third game
-
మూడో గేమ్‌లో గుకేశ్ గెలుపు
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అద్భుతంగా పుంజుకున్నాడు. మూడో గేమ్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో బుధవారం జరిగిన మూడో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన 18 ఏళ్ల గుకేశ్ 37 ఎత్తుల్లో విజయం సాధించాడు. నిబంధనల ప్రకారం తొలి 40 ఎత్తులను 120 నిమిషాల్లో పూర్తి చేయాలి. అయితే డింగ్ లిరెన్ 37 ఎత్తులే వేయగలిగాడు. దాంతో సమయాభావం కారణంగా డింగ్ లిరెన్‌కు ఓటమి ఖరారైంది. ‘తొలి విజయం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలి గేమ్‌లో కాస్త ఒత్తిడికి లోనయ్యా. రెండో గేమ్ నుంచి కోలుకున్నాను’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లు జరగనున్నాయి. తొలి గేమ్‌లో డింగ్ లిరెన్ నెగ్గగా... రెండో గేమ్ ‘డ్రా’గా ముగిసింది. మూడు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1.5–1.5 పాయింట్లతో సమంగా ఉన్నారు. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం నాలుగో గేమ్ జరుగుతుంది. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్
బాసెల్ (స్విట్జర్లాండ్): భారత యువ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్... స్విస్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ శ్రీకాంత్ 14-21, 21-15, 21-18తో ఎమిలి హోస్ట్ (డెన్మార్క్)పై నెగ్గాడు. తొలి గేమ్‌లో నిరాశపర్చిన శ్రీకాంత్... రెండో గేమ్‌లో బాగా ఆడాడు. కీలకమైన మూడో గేమ్‌లోనూ ఆధిపత్యం చేతులు మారడంతో స్కోరు 18-18తో సమమైంది. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన భారత ప్లేయర్ గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 21-17, 21-16తో 13వ సీడ్ జు వీ వాంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు నెట్ వద్ద విశేషంగా రాణించాడు. మరో భారత ఆటగాడు ఆనంద్ పవార్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. 21-19, 19-21, 15-21తో కుంజుమస సకాయ్ (జపాన్) చేతిలో ఓడాడు.