పది, పన్నెండేళ్ళుగా కంటున్న కలను నెరవేరిన తరుణం ఇది. చిన్నప్పుడు ఆడడం మొదలుపెడు తూనే మనసులో నాటిన లక్ష్యాన్ని సాధించిన చేరుకున్న దిగ్విజయ క్షణాలివి. అత్యంత పిన్నవయ స్కుడైన ప్రపంచ చదరంగ ఛాంపియన్‌గా నిలవడంతో పద్ధెనిమిదేళ్ళ దొమ్మరాజు గుకేశ్‌కు చిర కాలపు స్వప్నం సాకారమైంది. చరిత్రలో నిన్నటి వరకు గుకేశ్ కేవలం పిన్నవయస్కుడైన మూడో గ్రాండ్ మాస్టర్.
కానీ, సింగపూర్‌లో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గురువారం సాయంకాలపు విజయంతో ఈ టీనేజ్ కుర్రాడు చదరంగ చరిత్రలో కొత్త అధ్యాయం రచించాడు. సుదీర్ఘ కాలం తరువాత మనవాడు ఒకడు ఇలా భారత ఘనవారసత్వ సంప్రదాయ ప్రాచీనక్రీడ చదరంగంలో జగజ్జేతగా నిలిచి, జాతికి గర్వకారణమయ్యాడు.
చైనాకు చెందిన ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్‌పై చిరస్మరణీయ విజయంతో, అంచనాల్ని అధిగమించి, కాస్పరోవ్, మ్యాగ్నస్ కార్ల్‌సెన్ సరసన తన పేరు లిఖించాడు. గతంలో కాస్పరోవ్ పేరిట ఉన్న అత్యంత పిన్నవయస్కుడైన ప్రపంచ ఛాంపియన్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇది ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే క్షణం. మన చదరంగ క్రీడాలోకంలోనే కాదు... క్రీడాకారులందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తించే సందర్భం.
నిజానికి, ఈ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కొన్నిసార్లు గుకేశ్ తడబడకపోలేదు. మొత్తం 14 గేమ్‌ల ఈ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్ ప్రస్థానం అతని పట్టుదల, వ్యూహచతురతకు నిదర్శనం. మొదట్లో తడబడి, ఓపెనింగ్ రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. కానీ, కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో విజృంభించాడు. విమర్శలను విజయసోపానాలుగా మలుచుకున్నాడు. పట్టువదలని విక్రమార్కు డిలా ఆటలో పైచేయి సాధించాడు.
మొదటి నుంచి గుకేశ్ బృందం వేసుకున్న వ్యూహం ఒకటే. గుకేశ్ తన లాగా తాను ఆడాలి. అంతే! పక్కా ప్రణాళికతో ఈ యువ ఆటగాడు, అతని క్రీడాశిక్షకుడు, మిగతా బృందం పడ్డ శ్రమ ఫలించింది. కొన్నిసార్లు ఆట ఆరంభపుటెత్తులను ఆఖరి నిమిషంలో నిర్ణయిస్తే, మరికొన్నిసార్లు వాటి మీద వారాల తరబడి కసరత్తు చేస్తూ వచ్చారు. ఆ సాధన ఉపకరించింది. డింగ్‌తో ప్రతి గేమ్‌లోనూ తన ఓపెనింగ్స్ ద్వారా ప్రత్యర్థిని గుకేశ్ ఆశ్చర్యపరిచాడు.
14 గేమ్‌ల మ్యాచ్‌లో 13 గేమ్‌లు ముగిసినా, చెరి రెండు విజయాలతో టై నెలకొంది. ఆ పరిస్థితుల్లో గురువారం నాటి 14వ గేమ్ ఒక దశలో డ్రా దిశగా వెళుతున్నట్టు అనిపించినా, ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్ అనూహ్యంగా దిద్దుకోలేని తప్పు చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకొని, గుకేశ్ తన ప్రత్యర్థి ఆట కట్టించాడు. 2.5 మిలియన్ డాలర్ల బహుమతి నిధిలో సింహభాగాన్నిసంపాదించాడు. గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ సాధించిన విశ్వనాథన్ ఆనందన్ తర్వాత మళ్ళీ ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడు అయ్యాడు.
ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ చెన్నై చిన్నోడు ఈ విజయంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టిన క్షణాలు, బయటకు వస్తూనే తండ్రిని గాఢంగా హత్తుకొని మాటల కందని భావా లను మనసుతో పంచుకున్న దృశ్యాలు ఇప్పుడిప్పుడే ఎవరికీ మరపునకు రావు. గుకేశ్ ఇప్పుడు చద రంగ ప్రపంచానికి సరికొత్త రారాజు. లెక్కల్లో చూస్తే, ప్రపంచ చదరంగానికి 18వ చక్రవర్తి. చదరంగంలో గుకేశ్ ప్రస్థానం ఇప్పుడొక పూర్తి ఆవృత్తం పూర్తి చేసుకుందనుకోవచ్చు.
2013లో 7 ఏళ్ళ గుకేశ్ చెన్నైలో ప్రేక్షకుల మధ్య కూర్చొని, విశ్వనాథన్ ఆనంద్‌కూ, మ్యాగ్నస్ కార్ల్‌సెన్‌కూ మధ్య జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ చూశాడు. ఆ మ్యాచ్‌లో గెలిచిన కార్ల్‌సెన్ అప్పటి నుంచి గత ఏడాది వరకు ప్రపంచ ఛాంపియన్‌గా పట్టు కొనసాగించారు. నిరుడు డింగ్ ఆ పట్టం గెలిచారు. చిన్న నాటి నుంచి అలా సౌండ్‌ప్రూఫ్ గ్లాస్ బూత్‌లో కూర్చొని, ఆటలో గెలవాలని కలలు గన్న గుకేశ్ ఎట్టకే లకు ఆ స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు.
అయితే, ఇంత త్వరగా తన ఆకాంక్ష నెరవేరుతుందని అతనూ ఊహించలేదు. కార్ల్‌సెన్ నంబర్ 1 ర్యాంకులో ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ తాను ప్రపంచ అత్యుత్తమ ఆటగాణ్ణి కాదని వినయం ప్రదర్శిస్తున్నాడు. ఏదో ఒక రోజున కార్ల్‌సెన్‌లా చెస్ ప్రపంచాన్ని ఏలాలని తమిళనాట పెరిగిన ఈ తెలుగు మూలాల టీనేజ్ కుర్రాడు ఆశిస్తున్నాడు.
గతంలో 22 ఏళ్ళ వయసుకే గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్ సాధించారు. అప్పట్లో ఆయన అనటోలీ కార్పోవ్‌ను ఓడించి, ఆ టైటిల్ సాధించి, అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించారు. కేవలం పన్నెండేళ్ళ ఏడు నెలల వయసుకే గ్రాండ్ మాస్టరైన గుకేశ్ ఇప్పుడు 18వ ఏట ఆ ఘనత సాధించడం ఎలా చూసినా విశేషమే. గుకేశ్ బాటలోనే మన దేశ కీర్తిపతాకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగల సత్తా ఉన్న ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులు ఇంకా చాలామంది ఉన్నారు.
ఇటీవల బుడాపెస్ట్‌లో జరిగిన ఒలింపియాడ్‌లో ఓపెన్ గోల్డ్, ఉమెన్స్ గోల్డ్... రెంటినీ భారత చదరంగ జట్లు విజయవంతంగా గెలిచాయి. ప్రస్తుతం దాదాపు 85 మందికి పైగా గ్రాండ్ మాస్టర్లు భారత్‌లో ఉన్నారనేది ఆశ్చర్యపరిచే గణాంకం. పైగా, వారిలో చాలామంది ఇప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రానంతటి పిన్న వయస్కులు. అంటే ఈ విశ్వక్రీడలో భారత్‌కు ఎంతటి బంగారు భవిష్యత్తు ఉందో అర్థం చేసుకోవచ్చు. రాగల రోజుల్లో ప్రజ్ఞానంద లాంటి పలువురు ప్రపంచ ఛాంపియన్లుగా ఎదగగల సత్తా పుష్కలంగా ఉన్నవారు.
అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ శిష్యరికంలో ఈ స్థాయికి ఎదిగిన గుకేశ్ ఇప్పుడు అలాంటి ఎందరికో సరికొత్త ప్రేరణ. సుదీర్ఘ క్రీడా జీవితం ముందున్న ఈ టీనేజర్ భవిష్యత్ ప్రయాణంలో ఈ కొత్త ప్రపంచ కిరీటం ఓ మైలురాయి మాత్రమే. రానున్న రోజుల్లో ఇలాంటివి అనేకం కైవసం చేసుకొని, మరింత మంది గుకేశ్‌ల రూపకల్పనకు ఈ కుర్రాడు స్ఫూర్తి కిరణంగా భాసించడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment