
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అద్భుతంగా పుంజుకున్నాడు. మూడో గేమ్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో బుధవారం జరిగిన మూడో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన 18 ఏళ్ల గుకేశ్ 37 ఎత్తుల్లో విజయం సాధించాడు. నిబంధనల ప్రకారం తొలి 40 ఎత్తులను 120 నిమిషాల్లో పూర్తి చేయాలి.
అయితే డింగ్ లిరెన్ 37 ఎత్తులే వేయగలిగాడు. దాంతో సమయాభావం కారణంగా డింగ్ లిరెన్‌కు ఓటమి ఖరారైంది. ‘తొలి విజయం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలి గేమ్‌లో కాస్త ఒత్తిడికి లోనయ్యా. రెండో గేమ్ నుంచి కోలుకున్నాను’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు.
ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లు జరగనున్నాయి. తొలి గేమ్‌లో డింగ్ లిరెన్ నెగ్గగా... రెండో గేమ్ ‘డ్రా’గా ముగిసింది. మూడు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1.5–1.5 పాయింట్లతో సమంగా ఉన్నారు. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం నాలుగో గేమ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment