ఎత్తుకు పైఎత్తు... | World Chess Championship from today | Sakshi
Sakshi News home page

ఎత్తుకు పైఎత్తు...

Published Mon, Nov 25 2024 4:06 AM | Last Updated on Mon, Nov 25 2024 4:06 AM

World Chess Championship from today

నేటి నుంచి విశ్వ చదరంగ సమరం

ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం డింగ్‌ లిరెన్‌తో గుకేశ్‌ పోరు

ఫామ్‌లో ఉన్న భారత్‌ గ్రాండ్‌మాస్టర్‌

టైటిల్‌ కాపాడుకునేందుకు చైనా గ్రాండ్‌మాస్టర్‌ రె‘ఢీ’  

క్లాసికల్‌ చెస్‌ ఫార్మాట్‌లో భారత్‌ నుంచి ఇప్పటి వరకు ఒక్కరే విశ్వవిజేతగా నిలిచారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ చివరిసారి 2013లో విశ్వకిరీటాన్ని అధిరోహించాడు. ఆ తర్వాత నార్వే సూపర్‌స్టార్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ దశాబ్దంపాటు చదరంగ విశ్వాన్ని ఏలాడు. అదే సమయంలో భారత్‌ నుంచి మరో ప్లేయర్‌ ఆనంద్‌ ఘనతలకు చేరువగా రాలేకపోయారు. 

కానీ గత కొన్నాళ్లుగా భారత చెస్‌ ముఖచిత్రం మారిపోయింది. ఒక్కసారిగా నలుగురైదుగురు తెరపైకి వచ్చి సంచలన విజయాలు సాధిస్తున్నారు. దొమ్మరాజు గుకేశ్‌ అందరి అంచనాలను తారుమారు చేసి ఏకంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించాడు. 

సరైన పోటీ లేకపోవడంతో కార్ల్‌సన్‌ స్వచ్ఛందంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు దూరమవ్వడంతో ... గత ఏడాది చైనా ప్లేయర్‌ డింగ్‌ లిరెన్‌ కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. అంతా అనుకున్నట్లు జరిగితే 11 ఏళ్ల తర్వాత భారత్‌ నుంచి గుకేశ్‌ రూపంలో మరో విశ్వవిజేత కనిపిస్తాడు.  
 
సింగపూర్‌ సిటీ: చదరంగ చరిత్రలోనే ఇద్దరు ఆసియా గ్రాండ్‌మాస్టర్ల మధ్య మరో ఆసియా వేదికపై ప్రపంచ చెస్‌ చాంపియన్‌ టైటిల్‌ వేటకు నేడు జేగంట మోగనుంది. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఆగ్నేయాసియా దేశంలో ప్రపంచ చదరంగ విజేత పోటీలు జరుగుతున్నాయి. 1979లో ఫిలిప్పీన్స్‌లోని బగూవోలో జరిగితే ఇప్పుడు సింగపూర్‌ కొత్త చాంపియన్‌కు తివాచీ పరిచే అవకాశముంది. 

చైనాకు చెందిన డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌తో భారత గ్రాండ్‌మాస్టర్, 18 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్‌ అమీతుమీకి సిద్ధమయ్యాడు. సూపర్‌ గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత మళ్లీ భారత్‌కు ప్రపంచ చెస్‌ కిరీటాన్ని తెచ్చేందుకు చైనీస్‌ గ్రాండ్‌మాస్టర్‌పై ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు ఈ తమిళనాడు టీనేజర్‌ ‘సై’ అంటున్నాడు.  

గుకేశ్‌ అవుతాడా మరో ఆనంద్‌? 
భారత స్టార్‌ గుకేశ్‌ ర్యాంక్‌ 5. గతేడాది నుంచి నిలకడైన విజయాలు సాధిస్తున్నాడు. తన ఎత్తులతో ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తున్న అతను గతేడాది ఆగస్టులో విశ్వనాథన్‌ ఆనంద్‌ లైవ్‌ రేటింగ్స్‌ను అధిగమించాడు. 1986, జూలైలో ప్రవీణ్‌ థిప్సే తర్వాత ఆనంద్‌ను దాటిన తొలి భారత ప్లేయర్‌గా ఘనత వహించి ప్రపంచ టాప్‌–10 ర్యాంకింగ్స్‌లోకి దూసుకొచ్చాడు. 

‘ఫిడే’ సర్క్యూట్‌లో క్యాండిడేట్స్‌ టోర్నీ సహా చెస్‌ ఒలింపియాడ్‌ తదితర ఈవెంట్లలో ఘనవిజయాలు సాధించడంతో రెండేళ్ల క్రితం 2600 ఎలో రేటింగ్‌లో ఉన్న తను ఇప్పుడు 2783 రేటింగ్‌కు ఎగబాకాడు. చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ చారిత్రక విజయంలో గుకేశ్‌ది కీలకపాత్ర! మొదటి బోర్డులో గరిష్ట పది పాయింట్లకుగాను 9 పాయింట్లు సాధించడంతో అప్పటి లైవ్‌ రేటింగ్‌లో ఏకంగా 3056 రేటింగ్స్‌కు చేరుకున్నాడు. 

మరోవైపు ప్రపంచ చాంపియన్‌ 32 ఏళ్ల డింగ్‌ ఇటీవల తడబడుతున్నాడు. మానసిక అనారోగ్యం చాంపియన్‌ ఆటతీరుపై పెను ప్రభావమే చూపింది. కొన్ని నెలలపాటు అసలు ఏ స్థాయి టోర్నీలోనూ బరిలోకే దిగలేని పరిస్థితి వచి్చంది. తర్వాత చెస్‌ సర్క్యూట్‌లో ఆడినా... అంతంత మాత్రం ఫలితాలతో 2788 ఎలో రేటింగ్‌ నుంచి 2728కు పడిపోయాడు. దీంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానానికి దిగజారాడు. అయితే రేటింగ్స్‌ను, ముందరి ఫామ్‌ను పరిగణించి తక్కువ అంచనా వేస్తే తప్పులో కాలేసినట్లే! టైబ్రేక్స్‌లో, కీలకమైన ఎత్తులపుడు పైఎత్తులు వేయడంలో డింగ్‌ దిట్ట. 

ముఖాముఖి పోరులో 
ఇప్పుడు ప్రపంచ కిరీటం కోసం పోటీపడుతున్న వీరిద్దరు గతంలో మూడుసార్లు ముఖాముఖిగా తలపడ్డారు. అయితే ఇందులో ప్రపంచ చాంపియన్‌దే పైచేయి. క్లాసికల్‌ ఈవెంట్‌లో నల్లపావులతో రెండు సార్లు డింగ్‌ గెలుపొందగా... చివరగా సింక్విఫీల్డ్‌ కప్‌లో ఇద్దరి మధ్య జరిగిన పోటీ ‘డ్రా’గా ముగిసింది. అంటే మూడింట ఒక్కసారి కూడా డింగ్‌ ఓడిపోలేదు. గుకేశ్‌ 0–2తో వెనుకబడి ఉన్నాడు.  

అర్హత సాధించారిలా... 
గతేడాది జరిగిన ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్‌ ఇయాన్‌ నిపోమ్‌నిషిని ఓడించి డింగ్‌ తొలిసారి చాంపియన్‌గా ఆవిర్భవించాడు. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్‌ హోదాతో చైనా గ్రాండ్‌మాస్టర్‌కు నేరుగా టైటిల్‌ నిలబెట్టుకునే అవకాశముంటుంది. 

భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ ఈ మెగా టోర్నీలో ఆడేందుకు పెద్ద పోరాటమే చేశాడు. ఈ ఏడాది టోరంటోలో జరిగిన క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలువడం ద్వారా తాజా చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. క్యాండిడేట్స్‌ టోర్నీ ఆడి, గెలిచిన పిన్న వయసు్కడిగా గుకేశ్‌ గుర్తింపు పొందాడు.  

షెడ్యూల్‌... ఫార్మాట్‌ 
అధికారికంగా టోర్నీ ప్రారం¿ోత్సవం 23నే జరిగింది. అయితే తొలి రౌండ్‌ నేడు మొదలవుతుంది. వచ్చే నెల 15 వరకు మొత్తం 14 రౌండ్ల పాటు గేమ్‌లు జరుగుతాయి. గెలిస్తే ఒక పాయింట్‌... ‘డ్రా’ చేసుకుంటే అర పాయింట్‌ లభిస్తాయి. ఎవరైతే ముందుగా 7.5 పాయింట్లు సాధిస్తారో వారే ప్రపంచ చాంపియన్‌. 

క్లాసికల్‌ గేమ్‌లో తొలి 40 ఎత్తుల వరకు ఒక్కో ఆటగాడికి 120 నిమిషాలు సమయం ఉంటుంది. 41వ ఎత్తు నుంచి మిగతా గేమ్‌ మొత్తానికి 30 నిమిషాల సమయమిస్తారు. 14 గేమ్‌ల తర్వాత స్కోరు సమమైతే... ర్యాపిడ్, బ్లిట్జ్‌ ఫార్మాట్లలో టైబ్రేక్‌ పోటీలు నిర్వహించి విజేతను తేల్చుతారు. 

ప్రైజ్‌మనీ రూ. 21.10 కోట్లు 
టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 2.5 మిలియన్‌ డాలర్లు (రూ. 21.10 కోట్లు). ఒక్కో గేమ్‌ విజేతకు 2 లక్షల డాలర్లు (రూ. కోటి 68 లక్షలు) లభిస్తాయి. ఇలా 14 రౌండ్ల తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇద్దరు ప్లేయర్లకు సమానంగా అందజేస్తారు. టైబ్రేకర్‌లో విజేతగా నిలిచిన ప్రపంచ చాంపియన్‌కు 13 లక్షల డాలర్లు (రూ.10.97 కోట్లు ), రన్నరప్‌నకు 12 లక్షల డాలర్లు (రూ.10.13 కోట్లు) ప్రదానం చేస్తారు.

లైవ్‌గా చూడొచ్చా?
ఎంచక్కా చూడొచ్చు. టీవీ చానెల్స్‌లో అందుబాటులో లేకపోయినా... మన భారత గ్రాండ్‌మాస్టర్‌ తలపడుతున్న ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌ గేమ్‌లపై మనం ఓ కన్నేయొచ్చు. ‘ఫిడే’కు చెందిన యూట్యూబ్, ట్విట్చ్‌ చానెల్స్‌లో అలాగే... ఈఎస్‌పీఎన్‌ ఇండియా లైవ్‌ బ్లాగ్‌లోనూ పోటీలను వీక్షించవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement