..
‘కొడుకు కోరికను తండ్రి తీరిస్తే ఇద్దరూ నవ్వుకుంటారు... అదే తండ్రి కోరికను కొడుకు తీరిస్తే ఇద్దరూ ఏడుస్తారు’... ఈ హీబ్రూ వ్యాఖ్యను వివరించేందుకు గురువారం కనిపించిన దృశ్యం ఒకటి చాలు! వరల్డ్ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ చివరి గేమ్ సాగుతున్న సమయంలో అతని తండ్రి రజనీకాంత్ లాబీలో తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. గెలుపు గురించి తెలిసిన క్షణాన తెలిసిన కొందరు అభినందిస్తుండగా తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఆయనకు మాటలు కూడా రాలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే గుకేశ్ బయటకు వచ్చాడు. కొడుకును హత్తుకున్న ఆయన భావోద్వేగంతో కన్నీళ్లపర్యంతమయ్యారు. తన అబ్బాయి సాధించిన ఘనత విలువేమిటో ఆయనకు తెలుసు. ఈ విజయం వెనక అతని కష్టం, సాధన ఎలాంటిదో కూడా బాగా తెలుసు.గుకేశ్ ఆటగాడిగా ఎదిగే క్రమంలో అన్ని సౌకర్యాలు, శిక్షణ అందించడంతో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు చాలాసార్లు వైద్యవృత్తిని పక్కన పెట్టి సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. ‘త్యాగం అనే పదం నాకు నచ్చదు. పిల్లల కోసం కష్టపడటం తల్లిదండ్రుల బాధ్యత. గుకేశ్‌లో చెస్ ప్రతిభను గుర్తించిన తర్వాత ప్రోత్సహించేందుకు సిద్ధమైపోయాం’ అని ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిన రజనీకాంత్ గతంలో చెప్పారు. మైక్రోబయాలజిస్ట్ అయిన అమ్మ పద్మాకుమారి కూడా అన్ని వేళలా కొడుకుకు అండగా నిలిచింది. ఓటమి ఎదురైనప్పుడల్లా అతను తల్లితోనే మాట్లాడేవాడు. స్ఫూర్తిదాయక మాటలు, గాథలతో గుకేశ్ మళ్లీ కొత్త సమరోత్సాహంతో బరిలోకి దిగేందుకు అమ్మ మాటలే ఉపకరించేవి. చెన్నైలో చెస్ చాంపియన్ల అడ్డా అయిన వేలమ్మాల్ స్కూల్లో గుకేశ్ ఆట మొదలైంది. అండర్–11 జాతీయ చాంపియన్‌గా అతనికి మొదటిసారి గుర్తింపు లభించింది. ఆ సమయంలో అతనికి ఎలాంటి ఐఎం, జీఎం నార్మ్‌లు లేవు. కానీ తర్వాతి 16 నెలల వయసులో అద్భుత ఆటతో మూడు ఐఎం నార్మ్‌లు, మూడు జీఎం నార్మ్‌లు సాధించడంతో పాటు 2500 రేటింగ్‌ను దాటి గుకేశ్ సత్తా చాటాడు.12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన అతను పిన్న వయసులో జీఎంగా మారిన ప్రపంచ రికార్డును 17 రోజుల తేడాతో కోల్పోయాడు. అయితే ‘ఇవి నాకు పెద్ద లెక్క కాదు. ఇలాంటివేమీ లేని కార్ల్సన్ ఎక్కడికి వెళ్లాడో తెలుసు కదా. నేను అలాంటి పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నాను’ అనడం అతని ఆత్మవిశ్వాసాన్ని అప్పుడే చూపించింది. ఆ తర్వాత ఆసియా యూత్, వరల్డ్ యూత్, ఆసియా క్రీడలు, ఒలింపియాడ్ సహా పలు పెద్ద టోర్నీల్లో వరుస విజయాలు, రికార్డులు అతని ఖాతాలో వరుసగా వచ్చి చేరాయి. ఇటీవల సెప్టెంబరులో భారత జట్టు చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించడంలో గుకేశ్ కూడా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతను 2783 ‘ఫిడే’ రేటింగ్‌తో కొనసాగుతున్నాడు. క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన తర్వాత కూడా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అతని గెలుపుపై ఏదో మూల సందేహం ఉంది. 2800 రేటింగ్ దాటడంతో పాటు ఒకదశలో వరుసగా 100 గేమ్‌లలో ఓటమి ఎరుగని డింగ్ లిరెన్‌ను నిలువరించగలడా అనే అనుమానాలను గుకేశ్ పటాపంచలు చేశాడు.18 ఏళ్ల వయస్సులో విశ్వవిజేతగా నిలిచి చరిత్రకెక్కాడు.చదవండి: తెలుగు టైటాన్స్ పరాజయం -
ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా భారతీయుడు
సింగపూర్ సిటీ: వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. 14వ గేమ్‌లో గుకేశ్ ప్రస్తుత ఛాంపియన్, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించాడు. గుకేశ్ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.THE EMOTIONS...!!! 🥹❤️- 18 Year Old Gukesh Dommaraju creating history by becoming the youngest ever champion. 🇮🇳 pic.twitter.com/LVkA8JMKM1— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (2012) వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. గుకేశ్ అత్యంత చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం పోటీ పడిన అతి పిన్న వయస్కుడిగానూ గుకేశ్ రికార్డు నెలకొల్పాడు. గుకేశ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా. THE PRECIOUS MOMENT. 🥹- Gukesh hugging his father aftee creating history. ❤️pic.twitter.com/iLs5aNFIEW— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024 -
గుకేశ్, డింగ్ లిరెన్ 13వ గేమ్ ‘డ్రా’... నేడు చివరిదైన 14వ గేమ్
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో తొమ్మిదో ‘డ్రా’ నమోదైంది. భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య బుధవారం జరిగిన 13వ గేమ్ 68 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. తెల్ల పావులతో ఆడిన గుకేశ్ ‘కింగ్ పాన్’ ఓపెనింగ్ తో గేమ్‌ను ప్రారంభించగా... ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లిరెన్ ఫ్రెంచ్ డిఫెన్స్‌తో జవాబు ఇచ్చాడు. గుకేశ్ కొత్త వ్యూహాలతో చైనా ప్లేయర్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. 68 ఎత్తులు ముగిశాక ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. నిర్ణీత 14 గేముల్లో 13 గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 6.5–6.5తో సమఉజ్జీగా ఉన్నారు. నేడు చివరిదైన 14వ గేమ్ జరుగుతుంది. ఒకవేళ చివరిదైన 14వ గేమ్ కూడా ‘డ్రా’ అయితే ఇద్దరూ 7–7తో సమంగా నిలుస్తారు. శుక్రవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
గుకేశ్, డింగ్ లిరెన్ కీలక పోరు నేడు
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ కీలకదశకు చేరుకుంది. భారత గ్రాండ్‌మాస్టర్ c చైనాగ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోరులో నేడు 13వ గేమ్ జరగనుంది. వీరిద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లను నిర్వహించనుండగా... ఇప్పటికి 12 గేమ్‌లు ముగిశాయి.గుకేశ్, లిరెన్ చెరో రెండు గేముల్లో గెలిచారు. మిగతా ఎనిమిది గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. వీరిద్దరు 6–6 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. నేడు జరిగే 13వ గేమ్‌లో గుకేశ్ తెల్ల పావులతో ఆడతాడు. ఈ నేపథ్యంలో గుకేశ్ ఓపెనింగ్‌కు డిఫెండింగ్ చాంప్ లిరెన్ ఏ విధంగా జవాబు ఇస్తాడో చూడాలి. ఇప్పటికే ఒకసారి ప్రపంచ చాంపియన్ అయిన లిరెన్‌కు గత అనుభవం కలిసొచ్చే అవకాశముంది. 13వ గేమ్‌లో గుకేశ్ గెలిస్తే, చివరిదైన 14వ గేమ్‌లో లిరెన్ తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఒకవేళ గేమ్ ‘డ్రా’ అయినా, గుకేశ్ ఓడినా... చివరి గేమ్‌లో తెల్ల పావులతో ఆడనున్న లిరెన్‌కు పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది. -
గుకేశ్‌కు రెండో విజయం... డింగ్ లిరెన్‌పై 6–5తో ఆధిక్యం
సింగపూర్ సిటీ: పిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించే దిశగా భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అడుగు ముందుకు వేశాడు. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో ఆదివారం జరిగిన 11వ రౌండ్ గేమ్‌లో 18 ఏళ్ల గుకేశ్ కేవలం 29 ఎత్తుల్లో అద్భుత విజయం సాధించాడు. వరుసగా ఏడు ‘డ్రా’ల తర్వాత ఫలితం రావడం విశేషం. ఈ గెలుపుతో గుకేశ్ 6–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మిగిలిన మూడు గేమ్‌లను గుకేశ్ ‘డ్రా’ చేసుకుంటే విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ అయిన రెండో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. 11వ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన గుకేశ్ అశ్వంతో తొలి ఎత్తును వేయగా... లిరెన్ తొలి ఎత్తు నుంచే తప్పిదాలు చేసి చివరకు 29వ ఎత్తు వద్ద తన ఓటమిని అంగీకరించాడు. నేడు జరిగే 12వ గేమ్‌లో లిరెన్ తెల్లపావులతో ఆడతాడు. -
వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో మరో ‘డ్రా’
భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ పోరులో ‘డ్రా’ల పరంపర ఆగడం లేదు. శనివారం జరిగిన పదో గేమ్ కూడా సమంగానే ముగిసింది. తొలి గేమ్‌లో లిరెన్, మూడో గేమ్‌లో గుకేశ్ గెలవగా...ఆ తర్వాత ఇది వరుసగా ఏడో ‘డ్రా’ కావడం గమనార్హం. నల్ల పావులతో ఆడిన గుకేశ్, లిరెన్ కూడా ఎలాంటి దూకుడైన ఎత్తులకు ప్రయతి్నంచలేదు. ఇద్దరూ డిఫెన్స్‌కే ప్రాధాన్యతనివ్వడంతో 36 ఎత్తుల తర్వాత ‘డ్రా’ ఖాయమైంది. పది గేమ్‌లు ముగిసిన తర్వాత గుకేశ్, లిరెన్ చెరో 5 పాయింట్లతో సమంగా కొనసాగుతున్నారు. ఈ 14 గేమ్‌ల పోరులో ముందుగా 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. మిగిలిన 4 గేమ్‌ల ద్వారా మరో 2.5 పాయింట్లు ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరం. నల్లపావులతో ఆడి గేమ్‌ను ‘డ్రా’గా ముగించడం సంతృప్తిగా ఉందన్న గుకేశ్... రాబోయే నాలుగు గేమ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతాయని ఆశిస్తున్నానన్నాడు. -
గుకేశ్, డింగ్ లిరెన్ తొమ్మిదో గేమ్ కూడా ‘డ్రా’
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో వరుసగా ఆరో ‘డ్రా’ నమోదైంది. భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) మధ్య గురువారం జరిగిన తొమ్మిదో గేమ్ 54 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లు జరుగుతాయి. ఇప్పటికి తొమ్మిది గేమ్‌లు పూర్తయ్యాయి. మరో ఐదు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఇద్దరూ 4.5 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. మొదట 7.5 పాయింట్లు సాధించిన ప్లేయర్ విశ్వవిజేతగా నిలుస్తాడు. 32 ఏళ్ల డింగ్ లిరెన్ తొలి గేమ్‌లో గెలుపొందగా... చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ మూడో గేమ్‌లో నెగ్గాడు. మిగతా ఏడు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. నేడు విశ్రాంతి దినం. శనివారం పదో గేమ్ జరుగుతుంది. -
ఎనిమిదో గేమ్ కూడా ‘డ్రా’
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో మరో ‘డ్రా’ నమోదైంది. భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) మధ్య జరిగిన ఎనిమిదో గేమ్ 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లు జరుగుతాయి. ఇప్పటికి ఎనిమిది గేమ్‌లు పూర్తయ్యాయి.ఇద్దరూ 4 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. మొదట 7.5 పాయింట్లు సాధించిన ప్లేయర్ విశ్వవిజేతగా నిలుస్తాడు. 32 ఏళ్ల డింగ్ లిరెన్ తొలి గేమ్‌లో గెలుపొందగా... చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ మూడో గేమ్‌లో నెగ్గాడు. మిగతా ఆరు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. నేడు తొమ్మిదో రౌండ్ గేమ్ జరుగుతుంది. -
గుకేశ్ చేజారిన అవకాశం... లిరెన్‌తో ఏడో గేమ్ కూడా ‘డ్రా’
సింగపూర్ సిటీ: దొమ్మరాజు గుకేశ్ (భారత్), డింగ్ లిరెన్ (చైనా) మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య మంగళవారం జరిగిన ఏడో గేమ్ కూడా ‘డ్రా’గా ముగిసింది. చాంపియన్‌షిప్ సమరంలో ఇది వరుసగా నాలుగో ‘డ్రా’ కావడం విశేషం. 5 గంటల 22 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 72 ఎత్తుల తర్వాత ఆటను ముగించేందుకు గుకేశ్, లిరెన్ అంగీకరించారు. అయితే కీలక దశలో గెలిచే స్థితిలో నిలిచిన గుకేశ్ దానిని వథా చేసుకోవడం అతడిని నిరాశపరిచే అంశం. తెల్ల పావులతో ఆడిన గుకేశ్ ఓపెనింగ్ నుంచే దూకుడుగా ఆడి ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచాడు. గుకేశ్ 44వ ఎత్తు తర్వాత లిరెన్ ఓటమికి బాట పడినట్లుగా కనిపించింది. అయితే ఈ గెలుపు అవకాశాన్ని వాడుకోలేక గుకేశ్ వేసిన 45వ ఎత్తు లిరెన్ మళ్లీ కోలుకునేలా చేసింది. ఏడు గేమ్‌ల తర్వాత ఇద్దరూ చెరో 3.5 పాయింట్లతో ఉన్నారు. -
సమంగా ముగిసిన ఐదో గేమ్
భారత ఆటగాడు దొమ్మరాజు గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సమరంలో మరో పోరు సమంగా ముగిసింది. సింగపూర్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ ఐదో గేమ్ 40 ఎత్తుల తర్వాత ‘డ్రా’ అయింది. ఈ ఫలితం అనంతరం గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ లిరెన్ చెరో 2.5 పాయింట్లతో సమంగా కొనసాగుతున్నారు.విజేతగా నిలవాలంటే మిగిలిన 9 గేమ్‌లలో మరో 5 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. నల్ల పావులతో ఆడిన లిరెన్ తొలి గేమ్ తరహాలోనే ఫ్రెంచ్ డిఫెన్స్‌తో మొదలు పెట్టాడు. ఆ గేమ్‌లో ఓటమిపాలైన గుకేశ్ ఈ సారి జాగ్రత్త పడ్డాడు. అయితే 23వ ఎత్తు వద్ద గుకేశ్ తప్పుడు ఎత్తు వేసి ఓటమికి ఆస్కారం కల్పించగా...లిరెన్ దానిని గుర్తించలేకపోయాడు. దాంతో గుకేశ్ డ్రాతో గట్టెక్కాడు. ‘నేను చాలా పెద్ద తప్పు చేశానని తర్వాత అర్థమైంది. కానీ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాను. ఇంకా ఈ సమరం సగం కూడా కాలేదు. కాబట్టి నాకూ మంచి అవకాశాలున్నాయని నమ్ముతున్నా’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు. ఇద్దరి మధ్య ఆరో గేమ్ నేడు జరుగుతుంది. -
మూడో గేమ్‌లో గుకేశ్ గెలుపు
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అద్భుతంగా పుంజుకున్నాడు. మూడో గేమ్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో బుధవారం జరిగిన మూడో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన 18 ఏళ్ల గుకేశ్ 37 ఎత్తుల్లో విజయం సాధించాడు. నిబంధనల ప్రకారం తొలి 40 ఎత్తులను 120 నిమిషాల్లో పూర్తి చేయాలి. అయితే డింగ్ లిరెన్ 37 ఎత్తులే వేయగలిగాడు. దాంతో సమయాభావం కారణంగా డింగ్ లిరెన్‌కు ఓటమి ఖరారైంది. ‘తొలి విజయం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలి గేమ్‌లో కాస్త ఒత్తిడికి లోనయ్యా. రెండో గేమ్ నుంచి కోలుకున్నాను’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లు జరగనున్నాయి. తొలి గేమ్‌లో డింగ్ లిరెన్ నెగ్గగా... రెండో గేమ్ ‘డ్రా’గా ముగిసింది. మూడు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1.5–1.5 పాయింట్లతో సమంగా ఉన్నారు. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం నాలుగో గేమ్ జరుగుతుంది. -
డింగ్ లిరెన్‌తో గుకేశ్ రెండో గేమ్ ‘డ్రా’
సింగపూర్ సిటీ: తొలి గేమ్‌లో ఎదురైన పరాజయం నుంచి భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తేరుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో రెండో గేమ్‌ను గుకేశ్ ‘డ్రా’ చేసుకున్నాడు.23 ఎత్తుల తర్వాత ఫలితం తేలే అవకాశాలు కనిపించకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. తొలి గేమ్‌లో డింగ్ లిరెన్ గెలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లు జరుగుతాయి. రెండు గేమ్‌ల తర్వాత డింగ్ లిరెన్ 1.5–0.5తో గుకేశ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. నేడు జరిగే మూడో గేమ్‌లో గుకేశ్ తెల్ల పావులతో ఆడతాడు. -
ఎత్తుకు పైఎత్తు...
క్లాసికల్ చెస్ ఫార్మాట్లో భారత్ నుంచి ఇప్పటి వరకు ఒక్కరే విశ్వవిజేతగా నిలిచారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ చివరిసారి 2013లో విశ్వకిరీటాన్ని అధిరోహించాడు. ఆ తర్వాత నార్వే సూపర్‌స్టార్ మాగ్నస్ కార్ల్సన్ దశాబ్దంపాటు చదరంగ విశ్వాన్ని ఏలాడు. అదే సమయంలో భారత్ నుంచి మరో ప్లేయర్ ఆనంద్ ఘనతలకు చేరువగా రాలేకపోయారు. కానీ గత కొన్నాళ్లుగా భారత చెస్ ముఖచిత్రం మారిపోయింది. ఒక్కసారిగా నలుగురైదుగురు తెరపైకి వచ్చి సంచలన విజయాలు సాధిస్తున్నారు. దొమ్మరాజు గుకేశ్ అందరి అంచనాలను తారుమారు చేసి ఏకంగా ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించాడు. సరైన పోటీ లేకపోవడంతో కార్ల్సన్ స్వచ్ఛందంగా ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు దూరమవ్వడంతో ... గత ఏడాది చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. అంతా అనుకున్నట్లు జరిగితే 11 ఏళ్ల తర్వాత భారత్ నుంచి గుకేశ్ రూపంలో మరో విశ్వవిజేత కనిపిస్తాడు. సింగపూర్ సిటీ: చదరంగ చరిత్రలోనే ఇద్దరు ఆసియా గ్రాండ్‌మాస్టర్ల మధ్య మరో ఆసియా వేదికపై ప్రపంచ చెస్ చాంపియన్ టైటిల్ వేటకు నేడు జేగంట మోగనుంది. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఆగ్నేయాసియా దేశంలో ప్రపంచ చదరంగ విజేత పోటీలు జరుగుతున్నాయి. 1979లో ఫిలిప్పీన్స్‌లోని బగూవోలో జరిగితే ఇప్పుడు సింగపూర్ కొత్త చాంపియన్‌కు తివాచీ పరిచే అవకాశముంది. చైనాకు చెందిన డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌తో భారత గ్రాండ్‌మాస్టర్, 18 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్ అమీతుమీకి సిద్ధమయ్యాడు. సూపర్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మళ్లీ భారత్‌కు ప్రపంచ చెస్ కిరీటాన్ని తెచ్చేందుకు చైనీస్ గ్రాండ్‌మాస్టర్‌పై ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు ఈ తమిళనాడు టీనేజర్ ‘సై’ అంటున్నాడు. గుకేశ్ అవుతాడా మరో ఆనంద్? భారత స్టార్ గుకేశ్ ర్యాంక్ 5. గతేడాది నుంచి నిలకడైన విజయాలు సాధిస్తున్నాడు. తన ఎత్తులతో ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తున్న అతను గతేడాది ఆగస్టులో విశ్వనాథన్ ఆనంద్ లైవ్ రేటింగ్స్‌ను అధిగమించాడు. 1986, జూలైలో ప్రవీణ్ థిప్సే తర్వాత ఆనంద్‌ను దాటిన తొలి భారత ప్లేయర్‌గా ఘనత వహించి ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి దూసుకొచ్చాడు. ‘ఫిడే’ సర్క్యూట్లో క్యాండిడేట్స్ టోర్నీ సహా చెస్ ఒలింపియాడ్ తదితర ఈవెంట్లలో ఘనవిజయాలు సాధించడంతో రెండేళ్ల క్రితం 2600 ఎలో రేటింగ్‌లో ఉన్న తను ఇప్పుడు 2783 రేటింగ్‌కు ఎగబాకాడు. చెస్ ఒలింపియాడ్‌లో భారత్ చారిత్రక విజయంలో గుకేశ్‌ది కీలకపాత్ర! మొదటి బోర్డులో గరిష్ట పది పాయింట్లకుగాను 9 పాయింట్లు సాధించడంతో అప్పటి లైవ్ రేటింగ్‌లో ఏకంగా 3056 రేటింగ్స్‌కు చేరుకున్నాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్ 32 ఏళ్ల డింగ్ ఇటీవల తడబడుతున్నాడు. మానసిక అనారోగ్యం చాంపియన్ ఆటతీరుపై పెను ప్రభావమే చూపింది. కొన్ని నెలలపాటు అసలు ఏ స్థాయి టోర్నీలోనూ బరిలోకే దిగలేని పరిస్థితి వచి్చంది. తర్వాత చెస్ సర్క్యూట్లో ఆడినా... అంతంత మాత్రం ఫలితాలతో 2788 ఎలో రేటింగ్ నుంచి 2728కు పడిపోయాడు. దీంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానానికి దిగజారాడు. అయితే రేటింగ్స్‌ను, ముందరి ఫామ్‌ను పరిగణించి తక్కువ అంచనా వేస్తే తప్పులో కాలేసినట్లే! టైబ్రేక్స్‌లో, కీలకమైన ఎత్తులపుడు పైఎత్తులు వేయడంలో డింగ్ దిట్ట. ముఖాముఖి పోరులో ఇప్పుడు ప్రపంచ కిరీటం కోసం పోటీపడుతున్న వీరిద్దరు గతంలో మూడుసార్లు ముఖాముఖిగా తలపడ్డారు. అయితే ఇందులో ప్రపంచ చాంపియన్‌దే పైచేయి. క్లాసికల్ ఈవెంట్లో నల్లపావులతో రెండు సార్లు డింగ్ గెలుపొందగా... చివరగా సింక్విఫీల్డ్ కప్‌లో ఇద్దరి మధ్య జరిగిన పోటీ ‘డ్రా’గా ముగిసింది. అంటే మూడింట ఒక్కసారి కూడా డింగ్ ఓడిపోలేదు. గుకేశ్ 0–2తో వెనుకబడి ఉన్నాడు. అర్హత సాధించారిలా... గతేడాది జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నిపోమ్నిషిని ఓడించి డింగ్ తొలిసారి చాంపియన్‌గా ఆవిర్భవించాడు. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్ హోదాతో చైనా గ్రాండ్‌మాస్టర్‌కు నేరుగా టైటిల్ నిలబెట్టుకునే అవకాశముంటుంది. భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ ఈ మెగా టోర్నీలో ఆడేందుకు పెద్ద పోరాటమే చేశాడు. ఈ ఏడాది టోరంటోలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్లో విజేతగా నిలువడం ద్వారా తాజా చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. క్యాండిడేట్స్ టోర్నీ ఆడి, గెలిచిన పిన్న వయసు్కడిగా గుకేశ్ గుర్తింపు పొందాడు. షెడ్యూల్... ఫార్మాట్ అధికారికంగా టోర్నీ ప్రారం¿ోత్సవం 23నే జరిగింది. అయితే తొలి రౌండ్ నేడు మొదలవుతుంది. వచ్చే నెల 15 వరకు మొత్తం 14 రౌండ్ల పాటు గేమ్‌లు జరుగుతాయి. గెలిస్తే ఒక పాయింట్... ‘డ్రా’ చేసుకుంటే అర పాయింట్ లభిస్తాయి. ఎవరైతే ముందుగా 7.5 పాయింట్లు సాధిస్తారో వారే ప్రపంచ చాంపియన్. క్లాసికల్ గేమ్‌లో తొలి 40 ఎత్తుల వరకు ఒక్కో ఆటగాడికి 120 నిమిషాలు సమయం ఉంటుంది. 41వ ఎత్తు నుంచి మిగతా గేమ్ మొత్తానికి 30 నిమిషాల సమయమిస్తారు. 14 గేమ్‌ల తర్వాత స్కోరు సమమైతే... ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో టైబ్రేక్ పోటీలు నిర్వహించి విజేతను తేల్చుతారు. ప్రైజ్‌మనీ రూ. 21.10 కోట్లు టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 2.5 మిలియన్ డాలర్లు (రూ. 21.10 కోట్లు). ఒక్కో గేమ్ విజేతకు 2 లక్షల డాలర్లు (రూ. కోటి 68 లక్షలు) లభిస్తాయి. ఇలా 14 రౌండ్ల తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇద్దరు ప్లేయర్లకు సమానంగా అందజేస్తారు. టైబ్రేకర్‌లో విజేతగా నిలిచిన ప్రపంచ చాంపియన్‌కు 13 లక్షల డాలర్లు (రూ.10.97 కోట్లు ), రన్నరప్‌నకు 12 లక్షల డాలర్లు (రూ.10.13 కోట్లు) ప్రదానం చేస్తారు.లైవ్‌గా చూడొచ్చా?ఎంచక్కా చూడొచ్చు. టీవీ చానెల్స్‌లో అందుబాటులో లేకపోయినా... మన భారత గ్రాండ్‌మాస్టర్ తలపడుతున్న ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ గేమ్‌లపై మనం ఓ కన్నేయొచ్చు. ‘ఫిడే’కు చెందిన యూట్యూబ్, ట్విట్చ్ చానెల్స్‌లో అలాగే... ఈఎస్పీఎన్ ఇండియా లైవ్ బ్లాగ్‌లోనూ పోటీలను వీక్షించవచ్చు. -
ఇది స్వర్ణయుగం
ప్రతి రంగంలో కొన్ని చరిత్రాత్మక క్షణాలు ఉంటాయి. చదరంగంలో మన దేశానికిప్పుడు అలాంటి క్షణాలే. బుడాపెస్ట్‌లో ముగిసిన 45వ చెస్ ఒలింపియాడ్ భారతీయ చదరంగంలోనే కాదు... యావత్ భారత క్రీడారంగ చరిత్రలోనే చిరస్మరణీయం. మన ఆటగాళ్ళు తొలిసారిగా అటు ఓపెన్, ఇటు మహిళల కేటగిరీల్లో బంగారు పతకాలు సాధించి, దేశానికి మరువలేని కానుక ఇచ్చారు. చైనా, సోవియట్ రష్యా తర్వాత చెస్ ఒలింపియాడ్‌లో ఒకే ఏడాది ఇలా రెండు విభాగాల్లోనూ స్వర్ణాలు గెలిచిన మూడో దేశం మనదే. అలాగే, గుకేశ్, అర్జున్, దివ్య, వంతికల 4 వ్యక్తిగత స్వర్ణాలతో టోర్నీలో భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని చాటింది. విశ్వనాథన్ ఆనందన్ బాటలో నడిచిన ఆయన శిష్యబృందం దేశాన్ని సమున్నతంగా నిలిపింది. కేవలం పదేళ్ళ క్రితం ఆశ్చర్యకరంగా కాంస్యం గెలిచి ఒలింపియాడ్‌లో బోణీ కొట్టిన దేశం, గడచిన 2022లో రెండు విభాగాల్లోనూ కాంస్యాలకే పరిమితమైన దేశం ఇవాళ ఈ స్థాయికి ఎదగడం అసామాన్యం. ఒక్కమాటలో నిన్న మొన్నటి దాకా చెస్‌లో సాగిన యూరోపియన్ ప్రపంచ ఆధిపత్యానికి తెరపడింది. ఆటకు భవిష్యత్ చిరునామాగా భారత్ ఆవిర్భవించింది. చదరంగంలో అక్షరాలా మన స్వర్ణయుగం ఆరంభమైంది. ఒలింపిక్స్ పోటీల్లో స్థానం లేని చెస్‌కు సంబంధించినంత వరకు ఈ చెస్ ఒలింపియాడే... ఒలింపిక్స్. అలాంటి అత్యున్నత స్థాయి పోటీల్లో... 193 దేశాలకు చెందిన అంతర్జాతీయ జట్లు పాల్గొన్న ఓపెన్ విభాగంలో, 181 దేశాలు పోటీపడ్డ మహిళా విభాగంలో మన జట్లు స్వర్ణాలు సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతి దేశం నుంచి అయిదుగురు అగ్రశ్రేణి క్రీడాకారుల జట్లు ఆ యా విభాగాల్లో పోటీ పడతాయి. అలాంటి చోట ఓపెన్ విభాగంలో తొమ్మిదో రౌండ్లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన ఆటను డ్రా చేయడం తప్ప, మొత్తం 11 రౌండ్లకు గాను 10 రౌండ్లు మన భారత జట్టు గెలిచింది. టైటిల్ విజేతగా నిలిచింది. అంతేకాక 21 పాయింట్ల రికార్డ్ స్కోర్ సాధించి, రెండోస్థానంలో నిలిచిన 17 పాయింట్ల అమెరికా కన్నా చాలా పైన మనం నిలవడం విశేషం. మహిళా విభాగంలోనూ మొత్తం 11 రౌండ్లలో, ఒక్క 8వ రౌండ్లో పోలండ్‌తోనే మన జట్టు ఓడింది. అమెరికాతో ఆటను డ్రా చేసి, మొత్తం 19 పాయింట్లు సాధించి, స్వర్ణం సాధించింది. కనివిని ఎరుగని ఈ జంట విజయాల కారణంగానే ఇవాళ మన క్రీడా ప్రపంచం సంబరాలు చేసుకుంటోంది.మొత్తం మీద భారతీయుల ఆటగా పేరొందిన చదరంగంలో ఇప్పుడు మళ్ళీ పుట్టినింటికి పూర్వ వైభవం వచ్చింది. ఈ ఒలింపియాడ్ విజయాలు దేశవ్యాప్తంగా మన యువతరంలో దాగిన చదరంగ ప్రతిభాపాటవాలకు అద్దం పడుతున్నాయి. గుకేశ్ దొమ్మరాజు లాంటి మన ఆటగాళ్ళు కొందరు వ్యక్తిగత స్వర్ణాలు సైతం సాధించడం అందుకు నిదర్శనం. ఒకప్పుడు విశ్వనాథన్ ఆనంద్ లాంటి కొందరి పేర్లే వినిపించిన దేశంలో ఇటీవల దాదాపు 85 మంది గ్రాండ్ మాస్టర్లు ఉద్భవించారు. వారిలో పలువురు 20వ పడిలో వారే. అయిదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియనైన మ్యాగ్నస్ కార్ల్సెన్ను పలుమార్లు ఓడించిన ప్రజ్ఞానంద లాంటి టీనేజ్ వండర్లు మనకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రశ్రేణిలో నిలిచిన అర్జున్ ఇరిగైసి, విదిత్ గుజరాతీ, హరికృష్ణ తదితరులు మన పురుషుల జట్టులో ఉన్నారు. అలాగే, అనుభవమున్న కోనేరు హంపి జట్టులో లేకున్నా, ఒకట్రెండు తడబాట్లు ఎదురైనా సరే పట్టువదలక పోరాడి, ఒలింపియాడ్ విజయం సాధించిన ఆడపిల్లల జట్టు ఈ రోజున మనకుంది. అంతకంతకూ పెరుగుతున్న మన బలానికీ, బలగానికీ అది గీటురాయి. పోగుబడ్డ ప్రతిభావంతులకు నిరంతర సాధన, నిరుపమానమైన టీమ్ స్పిరిట్ కూడా తోడై తాజా అందలాన్ని ఎక్కించాయి. అదే సమయంలో మన ప్రస్తుత విజయ పరంపరకు స్ఫూర్తి... ప్రజ్ఞానంద, గుకేశ్ లాంటి పలువురికి చేయూతనిచ్చిన దీప్తి... శిక్షణకు ఎంతో ఖర్చయ్యే ఈ ఆటలో వర్ధిష్ణువులెందరికో స్పాన్సర్‌షిప్‌లు దక్కేలా తోడ్పడ్డ తెర వెనుక దీప్తి... 15వ వరల్డ్ చెస్ ఛాంపియనైన విశ్వనాథన్ ఆనంద్ అని మర్చిపోలేం. ప్రతిభ గల పిల్లల్ని తీర్చిదిద్దడానికి వీలుగా ఒక వాతావరణాన్నీ, వ్యవస్థనూ కల్పించిన ఆలిండియా చెస్ ఫెడరేషన్ కృషినీ చెప్పుకొని తీరాలి. పెరిగిన సోషల్ మీడియా, హద్దులు లేని డిజిటల్ వ్యాప్తి సైతం మన యువతరాన్ని చెస్ వైపు ఆకర్షించిందీ నిజమే. భారతీయ స్ట్రీమింగ్ వేదికల్లో బాగా పాపులరైన చెస్‌బేస్ ఇండియాకు దాదాపు 19 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఆ వేదిక వివిధ టోర్నీల నిర్వహణతో పాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పలువురు ఆటగాళ్ళకు ఆర్థికంగా అండగా నిలవడం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడీ ఒలింపియాడ్ డబుల్ ధమాకా స్వర్ణాలు చెస్ ప్రాచుర్యంతో పాటు పిల్లల్లో ఆసక్తి పెంచడం ఖాయం. భారత చదరంగానికి ఇది శుభతరుణం. త్వరలో జరిగే వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రస్తుత చైనీస్ ఛాంపియన్‌తో 18 ఏళ్ళ మన గుకేశ్ పోరు కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఉన్నవారు కాక, కనీసం మరో అరడజను మంది ఒలింపియాడ్‌లో స్థానం కోసం పోటీపడుతున్న స్థాయికి చేరాం. అయితే, ఇది చాలదు. ఆడపిల్లల్లో మన చెస్ బలగం ఇంకా పెరగాల్సి ఉంది. ఇదే అదనుగా కేంద్రం, రాష్ట్రాలు మరింత ప్రోత్సాహం అందించాలి. పాఠశాలల స్థాయి నుంచే చెస్ పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచాలి. బడుల్లోనే కాక గ్రంథాలయాల్లో, స్థానిక పట్టణ కేంద్రాల్లోనూ చెస్‌కు వసతులు కల్పించాలి. అలాగే మన దేశంలోనూ అగ్రశ్రేణి టోర్నీలు జరిగేలా చూడాలి. చెన్నై ఇవాళ చదరంగ ప్రతిభకు కేంద్రంగా మారిందంటే తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన చేయూత కారణం. అందరికీ అది ఆదర్శప్రాయం. స్వర్ణయుగం సుదీర్ఘంగా కొనసాగాలంటే ఇలాంటి చర్యలే కీలకం. -
గుకేశ్ ‘భూకంపం’ తెచ్చాడు!
గ్యారీ కాస్పరోవ్ ప్రశంస టొరంటో: క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచి వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ పోరుకు అర్హత సాధించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌పై ‘ఆల్‌టైమ్ గ్రేట్’ గ్యారీ కాస్పరోవ్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ చెస్‌లో కొత్త మార్పునకు ఇది సూచన అని ఈ మాజీ వరల్డ్ చాంపియన్ అభిప్రాయపడ్డాడు. ‘గుకేశ్‌కు అభినందనలు. టొరంటోలో ఒక భారతీయుడు భూకంపం సృష్టించాడు. 17 ఏళ్ల కుర్రాడు చైనా చాంపియన్ డింగ్ లిరెన్‌ను ఢీకొనబోతుండటం ప్రపంచ చెస్‌లో ఆధిక్యం ఒక దిక్కు నుంచి మరో దిక్కుకు మారిందనేదానికి సరైన సూచిక. విశ్వనాథన్ ఆనంద్ ‘పిల్లలు’ అన్ని చోట్లా దూకుడు ప్రదర్శిస్తున్నారు. గుకేశ్ మరింత పైకి ఎదుగుతాడు. చైనా, భారత్‌కు చెందిన కుర్రాళ్లు చెస్‌లో ఏదైనా సాధించే సంకల్పంతో దూసుకుపోతుంటే ఇంగ్లండ్, అమెరికా జూనియర్ ఆటగాళ్లు మాత్రం చూస్తూనే ఉండిపోతున్నారు’ అని కాస్పరోవ్ వ్యాఖ్యానించాడు. ఆదివారం ముగిసిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఓపెన్ విభాగంలో భారత్ నుంచి గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతి పోటీపడ్డారు. గుకేశ్ విజేతగా అవతరించగా... ప్రజ్ఞానంద ఐదో స్థానంలో, విదిత్ ఆరో ర్యాంక్‌లో నిలిచారు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి రన్నరప్‌గా నిలువగా, వైశాలికి నాలుగో స్థానం లభించింది. -
ఛాంపియన్ దేశం
భారత చదరంగ క్రీడావనికి ఇది మరో శుభవార్త. మన దేశం నుంచి మరో చిచ్చరపిడుగు వచ్చాడు. తెలుగు కుటుంబానికి చెందిన దొమ్మరాజు గుకేశ్ పట్టుమని 17 ఏళ్ళ వయసులో ప్రపంచస్థాయిలో సత్తా చాటాడు. అరంగేట్రంలోనే ప్రపంచ చదరంగ క్రీడా పర్యవేక్షక సంస్థ (ఫిడే) వారి ‘క్యాండిడేట్స్ 2024’లో గెలిచాడు. అదీ... చదరంగపుటెత్తుల్లో చలాకీతనం చూపుతూ, చులాగ్గా గెలిచాడు. కొద్ది నెలల్లో జరిగే ప్రపంచ ఛాంపియన్ పోటీలకు ఎన్నికయ్యాడు. 138 సంవత్సరాల ప్రపంచ ఛాంపి యన్షిప్ చరిత్రలోనే చిన్న వయసువాడిగా వరల్డ్ టైటిల్ కోసం పోటీపడనున్నాడు. ఒకవేళ ఆ విశ్వవేదిక పైనా గెలిస్తే, అతి పిన్నవయస్కుడైన వరల్డ్ ఛాంపియన్‌గా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఒక్క గుకేశ్ విజయమే కాక భవిష్యత్ ఆశాకిరణాలూ అనేకం ఉండడం గమనార్హం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళు పాల్గొనే ‘క్యాండిడేట్స్’లో ఉన్నదే 16 మంది. అందులో ముగ్గురు మగ వాళ్ళు (గుకేశ్, విదిత్, ఆర్. ప్రజ్ఞానంద), ఇద్దరు ఆడవారు (కోనేరు హంపీ, ఆర్. వైశాలి)తో మొత్తం అయిదుగురి అతి పెద్ద బృందం భారత్‌దే. ఇంతమంది ఆటగాళ్ళు ఈ క్లిష్టమైన అలాగే, 2024 ఏప్రిల్ నాటి ‘ఫిడే’ ర్యాంకింగ్స్‌లో టాప్ 25లో అయిదుగురు భారతీయ పురుషులే. ఇక, మహిళల ర్యాకింగ్స్లో టాప్ 15లో ముగ్గురు మనవాళ్ళే. జూనియర్ ర్యాకింగ్స్‌కు వస్తే టాప్ 20లో ఏడుగురు భార తీయులే. అదే టాప్ 30 జూనియర్స్ని గనక లెక్క తీస్తే మూడింట ఒక వంతు మన దేశీయులే.ప్రపంచ చదరంగ వేదికపై అంతకంతకూ విస్తరిస్తున్న భారతదేశ స్థాయికీ, స్థానానికీ ఇదే సాక్ష్యం. ‘చదరంగంలో భారత్ విశేష కృషి చేస్తోంది. అనతికాలంలో ప్రపంచంలో అగ్రశ్రేణి చదరంగ దేశమవుతుంది’ అని ప్రపంచ మాజీ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సెన్ గత ఏడాది వ్యాఖ్యానించారు. ఇప్పుడదే నిజమవుతోంది. నిజానికి, మన దేశంలో చదరంగ క్రీడ ఇంత శరవేగంతో విస్తరించడానికీ, విస్ఫోటనం చెందడానికీ అనేక కారణాలున్నాయి. ఇంటర్నెట్ డేటా ప్యాక్‌లు చౌక కావడం, మొబైల్ ఫోన్లలో సైతం సులభంగా అందుబాటులో ఉన్న చెస్ యాప్‌లు వగైరా వల్ల జనసామాన్యంలో ఈ క్రీడ వేగంగా, బలమైన పునాది వేసుకుంటోందని నిపుణుల విశ్లేషణ. ఇంటర్నెట్ వ్యాప్తి వల్ల ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని పిల్లలు సైతం మెట్రో నగరాల్లోని అత్యుత్తమ కోచ్‌ల నుంచి ఆన్ లైన్ చెస్ పాఠాలు నేర్చే వీలొచ్చింది. కరోనా అనంతరం ఆన్లైన్ టోర్నమెంట్లు పెరగడం కూడా భారతీయ యువకిశోరాలకు కలిసొచ్చింది. సూపర్ గ్రాండ్ మాస్టర్ల తోనూ, చివరకు ప్రపంచ మాజీ ఛాంపియన్లతోనూ తలపడి అనుభవం, ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించే అవకాశం దక్కింది. అగ్రశ్రేణి క్రీడాకారులు ఆట మానేశాక, కోచ్‌లుగా మారడమూ కొత్త తరానికి వరమైంది.గ్రాండ్ మాస్టర్లు ఆర్బీ రమేశ్ (ప్రజ్ఞానంద, వైశాలికి కోచ్), విష్ణుప్రసన్న (గుకేశ్‌కు కోచ్), శ్రీనాథ్ నారాయణన్ (అర్జున్, నిహాల్ సరీన్‌ల ట్రైనర్), సూర్యశేఖర్ గంగూలీ (విదిత్‌కు కోచ్) లాంటి వారు, వారి శిక్షణలో ఆరితేరిన ఆటగాళ్ళే అందుకు నిదర్శనం. గ్రాండ్ మాస్టర్లు కాకపోయినప్పటికీ, మంచి చదరంగం ఆటగాళ్ళు దాదాపు 50 వేల మందికి పైగా భారత్‌లో ఉన్నారని సాక్షాత్తూ ప్రపంచ చదరంగ క్రీడా పర్యవేక్షక సంస్థ (ఫిడే) డైరెక్టర్ జనరల్ ఎమిల్ సుతోవ్‌స్కీ అనడం విశేషం. ఇవన్నీ కలసి దేశంలో చదరంగ క్రీడకు సంబంధించిన సువ్యవస్థిత వాతావరణ కల్పనకు దోహదం చేశాయి. ‘ఫిడే’ సహకారంతో టెక్ మహీంద్రా ధనసాయంతో నడుస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ లాంటి టోర్నమెంట్లు సైతం ఆటకూ, ఆటగాళ్ళకూ కొత్త ఉత్సాహం, ఉత్తేజం తెచ్చాయి. వీటన్నిటి ఫలితంగా ఇవాళ 64 చదరపు గడుల ఆటలో భారత్ అపూర్వంగా ముందుకు దూసుకుపోతోంది. ‘ఈ ప్రపంచంలో ఈ క్షణంలో అత్యంత అస్థిరమైనది ఏమిటంటే, చదరంగంలో భారత నంబర్ 1 స్థానం’ అని అజర్‌బైజాన్‌కు చెందిన ఓ గ్రాండ్ మాస్టర్ ఈ ఏడాది జనవరిలో ట్వీట్ చేశారు. ఛలోక్తిగా చెప్పినా, చెస్‌లో నిత్యం కొత్త ప్రతిభావంతులు రంగంలోకి దూసుకువస్తున్న మన దేశంలో ఇప్పుడది అక్షరసత్యం. ఈ ఏడాదిలో ఈ నాలుగు నెలల్లోనే ఆ నంబర్1 కిరీటం మన ఆటగాళ్ళు అయిదుగురి (విశ్వనాథన్ ఆనంద్, గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్, విదిత్) మధ్య ఎప్పటికప్పుడు మారుతూ వచ్చిందంటే మనవాళ్ళలో పెల్లుబుకుతున్న ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. యువజన – క్రీడాశాఖ సమకూరుస్తున్న నిధులు, ఆటగాళ్ళ శిక్షణకు అఖిల భారత చదరంగ సమాఖ్య అందిస్తున్న సహకారం, ప్రైవేట్ సంస్థల సహాయం ప్రతిభను పెంచి పోషించడంలో ప్రధానపాత్ర వహించాయి. ఇవాళ దేశంలో 84 మంది గ్రాండ్ మాస్టర్లు, 124 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు, 23 మంది మహిళా గ్రాండ్ మాస్టర్లు, 42 మంది మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్లు ఉన్నారంటే కారణం అదే! దేశవ్యాప్తంగా 30 వేల మందికి పైగా రేటింగ్ పొందిన రెగ్యులర్ టోర్నమెంట్ చెస్ ఆటగాళ్ళు న్నారని ఒక లెక్క. ప్రపంచమంతటిలో ఇందరు ప్రతిభావంతులున్నది మన దేశంలోనే! ప్రపంచ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ లాంటివారు చిరకాలంగా ఆదర్శంగా నిలవడంతో, ఎంతో మంది చెస్ వైపు ఆకర్షితులయ్యారన్నది నిజం. సమాజంలోని ఆ ధోరణుల్ని గమనించి, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తగినంత సహాయ సహకారాలు అందించి, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే ఏ క్రీడలోనైనా ఎంతటి అద్భుతాలు చేయవచ్చో భారతీయ చదరంగావని చాటిచెబుతోంది. కఠోర పరిశ్రమతో, కాలగతిలో ఆ ఆటలో ఛాంపియన్ దేశంగా ఆవిర్భవించిన మనం ఈ పాఠాలను ఇతర క్రీడలకూ అనువర్తింపజేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమూ, ఇతర క్రీడా సంస్థలూ ఆ దిశగా అడుగులు వేస్తే మన క్రీడాలోకం మరిన్ని శుభవార్తలు అందించడానికి సదా సిద్ధంగా ఉంటుంది! -
ప్రపంచకప్‌లో అదుర్స్.. ఇదో చారిత్రక ఘట్టం: భారత చెస్ దిగ్గజం
బకూ (అజర్బైజాన్): ప్రపంచ కప్ చెస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి కీలక విజయాన్ని అందుకున్నాడు. మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో అర్జున్ 53 ఎత్తుల్లో భారత్‌కే చెందిన ఆర్. ప్రజ్ఞానందను ఓడించాడు. నల్లపావులతో ఆడిన అర్జున్‌కు ఈ విజయంతో ఆధిక్యం దక్కింది. బుధవారం తెల్ల పావులతో ఆడి రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకు న్నా అతను సెమీస్ చేరతాడు. తొలి గేమ్‌లు డ్రా మరో క్వార్టర్స్ పోరులో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) జోరు ముందు భారత ఆటగాడు డి.గుకేశ్ నిలవలేకపోయాడు. నల్ల పావులతో ఆడిన కార్ల్సన్ 48 ఎత్తులో గుకేశ్ ఆటకట్టించాడు. మరో రెండు క్వార్టర్ ఫైనల్ సమరాల తొలి గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. విదిత్ గుజరాతీ (భారత్), నిజాత్ అబసోవ్ (అజర్ బైజాన్) మధ్య గేమ్ 109 ఎత్తుల్లో... ఫాబియోనో కరువానా (అమెరికా), లీనియర్ డొమినెగ్వెజ్ పెరెజ్ (అమెరికా) మధ్య గేమ్ 71 ఎత్తుల్లో ‘డ్రా‘ అయ్యాయి. ఇదో చారిత్రక ఘట్టం మరోవైపు నలుగురు భారత ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరడం పెద్ద విశేషమని దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ‘భారత చదరంగంలో ఇదో చారిత్రక ఘట్టం’ అని ఆనంద్ విశ్లేషించాడు. ‘ఒకరు కానీ ఇద్దరు కానీ క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలరని నేను అంచనా వేశాను. కానీ నలుగురు ముందంజ వేయగలిగారు. వారి ఆట చూస్తే ఇంకా ముందుకు వెళ్లగల సామర్థ్యం ఉందని నమ్ముతున్నా’ అని ఆనంద్ అభిప్రాయ పడ్డాడు. చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే! -
ప్రిక్వార్టర్స్‌లో అర్జున్
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అర్జున్‌తోపాటు భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. నాలుగో రౌండ్లో అర్జున్ 1.5–0.5తో సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, విదిత్ 1.5–0.5తో ఎటెని బాక్రోట్ (ఫ్రాన్స్) పై గెలుపొందారు. సిందరోవ్‌తో బుధవారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న అర్జున్ గురువారం జరిగిన రెండో గేమ్‌లో 60 ఎత్తుల్లో నెగ్గాడు. బాక్రోట్తో బుధవారం జరిగిన తొలి గేమ్‌లో గెలిచిన విదిత్ గురువారం జరిగిన రెండో గేమ్‌ను 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నాలుగో రౌండ్లో రెండు గేమ్‌లు ముగిశాక గుకేశ్ (భారత్)–ఎసిపెంకో (రష్యా); ప్రజ్ఞానంద (భారత్)–నకముర (అమెరికా); నిహాల్ (భారత్) –నెపోమ్నిశి (రష్యా) 1–1తో సమంగా ఉండటంతో వీరి మధ్య నేడు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. మరోవైపు మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక కూడా శుక్రవారం టైబ్రేక్ గేమ్‌లు ఆడనున్నారు. బెలా ఖొటె నాష్విలి (జార్జియా)తో తొలి గేమ్‌లో ఓడిన హంపి గురువారం జరిగిన రెండో గేమ్‌లో 42 ఎత్తుల్లో గెలిచి స్కోరును 1–1తో సమం చేసింది. హారిక, ఎలైన్ రోబర్స్ (నెదర్లాండ్స్) మధ్య రెండో గేమ్ కూడా ‘డ్రా’గా ముగియడంతో ఇద్దరూ 1–1తో సమంగా ఉన్నారు. -
నూతక్కి ప్రియాంకకు చేదు అనుభవం.. ఊహించని పరిణామంతో ఇంటికి
చెన్నై: ఆంధ్రప్రదేశ్ మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఊహించని పరిణామంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ గేమ్ సందర్భంగా ఆమె ధరించిన బ్లేజర్ జేబులో ఇయర్ బడ్స్ ఉండటంతో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) వేటు వేసింది. 20 ఏళ్ల ప్రియాంకను మిగతా రౌండ్లు ఆడకుండా టోర్నీ నుంచి పంపించింది. అధునాతన సాంకేతిక పరికరాలతో మోసపూరిత ఆట ఆడే అవకాశం ఉండటంతో స్మార్ట్ పరికరాలకు అనుమతి లేదు. ‘ఆమె గేమ్‌లో చీటింగ్‌కు పాల్పడలేదు. కానీ నిషేధిత పరికరాలతో హాల్లోకి ప్రవేశించరాదని కఠిన నిబంధనలున్నాయి. వీటిని ఉల్లంఘించడంవల్లే ప్రియాంకపై వేటు వేశాం’ అని ‘ఫిడే’ తెలిపింది. చదవండి: T20 WC- Semi Finalists: ప్రపంచకప్.. సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే! ఇక విజేతగా..: సచిన్ టెండుల్కర్ FIFA U17 Womens World Cup: ప్రపంచకప్ నుంచి వట్టి చేతులతో నిష్క్రమించిన భారత్ -
చెన్నైలో చెస్ ఒలింపియాడ్
సాక్షి, చెన్నై: భారత చెస్ రాజధాని చెన్నై మరో మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ తర్వాత మరో ప్రధాన టోర్నీ అయిన ‘చెస్ ఒలింపియాడ్’ ఈ ఏడాది చెన్నైలో జరగనుంది. ఉక్రెయిన్‌పై అనైతిక యుద్ధం చేస్తోన్న రష్యాకు కట్టబెట్టిన ఆతిథ్య హక్కుల్ని ఇదివరకే రద్దు చేసిన ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) తాజాగా కొత్త వేదికను ఖరారు చేసింది. అయితే తేదీలు తదితర వివరాలను ఇంకా ప్రకటించలేదు. ముందనుకున్న షెడ్యూలు ప్రకారమైతే మాస్కోలో జూలై 26 నుంచి ఆగస్టు 8 వరకు ఈ టీమ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. చెన్నైలోనూ ఇదే షెడ్యూలులో నిర్వహిస్తారా లేదం టే కొత్త తేదీల్ని ప్రకటిస్తారనేదానిపై స్పష్టత రాలే దు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చెన్నై లో మెగా టోర్నీ విషయాన్ని ప్రకటించారు. ‘భారత చెస్ క్యాపిటల్‌కు చెస్ ఒలింపియాడ్ ఆతిథ్య భాగ్యం దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఇది తమిళనాడుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. ప్రపంచంలోని చదరంగ రాజులు, రాణులకు (ప్లేయర్లు)కు చెన్నై స్వాగతం పలుకుతోంది’ అని తమిళ సీఎం స్టాలిన్ ట్విట్టర్లో తెలిపారు. ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) కూడా ఆతిథ్య వేదికగా చెన్నై ఖరారైందని వెల్లడించింది. ‘ఫిడే’ రష్యాను తప్పించగానే ఏఐసీఎఫ్ ఆతిథ్య హక్కుల కోసం గట్టిగానే ప్రయత్నించింది. 10 మిలియన్ డార్లు (సుమారు రూ. 70 కోట్లు) గ్యారంటీ మనీగా డిపాజిట్ చేసింది. ఇది చెస్‌లో జరిగే పెద్ద టీమ్ ఈవెం ట్. ఇందులో దాదాపు 190 దేశాలకు చెందిన 2000 పైగా క్రీడాకారులు తలపడతారు. భారత్ నుంచి జగద్విఖ్యాత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, తెలుగు గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణ, విదిత్ గుజరాతీలతో పాటు తెలంగాణ ఆటగాడు అర్జున్ ఎరిగైసి... మహిళల కేటగిరీలో హంపి, హారిక, వైశాలి తదితరులు పాల్గొనే అవకాశాలున్నాయి. అయితే జట్లను మే 1న అధికారికంగా> ప్రకటిస్తారు. 2013లో విశ్వనాథన్ ఆనంద్, కార్ల్‌సన్‌ల మధ్య జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు చెన్నై ఆతిథ్యమిచ్చింది. చెన్నై ఆతిథ్యంపై ఆనంద్ స్పందిస్తూ ‘ఇది భారత్‌కు, చెన్నై చెస్ సమాజానికి గర్వకారణం. చెస్‌కు చెన్నై సరిగ్గా సరిపోతుంది. ఈ దిశగా కృషి చేసిన ఏఐసీఎఫ్‌కు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు. మరో వైపు రష్యానుంచి వేదికను మార్చిన ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) అక్కడి ఆటగాళ్లను చెస్ ఒలింపియాడ్‌లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది. రష్యాతో పాటు యుద్ధోన్మాదానికి సహకరిస్తోన్న బెలారస్ ఆటగాళ్లపై నిషేధం విధిస్తున్నామని, తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని ‘ఫిడే’ ప్రకటించింది. -
చరిత్ర సృష్టించిన కార్ల్సన్.. వరుసగా నాలుగోసారి
దుబాయ్: 64 గళ్లపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ నార్వే దిగ్గజ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ వరుసగా నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. రష్యాకు చెందిన ‘చాలెంజర్’ ఇయాన్ నిపోమ్‌నిషితో జరిగిన ప్రపంచ క్లాసికల్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో మరో మూడు గేమ్‌లు మిగిలి ఉండగానే కార్ల్సన్ విశ్వ కిరీటాన్ని హస్తగతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన 11వ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన కార్ల్సన్ 49 ఎత్తుల్లో గెలుపొందాడు. దాంతో నిర్ణీత 14 గేమ్‌ల ఈ చాంపియన్ షిప్ మ్యాచ్‌లో కార్ల్సన్ 7.5–3.5తో ఆధిక్యంలోకి వెళ్లి టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. తదుపరి మూడు గేముల్లో నిపోమ్‌నిషి గెలిచినా కార్ల్సన్ స్కోరును సమం చేసే అవకాశం లేకపోవడం... కార్ల్‌సన్‌కు టైటిల్ ఖాయం కావడంతో మిగతా మూడు గేమ్‌లను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. 2014, 2016, 2018లలో కూడా ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 30 ఏళ్ల కార్ల్ సన్‌కు ఈసారీ తన ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. వరుసగా మొదటి ఐదు గేమ్‌లు ‘డ్రా’గా ముగిసినా... 136 ఎత్తులు, 7 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఆరో గేమ్‌లో కార్ల్సన్ గెలిచి బోణీ కొట్టాడు. ఆ తర్వాత ఏడో గేమ్ ‘డ్రా’కాగా... ఎనిమిదో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో కార్ల్సన్ విజయం సాధించాడు. అనంతరం పదో గేమ్ ‘డ్రా’ అయింది. అయితే 11వ గేమ్‌లో మళ్లీ కార్ల్సన్ గెలిచి నిపోమ్‌నిషి కథను ముగించాడు. విజేత కార్ల్‌సన్‌కు 12 లక్షల యూరోలు (రూ. 10 కోట్ల 28 లక్షలు)... రన్నరప్ నిపోమ్‌నిషికి 8 లక్షల యూరోలు (రూ. 6 కోట్ల 85 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. క్లాసికల్ ఫార్మాట్లోనే కాకుండా ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలోనూ కార్ల్సన్ ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌గా ఉన్నాడు. -
World Chess Championship: కార్ల్సన్ మళ్లీ గెలిచాడు
దుబాయ్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ జోరు మీదున్నాడు. చాలెంజర్ నిపోమ్‌నిషి (రష్యా)తో మంగళవారం జరిగిన తొమ్మిదో గేమ్‌లో కార్ల్సన్ నల్లపావులతో ఆడుతూ 39 ఎత్తుల్లో గెలిచాడు. ఈ చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్కిది మూడో విజయం. గత రెండు విజయాలు కార్ల్‌సన్‌కు తెల్లపావులతో ఆడినపుడు లభించాయి. తొమ్మిదో గేమ్‌ను ప్రారంభించే అవకాశం భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు దక్కింది. నిపోమ్‌నిషి తరఫున ప్రజ్ఞానంద తెల్లపావులతో తొలి ఎత్తును వేసి గేమ్‌ను ప్రారంభించాడు. మొత్తం 14 గేమ్‌లు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో తొమ్మి ది గేమ్‌ల తర్వాత కార్ల్సన్ 6–3తో ఆధిక్యంలో ఉన్నాడు. నేడు పదో గేమ్ జరగనుంది. -
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్..
సిట్‌గెస్ (స్పెయిన్): ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో రాణించిన భారత అమ్మాయిలు ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లారు. జార్జియాతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2.5–1.5తో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ తొలి మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. సెమీఫైనల్ రెండో మ్యాచ్‌లో తానియా సచ్దేవ్, వైశాలి తమ ప్రత్యర్థులను ఓడించి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. తానియా 54 ఎత్తుల్లో మేరీ అరాబిద్జెపై... వైశాలి 43 ఎత్తుల్లో గ్రాండ్‌మాస్టర్ నినో బత్సియాష్విలిపై గెలిచారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 43 ఎత్తుల్లో గ్రాండ్‌మాస్టర్ నానా జాగ్‌నిద్జెతో గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. మేరీఆన్ గోమ్స్ 62 ఎత్తుల్లో లెలా జవాకిషివిలి చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే ఫైనల్లో రష్యాతో భారత్ తలపడుతుంది. అతాను దాస్ విఫలం యాంక్టన్ (అమెరికా): ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ ప్రపంచకప్ ఫైనల్స్ నుంచి భారత క్రీడాకారులు రిక్తహస్తాలతో తిరిగి వస్తున్నారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ అతాను దాస్ కాంస్య పతక పోరులో ఓడిపోయాడు. టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ మెట్ గాజోజ్ (టర్కీ)తో జరిగిన మ్యాచ్‌లో అతాను దాస్ 0–6 (27–29, 26– 27, 28–30)తో పరాజయం పాలయ్యాడు. చదవండి: Venkatesh Iyer: అయ్యారే అయ్యర్.. కేకేఆర్ తరపున రెండో బ్యాటర్‌గా -
Women World Chess Championship: భారత్‌కు మిశ్రమ ఫలితాలు
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అర్మేనియాతో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 2.5–1.5తో గెలిచిన భారత జట్టు... రష్యాతో జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 1–3తో పరాజయం పాలైంది. అర్మేనియాతో మ్యాచ్‌లో హారిక తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకోగా... వైశాలి ఓడిపోయింది. తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి తమ ప్రత్యర్థులపై నెగ్గి భారత్‌కు విజయాన్ని అందించారు. రష్యాతో మ్యాచ్‌లో హారిక, మేరీఆన్ గోమ్స్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... తానియా, వైశాలి ఓడిపోయారు. నేడు ఐదో రౌండ్లో ఫ్రాన్స్‌తో భారత్ ఆడుతుంది. కాగా అజర్‌బైజాన్‌తో జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో లీగ్ మ్యాచ్‌లో 2.5–1.5తో స్పెయిన్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్ కార్తిక్ The battles of the FIDE Women's World Team Championship are finished for today. Results of Round 4 of the group stage: Pool A Spain ½:3½ Armenia CFR Team 3:1 India France 3½:½ Azerbaijan Pool B Poland 2:2 Georgia FIDE Americas 2:2 Germany Ukraine 2½:1½ Kazakhstan pic.twitter.com/pdcmsOr5mP — International Chess Federation (@FIDE_chess) September 28, 2021 -
Dronavalli Harika: స్పెయిన్‌పై భారత్ విజయం
Women World Chess Championship.. సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత్ అజేయంగా నిలిచింది. అజర్‌బైజాన్‌తో జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో లీగ్ మ్యాచ్‌లో 2.5–1.5తో స్పెయిన్‌పై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి, మేరీఆన్ గోమ్స్‌లతో కూడిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. అజర్‌బైజాన్‌తో మ్యాచ్‌లో హారిక 34 ఎత్తుల్లో గునె మమద్జాదాపై, వైశాలి 60 ఎత్తుల్లో గుల్నార్ మమదోవాపై గెలిచారు. తానియా, భక్తి కులకర్ణి తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. స్పెయిన్‌తో మ్యాచ్‌లో హారిక, భక్తి కులకర్ణి, మేరీఆన్ గోమ్స్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... వైశాలి 47 ఎత్తుల్లో సబ్రీనాపై నెగ్గడంతో భారత విజయం ఖాయమైంది. చదవండి: David Warner: మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి.. అన్నా అలా అనొద్దు! -
‘రెండేళ్ల తర్వాత ఆడటం కొంచెం కష్టమనిపించింది’
-
‘రెండేళ్ల తర్వాత ఆడటం కొంచెం కష్టమనిపించింది’
సాక్షి, విజయవాడ : ప్రపంచ రాపిడ్ ఛాంపియన్‌గా గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందని చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పేర్కొన్నారు. గత నెల రష్యాలోని మాస్కోలో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి బంగారు పథకం సాధించిన విషయం తెలిసిందే. గురువారం ఆమె సాక్షితో మాట్లాడుతూ.. గోల్డ్ మెడల్ సాధించడం తన 15 ఏళ్ల కల అని అన్నారు. ఆరేళ్ల వయసు నుంచి చెస్ ప్లేయర్‌గా రాణిస్తున్నానని.. రెండు సంవత్సరాల బ్రేక్ తర్వాత చెస్ ఆడటం కొంచెం కష్టమనిపించిందన్నారు. తనకు పాప పట్టడం వల్ల రెండేళ్ల వరకు ఆట జోలికి వెళ్లలేదని, తిరిగి ఆడిన గేమ్ ప్రపంచ ఛాంపియన్‌గా గెలవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.(కోనేరు హంపికి సీఎం జగన్ అభినందనలు) తన విజయాన్ని అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రత్యర్థులతో ఎత్తుకు పైఎత్తు వేసి మేధస్సుకు పని చెప్పానన్నారు. తన విజయం వెనుక తల్లిదండ్రులు, భర్త పాత్ర ఎంతోగానో ఉందని తెలిపారు. ఎన్నో జయాపజయాలను చవి చూశానని...అపజయాలను అధిగమించి ప్రపంచ ఛంపియన్‌గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని టోర్నమెంట్లు ఆడి దేశం గర్వించేలా చేస్తానన్నారు. -
విజేత హారిక
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ స్విస్ గ్రాండ్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసింది. యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన ఈ టోర్నీలో హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హారిక 5.5 పాయింట్లతో దినారా (కజకిస్తాన్)తో కలిసి సమఉజ్జీగా నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా హారికకు తొలి స్థానం, దినారాకు రెండో స్థానం లభించాయి. హారిక 11 మంది గ్రాండ్మాస్టర్లతో గేమ్‌లు ఆడింది. రెండు గేముల్లో గెలిచింది. ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడింది. తాజా ప్రదర్శనతో హారిక త్వరలో వెలువడే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంటుంది. -
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ లోగో వివాదం
2018లో లండన్‌లో జరగబోయే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు సంబంధించి కొత్తగా విడుదల చేసిన లోగోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చదరంగానికి ఇంత అసభ్యతను జోడించడం ఏమిటంటూ ప్రపంచవ్యాప్తంగా గారీ కాస్పరోవ్వంటి దిగ్గజాలు సహా పలువురు విరుచుకు పడ్డారు. నవంబర్ 18నుంచి మాగ్నస్ కార్ల్సన్...క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచే చాలెంజర్తో తలపడతాడు. ‘చెస్‌ను ప్రపంచంలో ఎవరైనా గేమ్‌ల కోసమే చూస్తారు. దీనిని అర్ధరాత్రి మాత్రమే చూడగలిగే టీవీ షోగా మార్చకండి. నాకు తెలిసిన చెస్‌లో 8గీ8 గళ్లు ఉంటాయి. ఇక్కడ 6గీ6 కనిపిస్తున్నాయి’ అని దీనిపై విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. అయితే నిర్వాహకులు మాత్రం ఈ లోగోతోనే ప్రచారానికి సిద్ధమైనట్లు ప్రకటించేశారు. -
నిరాశ... అయినా ఆనందమే!
ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రదర్శనపై ‘సాక్షి’తో హారిక సాక్షి, హైదరాబాద్: గత రెండు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలతో సంతృప్తి పడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఈసారి మాత్రం మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తుందని అందరూ భావించారు. అయితే కీలకదశలో అదృష్టం కలిసి రాకపోవడంతో ఆమె మూడోసారీ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చైనా క్రీడాకారిణి తాన్ జోంగితో చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ టైబ్రేక్‌లో హారిక ఓటమి చవిచూసింది. ఈసారీ హారిక కాంస్యమే నెగ్గినా అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకుంది. వరుసగా మూడు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ (నాకౌట్ ఫార్మాట్) పోటీల్లో పతకం నెగ్గిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. గతంలో కోనేరు హంపి (2004, 2008, 2010లలో) కూడా మూడు కాంస్యాలు నెగ్గినా వరుస చాంపియన్‌షిప్‌లలో ఆమె ఈ పతకాలను సాధించలేదు. ఈ టోర్నీ వేదికగా నిలిచిన ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి హైదరాబాద్‌కు ఆదివారం బయలుదేరేముందు ఈ మెగా ఈవెంట్లో ప్రదర్శనపై హారిక ‘సాక్షి’తో ముచ్చటించింది. మూడోసారీ కాంస్యమే సాధించారు... ఎలా అనిపిస్తోంది? నా అనుభూతిని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. ఒకవైపు నిరాశ కలుగుతోంది. మరోవైపు వరుసగా 3సార్లు ఈ మెగా ఈవెంట్లో పతకం సాధించినందుకు ఆనందంగా కూడా ఉంది. టోర్నీ ఆసాంతం మీ ప్రదర్శనను విశ్లేషిస్తే... క్లాసికల్ గేమ్స్‌లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాను. సులువుగా గెలవాల్సిన చోట లేదా ‘డ్రా’ చేసుకోవాల్సిన సమయంలో కాస్త తడబడ్డాను. అయినప్పటికీ క్లిష్టమైన సమయాల్లో ఒత్తిడిని అధిగమించి రాణించినందుకు సంతోషంగా ఉన్నాను. సెమీఫైనల్ టైబ్రేక్‌లో ఎక్కడ పొరపాటు జరిగింది? ర్యాపిడ్ పద్ధతిలో జరిగిన టైబ్రేక్ తొలి గేమ్‌లో బాగా ఆడి గెలిచాను. ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్న సమయంలో రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవాలనే తొందరలో తప్పటడుగు వేశాను. కీలక దశలో బంటును కోల్పోయి గేమ్‌లో ఓటమి చెందాను. ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన సెమీఫైనల్ రెండో గేమ్‌లో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ గేమ్ ఆరంభంలోనే నేను విజయావకాశాలను సృష్టించుకున్నాను. కానీ కీలకదశలో పొరపాటు చేసి నా ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చాను. అయితే ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో అనుభవాన్నంతా రంగరించి పోరాడాను. చివరకు 6 గంటలపాటు జరిగిన ఈ గేమ్‌లో నేను 162 ఎత్తుల వరకు ఆడాల్సి వచ్చింది. సెమీఫైనల్ చేరే క్రమంలో మీకు అన్ని మ్యాచ్‌లలో టైబ్రేక్‌లోనే విజయాలు దక్కడాన్ని ఎలా చూస్తారు? ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కాబట్టి అందరూ పక్కాగా సిద్ధమై వచ్చారు. నా తొలి రౌండ్ ప్రత్యర్థి బంగ్లాదేశ్‌కు చెందిన షమీమా ఆమె రేటింగ్ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. నాకౌట్ టోర్నమెంట్ కాబట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకుండా, రిస్క్ తీసుకోకుండా ఆడాను. అయితే అన్ని టైబ్రేక్‌లలో నా ప్రదర్శన బాగా ఉంది. ఈ టోర్నీలో నాతోపాటు ఉన్న మా అమ్మమ్మ అన్ని విధాలా అండగా నిలిచింది. క్లిష్ట సమయంలో ఆమె మద్దతు నాకు ఎంతో ఉప యోగపడింది. ఎలాంటి విరామం తీసుకోకుండా వచ్చే నెలలో రెండు అంతర్జాతీయ టోర్నీలలో (షార్జా, ఐస్లాండ్) ఆడనున్నాను. -
పోరాడి ఓడిన హారిక... కాంస్య పతకం సొంతం
టెహరాన్ (ఇరాన్): చివరి క్షణం వరకు తన శక్తి వంచన లేకుండా పోరాడినప్పటికీ.... సమయాభావం రూపంలో దురదృష్టం వెంటాడటంతో ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కాంస్య పతకంతో సంతృప్తి పడింది. తాన్ జోంగి (చైనా)తో శనివారం జరిగిన సెమీఫైనల్ టైబ్రేక్‌లో హారిక 3–4 తేడాతో ఓడిపోయింది. ‘ర్యాపిడ్’ పద్ధతిలో జరిగిన తొలి రెండు గేముల్లో చెరొకటి నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. ‘ర్యాపిడ్’ పద్ధతిలోనే మళ్లీ రెండు గేమ్‌లు నిర్వహించగా... ఈసారీ చెరొకటి గెలవడంతో స్కోరు 2–2తో సమమైంది. ఆ తర్వాత ‘బ్లిట్జ్’ పద్ధతిలో నిర్వహించిన రెండు గేమ్‌లూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో స్కోరు 3–3తో సమమైంది. ‘అర్మగెడాన్’ పద్ధతిలో ఆఖరి గేమ్‌ను నిర్వహించారు. తెల్ల పావులు పొందిన హారికకు 5 నిమిషాలు... నల్లపావులు పొందిన తాన్ జోంగికి 4 నిమిషాలు కేటాయించారు. నిబంధనల ప్రకారం తెల్ల పావులతో ఆడేవారు ఐదు నిమిషాల్లో ఫలితం సాధించాలి. లేదంటే నల్లపావులతో ఆడినlవారిని విజేతగా ప్రకటిస్తారు. 99 ఎత్తుల తర్వాత హారిక వద్ద సమయం అయిపోవడం, ఫలితం తేలక పోవడంతో తాన్ జోంగి విజేతగా నిలిచింది. దాంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో హారికకు వరుసగా మూడోసారీ (2012, 2015, 2017) కాంస్యమే దక్కింది. -
హారిక పరాజయం
ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ టెహరాన్ (ఇరాన్): ప్రపంచ చెస్ చాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారికకు షాక్! టోర్నీ సెమీ ఫైనల్లో భాగంగా తాన్ జోంగి (చైనా)తో గురువారం జరిగిన తొలి గేమ్‌లో హారికకు పరాజయం ఎదురైంది. 44 ఎతు్తల్లో ఈ గేమ్ ముగిసింది. తెల్లపావులతో ఆడిన తాన్ ప్రా రంభం నుంచి ఆధిక్యం ప్రదర్శించి హారికకు ఎలాం టి అవకాశం ఇవ్వలేదు. పోటీలో నిలవాలంటే శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో హారిక తప్పనిసరిగా వి జయం సాధించాల్సి ఉంటుంది. గేమ్ ‘డ్రా’గా ము గిసినా ఆమె నిష్క్రమిస్తుంది. అయితే సెమీస్ చేరడంతో కాంస్యం మాత్రం దకు్కతుంది. ఉమెన్ గ్రాం డ్ మాస్టర్ అయిన తాన్ జోంగితో గతంలో 4–4తో సమవైున రికార్డు ఉన్న హారిక, ప్రపంచ చాంపియన్ షిప్ కీలక పోరులో మాత్రం తడబడింది. -
ఆశల పల్లకిలో హారిక
టెహరాన్: గత రెండు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో (2012, 2015) కాంస్య పతకాలు సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉంది. శనివారం ఇరాన్‌లోని టెహరాన్‌లో మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ తెలుగు అమ్మాయి నాలుగో సీడ్‌గా బరిలోకి దిగనుంది. శని వారం జరిగే తొలి రౌండ్ తొలి గేమ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన షమీమాతో హారిక తలపడుతుంది. మొత్తం 64 మంది క్రీడాకారిణుల మధ్య నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీ మార్చి 3వ తేదీన ముగుస్తుంది. సెమీఫైనల్ దశ వరకు ఇద్దరు క్రీడాకారిణుల మధ్య రెండు గేమ్‌ల చొప్పున జరుగుతాయి. ఎక్కువ పాయింట్లు సాధించిన క్రీడాకారిణికి విజయం దక్కుతుంది. ఒకవేళ స్కోరు సమంగా ఉంటే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. భారత్ నుంచి మరో ప్లేయర్ పద్మిని రౌత్ కూడా బరిలోకి దిగుతోంది. -
మరిన్ని టోర్నీలు ఆడతా
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండో ఏడాది ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన... ఆటకు స్వస్తి చెప్పాలనే ఆలోచన తనకేమాత్రం లేదని భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్పష్టం చేశాడు. తన కెరీర్లో ఇంకా గొప్ప ఫలితాలు రావాల్సి ఉన్నాయని... వచ్చే ఏడాది మరిన్ని టోర్నమెంట్లలో బరిలోకి దిగుతున్నానని ఈ ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ వెల్లడించాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) ఆటతీరు భిన్నంగా ఉంటుందని... అతను ప్రాక్టీస్‌కంటే గేమ్‌లో అప్పటికపుడు వచ్చే ఆలోచనలతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడతాడని హైదరాబాద్‌లో శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆనంద్ వ్యాఖ్యానించాడు. ఒకవైపు క్రీడాకారుడిగా కొనసాగుతూ... మరోవైపు శిక్షణ ఇవ్వడం అనేది కష్టంతో కూడుకున్న పని అని తెలిపాడు. రిటైరయ్యాకే శిక్షణ ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తానని అన్నాడు. తమ ఆటలోని లోపాలను సరిదిద్దుకునేందుకు విదేశాల్లో శిక్షణ తీసుకోవడం మంచిదే అని 45 ఏళ్ల ఆనంద్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరి నుంచైనా అత్యుత్తమ శిక్షణ తీసుకునేందుకు ప్రయత్నిస్తే తప్పులేదని... విద్యావిధానంలో చెస్‌ను పాఠ్యాంశంగా చేర్చితే మంచిదే అని ఆనంద్ తెలిపాడు. -
20 ఎత్తుల్లో... గంటలోనే...
* ఆనంద్, కార్ల్సన్ తొమ్మిదో గేమ్ డ్రా * ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సోచి: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో మరో డ్రా. అయితే ఈసారి కేవలం 20 ఎత్తుల్లోనే, అది కూడా గంటలోనే ఆనంద్, కార్ల్‌సన్‌ల మధ్య తొమ్మిదో గేమ్ డ్రాగా ముగిసింది. తెల్లపావులతో ఆడిన కార్ల్సన్ బెర్లిన్ డిఫెన్స్‌తోనే గేమ్ ప్రారంభించాడు. 12 మూవ్‌ల వరకూ ఇద్దరూ గతంలో ఆడిన ఎత్తులనే ఆడారు. ఆ తర్వాత నాలుగు మూవ్స్ మాత్రమే కొత్తగా వేశారు. దీంతో 16వ ఎత్తు వద్దే ఈ గేమ్ డ్రా కావడం ఖాయంగా కనిపించింది. ఆ తర్వాత మూడు ఎత్తులు కూడా పునరావృతం కావడంతో ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. ఈ గేమ్‌లో ఆనంద్ పెద్దగా ఆలోచించలేదు కూడా. కేవలం 12 నిమిషాల్లోనే తన 19 ఎత్తులు వేశాడు. తను ఈ గేమ్ కోసం బాగా సన్నద్ధమయ్యాడనడానికి ఇది ఉదాహరణ. చాంపియన్‌షిప్‌లో ఇది వరుసగా మూడో డ్రా కావడం విశేషం. తొమ్మిదో గేమ్ తర్వాత కార్ల్సన్ 5-4 పాయింట్లతో ఆనంద్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. శుక్రవారం జరిగే పదో గేమ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడతాడు. నిరాశ కలిగించిన రోజు పెంటేల హరికృష్ణ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ లాంటి పెద్ద మ్యాచ్‌లో ఓ గేమ్ కేవలం 20 ఎత్తుల్లోనే డ్రా కావడం అభిమానులకు కచ్చితంగా నిరాశ కలిగిస్తుంది. కార్ల్సన్ ఆరంభంలో కొత్త వేరియేషన్‌తో ఆడాడు. కానీ ఆనంద్ ఈ గేమ్ కోసం బాగా సన్నద్ధమై వచ్చాడు. దీంతో ఎవరికీ పెద్దగా అవకాశాలు రాలేదు. 16 ఎత్తుల తర్వాత ఇక ఎంతసేపు ఆడినా ఎత్తులు పునరావృతం కావడం మినహా మరో దారి లేదు. ఎవరైనా విజయం కోసం ప్రయత్నిస్తే వాళ్లు కచ్చితంగా ఇబ్బందుల్లోకి వెళతారు. అందుకే రిస్క్ తీసుకోకుండా ఇద్దరూ డ్రాకే మొగ్గు చూపారు. ఇది ఆనంద్‌కు మంచి ఫలితం అనుకోవాలి. నాలుగో గేమ్‌లో మినహా ఆనంద్ ప్రతిసారీ బ్లాక్స్‌తో ఆడేటప్పుడు ఇబ్బంది పడ్డాడు. ఈసారి మాత్రం సులభంగా డ్రా చేసుకున్నాడు. దీనికి కారణం బాగా సన్నద్ధమవడమే. పదో గేమ్‌లో ఆనంద్ తెల్లపావులతో ఆడే అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ గేమ్ కచ్చితంగా గెలవాలని కాదుగానీ... పదో గేమ్‌లో గెలిచి స్కోరు సమం చేస్తే... చివరి రెండు గేమ్‌లు మరింత ఆసక్తిక రంగా సాగుతాయి. బ్లాక్స్‌తో గంటలోనే డ్రా చేసుకుంటే ఏ ఆటగాడికైనా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఆనంద్ తర్వాతి గేమ్ బాగా ఆడతాడని అనుకుంటున్నా. చెస్ గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణను harichess@twitter లో ఫాలో కావచ్చు -
ఆనంద్‌కు చుక్కెదురు
-
ఆనంద్‌కు చుక్కెదురు
రెండో గేమ్‌లో కార్ల్సన్ గెలుపు {పపంచ చెస్ చాంపియన్‌షిప్ సోచి (రష్యా): కీలకదశలో అనవసర తప్పిదం చేసిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో మాగ్నస్ కార్ల్సన్ చేతిలో తొలి ఓటమిని చవిచూశాడు. ఆదివారం జరిగిన రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ 35 ఎత్తుల్లో ఆనంద్‌ను ఓడించాడు. ఆరంభంలో ఆనంద్ ఆటతీరును చూస్తే రెండో గేమ్ కూడా ‘డ్రా’గా ముగుస్తుందనిపించింది. కానీ కార్ల్సన్ సంయమనంతో ఆడి మిడిల్ గేమ్‌లో ఆనంద్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఆ తర్వాత ఆనంద్ తడబడి 34వ ఎత్తులో బంటును హెచ్5 గడిలోకి పంపి కోలుకోలేని తప్పిదం చేశాడు. ఈ తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న కార్ల్సన్ తర్వాతి ఎత్తులోనే ఆనంద్ ఆట కట్టించాడు. ఈ గెలుపుతో కార్ల్సన్ 1.5-0.5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం మూడో గేమ్ జరుగుతుంది. -
రెండో గేమ్‌లో కార్ల్సన్ విజయం
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రెండోగేమ్‌లో భారత్ ఆటగాడు ఆనంద్ ప్రత్యర్థి కార్ల్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో 12 గేమ్‌ల టోర్నీలో కార్ల్సన్ ఆధిక్యం లభించింది. ఆనంద్‌పై 35 ఎత్తుల్లో కార్ల్సన్ విజయం సాధించాడు -
ప్రపంచ చెస్ పోటీలలో ఇద్దరు ఆటగాళ్ల మృతి
ఓస్లో: నార్వేలో జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో అపశృతి చోటు చేసుకుంది. ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొంటున్న ఇద్దరు ఆటగాళ్లు మృత్యువాత పడ్డారు. సీషెల్స్ కు చెందిన 60 ఏళ్ల ఆటగాడు ఆట మధ్యలోనే కుప్పకూలాడు. కూప్పకూలిన ఆటగాడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి. ఈ ఘటన పోటీల ఫైనల్ రోజు గురువారం చోటు చేసుకుంది. అయితే ఆదే రోజు ఉజ్బెకిస్థాన్ కు చెందిన మరో ఆటగాడు హోటల్ గదిలో మరణించాడు. ఇద్దరు ఆటగాళ్లు మరణించడం చాలా విషాదకరం అని పోటీలకు సంబంధించిన ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. ఆటగాళ్ల మృతి వెనుక ఎలాంటి అనుమానాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ పోటీల్లో చైనా చాంఫియన్ గా అవతరించింది. -
ఆనంద్-కార్ల్సన్ మ్యాచ్‌కు స్పాన్సర్లు కరువు
ట్రోమ్సో (నార్వే): విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సన్ మధ్య నవంబర్‌లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు స్పాన్సర్లు కరువయ్యారు. ఈ నేపథ్యంలో తాను అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది నిర్వహిస్తానని రష్యా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ తెలిపారు. ఈ సోమవారం నార్వేలో జరిగే ‘ఫిడే’ ఎన్నికల్లో గ్యారీకి పోటీగా కిర్సాన్ ఇల్యుమ్‌జినోవ్ బరిలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆనంద్, కార్ల్సన్ మ్యాచ్ రష్యాలోని సోచి నగరంలో జరుగుతుంది. గతేడాది చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో విజేతకు రూ.14 కోట్లు లభించగా ఈసారి అది రూ.8 కోట్లకు తగ్గింది. ‘మూడు నెలల సమయమే ఉన్నా ఈ రీమ్యాచ్ కోసం స్పాన్సర్లు ఎవరూ లే రు. మరింత ప్రచారం చేయాల్సి ఉంది. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే వచ్చే మార్చిలో నిర్వహిస్తా. ఎందుకంటే స్పాన్సరర్లకు తగిన సమయం కావాల్సి ఉంటుంది’ అని కాస్పరోవ్ అన్నారు. -
ఆనంద్‌కు పరీక్ష
నేటి నుంచి క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): స్వదేశంలో గతేడాది కోల్పోయిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ కిరీటాన్ని ఈసారి దక్కించుకునే క్రమంలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి పరీక్షకు సిద్ధమయ్యాడు. బుధవారం మొదలయ్యే క్యాండిడేట్స్ టోర్నమెంట్ ద్వారా ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్ల్సన్ (నార్వే)తో తలపడే ప్రత్యర్థి ఎవరో నిర్ణయిస్తారు. ఈనెల 31 వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్స్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడనున్నారు. ఆనంద్‌తోపాటు వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా), దిమిత్రీ ఆంద్రికిన్ (రష్యా), వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా), షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్), లెవాన్ అరోనియన్ (అర్మేనియా), సెర్గీ కర్జాకిన్ (రష్యా), పీటర్ స్విద్లెర్ (రష్యా) బరిలో ఉన్నారు. విజేతగా నిలిచిన వారు ఈ ఏడాది చివర్లో కార్ల్సన్తో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో పోటీపడతారు. బుధవారం ప్రారంభోత్సవం జరుగుతుంది. గురువారం జరిగే తొలి రౌండ్లో అరోనియన్‌తో ఆనంద్; తొపలోవ్‌తో మమెదైరోవ్; కర్జాకిన్‌తో స్విద్లెర్; క్రామ్నిక్‌తో ఆంద్రికిన్ ఆడతారు. 6 లక్షల యూరోల (రూ. 5 కోట్ల 6 లక్షలు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజేతకు 1,35,000 యూరోలు (రూ. కోటీ 14 లక్షలు) లభిస్తాయి. -
ఆనంద్‌కు అచ్చిరాలేదు!
భారత చదరంగ రారాజుగా వెలుగొందున్న విశ్వనాథన్ ఆనంద్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్ కిరీటాన్ని దక్కించుకున్న విషీకి 2013 చేదు అనుభవాల్నే మిగిల్చింది. ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాలన్న అతడి ఆశలు సఫలం కాలేదు. సొంతగడ్డపై వరల్డ్ విజేతగా నిలవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. చెన్నైలో నవంబర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ చెస్ పోటీలో ఆనంద్ అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఒత్తిడి లోనయి తన వయసులో సగం వయసున్న కార్ల్సెన్ చేతిలో ఓడిపోయి టైటిల్ చేజార్చుకున్నాడు. టోర్నీ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఆనంద్ ఆ తర్వాత పట్టుసడలించాడు. ఈ బిగ్ ఈవెంట్ కోసం బాగా సన్నద్ధమయినప్పటికీ కార్ల్సెన్ పెట్టిన మానసిక ఒత్తిడికి విషీ బోల్తా పడ్డాడు. ప్రత్యర్థి ఆటకట్టించే స్థాయిలో ఎత్తులు వేయకపోవడంతో ఆనంద్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో ఆరోసారి ప్రపంచ టైటిల్ అందుకోలేకపోయాడు. ఇక డిసెంబర్లో జరిగిన లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లోనూ విశ్వనాథన్ ఉస్సూరనిపించాడు. వరల్డ్ టైటిల్ ఓటమి నుంచి తేరుకోక ముందే మరో పరాజయాన్ని చవిచూశాడు. ప్రత్యర్థుల ముందు అతడి ఎత్తులు పారకపోవడంతో క్వార్టర్ ఫైనల్స్‌లోనే టోర్ని నుంచి నిష్క్రమించాడు. మే నెలలో జరిగిన నార్వే సూపర్ చెస్ టోర్నమెంట్లో కూడా ఆనంద్‌కు కలిసి రాలేదు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో తడబడి టైటిల్ కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2013 మిగిల్చిన చేదు అనుభవాల నుంచి తొందరగా బయటపడాలని విశ్వానాథన్ ఆనంద్ తపిస్తున్నాడు. విజయం కోసం తహతహ లాడుతున్నాడు. గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. అయితే వయసు తనకు అడ్డంకి కాదంటున్నాడు 44 ఏళ్ల ఈ చదరంగ మేధావి. టాప్‌టెన్‌లో ఎక్కువగా యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ తాను ఆ దిశగా ఆలోచించడం లేదంటున్నాడు. అయితే 50 ఏళ్లు వచ్చే వరకు చెస్ ఆడనని స్పష్టం చేశాడు. ఎన్నేళ్లకు రిటైర్ అవుతానన్నది మాత్రం చెప్పలేదు. 2014 తనకు కలిసొస్తుందని విషీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. మార్చిలో జరగనున్న ‘క్యాండిడేట్స్ టోర్నీ’లో విజేతగా నిలిచేందుకు సన్నద్దమవుతున్నాడు. -
భాగ్యనగరంలో చెస్ పండుగ
సాక్షి, హైదరాబాద్: మీ పిల్లలను చెస్ ప్లేయర్‌ను చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ భారత్‌లో జరుగుతున్నందున... దేశంలో నాలుగు చెస్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకటి హైదరాబాద్‌లో ఈనెల 25 నుంచి జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరికీ ఉపయోగపడేలా ఈ టోర్నీని ఒక చెస్ పండుగలా నిర్వహించబోతున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్ లంక రవి, ఏపీ చెస్ సంఘం కార్యదర్శి కన్నారెడ్డి ఆ వివరాలు తెలిపారు. ఈ నెల 24న జార్జియా గ్రాండ్ మాస్టర్ టోర్నికె సనికెడ్జె... పిల్లలకు చెస్‌లో మెళకువలు నేర్పుతారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలెవరైనా... తమ ఐడీ కార్డ్ తీసుకుని హైదరాబాద్ శివార్లలోని బహదూర్‌పల్లిలో ఉన్న టెక్ మహీంద్ర ఆఫీస్‌కు వెళితే చాలు. ప్రవేశం ఉచితం. ఉదయం గం.8.00 నుంచి గం.10.00 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గం. 11.00 నుంచి సాయంత్రం వరకు క్లాస్ ఉంటుంది. 25న గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీ ప్రారంభమవుతుంది. ఇందులో 15 దేశా ల నుంచి సుమారు 90 మంది క్రీడాకారులు పాల్గొంటారు. 1900 రేటింగ్ కంటే ఎక్కువ ఉన్నవారు ఇందులో పాల్గొంటారు. ఈ టోర్నీ డిసెంబరు 3 వరకు జరుగుతుంది. లలిత్‌బాబు, దీప్‌సేన్ గుప్తా తదితర గ్రాండ్‌మాస్టర్లు ఇందులో ఆడతారు. 2100 రేటింగ్ కంటే తక్కువ ఉన్న ఆటగాళ్ల కోసం 26న టోర్నీ ప్రారంభమవుతుంది. రేటింగ్ పాయింట్లు లేని రాష్ట్ర క్రీడాకారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. అలాగే టోర్నీ జరిగే కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 25న సైబర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ర్యాపిడ్ చెస్ టోర్నీ నిర్వహిస్తారు. వయసుతో సంబంధం లేకుండా ఔత్సాహికులంతా ఇందులో పాల్గొనవచ్చు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకుంటే 24వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వివరాలకు 9959988766 ఫోన్ నంబర్లో సంప్రదించాలి. 25న ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ ‘చార్మినార్ చాలెంజ్’ కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరుగుతుంది. ఇందులో పాల్గొనాలంటే 24వ తేది రాత్రి గం. 8.00 లోపు రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. స్కూల్ ఐడీ, యూనిఫామ్ తెచ్చుకోవాలి. వివరాలకు 9247188018, 9032455655 నంబర్లలో సంప్రదించాలి. -
ఆనంద్‌కు ఆఖరి అవకాశం
చెన్నై: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు ముందు ఫేవరెట్‌గా భావించిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు... టోర్నీలో ముందుకెళ్లే కొద్దీ చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగినా... కార్ల్సెన్ (నార్వే) దూకుడుకు సరైన అడ్డుకట్ట వేయలేక వెనుకబడిపోయాడు. ఇప్పటి వరకు జరిగిన 8 గేమ్‌ల్లో విషీ ఆరు గేమ్‌లు డ్రా చేసుకోగా... రెండింటిలో ఓడిపోయాడు. దీంతో టోర్నీలో 3-5 తేడాతో ఎదురీదుతున్నాడు. ఈ నేపథ్యంలో కార్ల్‌సెన్‌తో నేడు (గురువారం) జరగబోయే తొమ్మిదో గేమ్ ఆనంద్‌కు అత్యంత కీలకమైంది. తెల్లపావులతో ఆడనున్న అతను టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే ఈ గేమ్‌లో తప్పనిసరిగా గెలిచి తీరాలి. దీంతో అతనిపై ఒత్తిడి నెలకొంది. అయితే ఇలాంటివి తన అనుభవంలో ఎన్నో చూసిన ఆనంద్ పుంజుకుంటాడా? లేదా? అన్నది ఆసక్తికరం. అలుపెరగకుండా పోరాడటంలో ఆనంద్ దిట్టే అయినా... ఓపెనింగ్‌తోనే కార్ల్సెన్ గేమ్‌పై పట్టు బిగిస్తున్నాడు. ఇది భారత్ ఆటగాడికి చాలా ఆందోళన కలిగించే అంశం. తొమ్మిదో గేమ్‌లో గెలవకపోతే ఇక తెల్లపావులతో ఆడే అవకాశం ఆనంద్‌కు 11వ గేమ్‌లో వస్తుంది. అప్పుడు గెలిచినా.. పెద్దగా ప్రయోజనం ఉండదు. -
ఆనందం దూరమవుతోంది
చెన్నై: రెండు గేమ్‌లలో వరుస ఓటముల తర్వాత ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఏడో గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ డ్రా చేసుకున్నాడు. ప్రత్యర్థి ఓపెనింగ్‌కు సరైన వ్యూహాన్ని రచించలేక డిఫెన్స్‌ను ఛేదించలేకపోయాడు. దీంతో మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే)తో సోమవారం జరిగిన ఈ గేమ్ 32 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఫలితంగా నార్వే ప్లేయర్ 4.5-2.5తో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇక టైటిల్ గెలవాలంటే ఆనంద్ మిగిలిన ఐదు గేమ్‌ల ద్వారా నాలుగు పాయింట్లు సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జరిగితే అద్భుతమే అనుకోవాలి. ఇప్పటికే బెర్లిన్ డిఫెన్స్‌తో ఆనంద్ టీమ్‌కు ఇబ్బందులు సృష్టించిన కార్ల్సెన్ ఏడో గేమ్‌లోనూ నల్లపావులతో అదే వ్యూహంతో బరిలోకి దిగాడు. దీంతో గేమ్‌లో ముందుకెళ్లేందుకు విషీకి సరైన దారి దొరకలేదు. రూయ్ లోపెజ్ డిఫెన్స్‌కు దగ్గరగా వెళ్లిన ఆనంద్ ఐదో ఎత్తు వద్ద నైట్‌ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించాడు. తెల్లపావులతో ఆడే ఆటగాడికి ఇంతకంటే మెరుగైన ఎత్తు వేసే అవకాశం లేకున్నా... కౌంటర్ అటాక్‌కు కార్ల్సెన్కు మాత్రం చాలా దారులు లభించాయి. గత రెండింటిలో ఎండ్గేమ్ల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆనంద్... ఈ గేమ్‌లో జాగ్రత్తలు తీసుకున్నాడు. 10వ ఎత్తు వద్ద ఆనంద్ కాస్త ఆధిక్యంలో కనిపించినా... గేమ్‌ను గెలిచేంత అవకాశం రాలేదు. కింగ్ రూక్పాన్ను ఉపయోగించి వేసిన 15వ ఎత్తుతో భారత ప్లేయర్ కొత్త వ్యూహాన్ని అమలుపర్చాడు. అయితే బలహీనమైన ఈ ఎత్తుగడకు కార్ల్సెన్ రూక్తోనే చెక్ పెట్టాడు. దీంతో క్వీన్, నైట్‌తో ఎండ్‌గేమ్ మొదలైంది. ఆనంద్ కొన్ని పాన్లను మార్చుకుంటూ ఎత్తులు వేసినా ప్రయోజనం లేకపోవడంతో 32వ ఎత్తు వద్ద డ్రాకు అంగీకరించాడు. నేడు ఎనిమిదో గేమ్ జరగనుంది. చివరి రెండు గేమ్‌ల్లో ఓటమి తర్వాత ఈ ఫలితం రావడం కాస్త అనుకూలమే. అయితే ఈ గేమ్‌లో అవకాశాలు లభించినా విజయం సాధ్యం కాలేదు. ఇంతకుముందు ఇద్దరం ఇదే లైన్లో ఆడాం. కార్ల్సెన్ బిషప్ వైపు మొగ్గడంతో నేను భిన్నమైన ఎత్తుగడలోకి వెళ్లా. వైట్‌కు ఉన్నవి రెండే మార్గాలు. కింగ్సైడ్ను బ్రేక్ చేయడం లేదా ఫ్లాంక్ మీద ఆడటం. నైట్‌తో ఆడాలని సిద్ధమైనప్పుడు ఎఫ్4ను ఉపయోగించడం సరైంది కాదు. తర్వాతి గేమ్‌లో గెలిచేందుకు ప్రయత్నిస్తా. -ఆనంద్ ఒకే లైన్లో ఇద్దరం ఆడినప్పటికీ భిన్నమైన ప్రణాళికలు అనుసరించాం. ఎలాంటి ఎత్తుగడ అయినా గేమ్ సాగుతున్న కొద్దీ నెమ్మదవుతుంది. కొంత ఇబ్బంది ఎదురైనా ఈ గేమ్‌లో నేను బాగానే ఆడా. కొన్ని మానసిక అంశాలు కూడా ఈ టోర్నీలో ముడిపడి ఉన్నాయి. ఐదో గేమ్ ఫలితం తర్వాతి రెండు గేమ్‌లపై ప్రభావం చూపింది. దీన్ని విస్మరించలేం. - కార్ల్సెన్ -
ఇక చావో రేవో
ప్రపంచ చాంపియన్‌షిప్ రెండో అర్ధభాగంలోకి కార్ల్సెన్ 4-2 ఆధిక్యంతో వెళుతున్నాడు. ఆనంద్ వరుసగా రెండు గేమ్‌లు ఓడిపోతాడని ఊహించలేదు. రెండు గేమ్‌ల్లోనూ ‘డ్రా’లకు అవకాశం ఉన్నా ఒత్తిడిలో పోగొట్టుకున్నాడు. ఒకరోజు విశ్రాంతి లభించింది కాబట్టి... ఆనంద్, తన సెకండ్స్ కలిసి ఈ ఓడిన రెండు గేమ్‌లను విశ్లేషిస్తారు. ముఖ్యంగా ఎండ్ గేమ్, మిడిల్ గేమ్‌ల మీద ఇక దృష్టి ఎక్కువగా పెట్టాలి. గత రెండు గేమ్‌ల్లోనూ కార్ల్సెన్ మిడిల్ గేమ్‌లో బాగా ఆడాడు. మరోసారి తెల్లపావులతో ఆడబోతున్న ఆనంద్‌కు ఇది చాలా కీలకమైన గేమ్. ఇక నుంచి ఆనంద్ మిడిల్ గేమ్‌లో అన్క్లియర్ పొజిషన్స్‌తో ఆడాలి. ఆనంద్ తన వ్యూహాన్ని మారుస్తాడా? లేక అలాగే కొనసాగిస్తాడా అనేది చూడాలి. మరోవైపు కార్ల్సెన్ వరుసగా రెండు విజయాలతో ఆనందంగా ఉండి ఉంటాడు. ‘డ్రా’లు కావలసిన గేమ్‌లను గెలవడం ఆటగాడి విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. కేవలం రెండు పాయింట్ల ఆధిక్యంతో కార్ల్సెన్ సరిపెట్టుకోడు. ఓడిపోయే రిస్క్ లేకుండా చూసుకుంటూ విజయాల కోసం ఆడతాడు. ఒకవేళ కార్ల్సెన్ గనక డిఫెన్సివ్‌గా ఆడితే, అప్పుడు ఆనంద్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఇక ఆనంద్‌కు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. -
ఆనంద్‌కు మళ్లీ షాక్
చెన్నై: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో పరాజయాన్ని చవిచూశాడు. ప్రత్యర్థి వ్యూహాన్ని సరిగా అర్థం చేసుకోలేక చేతులెత్తేశాడు. దీంతో శనివారం జరిగిన ఆరో గేమ్‌లో మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) 67 ఎత్తులతో విజయం సాధించాడు. ఫలితంగా ఈ టోర్నీలో 4-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. నల్లపావులతో బెర్లిన్ డిఫెన్స్‌తో గేమ్‌ను మొదలుపెట్టిన నార్వే కుర్రాడు బోర్డుపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. గేమ్ ముందుకెళ్తున్న కొద్దీ భిన్నమైన ఎత్తుగడలతో ఆనంద్‌ను కట్టిపడేశాడు. మరోవైపు ప్రత్యర్థి ఓపెనింగ్‌కు సరైన ప్రతి వ్యూహాన్ని అవలంభించలేకపోయిన భారత ప్లేయర్ కీలక సమయంలో పూర్తిగా తడబడ్డాడు. రూయ్ లోపెజ్ ఓపెనింగ్‌తో గేమ్‌ను మొదలుపెట్టినా... క్రమంగా పట్టు కోల్పోయాడు. ఓ దశలో 20 ఎత్తుల వరకు సాఫీగా సాగినా...మిడిల్ గేమ్ మొత్తం కార్ల్సెన్ ఆధిపత్యం నడిచింది. చివర్లో క్వీన్, రూక్, పాన్లతో ఎండ్‌గేమ్ మొదలుకావడంతో ఆనంద్ ఆత్మరక్షణలో పడిపోయాడు. దీన్ని అదునుగా చేసుకున్న కార్ల్సెన్ ఎదురుదాడి చేసి పాన్, రూక్‌ను సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ 56వ ఎత్తు వద్ద కూడా సాంకేతికంగా గేమ్ డ్రా అయ్యే అవకాశాలున్నా... కార్ల్సెన్ దూకుడుకు విషీ తప్పులను పునరావృతం చేశాడు. చివరకు మరో 11 ఎత్తుల తర్వాత ఆనంద్ ఓటమిని అంగీకరించాడు. -
ఆరో గేమ్‌లోనూ విశ్వనాథన్ ఆనంద్ ఓటమి
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మరోసారి ఓటమి పాలైయ్యాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ లో భాగంగా శనివారం మాగ్నస్ కార్ల్సెన్ తో జరిగిన మ్యాచ్‌లో ఆనంద్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నాడు. ఫలితంగా టోర్నీలో క్లార్సెన్ 4-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. తనదైన ఆటతీరతో ఆకట్టకున్న నార్వే గ్రాండ్ మాస్టర్ విజయపరంపర కొనసాగిస్తూ ఆనంద్‌కు ఆశలపై నీళ్లు చల్లాడు. ఇప్పటికి ఆరు మ్యాచ్ ల్లో నాలుగు గేమ్‌లు డ్రాగా ముగిసాయి. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండటంతో ఆనంద్ విజయం సాధించినా చాంపియన్‌షిప్ ట్రోఫీని క్లార్సెన్కు అప్పగించక తప్పదు. శుక్రవారం జరిగిన ఐదో గేమ్‌లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సెన్ 58 ఎత్తుల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ఎట్టకేలకు ఓ ఫలితం
చెన్నై: సులువైన అవకాశాలు చేజార్చుకోవడం... పదునులేని ఎండ్ గేమ్... కావలసినంత అనుభవం ఉన్నా... ప్రత్యర్థి ఎత్తుగడకు సరైన ప్రతి వ్యూహంలేక... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఐదో గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓటమిపాలయ్యాడు. శుక్రవారం జరిగిన గేమ్‌లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) 58 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఫలితంగా టోర్నీలో 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. తెల్లపావులతో తొలిసారి తనదైన ఆటతీరును ప్రదర్శించిన నార్వే గ్రాండ్‌మాస్టర్.. నోటోబ్బామ్ ఓపెనింగ్‌తో గేమ్‌ను ప్రారంభించి క్రమంగా మార్షల్ గ్యాంబిట్లోకి తీసుకెళ్లాడు. ఊహించని ఈ వ్యూహానికి కాస్త కంగారుపడ్డ విషీ ... అప్పటికప్పుడు కొత్త ఎత్తుగడతో సులువుగానే అడ్డుకట్ట వేశాడు. ఓ దశలో ఆనంద్ పాన్‌ను కోల్పోయినా గేమ్‌లో ప్రత్యర్థితో సమానంగా నిలిచాడు. అయితే 45వ ఎత్తులో చేసిన తప్పిదంతో మూల్యం చెల్లించుకున్నాడు. కింగ్‌ను పక్కనబెట్టి తర్వాత వేసిన ఎత్తుతో మళ్లీ గేమ్‌లోకి వచ్చినట్లే కనిపించినా... ఎండ్గేమ్లో రూక్స్, పాన్లతో ఆడటం పూర్తిగా దెబ్బతీసింది. రాబోయే రెండు గేమ్‌ల్లో కనీసం ఒక్క విజయమైనా సాధించకుంటే టోర్నీలో ముందుకెళ్లేకొద్దీ ఆనంద్‌కు కష్టాలు తప్పవు. -
ఐదో గేమ్ లో విశ్వనాథన్ ఆనంద్‌కు చుక్కెదురు
చెన్నై: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్‌కు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఐదో గేమ్‌లో చుక్కెదురైంది. మాగ్నస్ కార్ల్‌సెన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఆనంద్ ఓటమి చవిచూశాడు. విశ్వనాథన్ ఆనంద్ ఎత్తుల్ని ప్రపంచ ఛాంపియన్ కార్ల్సెన్ చాకచక్యంతో అధిగమించి తొలి విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు జరిగిన నాలుగు గేమ్‌లను డ్రా చేసుకుని సమ ఉజ్జీలుగా ఉన్నా, తాజాగా కార్ల్సెన్ దూకుడుగా ఆడి గెలుపు బావుటా ఎగురవేశాడు. బుధవారం ఇరువురి మధ్య జరిగిన నాలుగో గేమ్ కూడా 64 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. బుధవారం జరిగిన ఈమ్యాచ్ తరువాత ఒకరోజు విరామం లభించింది. ఈ రోజు ఇద్దరు మధ్య ఆసక్తికర పోరు జరిగినా ఓటమి చతికిలబడ్డాడు. -
గట్టెక్కిన ఆనంద్
చెన్నై: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ నాలుగో గేమ్‌లో ఓటమి అంచుల నుంచి గట్టెక్కాడు. వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) వేసిన దూకుడైన ఎత్తులకు తడబడినా... పుంజుకున్నాడు. దీంతో టోర్నీలో భాగంగా బుధవారం ఇరువురి మధ్య జరిగిన నాలుగో గేమ్ కూడా 64 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఫలితంగా ఇద్దరి స్కోరు 2-2తో సమంగా ఉంది. నల్లపావులతో బెర్లిన్ డిఫెన్స్‌తో గేమ్‌ను ఆరంభించిన కార్ల్సెన్ 10వ ఎత్తుతో గేమ్‌ను తనవైపు తిప్పుకున్నాడు. బిషప్‌ను ఉపయోగించి వేసిన ఈ ఎత్తు కొత్తది కాకపోయినా... గతంలో మూడుసార్లే దీన్ని ఉపయోగించారు. ఓపెనింగ్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆనంద్... గేమ్ ముందుకు సాగేకొద్ది క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. క్వీన్సైడ్ పాన్‌ను త్యాగం చేసి ఇబ్బందుల్లో పడ్డాడు. కార్ల్సెన్ మాత్రం రూక్తో ఎదురుదాడి చేస్తూ పోయాడు. దీనికి కంగారుపడ్డ విషీ... తప్పిదంలో మరో పాన్‌ను కోల్పోయాడు. అయితే ఈ దశలో గేమ్‌లో మరింత వేగం పెంచిన నార్వే ప్లేయర్ ఓ తప్పుడు నిర్ణయంతో మూల్యం చెల్లించుకున్నాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆనంద్... 37వ ఎత్తుతో మళ్లీ గేమ్‌లో నిలిచాడు. కార్ల్సెన్ దగ్గర ఎక్స్ట్రా పాన్ ఉన్నా దాంతో పెద్దగా ఉపయోగం లేకపోయింది. అయినా అతను గేమ్‌ను కొనసాగించేందుకే మొగ్గు చూపాడు. చివరకు రూక్స్, పాన్లతోనే తుది గేమ్ సాగింది. ఫైనల్ టైమ్ కంట్రోల్లో 90 సెకన్ల వ్యవధిలో మూడు ఎత్తులు వేయాల్సిన దశలో భారత ప్లేయర్ దాన్ని అద్భుతంగా అధిగమించాడు. దీంతో చేసేదేమీ లేక కార్ల్సెన్ డ్రాకు అంగీకరించాడు. గురువారం విశ్రాంతి దినం. ఐదో గేమ్ శుక్రవారం జరుగుతుంది. -
ఆనంద్ వైపే మొగ్గు
పెంటేల హరికృష్ణ ఈసారి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో హోరాహోరీ సమరం ఖాయం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రధాన గేమ్‌ల తర్వాత స్కోరు 6-6తో సమానమై టై బ్రేక్‌కు దారి తీసే అవకాశం ఉంది. ర్యాపిడ్‌లో ఇద్దరికీ పట్టుంది. ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఎంపిక చేయాలంటే నేను ఆనంద్వైపే మొగ్గు చూపుతాను. ర్యాపిడ్‌తో పాటు బ్లిట్జ్ టైబ్రేక్‌లోనూ ఆనంద్ మెరుగ్గా ఆడతాడు. కాబట్టి ఆనంద్‌కే ఎక్కువ అవకాశం ఉంది. కీలకమైన వివిధ అంశాల్లో ఈ ఇద్దరి బలాబలాను విశ్లేషిద్దాం... ఓపెనింగ్స్ గత గేమ్‌ల్లో క్రామ్నిక్, తపలోవ్, గెల్ఫాండ్లతో తలపడినప్పుడు ఆనంద్ చాలా భిన్నమైన శైలిని కనబర్చాడు. అయితే అతని వ్యూహంలోని సాధారణ పద్ధతి ఏదో ఒక ఆయుధాన్ని ఎంచుకోవడం, దాన్ని లోతుగా విశ్లేషించడం. ‘హిట్ అండ్ రన్’ పాలసీని బాగా పాటిస్తాడు. ఈ గేమ్‌లో ఎక్కువ షిఫ్టింగ్ లేకుండా తన సొంత శైలికి కట్టుబడి ఆడతాడని అనుకుంటున్నా. ఓపెనింగ్ ప్రకారం చూసుకుంటే కార్ల్సెన్ కంటే చాలా మెరుగ్గా సిద్ధమయ్యాడు. ఆశ్చర్యకరమైన ఎత్తులతో ప్రత్యర్థిని షాక్‌లోకి నెట్టడం కార్ల్సెన్ ప్రత్యేకత. మొత్తం మీద ఇందులో ఆనంద్‌దే పైచేయి. బలహీనతలు కార్ల్సెన్ చాలా అరుదుగా తప్పిదాలు చేస్తాడు. అతను మరింత తెలివైన వాడని ఈ టోర్నీలో కచ్చితంగా నిరూపితమవుతుంది. ఆనంద్ కొన్ని ప్రపంచ చాంపియన్‌షిప్ గేమ్‌లు ఆడాడు. తపలోవ్, గెల్ఫాండ్‌తో జరిగిన గేమ్‌ల్లో వెనుకబడినా పుంజుకున్నాడు. ఇలాంటి పరిణామాలను చూస్తే ఇద్దరిలో ఆనందే బలమైన ఆటగాడిగా నిలవనున్నాడు. శక్తి సామర్థ్యాలు ఆనంద్ కంటే కార్ల్సెన్ యువకుడు కాబట్టి అతనిలోనే శక్తి సామర్థ్యాలు అధికం. 12 గేమ్‌ల్లో షార్ట్ మ్యాచ్‌లు చాలా ప్రధానం కానున్నాయి. అన్ని గేమ్‌ల్లో గట్టి పోటీ తప్పకపోవచ్చు. శైలి ఆనంద్ శైలి సహజంగా, సులువుగా ఉంటుంది. ప్రారంభక సన్నాహకాలు చాలా లోతుగా ఉంటాయి. వ్యూహాత్మకంగా అతను చాలా క్లిష్టంగా ఉంటాడు. చాలా ఏళ్ల నుంచి మంచి డిఫెండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. నైట్స్‌తో ఆడటంలో అతను దిగ్గజ ఆటగాడు. ఎండ్గేమ్స్లో మంచి డిఫెండర్. కార్ల్సెన్ శైలి కూడా సహజంగా, సులువుగానే ఉంటుంది. అయితే ఓపెనింగ్ చాలా విశాలంగా ఉండటంతో అందులో డెప్త్ కొరవడింది. అతని శైలిని, గెలవాలన్న కృషిని కార్పోవ్‌తో పోల్చవచ్చు. ఎండ్గేమ్లో అతని టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది. బిషప్తో చాలా మెరుగైన ఆటతీరును కనబరుస్తాడు. రెండు విరుద్ధమైన ఆటతీరులు ఓ గొప్ప గేమ్‌కు దారితీస్తాయని నా ఉద్దేశం. దీని కోసం వేచి చూడాల్సిందే. (ఈ వ్యాసాన్ని ఛిజ్ఛిటట.ఛిౌఝ ఇంగ్లిష్‌లో చదవొచ్చు)