
ఎట్టకేలకు ఓ ఫలితం
చెన్నై: సులువైన అవకాశాలు చేజార్చుకోవడం... పదునులేని ఎండ్ గేమ్... కావలసినంత అనుభవం ఉన్నా... ప్రత్యర్థి ఎత్తుగడకు సరైన ప్రతి వ్యూహంలేక... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఐదో గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓటమిపాలయ్యాడు. శుక్రవారం జరిగిన గేమ్‌లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే) 58 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఫలితంగా టోర్నీలో 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. తెల్లపావులతో తొలిసారి తనదైన ఆటతీరును ప్రదర్శించిన నార్వే గ్రాండ్‌మాస్టర్.. నోటోబ్బామ్ ఓపెనింగ్‌తో గేమ్‌ను ప్రారంభించి క్రమంగా మార్షల్ గ్యాంబిట్‌లోకి తీసుకెళ్లాడు.
ఊహించని ఈ వ్యూహానికి కాస్త కంగారుపడ్డ విషీ ... అప్పటికప్పుడు కొత్త ఎత్తుగడతో సులువుగానే అడ్డుకట్ట వేశాడు. ఓ దశలో ఆనంద్ పాన్‌ను కోల్పోయినా గేమ్‌లో ప్రత్యర్థితో సమానంగా నిలిచాడు. అయితే 45వ ఎత్తులో చేసిన తప్పిదంతో మూల్యం చెల్లించుకున్నాడు. కింగ్‌ను పక్కనబెట్టి తర్వాత వేసిన ఎత్తుతో మళ్లీ గేమ్‌లోకి వచ్చినట్లే కనిపించినా... ఎండ్‌గేమ్‌లో రూక్స్, పాన్‌లతో ఆడటం పూర్తిగా దెబ్బతీసింది. రాబోయే రెండు గేమ్‌ల్లో కనీసం ఒక్క విజయమైనా సాధించకుంటే టోర్నీలో ముందుకెళ్లేకొద్దీ ఆనంద్‌కు కష్టాలు తప్పవు.