ఆనంద్‌కు మళ్లీ షాక్
చెన్నై: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్... ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో పరాజయాన్ని చవిచూశాడు. ప్రత్యర్థి వ్యూహాన్ని సరిగా అర్థం చేసుకోలేక చేతులెత్తేశాడు. దీంతో శనివారం జరిగిన ఆరో గేమ్‌లో మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే) 67 ఎత్తులతో విజయం సాధించాడు.
ఫలితంగా ఈ టోర్నీలో 4-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. నల్లపావులతో బెర్లిన్ డిఫెన్స్‌తో గేమ్‌ను మొదలుపెట్టిన నార్వే కుర్రాడు బోర్డుపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. గేమ్ ముందుకెళ్తున్న కొద్దీ భిన్నమైన ఎత్తుగడలతో ఆనంద్‌ను కట్టిపడేశాడు. మరోవైపు ప్రత్యర్థి ఓపెనింగ్‌కు సరైన ప్రతి వ్యూహాన్ని అవలంభించలేకపోయిన భారత ప్లేయర్ కీలక సమయంలో పూర్తిగా తడబడ్డాడు.
రూయ్ లోపెజ్ ఓపెనింగ్‌తో గేమ్‌ను మొదలుపెట్టినా... క్రమంగా పట్టు కోల్పోయాడు. ఓ దశలో 20 ఎత్తుల వరకు సాఫీగా సాగినా...మిడిల్ గేమ్ మొత్తం కార్ల్‌సెన్ ఆధిపత్యం నడిచింది. చివర్లో క్వీన్, రూక్, పాన్‌లతో ఎండ్‌గేమ్ మొదలుకావడంతో ఆనంద్ ఆత్మరక్షణలో పడిపోయాడు. దీన్ని అదునుగా చేసుకున్న కార్ల్‌సెన్ ఎదురుదాడి చేసి పాన్, రూక్‌ను సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ 56వ ఎత్తు వద్ద కూడా సాంకేతికంగా గేమ్ డ్రా అయ్యే అవకాశాలున్నా... కార్ల్‌సెన్ దూకుడుకు విషీ తప్పులను పునరావృతం చేశాడు. చివరకు మరో 11 ఎత్తుల తర్వాత ఆనంద్ ఓటమిని అంగీకరించాడు.