
తన భావోద్వేగంపై గుకేశ్ స్పందన
సింగపూర్ సిటీ: వరల్డ్ చెస్ చాంపియన్‌గా ఖాయమైన తర్వాత దొమ్మరాజు గుకేశ్ ఎంతో భావోద్వేగానికి లోనైన వీడియోను అభిమానులంతా చూశారు. విజయానంతరం అతను కన్నీళ్లపర్యంతమయ్యాడు. దీనిపై ‘ఫిడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుకేశ్ మాట్లాడాడు. అందుకు కారణాన్ని వివరించాడు. ‘నేను ఈ పోరులో మొదటినుంచి ఆధిక్యం కనబర్చలేదు. కొన్ని గేమ్‌లలో విజయానికి దగ్గరగా వచ్చి కూడా ఆ అవకాశం ఉపయోగించుకోలేకపోయాను.
అంతా సాఫీగా, ఏకపక్షంగా పోరు జరిగి నా గెలుపు కాస్త ముందే ఖాయమై ఉంటే నేనూ మామూలుగానే కనిపించేవాడినేమో. కానీ చివర్లో గెలిచిన తీరుతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అప్పటి వరకు గేమ్ డ్రా అవుతుందని, టైబ్రేక్‌కు వెళితే ఎలా సిద్ధం కావాలనే విషయం గురించి కూడా ఆలోచనలు మెదులుతున్నాయి. కానీ అద్భుతం జరిగి గెలిచేశాను.
పైగా ఎనిమిదేళ్ల వయసులో చెస్ నేర్చుకున్న రోజులు కూడా ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. అందుకే ఆ కన్నీళ్లు’ అంటూ గుకేశ్ వివరించాడు. తాను ప్రపంచ చాంపియన్‌గా నిలిచినా...ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, అయితే ప్రతీ సవాల్‌కు తాను సిద్ధమేనని గుకేశ్ వ్యాఖ్యానించాడు. పైగా చదరంగంలాంటి ఆటలో ఎవరూ వంద శాతం పర్‌ఫెక్ట్‌గా ఉండరని అతను అన్నాడు.
‘ఇప్పటి వరకు చెస్‌ను శాసించిన గొప్ప గొప్ప ఆటగాళ్లకు కూడా పరాజయాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఆటలో నేర్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. నా వయసు కూడా అందుకు సహకరిస్తుంది. ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని గుకేశ్ చెప్పాడు. చాంపియన్‌షిప్ సమయంలో తనకు సరిగ్గా ఇంటి భోజనం తరహాలో దక్షిణాది వంటకాలు అందించిన చెఫ్‌కు అతను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.