వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకున్న గుకేశ్
విజేతగా బిజీ బిజీగా గడిపిన చాంపియన్ ప్లేయర్
సింగపూర్ సిటీ: ‘ట్రోఫీ చూడటానికి చాలా బాగుంది. కానీ నేను ఇప్పుడు దీనిని ముట్టుకోను. బహుమతి ప్రదానోత్సవ సమయంలోనే అందుకుంటాను’... విశ్వ విజేతగా నిలిచిన తర్వాతి రోజు కొత్త ఉత్సాహంతో కనిపిస్తూ గుకేశ్ చెప్పిన మాట ఇది. ముగింపు కార్యక్రమానికి కొద్దిసేపు ముందు జరిగిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో ఇది చోటు చేసుకుంది.
వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రోఫీని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి అంటూ గుకేశ్ తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ఫొటో షూట్ సమయంలోనూ అతను దానిని ముట్టుకోలేదు. ప్రపంచ చాంపియన్ హోదాలో శుక్రవారం గుకేశ్ బిజీబిజీగా గడిపాడు. ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు, ఇంటర్వ్యూలతో పాటు పెద్ద సంఖ్యలో చెస్ అభిమానులకు అతను ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు.
వీరిలో భారత అభిమానులతో పాటు సింగపూర్‌కు చెందిన చదరంగ ఔత్సాహికులు కూడా ఉన్నారు. తాము వెంట తెచ్చుకున్న చెస్ బోర్డులపై వారు వరల్డ్ చాంపియన్ ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నారు. ఆటోగ్రాఫ్ కోసం నిలబడిన వారి సంఖ్య అనంతంగా సాగింది. ఆ తర్వాత గుకేశ్ ఎంతగానో ఎదురు చూసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ‘ఫిడే’ అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్ జగజ్జేత గుకేశ్‌కు ట్రోఫీతో పాటు బంగారు పతకాన్ని, ప్రైజ్‌మనీని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన భారత గ్రాండ్‌మాస్టర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుతమైన ఆట, చిరకాలం గుర్తుండిపోయే ప్రదర్శనగా గుకేశ్ విజయాన్ని ఆయన అభివర్ణించారు. తన విజయానందాన్ని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ...‘18వ ఏట 18వ చాంపియన్’ అంటూ గుకేశ్ ట్వీట్ చేశాడు.
నా ప్రయాణం ఒక కలలా సాగింది
ఇలాంటి క్షణం కోసం ఇంతకాలం ఎదురు చూశాను. ఇలాంటి రోజు కోసమే ప్రతీ రోజూ నిద్ర లేచేవాడిని. ఇప్పుడు ఈ ట్రోఫీని నా చేతుల్లో తీసుకున్న ఆనందంతో పోలిస్తే నా జీవితంలో ఏదీ సాటి రాదు. నా ప్రయాణం ఒక కలలా సాగింది. ఈ క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ నా చుట్టూ ఉన్నవారి అండతో అన్నింటినీ అధిగమించగలిగాను. కష్టాల్లో ఉన్న సమయంలో పరిష్కారం లభించనప్పుడు దేవుడే నాకు తగిన దారి చూపించాడు. –ట్రోఫీని అందుకున్న తర్వాత గుకేశ్ స్పందన
Comments
Please login to add a commentAdd a comment